మీరు అప్పులు చేయడం యోగ్యమేనా?
“మీకు డబ్బు అందకముందే ఖర్చు చేయవద్దు.” అప్పులు చేయడం నేడు చాలా మంది ప్రజల జీవిత విధానం గనుక, అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ ఇచ్చిన సలహా పాతకాలం నాటిదని అనిపిస్తుందా?
అనేక దేశాల్లో ధరలను పోల్చి చూస్తే కూలి చాలా తక్కువ, ద్రవ్యోల్బణం కూడబెట్టిన డబ్బును మింగివేస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితి ప్రజల మానసిక విలువలను ప్రభావితం చేస్తుంది. అయితే, నిజాయితీ అనేది ప్రాముఖ్యం. పన్ను కట్టకుండా మోసం చేయడం, అప్పు చెల్లించలేకపోవడం సర్వవ్యాప్తమైనందున, మంచి మనస్సాక్షిని కాపాడుకోవడం నిజంగా ఒక సవాలే. కాబట్టి, డబ్బును ఆదా చేసుకోవడమనేది నేటి చర్చనీయాంశం కావడంలో ఆశ్చర్యం లేదు, ఆర్థిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని ప్రజలు ఆలోచిస్తుండగా, డబ్బు ఆదా చేయడం లేదా సంపాదించడం వంటి విషయాలను గూర్చిన బోలెడు సలహాలు వార్తాపత్రికల్లోను పత్రికల్లోను, దూరదర్శినిలోను ఇవ్వబడుతున్నాయి. అదే సమయంలో, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషించుకోవడాన్ని గురించి మీరు చింతించడం సముచితమే.—1 తిమోతి 5:8.
కొందరు ప్రజలు మాత్రమే ఆర్థిక సుస్థిరతను అనుభవిస్తుండగా, మీ కుటుంబం కష్టాలను తప్పించుకోవడానికి మీరేమి చేయగలరు? ఒక విషయమేమంటే, మీరు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది.
మరీ ఎక్కువ అప్పులు చేయకండి
కొందరు ఎందుకు అప్పు చేస్తారు? వారు ఎప్పుడూ అప్పు చేసేది, రోగం వంటి అపాయకరమైన పరిస్థితులు వచ్చినందుకు కాదు. కొన్ని వస్తువులను సంపాదించాలనే కోరిక బలీయంగా ఉండవచ్చు. మరొకవైపు, అప్పు చేసే ప్రలోభంలో పడడం తప్పేమీ కాదు. నిజానికి, అద్దెకట్టే దానికన్నా, ఇంటిని తాకట్టుపెట్టడం మేలు, లేదా ఒక కారు కొనుక్కోవలసిన అవసరం ఉండవచ్చు. ఇంటి యజమాని తన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. భర్తగాను, తండ్రిగాను సఫలీకృతుడవ్వాలని కోరుకుంటాడు. ఇతరులకున్నటువంటి అనేక వస్తువులను కలిగి ఉండే హక్కు తన కుటుంబ సభ్యులకుందని ఆయన అనుకోవచ్చు.
కావాలనుకున్నదాన్ని అంటే, ఏమంత ముఖ్యంకాని వస్తువును కొనుక్కొనేందుకు అప్పు చేసే ప్రలోభంలో పడవచ్చన్నది నిజమే. వస్తువులను సంపాదించడం ఒకరిని సంతోషపరుస్తుంది, కాదంటారా? చక్కని దుస్తులు, క్రొత్త జోళ్ళు లేదా క్రొత్త కారు వంటి ఏదైనా ఉంటే ఎవరు సంతోషించరు? మరింత మనోహరమైన ఇల్లు కావాలని ఎవరు ఇష్టపడరు? అయినా, జాగ్రత్తపడండి! వ్యాపారస్థులు ప్రలోభ పెట్టేవారై అవసరంలేని వారికి, కొనుక్కోలేనివారికి కూడా వస్తువులను అమ్ముతూ చాలా డబ్బు సంపాదిస్తున్నారు.
అప్పులు తీర్చుకుంటూ ఉండడం కుటుంబ బంధాలను దుర్భలం చేస్తుందని కూడా గుర్తుంచుకోండి. దాని మూలంగా అసమ్మతి, కోపతాపాలు కలుగవచ్చు. “ఎప్పుడైతే కుటుంబం అప్పుతీసుకోవడం మీద, అప్పు మీద ఆధారపడుతుందో అప్పుడు కుటుంబ జీవితంలో స్వాతంత్ర్యం, ఆనందం కరువైపోతాయి,” అని ప్లేరైట్ హెన్రిక్ ఇబ్సెన్ చెప్పినది నిజమే. మీరు సమయానికి అప్పు తీర్చనట్లయితే, మీ మంచి పేరుకు కళంకం కలుగవచ్చు. వడ్డీతో పాటు తిరిగి చెల్లించడం కన్నా అప్పు చేసిన డబ్బును ఖర్చు చేయడం చాలా సులభం గనుక, తాము కొన్నవస్తువు తాము అపేక్షించిన ఆనందాన్నివ్వదని అనేకులు కనుగొంటారు.
సాధారణంగా, ప్రభుత్వాలు ఎడతెగక మరీ మరీ అప్పులు చేస్తూ వడ్డీలను పెంచుకుంటూ ఉంటాయి. ఇది సాధారణమే అయినప్పటికీ, అప్పులపాలైన దేశాలను ఎందుకు అనుకరించాలి? అమితంగా అప్పులు చేయడం ప్రజలను ధవవంతులుగా చేసే బదులు దారిద్ర్యాన్ని, భద్రత లేనితనాన్ని మరింత అధికం చేస్తుంది. డానిష్ సామెత చెబుతున్నట్లు, “తిన్న రొట్టెకు డబ్బు చెల్లించడం కష్టం.”
మీరు తెలివిగా ఖర్చు చేయడం నేర్చుకున్నప్పుడు, ఋణ బాధ్యత వల్ల కలిగే ఒత్తిడి చాలావరకు తగ్గుతుందన్నది సంతోషకరమైన విషయం. అప్పులు చేయాలనే ఒత్తిళ్ళను తప్పించుకొనేందుకు షాపింగ్‌ను గూర్చి జాగ్రత్తగా పథకం వేసుకొనేందుకు సమయం తీసుకోండి. అమిత ద్రవ్యోల్బణం గల దేశాల్లో కూడా బేరమాడి సరుకులు తీసుకోవడం ద్వారా మరియు అత్యవసరమైన వాటిని మాత్రమే కొనడం ద్వారా డబ్బు ఆదా చేసే మార్గాలున్నాయి. మీరు కోరుకునే దానిని వదిలిపెట్టడానికి సిద్ధపడుతూ, మీకున్నదానితో జీవించవలసిన అవసరముంది.
మిమ్మల్ని మీరే ఈ విధంగా ప్రశ్నించుకోండి: నేను అప్పులు చేయడం నా కుటుంబానికి కష్టాలు తెచ్చిపెడుతుందా? నేను అప్పు తీర్చకపోతే నా పేరు ప్రతిష్టలు ఏమవుతాయి? నేను మళ్ళీ నమ్మదగినవాడనవ్వాలంటే ఎంతో కాలం పడుతుంది! ఈ విషయంలో ఆచరణాత్మకమైన, సదుపదేశం దొరుకుతుంది. అప్పు చేయకుండా ఉండేందుకు మీకు మీ కుటుంబానికి బైబిలు సహాయపడుతుందేమో చూసేందుకు మీరు దానిని ఎందుకు పరిశీలించకూడదు?
బైబిలు మీకు సహాయపడగలదా?
అతి ప్రాముఖ్యంగా, యెహోవా యందు దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండేందుకు బైబిలు మనకందరికీ సహాయపడగలదు. ఈ ‘వ్యవహరించశక్యం కాని సమయాల్లో’ మనకు సహాయం తప్పక అవసరం అవుతుంది. (2 తిమోతి 3:1) మనం ఈ విధంగా ఉపదేశించబడుతున్నాము: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.—నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.” (హెబ్రీయులు 13:5, 6) మన పోషణకర్తగా దేవునియందలి మన దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!
ఒక్కో వ్యక్తి ఎలా జీవించాలో బైబిలు చెప్పకపోయినప్పటికీ, అది ఉత్తమమైన మార్గనిర్దేశాలనిస్తుంది. తమ ఆత్మీయతకు మొదటిస్థానమివ్వాలని యేసుక్రీస్తు తన శ్రోతలకు బోధించాడు: “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు.” (మత్తయి 5:3 NW) మనమీ లక్ష్యాలను పెట్టుకోవాలని కూడా మనకు చెప్పబడింది: “సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక, మీ సొంతకార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.” (1 థెస్సలోనీకయులు 4:11, 12) శాంతితో జీవించడానికి, ప్రశాంతతను అనుభవించడానికి మీకున్నదానితో జీవించడం అవసరం కాదా?
మన తలంపును సరిదిద్దుకోవడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేయగలదు. “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి—యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో” అని సామెతల గ్రంథకర్త దేవుని అభ్యర్థించినప్పుడు సమతుల్య దృష్టిని చూపించాడు. (సామెతలు 30:8, 9) తాత్కాలికంగానైనా స్వల్పమైనదానితో మీ అక్కరలు తీర్చుకోవలసివస్తే సిగ్గుపడవద్దు. తమను ఇతరులతో పోల్చుకుంటూ లేదా వస్తుసంపద గురించి అనవసరంగా కలతచెందుతున్న అనేకులవలె మీరు మీ సంతోషాన్ని వస్తుసంపదపై ఆధారపడేందుకు అనుమతించకండి.—మత్తయి 6:31-33.
అంతేకాక, బైబిలు మంచి అలవాట్లను అలవరచుకోడానికి మీకు సహాయపడగలదు. మీరు కొనుక్కోగల వస్తువులతో సంతృప్తిపడుతూ, పిసినారులుగా కాక ఆదాచేయడం నేర్చుకోండి. మీరు యౌవనస్థులైతే, పెద్దవారు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించినవాటిని మీరు వెంటనే ఆర్జించాలని అపేక్షించకండి. వస్తుసంపద అనే ఉరిలో పడకుండా జాగ్రత్తపడండి. బైబిలు సరైన విధంగా ధనమును గూర్చి గాక, “ధనాపేక్షను” గూర్చి మనలను హెచ్చరిస్తూ ఈ విధంగా చెబుతుంది: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.” (1 తిమోతి 6:9, 10) మీకు నిజంగా అవసరమైనదానికి, మీరు కేవలం కోరుకునేదానికి మధ్య తేడాను గుర్తించడం ఎంత ప్రాముఖ్యమో కదా!
అయితే, మీ ఆదాయం చాలా తక్కువని మీరనుకుంటున్నారా? నిరాశచెందకుండా లేమిని భరించడం సులభం కాదన్నది నిజమే. మీకు అమితమైన బరువులకు, ఆర్థిక నష్టానికి కారణమయ్యే విధంగా అప్పులు చేసే బదులు, కొన్ని అనవసరమైన వస్తువులను వదిలిపెట్టడానికి సిద్ధపడండి. జాగ్రత్తగా పథకం వేసుకోండి, మితవ్యయం చేయండి. అనుభవంగల స్నేహితునితో మాట్లాడడం ద్వారా మీరు ఆచరణయోగ్యమైన సలహాలను పొందవచ్చు. ఇది మీరు ఆదాయాన్ని పెంచుకునేందుకు తోడ్పడదా? పరిస్థితులెలాంటివైనా, బైబిలు సూత్రాలను అనుసరించడం, ఆత్మీయ విషయాలను ముందుంచడం, యెహోవాను పూర్తిగా ఆశ్రయించడం ప్రాముఖ్యమని గుర్తుంచుకోండి.—ఫిలిప్పీయులు 4:11-13.
అవును, అప్పుచేయడం మంచిది కాదు. ఈ విధంగా చెప్పబడింది: “అప్పుల్లో ఉన్న వ్యక్తి వలలో పడినట్లే.” ఋణ బాధ్యత కుటుంబానికి, ఆరోగ్యానికి, ఆత్మీయతకు హానికరం కాగలదు. అప్పు ఋణస్థుణ్ణి మరింత పేదవానిగా చేయవచ్చు. సామెతలు 22:7 ఈ విధంగా చెబుతుంది: “ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” కాబట్టి అనవసరంగా అప్పు చేయకండి. “ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు,” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు సిఫారసు చేసినదానిలో ఇమిడివున్న సూత్రం నుండి కూడా మనం ప్రయోజనం పొందగలము.—రోమీయులు 13:8.
మీ దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలాగున్నప్పటికీ, దేవుని నూతన లోకం కొరకు నమ్మకంతో ఎదురు చూడండి. త్వరలో మానవజాతి ఇక ఏ మాత్రము అప్పిచ్చేవారిగా, పుచ్చుకొనేవారిగా విభజించబడదు. దేవుని రాజ్యంలో ఎవరూ పేదవారుగా ఉండరు. యెహోవా వాగ్దానం నిజమౌతుంది: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును.” (కీర్తన 72:12, 13) అప్పుడు భూనివాసులు కేవలం మనుగడ కోసం పోరాడే బదులు “బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.
[25వ పేజీలోని చిత్రం]
థామస్ జెఫర్సన్
[క్రెడిట్ లైను]
Painting by Gilbert Stuart. Courtesy Bowdoin College Museum of Art/Dictionary of American Portraits/Dover
[26వ పేజీలోని చిత్రం]
విపరీతంగా అప్పులు చేయడం మీ వివాహజీవితంలో తిప్పలు తెచ్చిపెట్టవచ్చు