కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 3/8 పేజీలు 23-27
  • రష్యాను పునఃదర్శించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రష్యాను పునఃదర్శించుట
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రష్యాను గురించి ఆలోచిస్తున్నాము
  • స్నేహశీలులైన రష్యన్‌ కుటుంబం
  • బైబిలునందు గట్టి పునాది కలిగివున్నారు
  • తొలి క్రైస్తవత్వంతో పోల్చితే
  • అభివృద్ధికి సమాంతరంగా ఉండటానికి కృషి
  • సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరికి గెలిచాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—రష్యాలో
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మేము దేవున్ని కనుగొనడానికి ఆయన అనుమతించాడు
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1995
g95 3/8 పేజీలు 23-27

రష్యాను పునఃదర్శించుట

మునుపటి సోవియట్‌ రష్యానందలి గొప్ప మార్పుల్లో ఒకటి మతాన్నిగూర్చి చర్చించడానికి వచ్చిన స్వేచ్ఛ. చాలామంది రష్యన్లు బైబిలు బోధలను పరిశీలించడానికి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నారు. దాని ఫలితమే, ఆధునిక-దిన అద్భుతం.

జూలై 28, 1993 ఉదయాన నేను న్యూయార్కు టైమ్స్‌ (వార్తాపత్రిక) మొదటి పుటనందు మాస్కోలో గొప్ప బాప్తిస్మపు చిత్రాన్ని చూసిన వెంటనే ఎంత ఆశ్చర్యమేసిందో! దాని శీర్షిక ఇలావుంది: “రష్యానందలి మత స్వేచ్ఛ మతం మార్చుకున్నవారిని, యెహోవాసాక్షులుగా సామూహిక బాప్తిస్మం కొరకు మాస్కో లోకొమోటివ్‌ స్టేడియానికి వచ్చేలా చేసింది.”

దానికి ఒకరోజు ముందు నేను, నా భార్య రష్యానుండి తిరిగివచ్చాం. మేము 1,489 మంది పొందిన బాప్తిస్మానికి హాజరయ్యాం. రష్యన్లు చూపిన క్రైస్తవ ప్రేమ మరియు ఆత్మీయ విషయాలపై వారి ఆసక్తి నిజంగా మమ్మల్ని ముగ్ధులను చేశాయి. ఆదివారం సాయంత్రం అంటే ముగింపు భాగం తరువాత మేము పొందిన అనుభవం ఈ విధంగా వివరిస్తుంది.

మెట్రోలో మేము మా హోటలుకు తిరిగి వస్తుండగా, బహుశ 18 లేక 19 సంవత్సరాల ప్రాయంగల ఒక యౌవనస్థుడి ప్రక్కన నేను కూర్చున్నాను. అతనికి నేను రష్యన్‌ భాషలోవున్న, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?a అనే బైబిలు కరపత్రాన్ని అందించాను. అతడు దాన్ని కొంతసేపు చూసి, అతని తల్లికి అందించాడు. అయితే నేను ఆ యౌవనస్థుడికి మరొకటి ఇచ్చాను. అప్పుడు అతడు ఆరంభ ప్రశ్నను సూచిస్తూ, “మానవుడు ఒకవేళ మరణిస్తే, తిరిగి అతడు జీవిస్తాడా?” స్వరంలో సంశయాన్ని వ్యక్తంచేస్తూ, “మీరు దీన్ని నమ్ముతారా?” అని ఆంగ్లంలో అడిగాడు.—యోబు 14:14, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌.

అతని కళ్లలోకి సూటిగా చూసేందుకు తిరుగుతూ, గట్టి నమ్మకంతో, ఇలా జవాబిచ్చాను: “నేను నిజంగానే దాన్ని నమ్ముతున్నాను!” నేను ఇలా త్వరగా చెప్పాను, “దీన్నిగూర్చి ఆలోచించండి. జ్ఞానయుక్తమైన, ఆలోచించగల ప్రజలుగా మన జీవితం ఒక అద్భుతం. మనం మానవులుగా వృద్ధిచెందడానికి నడిపించిన ధర్మాలకు, ఒక అత్యున్నత వ్యక్తి కారణమై ఉంటాడు. కాబట్టి ఆ అత్యున్నత వ్యక్తే, మరణించిన వ్యక్తిని మరలా జీవించడానికి పునఃసృష్టించగలడని నేను నమ్ముతున్నాను.”

తక్షణమే ఆ యౌవనస్థుడు ఆ కరపత్రాన్ని చదవటం ఆరంభించాడు. అతడు దాన్ని ముగించగానే, దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కలిగివున్నాడా?* అనే రష్యా భాషలోని బ్రోషూరును నేను అందించాను. అతడు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని ఇష్టపడ్డాడు, కాని వచ్చే సబ్‌వే స్టాపులోనే మేము దిగిపోవాలి. ఆ యౌవనస్థుడు మరియు అతని తల్లి ఆ రాత్రి ఒక రైలులో వెళ్లవలసివున్నప్పటికీ వాళ్లు మాతో మరి కొద్దినిమిషాలు మాట్లాడడానికి సబ్‌వేలో దిగారు. మన బైబిలు పఠన కార్యక్రమాన్ని గూర్చి సంక్షిప్తంగా వ్యాఖ్యానించిన తరువాత, మరికొంత సమాచారంకొరకు అతడు బ్రోషూరు వెనుక ఉన్న చిరునామాలకు రాయవచ్చని చెప్పాను.

మేము ఆ మరుసటిదినమే రష్యా వదలివచ్చాం, కాని అలాంటి అనుభవాలు మాపై చెరగని ముద్రను వేశాయి.

రష్యాను గురించి ఆలోచిస్తున్నాము

మార్చి 1991లో మునుపటి సోవియట్‌ యూనియన్‌లో యెహోవాసాక్షులపై నిర్బంధం కడకు తీసివేయబడిన తరువాత అత్యధిక సంఖ్యలో క్రొత్తవాళ్లు బాప్తిస్మం పొందటాన్నిగూర్చి నేనింకా ఆలోచిస్తూనేవున్నాను. మరి 1991 వేసవికాలంలో ఏడు సమావేశాలు త్వరగా ఏర్పాటు చేయబడ్డాయి, వాటిల్లో 7,820 మంది నీటిద్వారా బాప్తిస్మం పొందారు. ఆ తర్వాత, 1993లో వేసవికాల సమావేశాలందు—మేము మాస్కోలో హాజరైన దానితో కలుపుకుని—11,238 మంది నీటిద్వారా బాప్తిస్మం పొందారు.

సువార్తను ప్రకటించాలన్న రష్యాలోని సాక్షుల ఆసక్తి చాలామంది రష్యన్‌ ప్రజలచే గుర్తింపబడకుండా పోలేదు. రష్యన్లు బైబిలు బోధలకు ప్రతిస్పందించడాన్నిగూర్చి మీరు ఆలోచిస్తే, అదో అద్భుతంలా అనిపిస్తుంది.

‘అలాంటి శీఘ్రమైన అభివృద్ధి ఎలా సాధ్యమైంది?’ అని మేము ఆలోచించాం. ‘క్రైస్తవ బోధలు రష్యావారిలో వాస్తవంగా ఎలా నాటుకుపోయాయి?’

మాస్కోను విడిచి వస్తుంటే మేము మరలా సందర్శించినట్లయితే మాకొరకు వసతి ఏర్పాటు చేస్తామని ఒక జంట చెప్పారు, కాబట్టి మళ్లీ ప్రయాణించటానికి పథకాలను వేయటం ప్రారంభించాము. బైబిలు సత్యాలయెడల రష్యావారు చూపుతున్న ఎనలేని ఆసక్తిని గూర్చిన అదనపు నివేదికలను మేము అందుకున్నప్పుడు ఆ ప్రయాణాన్నిగూర్చిన మా ఆతురత పెరగసాగింది.

స్నేహశీలులైన రష్యన్‌ కుటుంబం

జూలై 24న మాస్కోనందు చేతుల్లో సూట్‌కేసులతో—మా స్నేహితులున్న అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌నుండి పది నిమిషాల నడక దూరంలోనున్న రెండంతస్తుల అపార్ట్‌మెంట్‌కు—మేము ఉండవలసిన స్థలానికి చేరాము. మేము కలిసి ఉండబోయే కుటుంబీకుల్లో 15 సంవత్సరాల ప్రాయంగల కాట్యా మాత్రం మమ్మల్ని ఆహ్వానించటానికి ఇంట్లోవుంది. అది ఆదివారం సాయంత్రం గనుక మిగిలిన కుటుంబీకులంతాకూడా క్రైస్తవ పరిచర్యలోనే ఇంకా బయటవున్నారు.

కొద్దిసమయంలోనే, ఇతర కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి రావటం ఆరంభించారు—తల్లి, గాలీనా; 13 సంవత్సరాల ప్రాయంగల చిన్న కూతురైన జ్హెన్యా; చివరికి తండ్రి విక్టర్‌. వాళ్లలో ఎవరికీ ఆంగ్లం ఎక్కువగా రాదు, మరి మాకు రష్యన్‌ అంతకన్నా రాదు. ఆంగ్లం మాట్లాడే స్నేహితులు అనువాదకులుగా ఉన్నప్పుడు సంభాషించడం చాలావరకూ సులభంగానే ఉండేది అయితే వాళ్లు వెళ్లిపోగానే మరలా కష్టమయ్యేది. మేము సంజ్ఞలను, రష్యన్‌-ఆంగ్లం నిఘంటువును ఉపయోగించేవాళ్లం. కాట్యా, జ్హెన్యా ఇద్దరూ బధిరుల భాషను నేర్చుకున్నారు కాబట్టి సంభాషణలో చక్కగా పాల్గొనేవారు.

ఆ కుటుంబీకులందరూ రెండు సంవత్సరాల క్రితమే బాప్తిస్మం తీసుకున్నారు. విక్టర్‌ సంఘంలో పరిచారకుడుగా పనిచేస్తున్నాడు, ఆ అమ్మాయిలుకూడ పాఠశాల సెలవుదినాలను పరిచర్యలో గడపడానికి వినియోగిస్తారు. పాఠశాలకు హాజరౌతున్నప్పుడుకూడా, వాళ్లు వారి విశ్వాసాన్ని గూర్చి మాట్లాడడానికి సంకోచించలేదు. నిజానికి, వాళ్ల ప్రకటనాపని వాళ్ల పాఠశాల జిల్లా బయటి అధికారుల అవధానాన్ని కూడా పొందింది. ఆసక్తిగలవారితో ఆ కుటుంబమంతా కలిసి 28 బైబిలు పఠనాలను నిర్వహిస్తుందని తెలుసుకోవడం మమ్మల్ని ముగ్ధులను చేసింది.

వాస్తవంగా, కుటుంబంలోని ప్రతివ్యక్తి కూడా బైబిలు పఠనంపై మరియు క్రైస్తవ పరిచర్యపై అవధానం నిలిపారు, వాళ్ల జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపబడ్డాయని మేము చూడగల్గాము. వాళ్ల జీవితాలు సంతోషాన్ని ప్రతిబింబిస్తున్నాయి.—అపొస్తలుల కార్యములు 20:35.

బైబిలునందు గట్టి పునాది కలిగివున్నారు

రాత్రుల్లో పడుకోకముందు, నేను ఆ కుటుంబాన్ని బైబిలు ముఖ్యాంశాలపై కొన్ని చిక్కు ప్రశ్నలు అడిగేవాన్ని. మొదటిగా ప్రకటన 21:3, 4 ఏం చెబుతుందని అడిగాను. వెంటనే, ఆ అమ్మాయిలు ముక్తకంఠంతో జవాబు చెప్పారు. తరువాత యెషయా 2:4లో ఏముందని నేనడిగాను. వాళ్లకు అదికూడా తెలుసు, ఖడ్గాలను నాగటి నక్కులుగా చేసుకోవడాన్ని సంజ్ఞలతో చూపించటంకూడా వారికి తెలుసు.

యెషయాలోని రాజ్యపరిపాలనను మరియు నూతన లోక ఆశీర్వాదాలను తెలిపే లేఖనాలతో నేను కొనసాగించాను, ఉదాహరణకు, యెషయా 9:6, 7; 11:6-9; 25:8; 33:24; 35:5, 6; మరియు 65:21, 22. వాళ్లు బైబిళ్లను చూడకుండానే, ప్రతి వచనంలోని విషయాన్ని కుటుంబమంతా గుర్తుపట్టేవాళ్లు. ఆ అమ్మాయిలు అప్పుడప్పుడు లేఖనాలు తమకు తెలుసని సంజ్ఞలతో చూపుతుండేవాళ్లు, బాలుడు సింహాన్ని తోలును అనేవికూడా చూపారు.

మరొక సాయంత్రం మేము లేఖనాల్లో దేవుని గుర్తింపునుగూర్చి, దేవునికంటే యేసు తక్కువవాడు అనే దానిపై అవధానాన్ని నిలుపుతూ, దేవుడు మరియు యేసు ఒకే వ్యక్తి కాదుగాని ఐకమత్యంలో ఒకటైవున్నారు అని పరిశీలించాము. యోహాను 10:30; యోహాను 17:20, 21, మరియు 1 కొరింథీయులు 11:3 వంటి లేఖనాల్లోని విషయాన్ని ఆ కుటుంబం గుర్తుపట్టగలిగింది. వాళ్ల బైబిలును వాళ్లు ఎంత చక్కగా ఎరిగివున్నారో అని నేను, నా భార్య ఆశ్చర్యపోయాము.

మంగళవారం ఉదయాన మేమందరం దాదాపు పన్నెండుమంది వరకు కూడుకొని, ఒక అందమైన పార్కు వరకు అందరం కలిసి మెట్రోలో ప్రయాణం చేసి, అక్కడ బైబిలును గూర్చి ప్రజలతో మాట్లాడుతూ రెండున్నర గంటలు గడిపాం. మేము ఇద్దరిద్దరిగా వెళ్లి పనిచేశాం. ప్రజలను సమీపించి, వారు చర్చలో పాల్గొనేలా చేయడంలో మంచి సమతూకాన్ని చూపిన ఒక రష్యన్‌ బాలికయైన నాడ్యా, నాతో పనిచేసినవాళ్లలో ఒకరు. బైబిల్లోని దేవుని తలంపులవైపు అవధానాన్ని మళ్లించడంలో ఆమె నిపుణురాలు. ‘ఈమె చాలా అనుభవంగల ప్రచారకురాలు,’ అని నాలో నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆమెది 17 సంవత్సరాల ప్రాయమేనని, బాప్తిస్మం తీసుకుని రెండు నెలలు మాత్రమే అయిందని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను!

మాకు కలిగిన అలాంటి అనుభవాలు రష్యాలో పరిస్థితి అంతాకూడా విశేషంగావుందనే అభిప్రాయాన్ని కలిగించాయి. సామ్యవాదం కూలిపోయిన దగ్గరనుండి, రష్యావారు బైబిలు బోధలను పరిశీలించటానికి ఆతురతను కలిగివున్నామని కనపర్చుకున్నారు. చాలామంది మంచి విద్యావంతులు, వారు చదవటానికి సుముఖత కల్గివున్నారు. యౌవనస్థులుకూడా చదువుతున్నారు మరియు బాగా గ్రహిస్తున్నారు, మేము రష్యన్‌ కుటుంబాన్ని సందర్శించినప్పుడు ఆ విషయం స్పష్టమైంది, వాళ్లు బైబిలు సత్యాలను సాక్షులపై నిర్బంధాన్ని విధించినప్పుడే నేర్చుకున్నారు.

ఆ దంపతుల చిన్న కుమారుడు తనకు ఒక ప్రశ్న ఉంది అడగాలని కోరాడు. ఒక అనువాదకుడిద్వారా, అతడు ఆ అభ్యర్థనను తెలిపాడు. దానికి నేను చలించినవాడనై అతని అభ్యర్థనను వ్రాతలో పెట్టినట్లయితే, దానిని తేజరిల్లు! ప్రచారకులకు అందించగలనని చెప్పాను. తక్షణమే అతడు కూర్చుని ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. అతనేం వ్రాశాడో దాని అనువాదం ఇక్కడ ఇవ్వబడింది. ఆ ఉత్తరంయొక్క ప్రతి 25 వ పుటలో ఉంది.

“రష్యానుండి సిరాషా, వాచ్‌టవర్‌ సొసైటీకి వ్రాస్తున్నాడు. నాకు ఏడు సంవత్సరాలు, నేను ఇప్పటికే మా అమ్మానాన్నలతో ప్రకటనాపనికి వెళ్తున్నాను. దేవుని రాజ్యాన్నిగూర్చి ప్రజలతో మాట్లాడడం నాకు ఇష్టం. నాకు తేజరిల్లు! పత్రిక చదవడమంటేకూడా ఇష్టమే. రష్యాకు అది రష్యన్‌ భాషలో నెలకు ఒక్కసారే వస్తుంది, కాని ఆంగ్లంలోనైతే నెలకు రెండుసార్లు వస్తుంది. ఈ పత్రిక నెలకు రెండుసార్లు రావాలని నేనెంతో కోరుతున్నాను, ఎందుకంటే నాకు అది చాలా చాలా చాలా ఇష్టమైంది. దయచేసి అలా చేయండి.”

మాస్కోలో ఉన్న మా స్నేహితులను విడిచిపెట్టి రావటం మాకు చాలా కష్టమైంది. ఈ కొద్ది కాలవ్యవధిలోనే, మేము వారిని అధికంగా ప్రేమించేలా కదిలింపబడ్డాము.

తొలి క్రైస్తవత్వంతో పోల్చితే

మేము రాత్రిరైలులో ఎస్టోనియాలోని టాలిన్‌కు వచ్చాము. సోవియట్‌ యూనియన్‌ యొక్క మునుపటి గణతంత్రరాజ్యమైన ఆ ప్రాంతంలో ప్రకటనాపని విషయంలో ఆధ్వర్యం వహించడానికి ఉన్న చక్కని క్రొత్త సదుపాయాలను మేమక్కడ చూశాం, మేము మూడు రోజుల తర్వాత సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు రైలులో వచ్చాం. మాస్కోలో ప్రకటనాపని ఎలా జరుగుతుందని ఈ రెండు ప్రాంతాల్లోని తోటి క్రైస్తవులు అడిగారు. “అక్కడ ఉండి పెరుగుదలను చూడటం, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయపు తొలిభాగంలో మరియు థెస్సలోనీయులకు వ్రాసిన ఉత్తరాలలో ఉన్న వాటిని శ్రేష్ఠంగా అర్థం చేసుకోటానికి నాకు చాలా సహాయం చేసిందని,” నేను జవాబిచ్చాను.

అక్కడ అపొస్తలుడైన పౌలు పరిచర్య ముగిసిన బహుశ కొన్ని వారాలకే థెస్సలోనీకలో సంఘం ఏర్పాటు చేయబడిందని నేనెప్పుడూ ఆశ్చర్యపోతుండేవాడ్ని. అది ఏర్పడిన దాదాపు ఒక సంవత్సరానికి పౌలు క్రొత్త క్రైస్తవులకు రెండు ఉత్తరాలను వ్రాస్తూ, వాటిలో పునరుత్థానమును గూర్చి, “మేఘములమీద కొనిపోబడుట,” “ప్రభువు దినము,” “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని” చెప్పుకొనుట మరియు “మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ,” అనే లోతైన ఆత్మీయ విషయాలను గూర్చి వ్రాయటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. (1 థెస్సలొనీకయులు 4:13-17; 5:1-3; 2 థెస్సలొనీకయులు 2:1, 2) తొలి క్రైస్తవుల ఉత్సాహంగల పనియొక్క ప్రభావమే, మొదటి-శతాబ్దంలో అద్భుతాన్ని సృష్టించింది—అదే, కొద్దికాలంలోనే పరిపక్వతగల, ఆత్మీయంగా బలమైన, ప్రచారకుల అంతర్జాతీయ సంస్థగా ఉత్పన్నమవ్వటం. దాదాపు పది సంవత్సరాల తర్వాత, పౌలు “సువార్త ఆకాశము క్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినదని,” వ్రాశాడు.—కొలొస్సయులు 1:23.

రష్యాలో సంభవిస్తున్నది, మొదటి శతాబ్దంలో జరిగిన దాని వంటిదేనని నాకు అనిపిస్తుంది.

అభివృద్ధికి సమాంతరంగా ఉండటానికి కృషి

రష్యా, భూమిపై ఉన్న అతి పెద్ద దేశం గనుక, అక్కడ దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తున్న వేలాదిమందికి నడిపింపును అందజేయడం నిజంగానే ఒక పెద్ద పని.—మత్తయి 24:14.

క్రైస్తవత్వాన్ని గురించి మొదటి శతాబ్దంలో విన్నవాళ్లను గూర్చి బైబిలిలా చెబుతుంది: “ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.” (అపొస్తలుల కార్యములు 11:21) రష్యాలోని క్రైస్తవ సహోదరులకు ఈ మాటలు ఎంత చక్కగా అన్వయింపబడతాయోనని గుర్తించాము! రష్యా ప్రాంతం ఆత్మీయ కోతపనికి సిద్ధంగా ఉండును గాక, ఇంకా అనేకులను జీవమార్గానికి నడిపించటానికి సహాయంచేసే అమూల్యమైన ఆధిక్యతను, అక్కడి వేలాదిమంది అనేకులు కూడా పొందెదరు గాక.—ఉచితవ్యాసం.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రచురించినది.

[24,25వ పేజీలోని చిత్రాలు]

పైన: మేము కలిసి ఉండిన కుటుంబం. పైన మరియు కుడివైపున: పార్కులో ప్రకటించడం. క్రింద కుడివైపున: సిరాషా మరియు అతని ఉత్తరం

[26వ పేజీలోని చిత్రం]

ఎస్టోనియాలోని టాలిన్‌నందలి వాచ్‌టవర్‌ యొక్క క్రొత్త సదుపాయాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి