నల్లని వెల్వెట్ సూట్ ధరించిన చిన్న జెంటిల్మెన్
బ్రిటన్లోని తేజరిల్లు! ప్రతినిధి
ఇంగ్లాండ్కు ఉత్తరాన మోల్లు (అడవి ఎలుకలు) చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఫామ్యార్డ్ గేట్ అవతలున్న పచ్చికబయలు ప్రాంతాన్ని చూసినప్పుడు, అక్కడ ఉన్నన్ని మంటిగుట్టలను నేను ఎప్పుడూ చూడలేదు. అప్పుడే తవ్వబడిన చిన్న మట్టిదిబ్బలు పచ్చికలో అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. మోల్ (అడవి ఎలుక) ఎలాంటి ప్రాణి, అది ఎలా జీవిస్తుందన్న విషయాలు మీకు తెలుసా?
అది తన జీవితంలో చాలా సమయాన్ని భూమిక్రింద గడుపుతుంది గనుక, దాన్ని కొద్దిమంది మాత్రమే చూసి ఉంటారు. అది దాదాపు 15 సెంటీమీటర్ల పొడవు ఉండే చాలా చిన్నప్రాణి. మగమోల్ 115 గ్రాములకంటే కొంచెం తక్కువ బరువు ఉంటుంది. బ్రిటీష్ మోల్కు ముదురు బూడిద వర్ణపు, దాదాపు నల్లని బొచ్చు ఉంటుంది, అందుకే అది సాధారణంగా, అలాగే ప్రేమగా నల్లని వెల్వెట్ సూట్ ధరించిన చిన్న జెంటిల్మెన్ అని పిలువబడుతుంది.
మోల్ బొచ్చు భాగాలుగా ఉండదు; అంటే అవి శరీరంనుండి నిటారుగా నిలబడతాయి. కాబట్టి మోల్ భూమిపై ఎటువైపు తిరగాలన్నా లేక మరలాలన్నా అది చాలా సులభంగా చేయగలదు. సంవత్సరాల పూర్వం మోల్ను పట్టుకునే వారు వాటి చర్మాన్ని బట్టల కొరకు అమ్మారు, కానీ “ఒక కోట్ తయారు చేయాలంటే చెప్పలేనన్ని మోల్ శరీరాలు కావాలి,” అని మోల్లను పట్టుకునే వ్యక్తి తమాషాగా అన్నాడు.
మోల్ యొక్క శరీరం సొరంగాలు తవ్వే దాని పనికి తగినట్లుగా రూపొందించబడింది. దాని ముందుకాళ్లు శరీరం ముందు భాగంలో అరచేతులు చాచినట్లు అనువుగా ఉంచ బడ్డాయి. ఐదు వేళ్లు మరియు అర్థచంద్రాకారపు ఎముక రెండు సమర్థవంతమైన పారలవంటి చేతులు ఏర్పడేలా చేస్తుంది. ముందుకాళ్లతో పోల్చితే మాత్రమే బలహీనంగా అనిపించే, దాని చిన్నని వెనుక కాళ్లు, మోల్ను ముందుకు తోయడానికి (ప్రొపల్షన్ కొరకు) సహాయం చేస్తాయి. మీరు మోల్ను మెత్తని నేలపై పెడితే అది ఐదు క్షణాల్లో భూమిలోకి అంతర్దానమౌతుంది! అది తన చీకటి, తేమగల సొరంగాల్లో, లేక నేలపైన కూడా, దాదాపు గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని అంచనావేయబడింది.
అసాధారణమైన ఇంద్రియాలు
కొందరు ప్రజలు అనుకునేలా మోల్ పూర్తిగా గుడ్డిది కాదు, కానీ బొచ్చు క్రిందున్న దాని చిన్ని కళ్లు, ఆ ప్రాణి వెలుగుచీకట్ల తేడాను గుర్తించడానికి సరిపడేంత దృష్టిని మాత్రమే ఇస్తాయి. మోల్ నేలలో తవ్వుతూ పోతుండగా, దాని కళ్లను కాపాడటానికి పొడవైన వెంట్రుకలు వాటికి అడ్డంగా వస్తాయి. అయితే కంటిచూపుకంటే మోల్ యొక్క వాసన మరియు స్పర్శ జ్ఞానమే ప్రాముఖ్యమైనవి.
ఐరోపా మోల్, తన గులాబీ రంగు ముట్టె అంచుపై, వేలకొలది చిన్నచిన్న బుడిపెలను కలిగి ఉంటుంది, ప్రతి ఒక్క బుడిపెపై స్పర్శ జ్ఞానంగల వెంట్రుక ఒకటి ఉంటుంది. దాని తలపై వేర్వేరు భాగాల్లో పొడవైన మీసాలు, దానికితోడు తోక చివర్లో ఇంద్రియజ్ఞానం గల వెంట్రుకలు ఉంటాయి. మోల్ తన సొరంగంలో పోతుండగా ఎదురయ్యే వత్తిడితరంగాలను గమనిస్తుంది. ఈ విధంగా అది, పెద్ద రాళ్లను లేక వేటాడే జంతువు వంటి అడ్డంకులను సహితం గమనించి వాటిని వారించగలదు.
మోల్కు బాహ్యశ్రవణేంద్రియాలు లేవు, అయితే అది చాలా సూక్ష్మంగా వినగలదు. అది భూమిద్వారా ప్రకంపనాలను పసిగట్టి, వాటికి అనుగుణంగా ప్రతిస్పందించగల సామర్థ్యాన్ని కలిగివుంది. సంవరణి కండరాల ద్వారా మోల్ చెవులు మూయబడగలవు, దాని సున్నితమైన చెవి రంధ్రాలలోకి మన్ను పోకుండా నివారించడానికి అవి తోడ్పడతాయి.
ఆహారం మరియు నివాసము
పచ్చికబయలును చూస్తున్నప్పుడు, మోల్ వెళ్లే భూమిలోని మార్గాన్ని లేక దారిని నేను చూడగలిగాను. ఆ దారి ఉపరితలానికి కొంత క్రింద ఉంది, అది కొంచెం పైకి ఎత్తుగా ఉంది. కొత్తగా తవ్విన నేలను మోల్లు పైకి వేసినప్పుడు తయారైన కొత్త మట్టిదిబ్బలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా నేలను తిరగేయడం, నేల ఎండేలా చేసి దాని సారాన్ని నిలపడానికి సహాయం చేసే, ఒక రకమైన దున్నడం వంటిదే.
మోల్ ముఖ్యాహారం వానపాములు, అందుకే అవి సొరంగాలు తవ్వుతాయి. వానపాములు నేలలో కదులుతుండగా, అవి మోల్ యొక్క వంకరటింకర మార్గాల్లోకి వెళ్తాయి. అప్పుడు మోల్ చీకటి గుహల్లో అటుఇటు తిరుగుతూ, తన ఆహారాన్ని చాలా త్వరగా కనుగొంటుంది. లెథర్జాకెట్స్ మరియు వైర్వామ్స్తోపాటు కీటకాలను కూడా అది తింటుంది. మోల్ రెండు గంటలకోసారి తినాలి లేకపోతే అది చనిపోతుంది.
మోల్ యొక్క చిన్న మట్టిదిబ్బలను పొరపాటుగా వాటి నివాసాలని అనుకోకూడదు. అది చాలా పెద్దగా అంటే, దాదాపు 30 సెంటీమీటర్ల ఎత్తు, ఒక మీటరు వెడల్పు ఉంటుంది. అది సాధారణంగా తలదాచుకోడానికి స్థలం ఉన్న చోటుకు దగ్గరగా—అంటే గడ్డి, రెమ్మలు మరియు ఆకులవంటి గూడు కట్టడానికి కావాల్సినవి సులభంగా లభించే ఒక చెట్టు క్రిందో లేక కంచె ప్రక్కగానో కనిపిస్తుంది.
తొలి వసంత కాలంలో, ఒకే కాన్పుకి మోల్కు దాదాపు ఏడు చిన్న మోల్లు పుట్టవచ్చు. పుట్టినప్పుడు పిల్ల మోల్లు గుడ్డివి, బొచ్చు లేకుండా ఉంటాయి, మరి మూడు గ్రాములకంటే తక్కువ బరువుంటాయి. ఐదు వారాల తర్వాత అవి తమకై తామే ఆహారం వెదుక్కోగలవు, మరి బహుశా 1.5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలవు. తొమ్మిది వారాల తర్వాత అవి సంపర్కానికి సిద్ధంగా ఉంటాయి. మోల్ యొక్క సగటు జీవితాయుష్షు మూడు సంవత్సరాలు. అయితే, వేటాడే జంతువులు వాటిలో చాలా వాటిని అంతకంటే ఎంతో ముందే చంపేస్తాయి.
వాస్తవమేమంటే, చక్కగా గడ్డి పెంచి కత్తిరించిన లాన్లో లేక గాల్ఫ్ గ్రౌండ్ క్రింద మోల్ తన ఆహారం కొరకు వెదుకుతున్నప్పుడు అది సమస్యలను సృష్టించగలదు, కానీ నల్లని వెల్వెట్ సూట్ ధరించిన మన చిన్న జెంటిల్మెన్ గ్రామీణ జీవనంలోని ఒక ఆసక్తికరమైన భాగమే.