కొన్ని సమస్యలేవి?
తాత మామ్మలు, తలిదండ్రులు మరియు మనమళ్ళు అనే మూడు తరాల మధ్య కేవలం కొన్ని దశాబ్దాల అంతరమే ఉన్నప్పటికీ, వారి మధ్య పెద్ద అగాధమున్నట్లు అనిపిస్తుంది.
అనేకమంది తాత మామ్మలు రెండవ ప్రపంచ యుద్ధం తెచ్చిపెట్టిన వినాశకరమైన పర్యవసానాలతోపాటు, ఆ భయంకరమైన అనుభవాన్ని చవిచూశారు. నిరసన కాలంలో మరియు 60వ పడిలో ద్రవ్యోల్బణం ఏర్పడిన సమయంలో బహుశ, వారి పిల్లలు చిన్నవారైయుండవచ్చు. వారి మనమళ్ళు నేడు నైతిక విలువలు లేని లోకంలో జీవిస్తున్నారు. నేడు ప్రవర్తనకు మాదిరికర్తలుగా ప్రఖ్యాతిగాంచినవారిలోను మార్పులు జరుగుతుండగా, ఒక తరానికి తన తరువాతి తరంలో తన స్వంత అనుభవాల ఎడల మెప్పును కలిగించడం సులభం కాదు. వివిధ తరాలవారు సహకరించుకోవాలని, పరస్పరం గౌరవించుకోవాలని నచ్చజెప్పాలంటే, ఏదో లోపం ఉన్నట్లుంది. అయితే అదేమై ఉండవచ్చు?
తలిదండ్రులు తమ మనమళ్ళతో మరీ కఠినంగా ఉంటున్నట్లు లేదా వారికి మరీ చనువిస్తున్నట్లు కనిపిస్తుందని నిందిస్తూ, సదుద్దేశంగల తాత మామ్మలు వివాహితులైన తమ పిల్లల కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటారు. మరొకవైపు, తాత మామ్మలు సహజంగా చనువుగా ఉంటారు గనుక—“తాత మామ్మలిచ్చే శిక్ష మంచి మనమళ్ళను తయారు చేయదు” అని ఒక స్పెయిన్ సామెత చెబుతుంది. తమ అనుభవంవల్ల స్పష్టంగా వారు ముందుగా చూడగల తప్పిదాలను తమ పిల్లలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నందువల్లే వారు జోక్యం చేసుకుంటున్నారు కాబోలు. అయితే, వారు వివాహితులైన తమ పిల్లలతో తమకుగల మారిన బంధాలను గూర్చి సరైన విధంగా అర్థం చేసుకోలేకపోవచ్చు, ఆ నిజాన్ని తట్టుకోలేక పోవచ్చు. వివాహం ద్వారా ఎంతో కాలంగా వాంఛించిన స్వాతంత్ర్యాన్ని పొందిన పిల్లలు, మధ్యలో జోక్యం చేసుకోవడాన్ని భరించడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి వారు పనిచేస్తున్నారు, స్వంత తీర్మానాలను చేసుకునే తమ హక్కును అతిక్రమించడాన్ని వారు ఇష్టపడరు. తమకిదంతా తెలిసిందే అని తలంచే మనమళ్ళు, నియమాలను, నియంత్రణలను తృణీకరిస్తారు, బహుశ తమ తాత మామ్మలు జీవిత నిజాలను విస్మరిస్తున్నారని అనుకుంటారు. ఆధునిక సమాజంలో, తాత మామ్మలు తమ ప్రభావాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. వారి అనుభవం తరచూ నిర్లక్ష్యం చేయబడుతుంది.
సంభాషణ ఆగిపోయినప్పుడు
తాత మామ్మలు తమ మనమళ్ళతో కలిసి జీవిస్తున్నప్పుడు కూడా, పరస్పర అవగాహనా లోపమనే దుర్భేద్యమైన గోడ వారిని కుటుంబం నుండి వేరు చేస్తుంది. విచారకరమైనదేమంటే, తాత మామ్మల వయస్సు మీద పడినప్పుడు, సరిగ్గా ఆప్యాయత మరింత అవసరమైనప్పుడే ఇలా జరుగుతుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడే, ఒంటరితనంగా ఉన్నట్లనిపించాలని లేదు. సంభాషణ లేనప్పుడు, ప్రేమా గౌరవాల స్థానాన అమర్యాద లేదా చికాకు కలగడం వలన తాత మామ్మలు పూర్తి ఎడబాటును, నిరాశను అనుభవిస్తారు. వారు లోలోపల బాధపడతారు. విద్యావేత్తయైన జాకొమో డాక్వెనో ఈ విధంగా వ్రాస్తున్నాడు: “వాడుకలోలేని, పాత మోడల్ కారుతో ఇటీవల ఒకరు పోల్చిన కుటుంబంలో ప్రేమ అనేది ఇప్పటికీ వార్ధక్య వ్యాధులకు ఉత్తమమైన మందే. ముఖకవళికలను అర్థం చేసుకోవడం, దయాపూర్వకమైన నవ్వు, ఒక మంచి మాట, లేదా లాలనగా స్పర్శించడం అనేది ఎన్నో మందులకన్నా ఎక్కువగా సహాయపడుతుంది.”—లిబెర్టా డి ఇన్‌వెకియారె (వృద్ధులగుటకు స్వాతంత్ర్యము).
మీ మాదిరి వ్యత్యాసాన్ని కలిగించగలదు
కుటుంబ బంధాలు క్షీణించి పోవడం వలన కలిగే మానసిక సంఘర్షణ మూలంగా కూడా ఒక తరం మరొక తరానికి వ్యతిరేకంగా ఎడతెగక ఫిర్యాదు చేస్తుంది. కుటుంబంలోని ఒక సభ్యుడు మరొక సభ్యుడు ఏది చేసినా తప్పుగానే భావించవచ్చు. అయితే దాని చెడు ఫలితాలను అందరూ అనుభవించవలసిందే. తలిదండ్రులు తమ తాత మామ్మలను ఎలా చూస్తారో, దానికి తమ తాత మామ్మలు ఎలా ప్రతిస్పందిస్తారో పిల్లలు గమనిస్తారు. చాలామట్టుకు వృద్ధులు తమ బాధలను మౌనంగా భరించినప్పటికీ, మనమళ్ళు విని, చూసి, వాటిని గుర్తుంచుకుంటారు. ఆ విధంగా భవిష్యత్తులోని వాళ్ళ స్వంత ప్రవర్తనా విధానాలు ప్రభావితమౌతాయి. తమ తలిదండ్రులు తమ తాత మామ్మలనెలా చూసుకున్నారో, వాళ్ళు కూడా పెద్దవారైనప్పుడు తమ తలిదండ్రులను అలాగే చూసుకుంటారు. “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును,” అనే బైబిలు సూత్రాన్ని తప్పించుకునే మార్గమే లేదు.—గలతీయులు 6:7.
తలిదండ్రులు తాత మామ్మలను అమర్యాదగా చూడడాన్ని—ఎగతాళిచేయడాన్ని, క్రూరంగా వారి నోరుమూయించడాన్ని, చివరికి వారిని దోచుకోవడాన్ని—మనమళ్ళు చూస్తే, వారు కూడా పెద్దవారైనప్పుడు అలాగే చేస్తారు. తాత మామ్మల ఫోటోను ఫ్రేం కట్టి సైడ్ బోర్డు మీద పెట్టడం సరిపోదుగాని, వారిని ప్రేమించాలి, వ్యక్తులుగా వారిని గౌరవించాలి. కొంత కాలం అయిన తర్వాత, మనమళ్ళు కూడా అలాగే చేస్తారు. తాత మామ్మల ఎడల అగౌరవమనే అసాధారణ విషయం మరింత సర్వవ్యాప్తమౌతుందని చెప్పబడుతుంది. ఐరోపాలోని కొన్ని దేశాల్లో, పిల్లల రక్షణ కొరకు ఇప్పటికే అమలులో ఉన్న సంస్థలవలె, అన్యాయం జరిగిన వృద్ధుల కొరకు టెలిఫోన్ డిసెస్ లైన్లు స్థాపించబడ్డాయి.
స్వార్థం, అహంకారం, ప్రేమలేకపోవడం అనేవి వివేచనారాహిత్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. కాబట్టి, తమ తాత మామ్మలను ఆశ్రమాల్లో ఉంచి, వారిని వదిలించుకోవాలని ప్రయత్నించే వారి సంఖ్య అధికమౌతోంది. పెద్దవారిని చూసుకునే సమస్యను వదిలించుకునేందుకు, వారిని, అన్ని ఆధునిక సాంకేతిక వసతులు గల ప్రత్యేక కేంద్రాల్లోకి, లేక ప్రత్యేకంగా పదవీ విరమణ పొందిన వృద్ధుల కొరకు నిర్మించబడిన, అమెరికాలోని ఫ్లోరిడా లేదా కాలిఫోర్నియాల్లో ఉన్నటువంటి మరిన్ని సూపర్ మార్కెట్లు మరియు వినోద కేంద్రాలు గల గ్రామాల్లో వారిని ఉంచేందుకు ఎంత ఖర్చుచేయడానికైనా కొందరు సిద్ధమే, అయితే ప్రియమైనవారి చిరునవ్వు, లాలనతో కూడిన స్పర్శ, మనమళ్ళ కౌగిలింతలు వారికక్కడ లభించవు. ముఖ్యంగా సెలవు సమయాల్లో, అనేకులు తాతను మామ్మను ఎక్కడైనా “ఉంచేందుకు” స్థలాన్ని వెదకుతారు. ఇండియాలో కొన్నిసార్లు, కొందరు తాత మామ్మలు నిస్సహాయులుగా వదిలిపెట్టబడే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది.
కుటుంబంలో సన్నిహిత సంబంధాలను కాపాడుకోవడంలోని చిక్కులు, విడాకులతో మరింత అధికమౌతున్నాయి. బ్రిటీషు కుటుంబాల్లో నాలుగింట ఒక కుటుంబంలో మాత్రమే తలిదండ్రులిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడాకుల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో, ప్రతి సంవత్సరం పది లక్షల కన్నా ఎక్కువ విడాకులు ఇవ్వబడుతున్నాయి. అలా తాత మామ్మలు అనుకోకుండా, తమ పిల్లల వివాహ జీవితం తారుమారవ్వడాన్ని, దాని ఫలితంగా మనమళ్ళతో గల తమ సంబంధాల్లో త్వరితగతిన మార్పులను స్వయంగా చూడవలసి వస్తుంది. కొరియర్ సల్యూట్ అనే ఇటాలియన్ వార్తాపత్రిక నివేదించిన ప్రకారం, మునుపటి అల్లుడు లేక కోడలుతో మంచి సంబంధం కలిగి ఉండడం వలన కలిగే కలవరంతో పాటు, “తమ కుమారుని లేదా కుమార్తె యొక్క క్రొత్త భాగస్వామికి మునుపటి వివాహంలో పిల్లలు ఉన్న”ట్లయితే “అకస్మాత్తుగా ‘పొందిన’ మనమళ్ళ రాక మరింత కలవరపరుస్తుంది.”
“మన జీవితాల్లో ఉత్సాహం”
అయితే, ఒకరి తాత మామ్మలతోగల ఆప్యాయత, అనురాగాలతో కూడిన సంబంధం అనేది వారు కుటుంబంలోని మిగిలినవారితో కలిసి జీవించినా లేకపోయినా అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. “మన పిల్లల కొరకు మరియు మనమళ్ళ కొరకు ఏదైనా చేస్తే మన జీవితాల్లో ఉత్సాహం ఉంటుంది” అని జపాన్‌నందలి ఫూకూయ్‌లోని ఒక మామ్మ చెబుతుంది. అమెరికా నిపుణుల ఒక బృందం కొరియర్ సల్యూట్‌లో ప్రచురించిన పరిశోధనా ఫలితాల ప్రకారం ఈ విధంగా నివేదించబడుతుంది: “తాత మామ్మలు మరియు మనమళ్ళ మధ్య ప్రగాఢమైన మరియు ప్రేమపూర్వకమైన సంబంధమున్నట్లయితే, మనమళ్ళకు మాత్రమే కాదుగాని, అది కుటుంబమంతటికీ ఎంతో ప్రయోజనకరము.”
వ్యక్తిగత విభేదాలను, తరాల అంతరాలను, కుటుంబ బంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే స్వార్థపూరితమైన అంతర్గత ధోరణులను ఎలా అధిగమించవచ్చు? ఈ విషయం తరువాయి శీర్షికలో పరిశీలించబడుతుంది.
[6వ పేజీలోని చిత్రం]
“వృద్ధాప్యానికి చేరుకునే విషయంలో భయానక విషయమేమంటే, ఎవరూ తమ మాట వినిపించుకోరనేదే.”—ఆల్బర్ట్ కామస్ అనే ఫ్రెంచ్ నవలా రచయిత