ఇది నిజంగా దొంగతనమేనా?
అబియోదున్ నైజీరియాలోని ఓ పెద్ద హోటల్లో సీనియర్ వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం భోజన శాలను మూస్తుండగా, 1,827 అమెరికా సమానమైన డబ్బుగల ఓ బ్యాగ్ కనిపించింది. ఆలస్యం చేయకుండా అతను ఆ డబ్బును వెంటనే యిచ్చేశాడు, తర్వాత తమ హోటల్లో అతిధిగా విచ్చేసిన ఓ మహిళ అది తనదన్నప్పుడు అది ఆమెకు యివ్వడం జరిగింది. హోటల్ యాజమాన్యం అతనికి డబుల్ ప్రమోషన్ యిప్పించి, “ఆ సంవత్సరానికి ఉత్తమ పనివాడు” అనే బిరుదును అతనికిచ్చారు. ఆ డబ్బుకు చెందినావిడ కూడా అతన్ని సన్మానించింది.
క్వాలిటీ అనే ఓ ప్రాంతీయ వార్తాపత్రికలో, అబియోదున్ను “మంచి సమరయుడు” అని పేర్కొంటూ ఓ ప్రత్యేక కథను రాశారు. ఆ డబ్బును తన కొరకు ఉంచుకుందామనే శోధన కలిగిందా అని క్వాలిటీ పత్రిక వారు అతన్ని, ప్రశ్నించినప్పుడు, అబియోదున్ యిలా జవాబు చెప్పాడు: ‘నేనో యెహోవాసాక్షిని. కాబట్టి, నాది కానిది ఏదైనా నా కంటబడితే, అది చెందినవారికి నేను దాన్ని తిరిగిస్తాను.’
ఆ ప్రాంతంలోని అనేకులు అబియోదున్ నిజాయితీ నిరూపణకు ఆశ్చర్యచకితులయ్యారు. అబియోదున్ తోటి సాక్షులు జరిగినదాని విషయమై చాలా సంతోషించారు, అయితే వారు ఆశ్చర్యపడలేదు. భూవ్యాప్తంగా యెహోవాసాక్షులు తమ ఉన్నత సూత్రాలకు పేరుగాంచినవారు. వాటిలో నిజాయితీ మినహాయింపేమీ కాదు; అది విధి నిజ క్రైస్తవత్వంలో అది ఓ భాగము.
అయితే, పరిస్థితులు అప్పుడప్పుడు ఏది నిజాయితీ, ఏది కాదు అనే వాటికి భేదం లేకుండా చేస్తుంటాయి. ఈ పరిస్థితిని గమనించండి. తూర్పు ఆఫ్రికాలో యెహోవాసాక్షుల సంఘంలో చందానూ జమాలెక్కలను చూసుకునే ఫెస్టస్ అనే వ్యక్తికి డబ్బు అవసరం చాలా ఉంది.a ఆలస్యం చేయకూడదని డాక్టర్లు చెప్పిన ఓ పెద్ద ఆపరేషన్‌ను అతని భార్యకు చేయించాల్సి వచ్చింది. సగం డబ్బును ముందుగా యివ్వాలని ఆ హాస్పిటల్ వారు పట్టుపట్టారు.
ఫెస్టస్ దగ్గర డబ్బు లేదు. అప్పుకావాలని అనేకమందిని అతను అడిగినప్పుడు ఎవ్వరూ అతనికి అప్పు యివ్వలేదు. అప్పుడు అతను తన ఆధ్వర్యంలో ఉన్న డబ్బును గూర్చి తలంచి, ‘నేను నా భార్యను కాపాడగల్గినప్పుడు ఆమెను ప్రాణాపాయస్థితిలో విడిచిపెట్టడం సమంజసమేనా? సంఘం డబ్బునుండి కొంత “అప్పు” తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇతరులు నాకు అచ్చివున్న డబ్బు యిచ్చినప్పుడు దాన్ని నేను తిరిగి ఇవ్వొచ్చు’ అని తర్కించుకున్నాడు.
హాస్పిటల్లో కట్టడానికి ఫెస్టస్ తనది కాని డబ్బును ఉపయోగించుకున్నాడు. అతని తర్కం సరైందేనా? అతనెదుర్కొన్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా అతను తీసుకున్న చర్య సమంజసమేనా?
అది ఎవరి డబ్బు?
ఈ ప్రశ్నలను విశ్లేషించడంలో, ఫెస్టస్ తీసుకున్నటువంటి డబ్బు ఎక్కడిది దాని ఉద్దేశమేమిటని మనం క్లుప్తంగా పరిశీలిద్దాం. ఈ ధనం యెహోవా స్వచ్ఛారాధన కొనసాగాలని కోరే సంఘంలోని సభ్యులు యిచ్చిన స్వచ్ఛంద విరాళాల ద్వారా వస్తుంది. (2 కొరింథీయులు 9:7) అది జీతాలు యివ్వడానికి ఉపయోగించబడదు, కారణం సంఘంలో వారు చేసే పనికొరకు ఎవ్వరికీ డబ్బు చెల్లించబడదు. దీనికి భిన్నంగా, యివ్వబడిన డబ్బు ముఖ్యంగా కూటం జరుపుకునే స్థలాన్ని అంటే రాజ్యమందిరాన్ని సంపాదించడానికి, దాని విషయమై శ్రద్ధతీసుకోడానికి ఉపయోగించబడుతుంది. ఇది బైబిలు ఉపదేశాల కొరకు చిన్న పెద్ద, బీద గొప్పలనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ కూడుకోవడానికి అనుకూలమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని అందిస్తుంది.
అది ఎవరి డబ్బు? అది సంఘం మొత్తానికి చెందుతుంది. ఏ ఒక్క వ్యక్తి ఆ డబ్బును ఎలా ఖర్చుచేయాలన్న దాన్ని నిర్ణయించడు. సాధారణమైన సంఘ ఖర్చులను పెద్దల కూటమి నిర్వహించినప్పటికీ, అసాధారణమైన ఖర్చులు చేయాల్సి వచ్చినప్పుడు అనుమతి కొరకు ఆ విషయాన్ని వారు సంఘమంతటి ముందు ఉంచుతారు.
అప్పుతీసుకోవడమా లేక దొంగతనమా?
తాను తీసుకున్న డబ్బును వీలున్నంత త్వరగా తీరుస్తానని ఫెస్టస్ పథకం వేసుకున్నాడు గనుక ఆ చర్య అతనికి అప్పు తీసుకోవడంలా కనిపించింది. అయితే, “సహజంగా ఎవరికీ తెలియకుండా లేక అది ఎవరిదో ఆ వ్యక్తికి తెలియకుండా లేక తరచూ అతని అనుమతి లేకుండా అతని అస్తిని తీసుకోవడం, తొలగించడం” వీటికి వెబ్స్స్టర్స్ న్యూ డిక్షనరీ ఆఫ్ సిననిమ్స్, మరో పదాలను ఉపయోగిస్తోంది. ఈ పదాలే “దొంగతనం” “దొంగ.” ఫెస్టస్ సంఘానికి చెందిన డబ్బును అనుమతి లేకుండా, సమ్మతి లేకుండా, తీసుకున్నాడు. కాబట్టి, అతను దొంగతనం చేసిన దోషి అయ్యాడు. అతను ఒక దొంగ.
అయితే, దొంగతనం వెనుకనున్న ఉద్దేశము యొక్క నిందకు కొన్ని స్థాయిలున్నాయి. దాన్ని మనం యూదా ఇస్కరియోతు ఉదాహరణలో చూడవచ్చు. యేసు, నమ్మకమైన అపొస్తలుల డబ్బును అతని పర్యవేక్షణలో ఉంచడానికి అతనికి అప్పగించబడింది. బైబిలు యిలా అంటోంది: “[యూదా] దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను.” (యోహాను 12:6) చెడు హృదయంతోనూ దురాశతోనూ యూదా నైతికంగా మరింత దిగజారిపోయాడు. చివరికి, దేవుని కుమారుని 30 వెండి నాణాలకు అమ్ముకునేంత నీచానికి దిగజారిపోయాడు.—మత్తయి 26:14-16.
అయితే, ఫెస్టస్ తన భార్యను బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో పురికొల్పబడ్డాడు. దాని భావం అతనిలో తప్పులేదనా? కానేకాదు. అలాంటి మరో సత్వర పరిస్థితిలో దొంగతనం గూర్చి బైబిలు ఏం చెబుతుందో పరిశీలించండి: “దొంగ ఆకలిగొని ప్రాణ రక్షణ కొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.” (సామెతలు 6:30, 31) మరో మాటలో చెప్పాలంటే, దొంగ పట్టుబడినప్పుడు చట్టం విధించే పూర్తి శిక్షను అతను భరించాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం, ఓ దొంగ తాను చేసిన నేరానికి జరిమానా చెల్లించాలి. కనుక దొంగతనాన్ని ప్రోత్సహించడం లేక సమర్థించే బదులు తప్పనిసరి పరిస్థితుల్లో సహితం, దొంగతనం చేయడం ఆర్థిక నష్టాన్ని, అవమానాన్ని, అన్నిటికంటే గంభీరంగా దేవుని అంగీకారాన్ని కోల్పోవడం జరుగుతుందని బైబిలు హెచ్చరిస్తుంది.
క్రైస్తవులందరూ యెహోవా యొక్క సాక్షులుగా ప్రత్యేకంగా సంఘ బాధ్యతలు వహించేవారు మాదిరికరంగా “అనింద్యులై” ఉండాలి. (1 తిమోతి 3:10) వస్తుందనుకున్న డబ్బు ఫెస్టస్‌కు అందలేదు, కనుక అతను తీసుకున్న డబ్బును తిరిగి యివ్వలేక పోయాడు. అతను చేసింది పదిమందికీ తెలిసిపోయింది. అతనికి ఏం జరిగింది? అతను పశ్చాత్తాపంలేని దొంగైవుంటే స్వచ్ఛమైన క్రైస్తవ సంఘం నుండి అతను వెలివేయబడివుండే వాడు. (1 పేతురు 4:15) అయితే, అతను అనుతాపం చెంది, నిజంగానే పశ్చాత్తాపపడ్డాడు. తన సేవా ఆధిక్యతను అతను పోగొట్టుకున్నప్పటికీ, సంఘంలో ఉండగల్గాడు.
దేవునియందు నమ్మకముంచుట
యెహోవాను ఆరాధిస్తున్నానని చెప్పుకునే ఓ వ్యక్తి దొంగతనం చేయడం దేవుని నామానికీ ఆయన పేరునుబట్టి పిలువబడుతున్న ప్రజలకూ కళంకాన్ని తెస్తాడని అపొస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. పౌలు యిలా రాశాడు: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యనూ దూషించబడుచున్నది?”—రోమీయులు 2:21, 24.
ప్రాచీనకాల జ్ఞానియైన ఆగూరు ఈ విషయాన్నే చెప్పాడు. ఆయన ప్రార్థనలో ఆయన “బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో,” అలా కాకూడదని అడిగాడు. (సామెతలు 30:9) పేదరికం, ఓ నీతిమంతుని కూడా దొంగతనం చేయడానికి శోధించే పరిస్థితికి తేగలవని ఆ జ్ఞాని ఒప్పుకోవడాన్ని గమనించండి. అవును, కష్టతరమైన పరిస్థితులు, యెహోవా తన ప్రజల అవసరతను తీర్చగల సామర్థ్యం యెడల ఓ క్రైస్తవుని పరీక్షించగలవు.
అయినా, పేదలైన వారితో సహా యెహోవా నమ్మకమైన సాక్షులు, దేవుడు “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” నమ్ముతారు. (హెబ్రీయులు 11:6) తమ అవసరతలు తీర్చుకోడానికి సహాయం చేస్తూ యెహోవా తన్ను నమ్మేవారికి ఫలం దయచేస్తాడని వారికి తెలుసు. కొండ మీది ప్రసంగంలో యేసు యిలా అంటూ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి. . . . ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”—మత్తయి 6:31-33.
క్రైస్తవ సంఘంలో సహాయం అవసరం గలవారికి దేవుడు ఎలా సహాయాన్ని అందిస్తాడు? అనేక విధాలుగా అందిస్తాడు. ఒకటేమంటే, తోటి విశ్వాసుల ద్వారా అందిస్తాడు. దేవుని ప్రజలు ఒకరి యెడల ఒకరు యథార్థమైన ప్రేమను కనపరుస్తారు. వారు ఈ బైబిలు సలహాను గంభీరంగా తీసుకుంటారు: “ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.”—1 యోహాను 3:17, 18.
ప్రపంచవ్యాప్తంగా, 73,000 సంఘాల్లో నలభై అయిదు లక్షల కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు, దేవున్ని ఆయన నీతియుక్త సూత్రాలతో ఆరాధించడానికి గట్టి కృషిచేస్తున్నారు. దేవుడు తన నమ్మకమైన సేవకులను ఎన్నడూ ఎడబాయడని వారికి తెలుసు. అనేక సంవత్సరాలుగా యెహోవాను సేవించినవారు రాజైన దావీదుతో తమ గొంతును కలుపుతున్నారు, ఆయన యిలా అన్నాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనైయున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.”—కీర్తన 37:25.
దొంగతనం చేసేందుకు శోధింపబడడానికి, తద్వారా బహుశ దేవుని అనుగ్రహాన్ని శాశ్వతంగా కోల్పోవడాన్ని అనుమతించే బదులు ఈ మాటలను ప్రేరేపించిన దేవునియందు నమ్మకముంచడం ఎంత మేలు!—1 కొరింథీయులు 6:9, 10.
[అధస్సూచీలు]
a పేరు మార్చబడింది.