కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 6/8 పేజీలు 22-24
  • నా తండ్రి విఫలుడైనప్పటి విషయమేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా తండ్రి విఫలుడైనప్పటి విషయమేమిటి?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వారిని సన్మానించడమంటే నిజమైన భావమేంటి
  • కోపాన్ని, ఆగ్రహాన్ని సంభాళించుకోవడం
  • ‘నేనాయనను మార్చగలను’
  • మీ సొంతరక్షణ కొరకు పాటుపడడం
  • అమ్మ ఎందుకంత అనారోగ్యంగా ఉంది?
    తేజరిల్లు!—1999
  • తల్లి లేక తండ్రి మాత్రమేగల కుటుంబాలు విజయవంతం కాగలవు!
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
తేజరిల్లు!—1995
g95 6/8 పేజీలు 22-24

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నా తండ్రి విఫలుడైనప్పటి విషయమేమిటి?

“నా తండ్రి పది సంవత్సరాలు క్రైస్తవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నిష్క్రియుడు. ఆయన బైబిలు పఠించడు, కూటాలకు క్రమంగా హాజరుకాడు. సంఘంలోని తన క్రైస్తవ సహోదరులను ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాడు. జాతుల గురించి, మరి ఎన్నెన్నో విషయాల గురించి లోకుల అభిప్రాయాలే ఆయనకున్నాయి. ఆయన ఒక వేషధారి అని నేను భావిస్తాను.”—యౌవనారంభంలోని ఓ బాలిక.

ఏ తండ్రీ పరిపూర్ణుడు కాడు. “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు,” అని బైబిలు చెబుతుంది. (రోమీయులు 3:23) అయితే ఒకరి తల్లో, తండ్రో బహిరంగంగానేమో ఆదర్శ క్రైస్తవుల పాత్ర నిర్వహించి, చాటున నీచమైన రూపాన్ని ధరిస్తే, ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. “ఇతరుల ముందు, మా నాన్న చాలా మంచివాడు. కాని వారు లేనప్పుడు పూర్తి భిన్నమైన వ్యక్తి, అంటే ఊరకే పీడిస్తాడు! నేను చేసే ప్రతిదానిని ఆయన విమర్శిస్తాడు, మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని బాధపెడతాడు. నాకు జీవితంలో ఏ మాత్రం ఆనందం లభించలేని పరిస్థితిలో నేనున్నాను. నాకు ఆయనపై ద్వేషమే కలుగుతుంది” అని ఒక యౌవన బాలిక చెబుతుంది.

ముఖ్యంగా రహస్యంగా అనేక రకాల దురాగతాలకు గురయ్యే యౌవనస్థులకు కోపము, ఆగ్రహము తీవ్రంగా కలుగవచ్చు. కాబట్టి మేరి అనే పేరుగల ఒక స్త్రీ పైకి కనబడని త్రాగుబోతైన తన తండ్రి నుండి అనుభవించే “హింస, దూషణ, అన్ని విధములైన పీడను” గూర్చి వ్రాస్తుంది, “పిల్లలమైన మా దగ్గరకు ప్రజలు వచ్చి మా తండ్రి ఎంతో మంచి వాడని, మేమెంతో అదృష్టవంతులమని చెప్పేవారు” అని ఆమె దుఃఖంతో గుర్తుచేసుకుంటుంది.

అన్ని విధాలైన వేషధారణను బైబిలు ఖండిస్తుంది. (యాకోబు 3:17) దేవుని సత్యారాధికుల మధ్య కూడా “వేషధారులు” ఉంటారని అది హెచ్చరిస్తుంది. (కీర్తన 26:4; యూదా 4 పోల్చండి.) వేషధారణ చూపించేది, మీరు ప్రేమించి గౌరవించవలసిన మీ తండ్రే అయినప్పుడు, ఆ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రాన పరిస్థితులు తేలిక కాకపోవచ్చు. దానివల్ల కలిగే విభిన్న భావోద్రేకాల చేత కొందరు యౌవనస్థులు కలతచెందుతున్నారు. “నాకు సహాయం కావాలి, బైబిలేమో ‘నీ తండ్రిని సన్మానింపుము,’ అని చెబుతుంది, కాని అది నావల్ల కాదు,” అని ఒక బాలిక బాధపడుతుంది.

వారిని సన్మానించడమంటే నిజమైన భావమేంటి

తమ తల్లిదండ్రులు అర్హులు కారని భావించే యౌవనస్థులు తమ తల్లిదండ్రులను సన్మానించాలనే బైబిలు ఆజ్ఞనుండి ‘తప్పించుకునే మార్గం’ ఏదీ లేదు. (ఎఫెసీయులు 6:1, 2) తండ్రిని సన్మానించడమంటే, ఆయన జీవిత విధానాన్ని మీరు అంగీకరించాలని లేదా ఆయన మీతో వ్యవహరించే విధానాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారని దానర్థం కాదు.a బైబిలులో “సన్మానించుము” అనే పదానికి సముచితంగా నియమించబడిన అధికారాన్ని గుర్తించడం అనే సరళమైన భావం ఉండగలదు.

ఉదాహరణకు, క్రైస్తవులు ‘రాజును సన్మానించాలి’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 పేతురు 2:17) తరచూ రాజులు అనైతికత గలవారని అనుభవం ద్వారా ఆయనకు తెలుసు. ఉదాహరణకు, రాజైన హేరోదు అగ్రిప్పా I దుర్వ్యయం చేసే, లక్ష్యము లేని మనిషి. రోము చేత పాలస్తీనాకు రాజుగా నియమించబడిన తర్వాత అతడు క్రైస్తవులను హింసించనారంభించాడు. అతడు “యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను.” (అపొస్తలుల కార్యములు 12:1-3) అయితే, పేతురు తిరుగుబాటును ప్రోత్సహించలేదు. బదులుగా, అతడు రాజులకు విధేయత చూపించాలని ప్రోత్సహించాడు. అతడలా చేయడానికి మంచి కారణముంది. లోకపాలకులకు విధేయత చూపించడం యెహోవా చిత్తమైయున్నది. మరి పేతురు జీవించిన కాలంలో కొందరు రాజులకు సంపూర్ణాధిపత్యం, అధికారం ఉండేవి. సొలొమోను ఈ విధంగా చెప్పాడు: “వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజులతో చెప్పగలవాడెవడు?”—ప్రసంగి 8:3, 4.

అదే విధంగా, మీ తండ్రికి ఎలాంటి లోపమున్నప్పటికీ ఆయన ఇంకనూ పర్యవేక్షణా స్థానంలోనే ఉన్నాడు, మీ జీవితంపై ఆయనకు ఎంతో అధికారముంది. అలాంటప్పుడు, ఆయనకు ఎదురు తిరగడం, తిరస్కారముగా ఆయనతో వ్యవహరించడం జ్ఞానయుక్తమైన పని కాదు. అలా చేయడం వల్ల జీవితమింకా దుర్భరమవ్వడమేగాక, దేవుని ప్రీతిని కోల్పోవడానికి కూడా అది కారణమౌతుంది. (సామెతలు 30:17; ప్రసంగి 10:4 పోల్చండి.) అలా కాకుండా, మీకు సాధ్యమైనంతవరకు సహకరించడం, మీ తండ్రికి, మీకు మధ్య ఉన్న బంధంలో కొంత శాంతిని ప్రశాంతతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.—కొలొస్సయులు 3:20.

కోపాన్ని, ఆగ్రహాన్ని సంభాళించుకోవడం

మిమ్మల్ని గాయపరచిన లేదా నిరాశ కలిగించిన ఒకరితో మీరు ఎలా గౌరవంతో వ్యవహరించగలరు? ఇది సులభం కాదు. అయితే ఎడతెగక వారి తప్పులను, లోపాలను గుర్తుచేసుకోవడం మీ ఆగ్రహాన్ని మరింత అధికం చేస్తుంది. మీ తండ్రికున్న ఏవైన మంచి గుణాలనుబట్టి, ఆయనకు తగిన గౌరవాన్నిస్తూ ఆయనను గూర్చి మరింత అనుకూల దృక్పథంతో మీరు తలంచనవసరం ఉండవచ్చునేమో?

సామెతలు 19:11 ఏమి చెబుతుందో గమనించండి: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును.” మీ తండ్రిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మీ పరిస్థితులను గూర్చి మీకు మంచి దృష్టినివ్వవచ్చు. ఆయన నిజంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడా? లేక ఆయన అశక్తుడై, నిరుత్సాహం చెందినవాడై, సహాయం అవసరమైనవాడునైనందుననేమో? అనారోగ్యం, నిరాశ, ఒంటరితనం లేదా ఉద్యోగ ఒత్తిళ్ళ వలన ఆయనలా ప్రవర్తిస్తున్నాడేమో? అలాగైతే, ఈ సమస్యలను అర్థం చేసుకోవడం మీ తండ్రిమీద సానుభూతి కలగడానికి, బహుశ కోపాన్ని తగ్గించుకోవడానికి మీకు సహాయపడవచ్చు.

కారణమేదైనా, మీ భావాలను గూర్చి మరొకరితో చెప్పుకోవడానికి ఇది సహాయపడుతుంది. (సామెతలు 12:25) ఒక అమ్మాయి ఈ విధంగా గుర్తు చేసుకుంటుంది, “మా నాన్న ఎప్పుడూ ఎక్కువగా త్రాగేవాడు. నేనెలా భావిస్తున్నానో నా తల్లిదండ్రులకు చెప్పలేకపోయాను. కాబట్టి అంతా నా మనస్సులోనే దాచుకున్నాను.” అయినా, మీరు ఒంటరిగా భరించనవసరం లేదు, సంఘంలోని అనుభవజ్ఞులు తల్లిదండ్రుల స్థానం తీసుకోలేకపోయినా, ఇంట్లో లభించని ఎటువంటి శ్రద్ధనైనా చూపించడానికి ఎంతో చేయగలరు. (మార్కు 10:30.) సామెతలు 17:17 ఈ విధంగా చెబుతుంది: “స్నేహితులు ఎల్లవేళలా తమ ప్రేమను కనబరుస్తారు. కష్టాలను పంచుకోకపోతే ఇక సహోదరులెందుకు?”—టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

‘నేనాయనను మార్చగలను’

బాధ్యత ఉందనే తప్పుడు అభిప్రాయంతో కొందరు యౌవనస్థులు భావోద్రేకంగా బాధననుభవిస్తున్నారు. మేరి మరియు ఆమె సవతి తల్లి పిల్లలు ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నారు: “మా నాన్నగారి త్రాగుడు సమస్యను ఎవరన్నా కనిపెడతారేమోననే భయంతో మేము ఉండేవాళ్ళం.” అపరాధియైన తమ తండ్రిని మార్చే విఫల ప్రయత్నంలో కొందరు అలసిపోతారు.

మీ తండ్రిని మీరు ఎక్కువగా ప్రేమించి, శ్రద్ధ చూపిస్తున్నట్లయితే, మీరు ఆయన లోపాలనుబట్టి ఆయనను నిందించకూడదు. దేవుని ఎదుట తనకున్న బాధ్యత అనే తన ‘బరువును తానే భరిస్తాడు.’ (గలతీయులు 6:5; యాకోబు 5:14 పోల్చండి.) మీ తండ్రి ప్రవర్తనను మీరు సరిదిద్దడం లేదా అదుపు చేయడం మీ బాధ్యత కాదు. మీ తండ్రిని ఎప్పుడూ తప్పుపడుతూ, దూషిస్తూ ఉండడం ఆయనను మరింత కలతపరుస్తుంది.

దీనర్థం మీరు చేసేదేమీ లేదని కాదు. కనీసం మీరు మీ తండ్రి మనస్సు మార్చుకోవాలని ఆయన కొరకు “ఎడతెగక ప్రార్థన” చేయవచ్చు. (1 థెస్సలోనికయులు 5:17) ఆయనపై మీకున్న ప్రేమను క్రమంగా వెలిబుచ్చడం, సముచితమైనప్పుడు ప్రశంసించడం అతని దృక్పథాన్ని శాంతింప చేయవచ్చు. మీకు సాధ్యమైనంత మట్టుకు ఆ పరిస్థితిని భరించడం ఒక్కటే మీరు చేయగలిగింది.b

మీరు, మీ తండ్రి క్రైస్తవులైతే, ఆయన అమితంగా త్రాగడం, కోపిష్టిగా ఉండడం వంటి గంభీరమైన తప్పిదం చేస్తున్నట్లయిన, విషయాలు సంఘ పెద్దలతో చర్చించేలా చూడవలసిన బాధ్యత ఉందని సహజంగా మీరు భావిస్తారు. (యాకోబు 5:14) ఇది విశ్వాసఘాతుకం కాదు గాని, అతనికి ఎంతో అవసరమైన సహాయం అందేలా మీరు చేసే ప్రేమపూర్వక ప్రయత్నం. నిజమే, కొందరు తండ్రులు కోపంగా దానిని నిషేధించి, రహస్యంగా పిల్లలను దండించారు కూడా, కాని ఈ విషయంలో ‘నీతినిమిత్తము శ్రమపడే’ యౌవనస్థులు చేసిన సాహస కృత్యాన్ని యెహోవా అంగీకరిస్తాడని, తన యుక్తమైన సమయంలో ఆయన సత్యాన్ని వెలుగులోనికి తెస్తాడని నమ్మకము కలిగి ఉండగలరు.—1 పేతురు 3:14; 1 తిమోతి 5:24, 25.

మీ సొంతరక్షణ కొరకు పాటుపడడం

సొలొమోను ఈ విధంగా చెప్పాడు: “అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు.” (ప్రసంగి 7:7) విచారకరమైనదేమంటే, తమ తల్లిదండ్రుల తప్పుడు మాదిరి వలన కొందరు యౌవనస్థులు దుఃఖాక్రాంతులై, తామును చెడునడత నడవనారంభించారు. కొందరు దేవునికి వ్యతిరేకంగా క్రోధము గలవారై, క్రైస్తవ మార్గాన్ని విడిచి పెట్టారు కూడా! (సామెతలు 19:3) బైబిలు ఈ విధంగా హెచ్చరిస్తుంది: “నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము.”—యోబు 36:18-21.

దేవుని ఎదుట మీ తండ్రి స్థానాన్ని గూర్చి అమితంగా బాధపడడానికి బదులు, మీరు ‘భయముతోను వణకుతోను మీ సొంత రక్షణ కొరకు పాటుపడవలసిన’ అవసరముంది. (ఫిలిప్పీయులు 2:12) ప్రాచీన కాలాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో హిజ్కియా అనే పేరుగల యువరాజు ఆ విధంగా చేశాడు. అతని తండ్రియగు, రాజైన ఆహాజు యెహోవా ఆరాధికునిగా చెప్పుకున్నాడు. (యెషయా 7:10-12) నిజానికి ఆయన అన్యమత దేవతారాధికుడు, తన స్వంత కుమారులలో ఒకరిని మానవ బలిగా అర్పించాడు! (2 రాజులు 16:1-4) మతభ్రష్టత ప్రబలివున్న ఈ పరిస్థితి యువకుడైన హిజ్కియాకు ఎంతగా నిరాశ కలిగించి ఉంటుందో ఊహించండి! ఈ యువరాజే వ్రాసి ఉంటాడని కొందరు నమ్ముతున్న కీర్తన 119:28 ఈ విధంగా చెబుతుంది: “వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.”

యెహోవా అలాగే చేశాడు! తన పరిసరాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రార్థనలోను దేవుని వాక్య పఠనంలోను తన స్వంత ఆత్మీయ ఎదుగుదలకు హిజ్కియా తన్నుతాను అర్పించుకున్నాడు. (కీర్తన 119:97) ఆయన తన సహవాసాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. (కీర్తన 119:63) ఫలితం ఏమైంది? వేషధారియైన తన తండ్రి విచారకరమైన మాదిరినుంచినప్పటికీ హిజ్కియా ‘యెహోవాను హత్తుకున్నాడు.’ (2 రాజులు 18:6) మీరు కూడా అలాగే చేయగలరు! మీ తండ్రి వేషధారణతో ప్రవర్తిస్తుండవచ్చు, కాని మీరు దానిని అనుసరించనవసరం లేదు. యెహోవాను హత్తుకునే ఉండండి, బహుశ, విశ్వాస్యతకు మీరు ఉంచే మంచి మాదిరి ఒకరోజు మీ తండ్రి మారడానికి నడిపించవచ్చు.

[అధస్సూచీలు]

a సులభంగా అర్థమయ్యేందుకు, తల్లిదండ్రులు అనే దానికి బదులు తండ్రి అని అందాం.

b దీని భావం యౌవనస్థులు దెబ్బలను, లైంగిక అత్యాచారాన్ని భరించవలసిందే అని కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్న యౌవనస్థుడు సహాయం కొరకు వెదకాలి, అవసరమైతే కుటుంబానికి వెలుపల సహాయాన్ని పొందవచ్చని కూడా దాని భావము.

[23వ పేజీలోని చిత్రాలు]

మీ తండ్రి విఫలుడైనందువల్ల మీరు విఫలులవ్వనవసరం లేదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి