బైబిలు ఉద్దేశము
అవివాహిత జీవితం ఒక బహుమానమైనప్పుడు
‘నేను ఒంటరిగా, చాలా ఒంటరిగానున్నాను,’ అని 22 సంవత్సరాల క్రితమే బాప్తిస్మం పొంది, గత మూడు సంవత్సరాలుగా విధవరాలుగావున్న ఒక క్రైస్తవ సహోదరి విలపిస్తుంది. ‘నాకు ఒక తోడు కావాలని ఆశిస్తున్నాను. చేయడానికి ఎక్కువ పని కలిగివుండటం సహాయకరంగా ఉంటుంది. స్నేహితులను కలిగివుండటంకూడా సహాయం చేస్తుంది. కాని నాకు వైవాహిక ఆనందం, సంతోషం కూడా కావాలని నేను భావిస్తున్నాను—నేను వివాహం చేసుకోవాలని అనుకొంటున్నాను.’
మీరు యథార్థంగా వివాహం చేసుకోవాలనే కోరికను కలిగివున్నపుడు, జతకొరకు మీరు వెదుకుతూ విజయవంతులు కాలేనప్పుడు, మీ అవివాహిత జీవితం ఎంతమాత్రం బహుమానమని అనిపించదు—మీకు విసుగు, కృంగుదలను మిగిల్చే ప్రతికూలమైన భావాలనే బంధిఖానాలో మీరు ఉంచబడినట్లు అనిపిస్తుంది. లేదా మీరు సొంత కుటుంబం కలిగివున్నప్పటికీ, ఒంటరిగా ఉన్నయెడల, మీకై మీరు పిల్లలకు కావలసిన అవసరాలను అందించటానికి ఒంటరిగానే బాధ్యతను స్వీకరించవలసి ఉంటుంది.
కాబట్టి, మీ అవివాహిత దశను మీరు ఒక వరప్రసాదంగా దృష్టించరు. మరికొందరు, అవివాహితులుగా ఉండటాన్ని ప్రశస్తంగా భావించటమేకాక, అలా ఒంటరిగా జీవించటానికే ఎంపిక చేసుకొంటున్నారు. కాబట్టి అవివాహిత దశ ఒక వరప్రసాదమా, అట్లయితే, అది ఎప్పుడు మరియు ఎందుకు? దీనిని గూర్చి బైబిలు ఏమి చెబుతుంది?
సంతోషానికి అవరోధమా?
వివాహమనేది గొప్ప సంతోషానికి మూలంకాగలదు. (సామెతలు 5:18, 19) “వివాహం కొరకు అడుగిడుటే, సంతోషానికి, సార్థకతకు ఉన్న ఏకైక మార్గమని” కొందరు ఒప్పించబడుతున్నారు అని లాస్ ఏంజెల్స్ టైమ్స్ వ్యాఖ్యానిస్తుంది. సంతోషంగా ఉండటానికి వివాహ అనుమతి పత్రం మాత్రమే ఒక “కీలకమా”?
లాస్ ఏంజెల్స్ టైమ్స్‌లో చెప్పిన దాని ప్రకారంగా మానసిక ఆరోగ్య నిపుణురాలైన రూత్ లూబాన్ ఇలా చెబుతుంది: “అవివాహిత జీవితంనుండి ఒక పురుషుడో [లేక ఒక స్త్రీ] తమను విడిపిస్తారన్న నిరీక్షణతో తమ జీవితాన్ని నింపుకోవటం మానేసినపుడు, తమ జీవితంలో సాధించగల వాటిని చూసి స్త్రీలు [పురుషులుకూడా] ఆశ్చర్యపోతుంటారు. అవును, అవివాహిత జీవితం సంతోషానికి లేదా సంపూర్ణ జీవితానికి మాత్రం ఒక ఆటంకంకాదు. వివాహమనేది దానంతటదే సంతోషానికి మార్గంకాదని విడాకులు తీసుకొన్న చాలామంది వ్యక్తులు ఒప్పుకొంటున్నారు. నిజమైన సంతోషం దేవునితో మంచి సంబంధం కలిగివుండుటవలన కలిగే ఫలితమే. క్రైస్తవులు అవివాహితులైనా లేక వివాహితులైనా సంతోషంగానే ఉండగలరు.—కీర్త. 84:12; 119:1, 2.
మారియా ఎడ్వర్డ్స మరియు ఎలివ్వీనర్ హోవార్, ది చాలెంజ్ ఆఫ్ బీయింగ్ సింగిల్, అనే తమ పుస్తకంలో స్వయం-నియమిత ప్రతిబంధకాలనుగూర్చి పేర్కొనడమేకాక, సంతోషానికి మరొక ప్రాముఖ్యమైన ఆటంకం ఉంది—అది సాంఘికపరమైన ఒత్తిడి అని ఉన్నతపర్చారు. “మీరు గనుక వివాహం చేసుకోకపోతే మీరు లోలోపలనే, గుప్తంగా, భావోద్రేక ఆయాసంతో బాధపడతారు. . . . మీలో ఏదో ఒక లోపముంది, అది మాత్రం కచ్చితం అన్న ఒక తప్పుడు భావం ఉందని” వాళ్లు చెబుతున్నారు.
ఎంతో బాగా తెలిసిన స్నేహితులుకూడా అనాలోచితంగా, అవివాహిత వ్యక్తులకు అపరిమితమైన ఒత్తిడిని కలిగిస్తూ ఇలా చమత్కారంగా అడుగుతారు, ‘మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటారు?’ లేదా, ‘ఇంత అందగాడివైన నీకు భార్య ఎందుకు దొరకలేదు?’ అటువంటి వ్యాఖ్యానాలు పరిహాసంగా చెప్పినప్పటికీ, ఆ మాటలు ‘కత్తిపోటువంటి’విగా ఉండి వాటి ఫలితంగా భావాలు గాయపడవచ్చు లేదా ఇబ్బందికలుగవచ్చు.—సామెతలు 12:18.
వారి వారి బహుమానం
అపొస్తలుడైన పౌలు మిషనరీగా ప్రయాణం చేసే సమయానికి ఆయన అవివాహితుడే. ఆయన వివాహాన్ని వ్యతిరేకిస్తున్నందుకు అలా చేశాడా? కానేకాదు. అపొస్తలుడైన పౌలు ‘సువార్తలో . . . పాలివాడగుటకై’ ఒంటరిగానే ఉండిపోడానికి ఎంపిక చేసుకున్నాడు.—1 కొరింథీయులు 7:7; 9:23.
వివాహంనుండి పౌలు తనను హద్దుల్లో ఉంచుకొనటానికి శక్తిని కలిగివున్నాడు, అయినప్పటికీ, అందరు ఆయన వలె ఉండలేరని మాత్రం గ్రహించాడు. ఆయనిలా అన్నాడు: “ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.”—1 కొరింథీయులు 7:7.
మీ జీవనయానం మీరు ఉద్దేశించినట్లుగా ఉండకపోయినప్పటికీ, అవివాహిత జీవితం సంతోషానికి మార్గం కాగలదు. కచ్చితంగా, యెహోవానుండి పొందే అనేకమైన బహుమానాల్లో వివాహంకూడా ఇమిడివుంది. కాని బైబిలు తెలియజేసేది అవివాహిత జీవితంకూడా ఒక “కృపావరమే”—ఒకవేళ వీలైతే ‘అలా ఉండటానికి ఏర్పాటు చేసుకోండి.’ (మత్తయి 19:11, 12; 1 కొరింథీయులు 7:36-39) అయితే, అవివాహితదశలో గల కొన్ని ప్రయోజనాలేవి?
వివాహమైన జతలు వారి జతను “ఏలాగు సంతోషపెట్టవలెనని” చూస్తారని, అయితే వివాహంకానివారు “ప్రభువును ఏలాగు సంతోషపెట్టవలెనని” చూస్తారని పౌలు చెప్పాడు. ఇది అవివాహితులుగా ఉండటంలోగల గొప్ప ప్రయోజనాలను ఉన్నతపరుస్తుంది—యెహోవాను ‘తొందర యేమియు లేక’ సేవించటానికే ఈ అవకాశం.—1 కొరింథీయులు 7:32-35.
అవివాహితగా జీవించే వ్యక్తి పూర్తిగా ఎటువంటి తొందర లేకుండా జీవిస్తాడని మాత్రం బైబిలు చెప్పడంలేదు. ఏమైనప్పటికీ, ఒక వ్యక్తి ఒంటరిగా జీవించేటప్పుడు, సహజంగా ఒక కుటుంబాన్ని సంరక్షించే వ్యక్తికన్నాకూడా తక్కువ అవరోధాలనే కలిగివుంటాడు, ఎందుకంటే అతడు నిర్ణయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు తన ఒక్కడ్ని మాత్రమే పరిగణించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, దేవుడు అబ్రాహామును హారాను ప్రాంతాన్ని విడిచి కనానుకు తరలి వెళ్లమని చెప్పినప్పుడు, దానిని బైబిలు ఇలా చెబుతుంది: “అబ్రాము తన భార్యయయిన శారాయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి.” (ఆదికాండము 12:5) అబ్రాహాము కుటుంబ పరిస్థితి ఆయనను ఏమి ఆటంకపర్చకపోయినా, ఆ కార్యభారాన్ని చేపట్టేందుకు తన యింటి సామ్రాగిని వ్యవస్థీకరించటానికి ఆయన ఎక్కువ సమయాన్నే వ్యయపర్చి ఉంటాడు.
అబ్రాహాము తరలి వెళ్లిన దానితో అపొస్తలుడైన పౌలు యాత్రను పోల్చండి. పౌలు మరియు సీల థెస్సలోనీక పట్టణంలో సువార్తను ప్రకటిస్తుండగా, కోపంతో ఒక గుంపు వారికి వ్యతిరేకంగా బయల్దేరింది. అదే రాత్రి, సహోదరులు వెంటనే పౌలును మరియు సీలను ఇద్దరిని బొరియాకు పంపిచేశారు. మరొక సందర్భంలో, త్రోయలోవుండగా, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయుమని” పౌలు దర్శనం పొందాడు. అప్పుడు దర్శనం పొందిన వెంటనే, ఆయన మాసిదోనియకు ప్రయాణమయ్యాడు. స్పష్టంగా, పౌలు భార్యను కలిగిలేకపోవడం, కొద్ది కాలవ్యవధిలోనే కదలి వెళ్లడానికి వీలుకలిగించింది, కుటుంబాన్ని కలిగివుంటే కొంత కష్టతరమైన పరిస్థితి వుండేది.—అపొస్తలుల కార్యములు 16:8-10; 17:1-15.
అవివాహిత జీవితం గొప్ప వ్యక్తిగత స్వేచ్ఛాయుత ఎన్నిక అనే మరొక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నపుడు, ఎక్కడ నివసించాలి, ఏమి తినాలి, ఎపుడు తినాలి, లేదా ఏ సమయానికి నిద్రపోవాలి అనేవి నిర్ణయించుకోవడం సులభమే. ఈ స్వేచ్ఛ ఆత్మీయ కార్యకలాపాల విషయంలో కూడా ఉంటుంది. వ్యక్తిగత బైబిలు పఠనం చేసుకోడానికి, బహిరంగ ప్రకటనాపనిలో పాల్గొనడానికి, ఇతర అవకాశాలను తీసుకొని ఇతర ప్రజలకు సహాయం చేయడానికికూడా ఎక్కువ సమయం ఉంటుంది.
కాబట్టి, మీరు ఎన్నుకోవటంవల్లగాని, లేదా పరిస్థితులవల్లగాని అవివాహితులుగా ఉన్నట్లయితే, మీ సమయాన్ని జ్ఞానయుక్తంగా వినియోగించుకోవటంలో కృతనిశ్చయం చేసుకోండి. మీ అవివాహిత దశను ఇతరులకు సహాయం చేయడంలో గడిపితే మీరు సంతోషభరితమైన జీవితాన్ని కలిగివుండగలరు. (అపొస్తలుల కార్యములు 20:35) మీకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉన్నట్లయితే, మిమ్మల్ని మీరే ప్రతికూల భావోద్రేకాల్లో బంధించుకోవద్దు, లేదా ‘ప్రత్యేకమైన ఆ వ్యక్తి’ మీకు తోడుగా ఇంకా రాలేదు కాబట్టి మీరు సగం మాత్రమే ఉన్నారన్న భావనతో జీవించవద్దు. దేవుని సేవలో ఎక్కువ పని కలిగి ఉండండి మరియు పౌలు చెప్పిన విధంగా ఒంటరిదశ ఒక బహుమానమని మీరు తెలుసుకొంటారు.