ప్రపంచ ఆరోగ్య పరిస్థితి—పెరుగుతున్న అగాధం
బ్రెజిల్‌లోని తేజరిల్లు! ప్రతినిధి చెప్పింది
ఆలీ మావో మాలీన్కు 1977లో సోమాలియానందు మశూచి వచ్చినప్పుడు, అతడు ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన పేరు వార్తాశీర్షికల్లో కూడా వచ్చింది. ఆయన చికిత్స చేయించుకుని, నయమైన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ 1980లో ఈ విధంగా ప్రకటించింది—శతాబ్దాలుగా లక్షలాది మంది ప్రజలను హతమార్చిన తర్వాత మశూచి భూమి ఉపరితలం నుండి నిర్మూలించబడింది. ఆలీ ప్రపంచంలో చివరి ఎరగా చెప్పబడ్డాడు.
ఇతర ఆరోగ్య రక్షణ విజయాలను గూర్చి 1992లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధంగా నివేదించింది: 1980వ దశకంలో అభివృద్ధిచెందుతున్న దేశాల్లో అనేక మంది ప్రజలకు శుభ్రమైన నీరు మరియు ఆరోగ్యరక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక, అసలు అభివృద్ధి చెందని దేశాల్లో కూడా జనాబాలోని చాలా మందికి స్థానిక ఆరోగ్య సేవ అందుబాటులో ఉంది. దాని ఫలితంగా, గత దశాబ్దంలో శిశు మరణాల సంఖ్య కొన్ని ప్రాంతాల్లో తగ్గింది.
భయం కలిగించే వాస్తవాలు
అయినను, ఈ విజయాలు ఓటమిల వలన నిష్ఫలమై, పెద్ద అపాయాల వల్ల మరుగున పడ్డాయి. కొన్ని భయపెట్టే వాస్తవాలను గమనించండి.
హెచ్.ఐ.వి./ఎయిడ్స్—ప్రపంచవ్యాప్తంగా 1,70,00,000 కంటే ఎక్కువ మంది ప్రజలకు ఎయిడ్స్ కారకమైన హెచ్.ఐ.వి. వైరస్ సోకింది. ఇటీవల ఒక్క సంవత్సరంలో రోజుకు సుమారు 8,000 చొప్పున రమారమి 30,00,000 మందికి ఈ వ్యాధి సోకింది. పది లక్షలకంటే ఎక్కువ మంది పిల్లలకు హెచ్.ఐ.వి. సోకింది. ఇటీవల దశాబ్దాల్లో శిశు మరణాల తగ్గుదలలో సాధించిన ఏ పురోభివృద్ధి, శిశువుల్లోని ఎయిడ్స్ వ్యాధి మూలంగా కనుమరుగౌతుంది. ఆసియాలోని ప్రాంతాలవంటి అనేక ప్రాంతాల్లో ఈ వ్యాధి ఇప్పుడిప్పుడే ఆరంభమై అకస్మాత్తుగా ఉద్ధృతమౌతుంది. హెచ్.ఐ.వి.కి గురైనవారిలో 80 శాతం కన్నా ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జీవిస్తున్నారని ఎయిడ్స్ అండ్ డెవలప్మెంట్ చెబుతుంది.
క్షయవ్యాధి (టి.బి.)—గత రెండు దశాబ్దాలను పూర్తిగా మినహాయిస్తే, ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షలమంది ప్రజలను చంపుతూ, టి.బి. ప్రాణాంతక అంటువ్యాధుల్లో మొదటిస్థానం వహిస్తూ, ప్రపంచాన్ని మరలా పీడిస్తోంది. ఆ మరణాల్లో 98 కంటే ఎక్కువ శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరుగుతున్నాయి. క్షయవ్యాధి కారకాలైన బాక్టీరియాలు ప్రాణాంతకమైన మైత్రిగా రూపొందుతూ, హెచ్.ఐ.వి.తో జతయై, వినాశకరమైన పర్యవసానాలతో చెడు పరిస్థితిని మరింత హీనం చేస్తున్నాయి. రెండువేల సంవత్సరం నాటికెల్లా ప్రతి సంవత్సరం హెచ్.ఐ.వి. సోకిన పది లక్షలమంది క్షయవ్యాధి మూలంగా మరణిస్తారని అంచనా వేయబడింది.
క్యాన్సర్—నేడు క్యాన్సర్ రోగుల సంఖ్య వర్ధమాన దేశాల్లోకన్నా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఉంది.
హృద్రోగం—“మనం ప్రపంచవ్యాప్త హృదయ ధమనుల విపత్తుకు సమీపంగా ఉన్నాం,” అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని డా. ఈవాన్ గ్యార్ఫాస్ హెచ్చరిస్తున్నాడు. హృద్రోగాలు అనేవి ఇక ఏ మాత్రం పారిశ్రామిక దేశాలకు మాత్రమే పీడ కాదు. ఉదాహరణకు, లాటిన్ అమెరికాలో రెండు నుండి మూడు రెట్లకన్నా ఎక్కువ మంది ప్రజలు అంటువ్యాధుల మూలంగాకాక హృద్రోగం వలన ఎక్కువగా మరణిస్తారు. కొన్ని సంవత్సరాల్లో, హృదయ ధమనుల్లో రక్తం గడ్డకట్టుకోవడం, రక్తనాళాలు పగిలిపోవడం అనేవి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మరణాలకు ముఖ్య కారణమౌతాయి.
ఉష్టమండల వ్యాధులు—ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా హెచ్చరిస్తుంది: “అమెరికాలో కలరా వ్యాపించడంతో పాటు ఉష్టమండల వ్యాధులు అదుపు లేకుండా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తుంది. . . . , పసిమి రోగం మరియు కీళ్లనొప్పులతో వచ్చే జ్వరమనే మహమ్మారి ఇంకా ఎక్కువ మంది ప్రజలను బాధిస్తున్నాయి. మలేరియా పరిస్థితి మరింత హీనమౌతుంది.” టైమ్ పత్రిక ఈ విధంగా చెబుతుంది: “ప్రపంచ పేద దేశాల్లో అంటువ్యాధులకు వ్యతిరేకంగా చేసే పోరాటం ఇప్పటికే దుర్భరంగా ఉంది.” ఇప్పుడు ప్రతి సంవత్సరం కేవలం మలేరియా వలన కలిగే మరణాల సంఖ్య 20 లక్షలు, నలభై సంవత్సరాల క్రితం నిర్మూలించబడిందని అనుకున్న మలేరియా పరిస్థితి ఇలా ఉంది.
అతిసార వ్యాధులు—అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యౌవనస్థుల మరణ సంఖ్య భీతిని గొలిపేదిగా ఉంది. ప్రతిరోజు దాదాపు 40,000 మంది పిల్లలు అంటువ్యాధి వలన లేక కుపోషణ వలన చనిపోతున్నారు; కేవలం అతిసారవ్యాధుల వల్లే ప్రతి ఎనిమిది సెకండ్లకు ఒక బిడ్డ చనిపోతుంది.
ఆరోగ్యానికి పేదరికానికి—సంబంధం
ఈ ఆరోగ్య పరిస్థితి మనకు ఏమని చెబుతుంది? ఆరోగ్య నిపుణుడు ఇలా చెబుతున్నాడు, “అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు క్రొత్తగా వచ్చే ఆధునిక దీర్ఘకాలిక వ్యాధులతోను, అలాగే ఉష్టమండల వ్యాధులతోను రెట్టింపు సమస్యలతో బాధించబడుతున్నాయి.” పర్యవసానమేమిటి? వ్యాకులపరచే రీతిగా “భౌగోళికాంతరం,” స్పష్టంగా కనిపిస్తుందని అచీవింగ్ హెల్త్ ఫర్ ఆల్ బై ది ఇయర్ 2000 అనే పుస్తకం చెబుతుంది. అలా దాదాపు 40 ఆఫ్రికా మరియు ఆసియా దేశాల్లో ఆరోగ్య సంరక్షణ అనేది “ప్రపంచంలోని మిగిలిన దేశాల్లోని అభివృద్ధితో సమానంగా ఉండడం లేదు.” ఆరోగ్యం అసమతుల్యత అనేది అధికంగా ఉంది—అది పెరుగుతూనే ఉంది.
ఈ అసమతుల్యత పెరగడానికి కారణాలు అనేకమున్నా, అనారోగ్యానికి ఒక ముఖ్యమైన కారణం “పేదరికమని” వరల్డ్ హెల్త్ పత్రిక చెబుతుంది. (సామెతలు 10:15 పోల్చండి.) పేదరికము అనేది తరచూ సురక్షితమైన, చాలినన్ని సురక్షితమైన నీళ్ళు లేని, ప్రజలతో క్రిక్కిరిసి ఉండే క్లిష్టమైన జీవన స్థితిగతులున్న చాలీచాలని నివాస స్థలాల్లోనికి జనులను ఈడ్చుతుంది. ఈ మూడు కారకాలు ఆరోగ్యానికి ప్రతిబంధకంగా ఉండడమే కాక, వ్యాధులను కూడా వృద్ధిచేస్తాయి. దానికి తోడు కుపోషణ అనేది శరీర రోగప్రతిరోధకాలను బలహీనపరుస్తుంది, కలపకు చెదలు ఎలాగో అలాగే పేదరికము ఆరోగ్యానికి హానికరమని మీరు గ్రహించగలరు.
ప్రాణాంతక వ్యాధులు నివాసస్థలాలను మలినపర్చి, శరీరాన్ని వికలం చేసి, మరి పిల్లలను హతం చేస్తున్నప్పుడు పేదవాళ్ళే వీటికి తీవ్రంగా గురౌతున్నారు. కొన్ని ఉదాహరణలు. క్షయవ్యాధి దక్షిణాఫ్రికాలోని ధనవంతుల ప్రాంతాల్లోకన్నా ఆ దేశంలోని పేద ప్రాంతాల్లో వంద రెట్లు ఎక్కువగా వస్తుంది. బ్రెజిల్లో పొరుగున ఉన్న ధనవంతుల సీమలకన్నా పేద ప్రాంతాల్లోనే ఆరు రెట్లకన్నా ఎక్కువ మంది పిల్లలు నిమోనియా మరియు ఇన్ఫ్లూయెన్జా వ్యాధుల వలన మరణిస్తున్నారు. ఇండియాలోని ఐశ్వర్యవంతుల కుటుంబాల్లోని పిల్లల కన్నా ఇండియాలోని నిరుపేదల కుటుంబాల్లోని శిశువులే పది రెట్లు ఎక్కువగా చనిపోతున్నారు. దుఃఖకరమైన వాస్తవం స్పష్టం: ‘పేదరికము మీ ఆరోగ్యానికి హానికరము!’
నూరు కోట్ల కన్నా ఎక్కువ మంది భూవ్యాప్తంగా మురికివాడ నివాసులు నిరాశాభావంతో ఉన్నారనడంలో ఆశ్చర్యం లేదు. పేదరికానికి ముఖ్య కారణాలను అదుపులో పెట్టలేకపోవడం మరియు దాని భయంకరమైన పర్యవసానాలు వారి జీవితాలను బాధిస్తున్నాయి. మీరు పేదరికము యొక్క దుష్ఫలితాలను అనుభవిస్తున్నట్లయితే, మీరు కూడా ఆరోగ్య సంరక్షణా అసమతుల్యత యొక్క ఫలితాల్లో నిరాశాజనకంగా చిక్కుకొని ఉండవచ్చు. అయితే, మీరు పేదలైనా కాకపోయినా మీ ఆరోగ్యాన్ని మరియు మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవలసిన చర్యలున్నాయి. ఆ చర్యలు ఏవి? తరువాయి శీర్షికలు కొన్ని సలహాలను ఇస్తున్నాయి.