తాత మామ్మలకు ఏమి జరుగుతోంది?
ఇటలీలోని తేజరిల్లు! విలేఖరి
“తాతయ్యగా, నా మనమళ్ళు నన్నింతగా ప్రేమిస్తున్నారంటే నేను నమ్మలేదు. వారు ఒక బహుమానం, అనురాగ బంధాలను బలీయం చేసే చక్కని, నిష్కపటులైన రాయబారులు వారు.”—ఎటోరే అనే పేరు గల తాతయ్య.
పైన చెప్పబడినది మంచి బంధమే అయినప్పటికీ, ఈ రోజుల్లో తాత మామ్మలు, తలిదండ్రులు మరియు మనమళ్ళు ఎల్లవేళలా కలిసి ఉండలేకపోతున్నారు. ఈ మూడు తరాలవారు సహకరించుకునే బదులు, తరచూ కొట్లాడుకుంటున్నారు. దాని ఫలితాలేమిటి? కుటుంబంలో తరచూ ఎవరైతే ఎక్కువ బాధననుభవిస్తున్నారో, ఒంటరివారౌతున్నారో, ఆర్ధిక ఇబ్బందుల్లో కుటుంబ సభ్యులు ఎవరి సహాయాన్ని కోరుతున్నారో ఆ పెద్దవారైన తాత మామ్మలకే ఒంటరితనమూ అసంతోషమూ అధికంగా కలుగుతోంది. మీ కుటుంబంలోని పరిస్థితి ఎలాంటిది? మీరు తాత మామ్మలను గౌరవిస్తారా?
గత కొన్ని దశాబ్దాల్లో, ప్రపంచవ్యాప్తంగా కలిగే సాంఘిక మార్పులు పితృ ప్రాధాన్యతగల కుటుంబాలను దాదాపు పూర్తిగా అదృశ్యంచేస్తూ, కుటుంబాన్ని, దానిలో ఉన్న బంధాలను ప్రభావితం చేశాయి. ఐరోపాలోని వృద్ధుల్లో రెండు శాతం మంది మాత్రమే తమ పిల్లలతో నివసిస్తున్నారు. ఇటీవల సగటు ఆయుష్కాలం పెరగడం వలన మరియు జనన రేటు తగ్గడం వలన పారిశ్రామిక దేశాల్లో కూడా మొత్తం జనాబాలో తాతమామ్మల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఐరోపాలోని జనాబాలో 26 శాతం మంది తాతయ్యలూ మామ్మలే, మరి యూరోపియన్ యూనియన్ ప్రచురించిన ఒక సర్వే ప్రకారం ఆ సంఖ్య “ఇంకా పెరుగనుంది.” జపాను “వయోధికులైన తన పౌరులను చూసుకునే తన పారంపర్యాన్ని బట్టి గర్విస్తుంది,” అని ఆషాయి ఈవెనింగ్ న్యూస్ చెబుతుంది. అయితే, తాత మామ్మలను ఆసుపత్రుల్లో చేర్చవలసిన అవసరం నిజంగా లేనప్పుడు కూడా ఆసుపత్రుల్లోను, ప్రత్యేక క్లినిక్‌లలోను చేర్చే అలవాటు అన్నిచోట్ల, ముఖ్యంగా నగరాల్లో అధికమైంది. కేప్ నగర వార్తాపత్రికయైన ది కేప్ టైమ్స్ ప్రకారం, వృద్ధులను గౌరవించే పారంపర్యమున్న దక్షిణ ఆఫ్రికాలో కూడా, ఇప్పుడు వృద్ధులను తృణీకరించే విచారకరమైన ధోరణియే కనిపిస్తుంది. ఆ కుటుంబాలవారు “సాధ్యమైనంత వరకు జీవితంలో ఆనందించాలని ఆశిస్తూ, మామ్మను సురక్షితంగా అనాథాశ్రమంలో చేర్చిన తరువాత, తమ నైతిక బాధ్యతను నిర్వర్తించామని అనుకుంటూ తమను తాము వంచించుకుంటున్నారు,” అని ఆ నివేదిక ప్రత్యేకంగా చెబుతుంది.
“వచ్చి చూసుకుంటాము, ఎప్పుడూ వస్తూ ఉంటాము” అనే వాగ్దానంతో ఒక వృద్ధురాలిని, ఆమె ముగ్గురు పిల్లలు ఆమెను మంచి అనాథాశ్రమంలో చేర్చిన ఒక సంఘటనను గూర్చి అదే పత్రిక మాట్లాడుతోంది. ఆమెకు ఏమి జరిగింది? “మొదట్లో ప్రతి రోజూ వెళ్ళేవారు. కొన్ని వారాల తరువాత వారంలో మూడు రోజులుగా తగ్గించారు. తర్వాత అది వారానికొక్కసారి అయ్యింది. ఒక సంవత్సరం తర్వాత నెలకు రెండో, మూడో సార్లు అయ్యింది, చివరికి సంవత్సరానికి ఐదో ఆరో సార్లు అయ్యింది, ఆఖరికి ఇక వెళ్ళడమే మానేశారు.” ఈ మామ్మ తన చివరి దినాలను ఎలా గడిపింది? హృదయ వేదన కలిగించే ఆ వివరణ ఇలా చెబుతుంది: “ఆమె గది కిటికీలో నుండి ఒక చెట్టు కనిపించేది, సజీవులైన ఆమె సహవాసులు దానిపై వ్రాలే పావురాలు, పెడిసె పక్షులు. అవి తన సన్నిహిత బంధువులా అన్నట్లు ఆమె వాటి రాక కోసం ఆతురతతో వేచి ఉండేది.”
నగరాల్లో ఉద్యోగాలను అన్వేషించేందుకు ప్రలోభపెట్టే విధంగా దక్షిణ ఆఫ్రికా జీవిత విధానాలను పాశ్చాత్యీకరించడం వలన పారంపర్యాలను ఆచరించే కుటుంబాల్లో కూడా అలాగే జరుగుతోంది. మారుతున్న సాంఘిక పరిస్థితులే కాక, సాంఘిక మరియు కుటుంబ జీవితాన్ని సంతోషకరంగా చేసే మంచితనం, తన పొరుగువాని ఎడల ఒకనికిగల గౌరవం, కుటుంబంపై అనురాగం అనే మానవ సహజ లక్షణాలు అంతర్థానమవ్వడం మరియు స్వార్థం, ఆనందమే ఉత్తమ పురుషార్ధం అనే సిద్ధాంతం, అహంకారం, తిరుగుబాటు చేసే మనోవైఖరి ప్రబలి ఉండడం వంటివి కూడా తాత మామ్మలను వదిలి పెట్టడానికి మరితర కారణాలు. లేఖనాల ప్రకారం, అలాంటి నైతిక పతనం అనేది మనం “అంత్య దినాల్లో” జీవిస్తున్నామన్నదానికి సూచన. (2 తిమోతి 3:1-5) కాబట్టి, తమ తాత మామ్మలను ఐశ్వర్యానికి, సుస్థిరతకు మూలంగా ఎంచే బదులు, పిల్లలు, మనమళ్ళు వారిని త్వరితమైన సాంఘిక మార్పులకు సర్దుకోలేని ప్రయాసకరమైన ఓ ఆటంకంగా తరచూ భావిస్తారు.a
తరాల అంతరం అనేది మరింత అధికమౌతోంది, అది ఎంతో మానసిక సంఘర్షణను కలిగిస్తుంది. వృద్ధులు తమ కుటుంబంతోపాటు నివసిస్తున్నప్పుడు అది మరింత అధికమౌతుంది. అయినప్పటికీ తాత మామ్మల తోడ్పాటనేది ఎంతో ప్రయోజనకరంగా ఉండగలదు! అయితే, మరి తాత మామ్మలకు, పిల్లలకు, మనమళ్ళకు మధ్య ఉండే అనురాగ బంధాలకు అంతరాయం కలుగజేసే విధమైన తరాల మధ్య గల కొన్ని ముఖ్యమైన సమస్యలేవి? తాత మామ్మలు కుటుంబ వలయంలో తమ విలువైన పాత్రను ఎలా పునఃస్థాపించుకోగలరు?
[అధస్సూచీలు]
a వార్ధక్య సంబంధమైన బలహీనతతోను, అమితమైన అనారోగ్య సమస్యలతోను ఉన్నప్పుడు, వృద్ధులైన కొందరు తలిదండ్రులకు ప్రొఫెసనల్ సిబ్బంది ఉన్న నర్సింగ్ హోమ్ అత్యంత ప్రేమపూర్వకమైన, ఆచరణ యోగ్యమైన ఏర్పాటని గుర్తించాలి.