ప్రపంచ పరిశీలన
అనుపమానమైన గ్రహం
ఇతర గ్రహాలపై కూడా జీవం ఉండే సాధ్యత ఉందని శాస్త్రజ్ఞులు అనేక సంవత్సరాల నుండి ఊహిస్తున్నారు. విశ్వంలోని కోట్లకొలది పాలపుంతల్లో ఎక్కడో ఒకచోట భూమిపై జీవాన్ని సాధ్యపరుస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయని తలంచబడింది. లీ నొవెల్ అబ్‌సర్వేటర్ అనే పత్రిక ఇలా చెబుతుంది, “మానవుడు భూమిమీద కనిపించక ముందు ఒకే సమయంలో అద్భుతమైన అనేక ఏకకాల సంఘటనలు జరిగాయి” అని ఇప్పుడు మరింత స్పష్టమౌతుంది, “మరెక్కడా అలాంటి ప్రక్రియ జరిగే అవకాశం అప్పటికే తక్కువ ఉండగా,” విశ్వాన్ని గూర్చి మరియు భూమిని గూర్చిన అతి నూతన పరిశోధనలు “ఆ సాధ్యతను మరింత తగ్గించేశాయి.” మరొక గ్రహంపై సమానమైన పరిస్థితులు ఉండడాన్ని గూర్చిన గణితశాస్త్ర అసాధ్యతపై వ్యాఖ్యానిస్తూ, ఒకే ఒక గ్రహంపై అంటే మన గ్రహంపై మాత్రమే జీవం ఉందని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారని ఆ పత్రిక చెబుతుంది. (g95 4/22)
కచ్చితమైన వార్తలకు దూరదర్శినా లేక వార్తాపత్రికలా?
ఆస్ట్రేలియాలో దూరదర్శిని విశ్వసనీయతను పోగొట్టుకుంటుండగా, వార్తాపత్రికలు దానిని సంపాదిస్తున్నాయి. ది ఆస్ట్రేలియన్‌లో ప్రచురించిన ఒక సమాచార వ్యవస్థ జరిపిన అధ్యయనం ప్రకారం “మరింత ఆసక్తికరంగా చేసే ప్రయత్నంలో దూరదర్శిని విషయాల కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను, న్యాయమును చాలా వరకు విడిచిపెట్టింది” అని చెబుతుంది. ఉదాహరణకు మరింత ఉద్వేగపూరిత విషయంగా చేసేందుకు కొన్ని దూరదర్శిని వార్తలు పాత ఫైల్ టేప్‌ల ద్వారా అధికం చేయబడుతున్నాయి. విశ్లేషించబడిన 500 కథల్లో 260 ఉపయోగించబడిన ఫైళ్ళే. టి.వి. వార్తల్లో ఫైల్ టేపులను ఇమిడ్చినట్లయితే, అవి అంగీకరించదగినవేనని సాధారణంగా ప్రజలు తలస్తారు, అయితే ఇది ఎల్లవేళలా నిజం కాదు. ఆ నివేదిక ఈ విధంగా చెబుతుంది: “రే మార్గాన్ రిసర్చ్ సెంటర్ చేసిన పరిశోధన . . . చూపించేదేమంటే, ‘కచ్చితమైన, విశ్వసనీయమైన వార్త’లకు అతి శ్రేష్ఠమైన సమాచార వ్యవస్థ దూరదర్శినియని నమ్మే ప్రజల సంఖ్యలో 12 శాతం పాయింట్లు తగ్గాయి, అంటే 1986లో నూటికి 53.7 అనే శిఖరాగ్రం నుండి” 1993లో “41.5 శాతానికి తగ్గింది.” (g95 4/22)
తల్లిదండ్రుల/పిల్లల సంబంధం?
తల్లిదండ్రులు తమ పిల్లలను సమానులుగా ఎంచాలా? ఒ ఎస్టాడో డీ ఎస్. పౌలో అనే బ్రెజిలియన్ పత్రికలో సావోపాలో విశ్వవిద్యాలయంలోని విద్యాబోధకురాలైన లిసాన్‌డ్రా మారియా కాస్టలో బ్రాన్‌కో ఈ విధంగా చెబుతున్నారు: “తల్లిదండ్రులు పిల్లలతో ఎన్నడూ సమానులు కారు, మరి అది వ్యక్తం చేయబడాలి. . . అధికారాన్ని ఉపయోగించని చోట, బిడ్డ ఉపేక్షించబడినవాడు, అనాథ అవుతాడు. తన తల్లిదండ్రులు తనను విద్యావంతుడిని చేయడానికి సామర్థ్యంగల పెద్దవారిగా ఉండాలనే బిడ్డ ఎప్పుడూ కోరుకుంటాడు.” (g95 4/22)
సిసేరియన్ విభాగాలు ఎక్కువవుతున్నాయి
“పదివేల మంది స్త్రీరోగ నిపుణులు, మరీ ఎక్కువ సిసేరియన్లు అని అంటూ ఇటలీవైపుకు వేలెత్తి చూపిస్తున్నారు,” అని రోమ్ వార్తాపత్రికయైన II మెస్సాగెరొ నివేదిస్తుంది. సిసేరియన్ ద్వారా పుట్టే పిల్లల సంఖ్య విషయంలో ఇటలీ, ఐరోపాలో మొదటి స్థానాన్ని, అమెరికా, బ్రెజిల్‌ల తరువాత ప్రపంచంలో మూడవ స్థానాన్ని వహిస్తుంది. ఇటలీలో 1980 నుండి సిసేరియన్ శస్త్రచికిత్సలు రెండింతలయ్యాయి; ఇప్పుడు ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు సిసేరియన్ ద్వారా జన్మిస్తున్నారు. ఎందుకీ పెరుగుదల? II మెస్సాగెరొ ప్రకారం, వైద్య కారణాలు కాకుండా మరి రెండు కారణాలున్నాయి: స్త్రీలు వేదనతో కూడిన ప్రసవాలను తప్పించుకోవడానికి ఇష్టపడుతున్నారు, డాక్టర్లు కోర్టు తీర్మానాలకు భయపడి, ఎక్కువ అపాయంలేని పద్ధతులను ఎన్నుకుంటారు. అయితే, సిసేరియన్ పద్ధతులు సురక్షితమైనవని ఎంతో కాలం నుండి దృష్టించబడినప్పటికీ, వాటిని విరివిగా, సరైన కారణాలు లేకుండా ఉపయోగిస్తున్నారని అనేకమంది డాక్టర్లు నమ్ముతున్నారు. రోమ్‌నందలి లా సాఫియెన్జా విశ్వవిద్యాలయంలోని కార్లొ సింగారెలి ఈ విధంగా చెప్పాడు: “ప్రసవ సమయంలో మరణం సంభవించడానికి, సిసేరియన్లకు పరస్పర సంబంధమేమీ ఉన్నట్లు కనిపించదు.” బొలోగ్నాలోని ఎస్. ఆర్సోలా ఆసుపత్రినందలి లూస్యానో మోవీసెలీ ఈ విధంగా వ్రాశాడు: “సిసేరియన్ మరింత సురక్షితమైనదనే నమ్మకాన్ని విడిచిపెట్టాలి, ఎందుకంటే అది పచ్చి అబద్ధం.” (g95 4/22)
పరువు నిలబెట్టుకొనుట
పరువు నిలుపుకోవడానికి వివాహ సమయాల్లోను, అంత్య క్రియల్లోను కావలసినంత మంది బంధుమిత్రులు లేని జపాన్ దేశస్థుడు ఏమి చేయాలి? జవాబు: వారిని అద్దెకు తెచ్చుకోవాలి. వధూవరులు సాధారణంగా అతిథులను సమానంగా ఆహ్వానించుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే రెండు గుంపులు అసమానంగా ఉంటే లేదా పరువు నిలబెట్టుకోవడానికి సరిపోనంతగా గుంపు మరీ చిన్నదైతే, వధువు లేదా వరుని ఇంటివారు రహస్యంగా బెన్‌రియా సేవ కొరకు అంటే అక్షరార్థంగా “పనికివచ్చే వ్యక్తుల” సేవల కొరకు విజ్ఞప్తి చేసుకుంటారు. బెన్‌రియా బంధుమిత్రులకు బదులుగా మనుషులను పంపించడంతో పాటు నానా విధములైన పనులను చేసిపెడుతుంది. అంత్యక్రియలకు వచ్చినప్పుడు. వారు అద్దెకు తీసుకున్న ఏడ్చేవారుగా కాదు గాని, పొరుగువారు కనుక్కోలేని విధంగా బదులు వచ్చినవారిగా పనిచేస్తారు, ఉదాహరణకు, చనిపోయినవాని తోటి పనివాళ్ళు అంత్య క్రియలకు రాలేదనుకోండి. తాను ఒక కంపెనీ కార్యనిర్వహణాధికారి అంత్యక్రియలకు వెళ్ళాడని, అక్కడ ఉన్న వందమందిలో దాదాపు 60 మంది బెన్‌రియాలో వారేనని ఒక బెన్‌రియా కంపెనీ యజమాని మెయినికి డెయిలీ న్యూస్‌లో నివేదించాడు. “ఆ కుటుంబం 3 లేదా 4 బెన్‌రియా కంపెనీలను పిలిచి ఉండవచ్చు,” అని ఆయన చెప్పాడు. (g95 4/22)
ఉపాధ్యాయులను ఏది ప్రసిద్ధులనుగా చేస్తుంది?
“పాఠశాలకు వెళ్ళమంటే తరచూ పిల్లలు ఏడుస్తున్నప్పటికీ, వారిలో చాలా మందికి ఇష్టమైన ఉపాధ్యాయుడు ఉన్నాడు.” అని నోస్వాయిషె నాయి ప్రెస్ అనే జర్మన్ వార్తాపత్రిక నివేదిస్తుంది. నిజానికి, 91 శాతం మంది అమ్మాయిలకు, 83 శాతం మంది అబ్బాయిలకు ఇష్టమైన ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఏడు మరియు 16 ఏండ్లలోపు వయస్సు గల 2,080 మంది విద్యార్థుల మధ్య జరిగిన ఒక సర్వే, ఒక ఉపాధ్యాయుని పిల్లల ఎదుట ప్రసిద్ధునిగా చేసే గుణాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. “తక్కువ హోమ్ వర్క్ ఇచ్చే ఉపాధ్యాయుడు ఇష్టమైనవాడవ్వాలని లేదంటే” అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. ఉపాధ్యాయుడు న్యాయవంతుడును, హాస్యభావం కలవాడును, పాఠాలను ఆసక్తికరంగా చెప్పేవాడునై ఉండడం మరింత ప్రాముఖ్యమై ఉన్నది. అంతేకాక, విషయాలను చక్కగా వివరించగల, నెమ్మదిగా ఉండే, అర్థం చేసుకునే ఉపాధ్యాయులను విద్యార్థులు ప్రశంసిస్తారు. (g95 4/22)
చాలామంది వృద్ధులౌతున్నారు
మానవ కుటుంబం వయస్సు మళ్ళినదౌతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పత్రికయైన వరల్డ్ హెల్త్ ఈ విధంగా వివరిస్తుంది, “ప్రస్తుతం ప్రపంచంలో 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సుగలవారి మొత్తం సంఖ్య 36 కోట్లు. ప్రతి సంవత్సరం 8,00,000 మంది ఎక్కువవుతున్నారు.” రాబోయే 30 సంవత్సరాల్లో, అంచనా వేయబడినట్లు వృద్ధుల సంఖ్య 85 కోట్లకు చేరుతుందని అంచనా వేయబడుతుంది. “సంతానము ఎడతెగక తగ్గడం మరియు ఆయుష్కాలము పెరగడం” వలన ఐరోపా మరియు ఉత్తరమెరికాలో వృద్ధుల శాతం ఆకస్మికంగా పెరుగుతోందని వరల్డ్ హెల్త్ చెబుతోంది. “స్వీడన్ పౌరుల్లో 18 కంటే ఎక్కువ శాతం మందికి 65 కంటె ఎక్కువ ఏండ్లుండడంతో, ప్రపంచంలోని ‘అతి పురాతన’ జనాబా స్వీడన్‌లో ఉంది,” అని ఆ పత్రిక చెబుతుంది. (g95 5/8)
దోమనిరోధక రేడియో
పోలండ్‌లోని ఒక రేడియో స్టేషన్ యుగాలుగా ఉన్న కీటకమైన దోమకు వ్యతిరేకంగా పోరాడేందుకు క్రొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రకృతిని గూర్చిన ఫ్రెంచ్ పత్రికయైన టెర్ సోవాజ్ నివేదిస్తున్నదేమంటే, ఒక వేసవిలో, పోలండ్‌లో దోమలు ఎక్కువయ్యే కాలంలో రేడియోశ్రోతలు క్రిమినాశకాలు లేకుండానే, పీడించే ఈ కీటకాలతో పోరాడగలిగారు. వారు కేవలం రేడియో జెట్ అనే స్టేషన్‌లో రేడియో పెట్టారంతే. టెర్ సోవాజ్ ప్రకారం, మానవులకు వినిపించనిది, కాని దోమలకు వినిపించే ఎడతెగని సంకేతాలను రేడియో స్టేషన్ ప్రసారం చేస్తుంది. ఆ ప్రసారం ఏంటంటే దోమలను భక్షించే గబ్బిలాల పెద్ద అరుపులను ఎలక్ట్రానిక్ యంత్రాలు అనుకరించినవన్నమాట—వాటిని వినే దోమలను అవి వెళ్ళగొట్టడానికి అది సరిపోతుంది. (g95 5/8)
మలినపడిన యాత్రికులు
ప్రతి సంవత్సరం ప్రయాణం చేసే నాలుగు అరబ్బుల ప్రజల్లో 20 నుండి 50 శాతం మంది మలినపరచబడిన ఆహారం వలననో, నీళ్ళవలననో అతిసారవ్యాధికి బాధితులయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తుంది. ప్రయాణ బడలిక, అలసట లేదా ఆహార పదార్థాలు మారడం, వాతావరణం మారడం యాత్రికుని రోగ నిరోధకశక్తిని బలహీనపరుస్తూ సమస్యలకు కారణమౌతుంది. అతిసారవ్యాధి వచ్చే అవకాశాన్ని నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్రింది వాటిని సిఫారసు చేస్తుంది: ఆహారపదార్థాలను బాగా వండేటట్లు, వడ్డించే వరకు వేడిగా ఉండేటట్లుగా చూసుకోండి. త్రాగే నీళ్ళు సురక్షితమైనవి కానట్లయితే, వాటిని మరగబెట్టండి లేదా మందుల దుకాణాల్లో లభ్యమయ్యే నమ్మదగిన టాబ్లెట్లనుపయోగించి రోగక్రిములను తొలగించండి. పొట్టు ఒలువగల లేదా తీయగల పండ్లను లేదా కూరగాయలను తప్ప మిగిలిన పచ్చి ఆహార పదార్థాలను తినకండి. “వండండి, ఒలవండి లేదా వదిలిపెట్టండి, అనే సామెతను గుర్తు పెట్టుకోండి,” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. (g95 5/8)
ఇండియా దంపతులు ముట్టడిలో ఉన్నారు
ఇండియాలో వివాహం “‘మొదట నేను’ అనే సమాజంగా శీఘ్రం మారుతున్న సమాజపు ముట్టడిలో ఉంది,” అని ఇండియా టుడే అనే పత్రిక చెబుతుంది. అనేకమంది యౌవనస్థులైన దంపతులు తమ తగాదాలతో కోర్టుకెక్కుతున్నారు. ఇండియా టుడే ప్రకారం, కౌన్సిలర్ డా. నారాయణ రెడ్డి ఈ విధంగా నివేదిస్తున్నాడు, “సలహాదారుల దగ్గరికి వివాహం చేసుకున్న తొలి సంవత్సరాల్లోనే వచ్చే ప్రజల సంఖ్య గత ఐదు సంవత్సరాల్లో రెండింతలయ్యింది.” కొందరు దంపతులు వివాహం జరిగిన కొన్ని రోజులకే సలహాదారుల దగ్గరికి వెళ్ళారు. చాలా మట్టుకు, ఇండియాలోని వివాహాల విచ్ఛిన్నాలకు వ్యభిచారం, త్రాగుబోతుతనం, ఆర్థిక మరియు వస్తు సంబంధ తగాదాలు అత్తింటివారితో ఇబ్బందులు, లైంగిక విషయాలు కాకుండా క్రొత్త కారణాలేమి లేవు. ఒత్తిడి అనేది “ఇండియా గృహాల్లో సర్వవ్యాపియు, అదృశ్యమునైన, ద్రోహబుద్ధిగల అపరిచుతునిగా మారింది.” (g95 5/8)
“లాభంలేని” ఎయిడ్స్ టీకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థలోని పరిశోధన మరియు అభివృద్ధి శాఖ డైరెక్టరైన డా. పయట్ ప్రకటించినదేమంటే, కొన్ని ఔషధనిర్మాణ ప్రయోగశాలలు ఎయిడ్స్ టీకాల కొరకైన తమ పరిశోధనను ఆపివేసి, ఎయిడ్స్ రోగులను చికిత్స చేయడానికి మందులను కనిపెట్టడానికి ఆర్థిక చింతలు కారణమయ్యాయి. ఫలవంతమైన ఎయిడ్స్ టీకాలు వచ్చినట్లయితే, ఏ మాత్రం లాభానికి తావేలేకుండా ఆ ఉత్పత్తిని ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిళ్ళు బలవంతం చేస్తాయేమోనని ప్రయోగశాలలు భయపడుతున్నట్లు నివేదించబడింది. (g95 4/22)