ప్రపంచ పరిశీలన
శునకాల “ఆత్మహత్యలను” గూర్చిన మర్మము
అర్జెంటీనాలోని, రొజారియోనందలి ప్రజలు ఆ నగరంలో అనేక కుక్కలు “ఆత్మహత్యలకు” ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడాన్ని గూర్చిన నమ్మదగిన వివరణ కొరకు వెదుకుతున్నారు. ముఖ్యంగా రొజారియో యొక్క పార్క్ డి ఎస్పాన్యా అని పిలువబడే ప్రసిద్ధమైన పార్క్ వద్ద ఈ సమస్య గమనించబడింది. ఆ పార్క్‌లోని విహారస్థలము పార్నా నదికి దాదాపు 27 మీటర్ల ఎత్తున కనిపిస్తుంది. ఒక సంవత్సర కాలంలో, దాదాపు 50 సందర్భాల్లో కుక్కలు అకస్మాత్తుగా తమ యజమానుల నుండి దూరమై, విహార స్థలము అంచులవైపుకు నేరుగా పరుగెత్తి, దూకి చచ్చాయి. అయినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుక్కలు తమను తాము చంపుకునేందుకు నిర్ణయించుకునేంత సామర్థ్యమున్నవి కావు. బదులుగా, కుక్కలను మానవ శ్రవణశక్తికతీతమైన శబ్దాలు లేదా పక్షులు లేదా నదిలోని పడవల కదలికలు వశపరచుకుంటున్నాయని జంతువైద్యులు తలస్తున్నారు. అవి అంచులవైపుగా ముందుకు వేగంగా వెళ్తున్నాయి, అవి గ్రహించక ముందే క్రిందికి పడి పోతున్నాయి. (g95 2/22)
క్లెయిం చేయబడని సామాను
అమెరికా ఎయిర్‌లైన్సు కంపెనీల్లో వదిలిపెట్టబడిన క్లెయిం చేయబడని సామానంతా ఏం చేయబడుతుంది? అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ సెంటర్ అని పిలువబడే ఆల్బామాలోని స్కాట్స్బెరా కంపెనీకి అది అమ్మబడుతుంది. అక్కడ దానిని తెరిచి, శుభ్రం చేసి, డబ్బు ఉందేమోనని తనిఖీ చేసి ప్రజలకు తిరిగి అమ్మబడుతుంది. “అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ సెంటర్‌ను ఒక్కసారి వెళ్ళి చూస్తే చాలు, నమ్మకముంచే విమాన ప్రయాణికుడు సహితం చేతితో తీసుకెళ్ళగల సామానును మాత్రమే తీసుకెళ్ళాలని అనుకుంటాడు,” అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతుంది. “మిక్కిలి పెద్దవైన నాలుగు అంతస్తుల అమ్మకంలో రోమముతో చేసిన కోట్లు మరియు చేపలు పట్టే గాలాల నుండి టి-షర్టులు, కెమెరాల వరకు కనిపిస్తాయి . . . టోస్టర్లను, అలంకరణ సామాగ్రిని (కాస్మెటిక్స్), మూస్ కొమ్ములను, హంగేరి జానపద టేప్‌లను, శవపేటికలను కూడా మీరు కనుగొనవచ్చు.” ఎయిర్‌లైన్ కంపెనీవారు ప్రతిరోజు దాదాపు 20 లక్షల సంచీలతో (బ్యాగేజ్) వ్యవహరిస్తారు, మరి అయినప్పటికీ, ప్రతిరోజు 10,000 నుండి 20,000 వరకు వాటిని తప్పు దోవన పంపడమో, పొరపాటున మరొక స్థలంలో పంపించడమో జరుగుతుంది, 200 కన్నా తక్కువ సంచులు మాత్రమే వాటి యజమానులకు తిరిగి అందకుండా ఉంటాయి. తిరిగి అమ్మక ముందు ప్రయాణికులు తాము పోగొట్టుకొనిన సంచీల కొరకు వాటిని అడిగి తీసుకోడానికి మూడు నెలల గడువు ఉంది. “కంపెనీలవారు స్కోట్స్బారోకు పంపిన వస్తువుల యజమానులను కనుక్కోలేకపోయారని చెప్పగా, గుమస్తాలు, వ్యాపార సరుకును తిరిగి అమ్మకానికి పెట్టక ముందు తాము గంటల తరబడి అన్నింటిని విప్పి, పేర్లను, చిరునామాలను తుడిచివేశామని చెప్పారు,” అని జర్నల్ చెబుతుంది. (g95 2/22)
వ్యవసాయంలోని ఆరోగ్య ప్రమాదాలు
శిలీంధ్ర నాశకాలు, గుల్మనాశకాలు, కీటకనాశకాలు తమ పంటలో నష్టాన్ని తగ్గించడానికి రైతులకు తోడ్పడ్డాయి. అయినప్పటికీ, ప్రతి సంవత్సరం 40,000 మంది పొలం పనివారి మరణానికి వ్యవసాయ రసాయనాలు నేరుగా కారణమయ్యాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక చెబుతుంది. ఈ రసాయనాలు మరో 35 నుండి 50 లక్షల మంది వ్యక్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని అంచనా వేయబడింది. (g95 2/22)
భూగోళవ్యాప్త భద్రతా లోపం
మార్చి 1995లో జరుగనున్న సామాజిక అభివృద్ధి కొరకైన ప్రపంచ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, యు.ఎన్.డి.పి (ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం) మానవుల భద్రతను గూర్చిన తన వ్యాకులతను వ్యక్తం చేస్తూ, ఒక వార్తాలేఖను విడుదల చేసింది. ఆ వార్తాలేఖలో, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు 1994 ఆధారితమైన నివేదికలో ఇలా ఉంది, “ఈ శతాబ్దారంభమందు జరిగిన యుద్ధహతుల్లో దాదాపు 90 శాతం మంది సైనికులే అయితే, నేటి హతుల్లో 90 శాతం మంది పౌరులే. ఇది సమతుల్యతలో ప్రమాదకరమైన మార్పు.” నీవు ఎక్కడ జీవిస్తున్నా సరే, మానవ భద్రత అనేది అపాయంలో ఉందని యు.ఎన్.డి.పి. తెలియజేస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు ఇంకా ఇలా చెప్పింది “కరవులు, జాత్యంతర పోరాటాలు, సామాజిక విభజన, తీవ్రవాదము, కాలుష్యము, మాదక ద్రవ్యాల ఉపయోగం అనేవి ఇక దేశ సరిహద్దులకు పరిమితమై అప్పుడప్పుడు మాత్రమే జరిగే సంఘటనలు కావు. వాటి పర్యవసానాలు భూగోళమంతటా వ్యాపిస్తున్నాయి.” (g95 2/22)
జాక్‌పాట్ గుడి (ఫైన్)
దక్షిణ జపాన్‌లోని అంతగా ఎవరికి తెలియని ఒక చిన్న దీవి స్థానిక షింటో గుడి నామము వలన అకస్మాత్తుగా ప్రసిద్ధమయ్యింది. హటో అనే దాని పేరు అర్థం “నిక్షేపాన్ని సంపాదించడం,” మరి పట్టణ అభివృద్ధి సంఘం దీనిని ఉపయోగించి తమ గొప్ప అంచనాలను మించిన ఫలితాలను పొందింది. ప్రజలు తమ లాటరీ టికెట్లను పెట్టుకునేందుకు సంచీలను గుడి అమ్మేలా ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్రం వద్ద కొన్న ఈ “అదృష్ట సంచీలను” ఉపయోగించడం లాటరీనందు మంచి అదృష్టాన్ని హామీ ఇస్తుందని వారు చెప్పారు. అప్పటి నుండి, “లాటరీనందు పెద్ద మొత్తాలను పొందాలనే ఆశతో ప్రజలు గుంపులు గుంపులుగా హటో గుడిని సందర్శిస్తున్నారు,” అని ఆశాహి ఈవినింగ్ న్యూస్ చెబుతుంది. అయితే, ఈ “గుంపులు” కాదు గాని, ఒక్కో సంచిని 10 మరియు 30 డాలర్లకు అమ్ముతున్న గుడి జాక్‌పాట్‌ను కొట్టేసింది. (g95 2/22)
రాళ్ళను పరచి వేసిన అతి పురాతన రహదారి ఐగుప్తులో ఉంది
కైరోకు 69 కిలోమీటర్ల నైరుతి దిశగానున్న ఎడారి గుండా రాళ్ళను పరచి వేసిన 12 కిలోమీటర్ల రహదారిని పరిశోధకులైన భూగర్భశాస్త్రజ్ఞులు కనుగొన్నారు. సున్నపురాళ్ళ, ఇసుకరాళ్ళ పలకలను మరియు దృఢమైన కలపను పరచి వేసిన ఆ పురాతన రహదారి సా.శ.పూ. 2600 నుండి 2200 కాలం నాటిది, పాత రాజ్యం నాటిది. దీనికి దాదాపు రెండు మీటర్ల వెడల్పు ఉంది. పెద్ద నల్ల రాతి గని నుండి, వరద సమయమున నైలు నదితో సంబంధం గల ఒక పురాతన చెరువు ఒడ్డుకు పెద్ద రాతి బండలను రవాణా చేయడానికి ఈ రహదారి వేయబడింది. ఆ చెరువు ఇప్పుడు లేదు. తమ శవపేటికల కొరకు మరియు గిజా శవకుటీరాలలోని కాలిబాటల కొరకు ఐగుప్తు పరిపాలకులు నల్ల రాళ్ళను ఇష్టపడేవారు. “ఇదిగో మరో సాంకేతిక విజయాన్ని ప్రాచీన ఐగుప్తుకు ఆపాదించవచ్చు,” అని భూగర్భశాస్త్ర ప్రొఫసర్ అయిన డా. జేమ్స్. ఎ. హరెల్ చెప్పాడు. క్రేతులోని రాతి పలకల రహదారి సా.శ.పూ. 2000 తర్వాతి కాలం నాటిది, అది రాళ్ళు పరచి వేసిన అతి పురాతన రహదారిగా పరిగణించబడేది. (g95 2/22)
ఆశీర్వాదాలు అమ్మకానికి
నిధుల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్న అనేక మంది రష్యన్ ఆర్థడాక్స్ చర్చి మత నాయకులు ఆశీర్వాదాలను అమ్మడం మొదలెట్టారు, అయినా మత నాయకులందరూ బాహాటంగా ఈ వ్యాపారానికి వెంటనే ఒప్పుకోరు. ఒక రష్యా ఆర్థడాక్స్ మత నాయకుడు చెప్పిన మాటలను ది మాస్కో టైమ్స్ ఉదాహరించింది: “అనేక చర్చీలు నవీకరణ కొరకు ఆర్థిక అవసరతలో ఉన్నాయి.” కాబట్టి మతనాయకులు దుకాణాలను, అపార్ట్మెంట్లను, బార్లను, కాసినోలను ఆశీర్వదించడానికి డబ్బు అడుగుతారు. పాత కార్ల దుకాణం దగ్గర పనిచేస్తున్న ఒక మతనాయకుడు కారు బ్రాండును బట్టి ఆశీర్వాదాలకు 30,000 నుండి 50,000 రబుల్స్ను తీసుకుంటాడు, ఆ ఆశీర్వాదంలో ప్రార్థనలు, ధూపము మరియు “పవిత్ర జలమును” చిలకరించడం కూడా ఇమిడి ఉన్నాయి. (g95 3/8)
జంతువులు అంతరించిపోవుట
నల్లని ఖడ్గమృగాలు ప్రపంచంలోకెల్లా తనలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని జింబాబ్వే ఒకప్పుడు గొప్పలు చెప్పుకుంది. కాని 1980లోని 3,000 సంఖ్య నేడు దాదాపు 300కు తగ్గింది అని ది స్టార్ అనే జోహాన్స్‌బర్గ్ వార్తాపత్రిక నివేదిస్తుంది. వేటగాళ్ళు మృగాలను వాటి అమూల్యమైన కొమ్ముల కొరకు వేటాడడంలో కొనసాగుతున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వము కచ్చితమైన శాసనాన్ని అమలు చేసింది, అది పార్కుల డిపార్టుమెంట్ అధికారులకు వేటగాళ్ళను చంపే అధికారాన్నిచ్చింది. సమస్య ఏంటంటే ఖడ్గమృగ ప్రాంతాలను జయప్రదంగా కావలి కాసేందుకు జాతీయ పార్కులకు మరియు వన్య ప్రాణుల శాఖకు కావలసినన్ని నిధులను ప్రభుత్వము సరఫరా చేయలేకపోతుంది. ది స్టార్ నివేదించేదేమంటే వేట వలన “జింబాబ్వేలోని ఏనుగుల సంఖ్య ఒక్క దశాబ్దంలోనే 80,000 నుండి దాదాపు 60,000కు తగ్గిపోయింది.” (g95 3/8)
ప్రపంచ కప్ మరియు దేవుడు
“నాల్గవ [సాకర్] ప్రపంచ కప్‌ను సంపాదించే పోరాటంలో [బ్రెజిల్‌కు] అన్ని రకాల మత ఆచారాలు విలువైనవేనని,” జర్నల్ డా టార్డే నివేదిస్తుంది. “ఆటలకు ముందు, ఆటల సమయంలో, మరి ఆటల తర్వాత కూడా ఆచారకర్మలు అనుష్ఠించబడ్డాయి.” బ్రెజిల్‌లోని బెబెటో ఈ విధంగా వాదించాడు: “[దేవుడు] ఈ వరల్డ్ కప్‌లో బ్రెజిల్వానిగా ఉంటాడని నాకు నిశ్చయమే.” మ్యాచ్ ముగిసిన తర్వాత, ఆ ఆటగాళ్ళు విజయాన్ని దేవునికి ఆపాదించడం చూసి, కార్డినల్ డామ్ లూకాస్ మొరెరా నెవెస్ ఈ విధంగా వ్రాశాడు: “అనేకులకు ప్రపంచ కప్ మ్యాచ్ విజయం వ్యక్తిగత, కుటుంబ, సామాజిక విలువ గలదై ఉండవచ్చు . . . . ఇది ఆత్మ గౌరవం మరియు ఆత్మ విశ్వాసాల పునరుద్ధరణ; ఎన్నో దుఃఖాల్లో సాంత్వనం; అలక్ష్యం చేయబడిన దేశ క్షాళనము [శుద్ధీకరణ].” ఆసక్తికరకంగా, సాకర్ తార మోరో సిల్వా చెప్పేదేమంటే: “బ్రెజిల్ జట్టులోని ఆటగాళ్ళకు భిన్నంగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకోడానికి దేవుడు మాకు సహాయపడ్డాడని నేను నమ్మను. దేవుడు పక్షపాతి కాడు, ఆయన సాకర్‌ను ఏమంత పట్టించుకోడు.” (g95 3/8)
ట్రక్కు డ్రైవర్ల ద్వారా ఎయిడ్స్ వ్యాపించింది
ఇండియాలో ఎయిడ్స్ వైరస్ (హెచ్.ఐ.వి.) సోకడానికి ముఖ్యంగా ట్రక్కు డ్రైవర్లు బాధ్యులని ఎంచబడుతుంది. తమ కుటుంబాల నుండి దీర్ఘకాలం దూరంగా ఉండే వేల కొలది డ్రైవర్లు తరచూ బొంబాయిలోని వేశ్యాగృహాలకు వెళ్తున్నారు, అక్కడ పనిచేస్తున్న దాదాపు 80,000 మంది వేశ్యల్లో 50 నుండి 60 శాతం మందికి ఎయిడ్స్ ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ట్రక్కర్లు బొంబాయి నుండి దాదాపు దేశమంతటా తిరుగుతారు. రహదారులకు దగ్గరలోనున్న గ్రామాల్లో ట్రక్కర్లతో వ్యభిచారం చేసి డబ్బు సంపాదించే అమ్మాయిల గుడిసెలు వరుసగా ఉన్నాయి. సమీప నగరాలనుండి ధనవంతులైన యువకులు తరచూ ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటారు, ది టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం, ఇది “చిక్కైన, జాడను కనుగొనలేని వైరస్ శృంఖలను వ్యాపింపజేస్తుంది.” ఈ సమస్యను అధికం చేస్తూ, అమిత ఉష్టోగ్రతలో తాము అనేక గంటలు డ్రైవింగ్ చేసిన తర్వాత తమ శరీరాలను చల్లపరచుటకు లైంగిక సంబంధం అవసరం అని అనేక మంది ట్రక్కు డ్రైవర్లు గుడ్డిగా నమ్ముతారు. (g95 3/8)