కాలవిలంబం—సమయాన్ని దొంగిలిస్తుంది
“కాలవిలంబం సమయాన్ని దొంగిలిస్తుంది.”—ఎడ్వర్డ్ యంగ్, సుమారు 1742.
ఆగండి! ఈ శీర్షికను చదవడం ఆపకండి! ఆపితే ఏం జరుగగలదో మీకు తెలుసు. మీరు దాన్ని ప్రక్కకు పెట్టి ఇలా అనవచ్చు: “అది ఆసక్తికరమైన ముఖశీర్షికే, కానీ దాన్నిప్పుడు చదవడానికి నాకు సమయంలేదు. నేను దాన్ని తర్వాత చదువుతాలే.” అయితే ఆ తర్వాత అనేది ఇంకెప్పుడూ రాకపోవచ్చు.
కాలవిలంబాన్ని గూర్చిన శీర్షికను చదివేందుకు కాలవిలంబం చేయకండి! మీ సమయాన్ని నిర్ణయించుకోండి. బహుశా మీరు ఈ శీర్షికను దాదాపు ఐదు నిమిషాల్లో చదవగలరు. అప్పటికి మీరు ఈ పత్రికంతటిలో దాదాపు 10 శాతం చదవడం ముగించి ఉంటారు! మీ గడియారం వైపు చూసుకుని ఇప్పుడు సమయాన్ని లెక్కించడం ప్రారంభించండి. (మీరు ఇప్పటికే ఈ శీర్షికలో 5 శాతం చదివేశారు!)
అది కాలవిలంబమా?
మీరు ఇప్పుడు చేయగల, లేక చేయవలసిన దాన్ని మీరు ఒకవేళ కాలాపహరణం చేస్తే (పుట్ ఆఫ్)—వాయిదావేస్తే (పోస్ట్‌ఫోన్)—అప్పుడు మీరు కాలవిలంబం (ప్రోక్రాస్టినేట్) చేస్తారు. వేరే మాటల్లో చెప్పాలంటే, మీరు ఇప్పుడు, ఈనాడు చేయగల దాన్ని రేపటికి (పుట్ ఆఫ్) వాయిదా వేస్తారు. ఒక కాలవిలంబకుడు చర్య గైకొనవలసిన అవసరం ఉన్నప్పుడే, చర్య గైకొనడాన్ని జాప్యం చేస్తాడు.
ఒక పర్యవేక్షకుడు ఉద్యోగిని నివేదిక సిద్ధంచేయమని అడుగుతాడు; తల్లిదండ్రులు తమ పిల్లవాన్ని అతని గది శుభ్రం చేయమని అడుగుతారు; ఒక భార్య నీళ్లగొట్టం బిగించమని భర్తను అడుగుతుంది. “నేను చాలా బిజీగా ఉన్నాను” లేక, “నేను మర్చిపోయాను’ లేక, “నాకు సమయం లభించలేదు” అనేవి, దాన్ని చేయడంలో తప్పిపోయినందుకు చెప్పే సాకులు. వాస్తవమేమంటే, చేయడానికి ఇంకా ఎక్కువ ఆనందదాయకమైన పనులు ఉన్నప్పుడు, నివేదికలు సిద్ధంచేయడం లేక గదులు శుభ్రం చేయడం లేక నీటి గొట్టాలు బిగించడం వంటివి చేసేందుకు మనలో ఎవరూ కూడా ఇష్టపడరు. కావున మనం దాన్ని కాలాపహరణం చేస్తాం, మనం దాన్ని చేయడంలో జాప్యం చేస్తాము.
అయితే, కొన్నిసార్లు మనం ఏదైనా చేయడాన్ని కాలాపహరణం చేస్తే, అది కాలవిలంబం కాదన్న విషయం మీకు తెలుసా? ఒక వినతిపత్రాన్ని అందుకుని దాన్ని ఏమి చేయాలో తెలియని ఒక వ్యాపారవేత్త, దాన్ని తన బల్లపై “సస్పెన్డ్” అని పేరున్న డబ్బాలో భద్రపర్చుతుంది. కొన్ని వారాల తర్వాత, ఆమె ఈ ఐటమ్‌లను మళ్లీ పరిశీలిస్తుంది, మరి వాటిలో సగం వినతిపత్రాలపట్ల చర్యగైకొనవల్సిన అవసరమే లేదని తెలుసుకుంటుంది. అవి వాటికవే పరిష్కరింపబడ్డాయి లేక ఇక ఎంతమాత్రం అవసరం లేదు. మీరు జాప్యం చేయాలా లేక చర్యగైకొనాలా అనేది మీకు సరిగ్గా తెలియనప్పుడు, మీరు వాయిదా వేస్తున్నదాన్ని మీరెన్నటికీ చేయకపోతే ఏమౌతుందో నిశ్చయించుకోడానికి ప్రయత్నించండి. మీరు దాన్ని చేస్తే వచ్చే పర్యవసానం మంచిగా ఉండగలదా లేక మరీ ఘోరంగా ఉండగలదా?
మీరు ఇప్పుడు చర్య గైకొనగల్గి మరియు గైకొనాల్సి ఉన్నప్పుడు, అవసరమైన చర్యను జాప్యం చేయడం తర్వాత ఎక్కువ సమస్యలను సృష్టించగల్గినప్పుడు, అలా జాప్యం చేయడం కాలవిలంబము. ఉదాహరణకు, అంట్లను కొంత సమయం గడిచాక తోమితే, వాటిని శుభ్రంగా తోమడానికి కొంత కష్టమౌతుంది. కారును నియంత్రించడాన్ని వాయిదా వేయడంవల్ల, తర్వాత ఎక్కువ ఖర్చయ్యే మరమ్మత్తులు చేయవలసి రావచ్చు. ఒక బిల్లు చెల్లించటంలో ఆలస్యం చేయడం, ఎక్కువ ఖర్చులు చెల్లించడానికి లేక సేవలు పోగొట్టుకోడానికి దారి తీయగలదు. గడువు మీరిన ట్రాఫిక్ పన్నులకు, వీడియో క్యాసెట్లకు మరియు గ్రంథాలయ పుస్తకాలకు చెల్లించవలసిన బకాయిలు 46 డాలర్లు అయ్యిందని ఒక స్త్రీ లెక్కించి చెప్పింది! అది కేవలం ఒక నెలకు మాత్రమే!
దొంగను పట్టుకోవడం
మీరెందుకు కాలవిలంబం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఈ క్రింది కారణాలను ఒకసారి చూడండి, మరి మీరు ఇంకా ప్రారంభించని లేక ముగించని ప్రస్తుత పథకానికి ఏది సరిపోతుందో కనుగొనగలరేమో చూడండి:
అలవాటు:
నేను ఆఖరి నిమిషం వరకూ ఆగితే, దాన్ని ముగించడానికి నాకు ఎక్కువ ప్రేరణ ఉంటుంది.
పూర్తిగా చివరి క్షణంలో చేసేటప్పుడు లభించే సరదా అంటే నాకు ఇష్టం.
బాస్ దాన్ని నాకు ఓ రెండుసార్లు జ్ఞాపకం చేసేవరకు నేను ఆగుతా, అప్పుడు అది వాస్తవంగా జరగాలన్నది ఆయన అభీష్టమని నాకు తెలుస్తుంది.
నేను చేయవలసినది ఎంత ఉందంటే చాలా ముఖ్యమైనవి మాత్రమే నా దృష్టికి వస్తాయి.
దృక్పథం:
ఆ పని చేయడానికి కోరిక లేక స్ఫూర్తి నాకు లేవు.
ఆ పనులు చేయాలని నాకు అనిపించినప్పుడే నేను వాటిని చేస్తాను.
నాకు వేరేది చేయాలని ఉంది.
నాలో స్వయం శిక్షణ లోపిస్తుంది.
భయం:
నేనది చేయగలనో లేదో నాకు తెలియదు.
అది చేయడానికి కావలసినంత సమయం నాకు లేదు.
అది ఎంతో పెద్ద పథకం. నాకు సహాయం అవసరం.
నేను విజయం సాధించకపోతే లేక ముగించలేకపోతే ఎలా?
ఆ పథకాన్ని పూర్తిచేయడానికి సామాగ్రిని నేను తీసుకోవాలి.
నన్ను విమర్శిస్తారేమో లేక తొందరపెడతారేమోనని నాకు భయంగా ఉంది.
వేర్వేరు ప్రజలు వేర్వేరు స్థాయిల్లో కాలవిలంబం చేస్తారు. పథకం మరీ పెద్దదిగా ఉందని కొందరు భావిస్తారు గనుక వారు కాలవిలంబం చేస్తారు. ఇతరులు ప్రారంభిస్తారు, కాని సగం పని చేశాక, వారి ఉత్సాహం సన్నగిల్లి పోతుంది, వారు దాన్ని ముగించడంలో కాలాపహరణం చేస్తారు. ఇంకొందరు దాదాపు పూర్తి చేయడానికి దగ్గరపడతారు అయితే మొదటి దాన్ని ముగించకుండానే వదిలి మరో పథకాన్ని ప్రారంభిస్తారు. (చెప్పాలంటే మీరు చక్కగా సాగుతున్నారు. మీరు ఇప్పటికే ఈ శీర్షికను సగం చదివేశారు.)
ఒక పథకాన్ని ప్రారంభించక లేక పూర్తిచేయక పోవడానికి మీకుగల కారణాలు ఈ మూడు వాటిలో ఉండవచ్చు. ద నవ్వ్ హాబిట్ అనే పుస్తకంలో, నేల్ ఫారే ఇలా వ్రాశాడు: “కాలవిలంబం యొక్క సమస్యలకున్న మూడు ముఖ్యాంశాలు ఇవి: బాధితునిగా భావించడం, భారమనుకోవడం, మరియు అపజయమనే భయం.” కారణాలేవైనా, మీరు కారకాలను తెలుసుకోగల్గితే, మీకు పరిష్కారం దొరికినట్లే.
మీరెందుకు కాలవిలంబం చేస్తున్నారో మీకు తెలియనప్పుడు, అర్థగంట విరామాలతో, ఒక వారం పాటు మీ కార్యకలాపాల పట్టిక వేసుకోండి. మీరు సమయాన్నెలా గడుపుతున్నారో నిశ్చయించుకోండి. ప్రాముఖ్యమైన పనుల మధ్యలో అంత ప్రాముఖ్యం కాని వాటిపై మీరు ఎంత సమయాన్ని గడుపుతున్నారు అనేది చూడటం వాస్తవంగా కనువిప్పు కలిగించేదిగా ఉండగలదు. అయితే తర్వాతేమి చేయాలి?
పర్యవసానాల గురించి ఆలోచించండి
ఏ పని కొరకైనా కృషి చేయకుండానే అది జరిగిపోతుందని అపేక్షించడం ఏహ్యభావం కల్గిస్తుంది. అపేక్షించబడిన ముగింపు ఘడియకు మీరు దగ్గర పడుతుండగా, మీలో ఒత్తిడి మరియు ఆదుర్దా ప్రారంభమౌతాయి. ఈ భావాలు చోటుచేసుకుంటే, మీ సృజనాత్మక సామర్థ్యం కుంటుబడవచ్చు. మీరు ఆ ధ్యేయాన్ని సాధించడానికి వేర్వేరు మార్గాలను పరిశీలించడానికి లేక అంచనా వేయడానికి మొగ్గు చూపరు, అయితే దాన్ని ముగించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఉదాహరణకు: మీకు ఒక ప్రసంగ నియామకం ఇవ్వబడింది. దానికి ముందురోజు రాత్రి కొంత క్లుప్తంగా రాసుకుందామని మీరు కూర్చుంటారు. మీరు మీ అంశాన్ని గురించి పరిశోధించడానికి తగినంత సమయాన్ని వెచ్చించలేదు, కావున మీరు పొడిపొడి మాటలు చెబుతారు. బహుశా ఇంకా కొంత ప్రయత్నం చేసివుంటే, మీ ప్రేక్షకులు ఆ అంశాన్ని దృశ్యీకరించుకోడానికి సహాయపడేందుకు మీరు అనుభవాలను, మద్దతునిచ్చే సమాచారాన్ని, లేక పట్టికలను కలుపగలిగి ఉండేవారు.
ఏదైనా పథకాన్ని జాప్యం చేసినప్పుడు కల్గే మరొక పర్యవసానం ఏమంటే, మనకు తీరిక సమయం ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉండలేకపోవడం. అది ఎందుకంటే మనం ఒక పథకాన్ని పూర్తి చేయకుండా ఉన్నామన్న ఒక తరహా భావన కలగడం (లేక మనకు ఎవరైనా ఎడతెగక జ్ఞాపకం చేస్తుండటం) జరుగుతుంది.
నేను ఏమి చేయగలను?
ఒక లిస్టు వేసుకోండి. దీన్ని ముందురోజు రాత్రి చేయండి. ఆ మర్నాడు మీరు పూర్తిచేయాలనుకున్న వాటిని కాగితంపై వ్రాయండి. ఈ విధంగా మీరు ఏది మర్చిపోరు, మరి మీరు ముగించిన పనులను టిక్ చేసుకునేటప్పుడు మీరు మీ అభివృద్ధిని చూడగలరు. ప్రతి దాని కుడి ప్రక్కన, ఆ నియామకాన్ని పూర్తిచేయడానికి ఎంత సమయం పడుతుందని మీరు అంచనా వేస్తున్నారో వ్రాయండి. మీరు దినంలో ‘చేయవలసిన వాటి’ లిస్టు వేస్తుంటే, నిమిషాలను ఉపయోగించండి. ఒకవేళ మీరు పథకాల లిస్టు వేస్తుంటే, గంటలను ఉపయోగించండి. ఈ లిస్టును ముందురోజు రాత్రి వేసుకోండి. మర్నాటి కొరకు మీ లిస్టును తయారు చేయడానికి కొన్ని నిమిషాలను వెచ్చించండి. ఒక నెల క్యాలెండరును అందుబాటులో ఉంచుకోండి. మీరు నియామకాలను మరియు అపాయింటుమెంటులను అందుకున్నప్పుడెల్లా వాటిని అందులో వ్రాసుకోండి.
మర్నాటి కొరకున్న పనులను మీరు పునర్విమర్శిస్తున్నప్పుడు, క్యాలెండరుపై సూచింపబడిన, వరుస క్రమంలో చేయవలసిన మీ పనులను, అలాగే ఆ తర్వాత ముగించవల్సిన వాటిని గుర్తించడానికి ఎ, బి, సి మొదలుకొని అలా ఆ తర్వాతి అక్షరాలను వ్రాసి వరుసగా పెట్టుకోండి. కొంతమంది ఉదయం చక్కగా పనిచేయగలరు, ఇతరులు మధ్యాహ్నం లేక సాయంత్రం చేస్తారు. మీ అతి పెద్ద పథకాలను, మీ అతి అనుకూలమైన సమయంలో చేయడానికి పట్టిక వేసుకోండి. తక్కువ ఆనందకరమైన పనులను, ఎక్కువ ఆనందకరమైన పనుల ముందు పెట్టుకోండి.
సమయాన్ని తూచిచూడండి. ఒకవేళ మీరు ఎప్పుడూ వెనుకబడి ఉంటే, లేక ఆలస్యమైనందుకు అక్షరార్థంగా పరుగెడుతుంటే, సమయాన్ని తూచిచూడడానికి నేర్చుకోండి. అంటే, ఒక పని చేయడానికి మీకు ఎంత సమయం అవసరమో కచ్చితంగా లెక్కవేసుకోండి. ఆ పనికి అనుకోకుండా ఎదురయ్యే “ప్రమాదం” కొరకు కూడా కొద్ది నిమిషాలను జోడించండి. అపాయింట్‌మెంట్ల్ మధ్య వ్యవధి ఉంచడానికి మర్చిపోకండి. మీరు ప్రయాణ సమయాన్ని కూడా జత చేయాల్సి ఉంటుంది. మీరు ఒక సమావేశాన్ని ఉదయం 10: 00 గంటలకు ముగించి, మరొక దానికి ఉదయం 10: 00 గంటలకు హాజరు కాలేరు. అవి ప్రక్క గదిలో ఉన్నా సరే, అలాంటప్పుడు పట్టణంలోని మరో స్థలంలో ఉండే దాని విషయం అసలు చెప్పనక్కర లేదు. వాటి మధ్యలో తగినంత సమయాన్ని అనుమతించండి.
అప్పగించండి. అంతా మనంతట మనమే చేయాల్సిన అవసరం లేనప్పటికీ మనమలా చేయడానికి తరచూ ప్రయత్నిస్తుంటాము. మరో వ్యక్తి తపాలాకార్యాలయానికి వెళ్తున్నాడని మనకు తెలిస్తే, అతను మన కొరకు ఒక ప్యాకెట్టును అక్కడ వేసి వెళ్లగలడు.
దాన్ని విభాగించండి. కొన్నిసార్లు దాని పరిమాణాన్నిబట్టి మనం ఒక క్రొత్త పథకాన్ని ప్రారంభించము. పెద్ద పనిని చిన్న వాటిగా వేరుపర్చి దాన్నెందుకు విభాగించ కూడదు. మనం చిన్న పనులను పూర్తి చేస్తున్న కొలది, మనం మన అభివృద్ధిని చూస్తాం మరి తర్వాతి అంఖాన్ని పూర్తి చేయడానికి ప్రోత్సహించబడతాము.
అంతరాయాలను గురించి కూడా పథకం వేసుకోండి. మన పనిదినంలో అంతరాయాలు ఎప్పుడూ ఉంటాయి—ఫోన్‌లు రావడం, దర్శించేవారు, సమస్యలు, ఉత్తరాలు. మనం ప్రభావవంతంగా పని చేయాలని ఇష్టపడతాము, తమ పనులను కూడా ముగించవలసిన ఇతర ప్రజలతో పని చేయడం అందులో ఇమిడి ఉంది. మనం చక్కగా పనిచేయడంలో మాత్రమే శ్రద్ధను కలిగి ఉంటే, ఇతరులు మన కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తే మనం దిగులు చెందుతాము. అందుకే, అంతరాయాలను గురించి కూడా పథకం వేసుకోండి. ప్రతిదినం అనుకోని సంఘటనల కొరకు సమయాన్ని వెచ్చించండి. అవి తలెత్తినప్పుడు, మీరు వాటి కొరకు కొంత సమయాన్ని వెచ్చించారని మీకు తెలుసు గనుక మీరు వాటిపట్ల శ్రద్ధ వహించవచ్చు.
బహుమానమిచ్చుకోండి. మీరు మీ షెడ్యూలు వేసుకునేటప్పుడు, మీరు మంచి పట్టుదలతో లేక ఏకాగ్రతతో 90 నిమిషాలు పని చేసేలా పథకం వేసుకోండి. పని కొరకు సిద్ధపడటానికి కావల్సిన సమయాన్ని పట్టిక వేయడం మర్చిపోకండి. మీరు అసలు పనిని ప్రారంభించి, దాదాపు గంటన్నర వరకూ పని చేశాక మీరు కొంత విరామం తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఒకవేళ మీరు కార్యాలయంలో పని చేస్తుంటే, కొంత సేపు ఆగి ఒళ్లు విరుచుకుని, చేసిన పనిని గూర్చి యోచించండి. మీరు బయట పని చేస్తుంటే, కొంత ఫలహారం తీసుకోండి. మీ పనికి మీరే బహుమానమిచ్చుకోండి.—ప్రసంగి 3:13.
కొంచెం ఆలోచించండి, మీరు దీని ముఖశీర్షికను చదివిన దాదాపు ఐదు నిమిషాల్లోనే మీరీ శీర్షికను పూర్తి చేశారు. మీరు భర్తీ చేసుకునే మార్గంలోనే ఉన్నారు!