మా పాఠకుల నుండి
విద్యాభ్యాసం నేను ఈ మధ్యే నైజీరియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడనయ్యాను, మార్కులు 2 శాతం తక్కువ కావడం వలన పై గ్రేడులను పొందలేకపోయాను. నేను నిరాశచెందాను. అయితే, మీరు “విద్యాభ్యాసాన్ని దాని స్థానంలో ఉంచుట” (సెప్టెంబరు 8, 1994) అనే శీర్షికను ప్రచురించి, పాండిత్య ప్రాబల్యంతో శోభించాలనే ఉద్దేశంతో విద్యనభ్యసించకూడదని చూపించినప్పుడు, నేను సరైన విధంగా ఆలోచించడం మొదలు పెట్టాను. నా ప్రొఫెసర్లు పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులకు పోవాలని నన్ను ప్రోత్సహించగా, నేను నేర్చుకున్నదాని ఆధారంగా విషయాలను గూర్చి గంభీరంగా తలస్తున్నాను.
జి. జె., నైజీరియా
నాకు 14 ఏండ్లు, ఉన్నత విద్యనభ్యసించాలనే తీవ్రమైన ఒత్తిళ్ళలో ఉన్నాను. మీ శీర్షిక సహాయంతో, నేను చేయవలసినదేదో తీర్మానించుకున్నాను. నేను పయినీరు [పూర్తికాల సువార్తకురాలు] అవ్వాలని కోరుకుంటున్నాను, నేను ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి అదనపు తర్ఫీదు అవసరమైతే, వృత్తివిద్యా పాఠశాలకు వెళ్ళాలని, ఛాయాచిత్రకళ నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను.
హెచ్. ఓ., అమెరికా
నేను అదనపు విద్యనభ్యసించవద్దని తీర్మానించుకున్నాను. మన సృష్టికర్త గురించి ఇతరులకు బోధించడానికి ఆ సమయాన్ని ఉపయోగించాలని ఇష్టపడుతున్నాను. విభిన్న విషయాల గురించి నాకెంతో తెలుసని సాధారణంగా ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. “మీరు కళాశాలకు వెళ్తున్నారా?” అని వాళ్ళు అడుగుతారు. నాకు తెలిసినదంతా బైబిలు నుండి మరియు వాచ్‌టవర్ సొసైటీ అందించే సాహిత్యం నుండి నేర్చుకున్నవేనని వారికి చెబుతుంటాను.
ఎమ్. ఎల్., అమెరికా
అదనపు విద్యాభ్యాసము యొక్క లాభనష్టాలను బేరీజు వేయవలసిన అవసరం ఉందని మీ శీర్షిక తెలిపింది. మరలా పాఠశాలకు వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను, కాని ఆత్మీయ కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయదలచుకోలేదు. క్రైస్తవ కూటాల పట్టికను నేను పాఠశాల సెక్రటరీకి వివరించాను, నేను కూటాలన్నింటికీ హాజరవ్వగలిగేలా ఆయన నా క్లాసులను ఏర్పాటు చేశారు.
ఎమ్. ఎఫ్. ఎస్., బ్రెజిల్
బలహీనమైన ఘటము? “బైబిలు ఉద్దేశము: ‘బలహీనమైన ఘటము’—స్త్రీలకు అవమానమా?” అనే జ్ఞానాభివృద్ధిని కలిగించే శీర్షికను (అక్టోబరు 8, 1994) బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రతి పురుషుడు ఈ శీర్షికను చదవాలి, అది అంత చక్కగా వివరించబడింది.
జి. బి., అమెరికా
నేను 1 పేతురు 3:7నందున్న స్త్రీలను గూర్చిన ‘బలహీనమైన ఘటము’ అనే బైబిలు పదాన్ని ఎన్నడూ స్పష్టంగా అర్థం చేసుకోలేదు. స్త్రీలు అల్పమైన సృష్టి అని నేనెప్పుడు అనుకునేదాన్ని, పురుషులు స్త్రీలతో అగౌరవంగా వ్యవహరించడాన్ని చూస్తూ నేను పెరిగాను. కాని ఆ శీర్షిక నా తలంపులను సరిచేసింది.
టి. సి., అమెరికా
వ్యతిరేక లింగం “నేనెందుకు ఆ వ్యక్తిని గూర్చి తలంచకుండా ఉండలేకపోతున్నాను?” “నేను ఆ వ్యక్తిని గూర్చి తలంచకుండా ఎలా ఉండగలను?” (ఆగష్టు 8, మరియు సెప్టెంబరు 8, 1994) లాంటి యౌవనస్థులు ఇట్లు అడుగుదురు. . . అనే శీర్షికలను బట్టి మీకు నా కృతజ్ఞతలు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఎడల 12 ఏండ్లప్పటి నుండి నాకు భావోద్రేకాలు బలీయంగా ఉండేవి, అయితే నాకు పిచ్చి లేదని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను సంఘంలోని ఒక వృద్ధ క్రైస్తవ సహోదరికి చెప్పాను, ఆమె నాకు సహాయం చేసింది.
పి. జెడ్., అమెరికా
హస్తప్రయోగాన్ని గూర్చిన భాగం నాకు సూటిగా వర్తించింది. హస్తప్రయోగం తీవ్రమైన లైంగిక కోరికలను అణచివేయడానికి సహాయపడుతుందని నేననుకున్నాను, అయితే దాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఈ హేయమైన పని చేసినందుకు యెహోవా నన్ను క్షమించాలని ప్రార్థిస్తున్నాను.
పి. ఎమ్., అమెరికా
ఈ శీర్షిక నాకు సరైన సమయంలో అందింది. పాఠశాలలో మొదటి చర్చనీయాంశం లైంగికత. నేను వెళ్ళే సంఘానికి హాజరయ్యే ఒక అమ్మాయి పాఠశాలలో ఉండేది. ఆమె బుద్ధిమంతురాలు, తెలివి గలది, అందమైనది. ఎడతెగక ఆమె గురించి ఆలోచించకుండా, ఆమెను చూస్తూ ఉండకుండా ఉండేందుకు ఈ శీర్షిక నాకు సహాయం చేసింది.
ఎమ్. ఎఫ్., జర్మనీ