బియ్యం—మీరు ఉప్పుడు బియ్యం ఇష్టపడతారా లేక పచ్చి బియ్యమా?
ఇండియాలోని తేజరిల్లు! ప్రతినిధి
‘మీరు పచ్చిబియ్యం తింటారా లేక ఉప్పుడు బియ్యం తింటారా?’ ఇండియాలోని గృహంలో మీరు అతిథులైతే మిమ్మల్నడిగే ప్రశ్న అది. ఇండియాలో అన్నం తినేవారిలో దాదాపు 60 శాతం మంది ఉప్పుడు (పాక్షికంగా ఉడకబెట్టిన) బియ్యం తింటారు. అయితే పాశ్చాత్య దేశాల్లో దాదాపు అందరూ, భారతీయులు పచ్చి బియ్యం అని పిలిచేదాన్నే తింటారని తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు!
అన్నం వండే విధానాన్ని గూర్చి కాదు గాని, భారతీయులు వరి విత్తనాలను కోసిన తర్వాత, వాటిని ప్రత్యేక ప్రక్రియకు లోను చేసే విధానాన్ని గూర్చి మేము మాట్లాడుతున్నామని మీరు గ్రహించినప్పుడు ఇదేమీ మీకు వింతగా అనిపించదు. అలాంటి ప్రక్రియలో ఏమి చేస్తారు, మరి ఎందుకని? వరిని, మరియు దాన్ని ఆహారధాన్యంగా సిద్ధం చేయడాన్ని దగ్గరగా చూడడం విజ్ఞానప్రదమైన జవాబులను యిస్తుంది.
కోట్లకొలది ప్రజల ఆహారధాన్యం
పురావస్తు శాస్త్ర ఆధారాలు, పురాతన గ్రంథస్థ సమాచారాలు సూచించేదేమంటే, ఇండియాలోను, చైనాలోను సా.శ.పూ. మూడు వేల సంవత్సరాల ముందు నుండే బియ్యం పండించబడుతుంది. పురాతన ఇండియా నివాసులు దానిని ధాన్య లేదా “మానవజాతిని పోషించేది” అని పిలిచారు. అది ఇప్పటికీ సరైన పేరే. ఎందుకంటే అనేకమంది ప్రజలు మరే ఆహార ధాన్యము కన్నా ఎక్కువగా దీనినే ఆశ్రయిస్తారు. ఒక సమాచార మూలం ప్రకారం, అలాంటి ప్రజలు ఎక్కువగా ఆసియాలోనే ఉన్నారు. ఇక్కడే 60 కోట్లకన్నా ఎక్కువ మంది ప్రజలు ప్రతిదిన ఆహార కెలోరీల్లో సగం బియ్యం నుండే పొందుతారు, ప్రపంచంలో ఉత్పత్తయ్యే 90 కంటే ఎక్కువ శాతం వరి అక్కడే పండుతుంది, అలాగే వినియోగించబడుతుంది.
తేమగానుండే ఉష్ణమండల గంగా డెల్టా, ప్రపంచంలోని అధిక వరిని పండించే ప్రాంతాల్లో ఒకటి. కావలసినంత వర్షపాతము, కావలసినంత ఉష్ణోగ్రత, కావలసినంత పనివారు ఉండడం దీనిని వరి పంటకు అనువైన ప్రాంతంగా చేస్తుంది. ఈ మండలంలోని గ్రామనివాసులైన మా స్నేహితుల ఆహ్వానాన్ని అంగీకరించి వరి కోతను, ఆ తర్వాతి ప్రక్రియను ప్రత్యక్షంగా చూస్తాము.
వరిపంటను కోయడం
మా బస్సు మమ్మల్ని పశ్చిమ బెంగాల్లోని జైదర్కోట్కు తీసుకు వెళ్ళింది, మేము రిక్షాలో మా ప్రయాణాన్ని ఊరు లోపలికి కొనసాగించాము. త్వరలోనే పొలంలో చురుకైన కార్యకలాపాలను చూశాము. ఉమ్మడి వ్యవసాయదారుల జాడే లేదు! బదులుగా, తండ్రులు, కుమారులు, బాబాయిలు, సహోదరులు వరి వడ్లను నూర్చడంలోను, కొడవలితో నిపుణంగా చేతినిండా వెన్నులను కోసి, చిన్న కట్టలు కట్టడంలోను నిమగ్నమై ఉన్నారు. కోతవాళ్ళలో ఒకరు మా కెమరాను చూసి, తన కట్టలను గడ్డి మెరకతో త్వరగా బిగించడం ముగించి, పనిచేస్తున్న ఫోజులో దాన్ని పైకి ఎత్తుకున్నాడు. గ్రామ ప్రజలకు ఫొటో తీయించుకోవడం ఎంత సరదానో అని మేము నవ్వుకున్నాము.
వెన్నులు ఎండడానికి వాటిని ఒకటి రెండు రోజులు ఎండలో పెట్టేశారు. కుటుంబంలోని చిన్న పిల్లలు కూడా పూర్తిగా ఎండిన వెన్నుల కట్టలను తమ తలపై చక్కగా సరితూకంగా పెట్టుకుని యింటికి చేరవేయడంలో తలా ఒక చెయ్యి వేయగలరు.
చివరికి, మేము గ్రామానికి చేరుకున్నాము. మేము గౌరవసూచకమైన పదాన్ని ఉపయోగిస్తూ, మా అతిథేయుడ్ని ఇలా పలకరించాము, “బాగున్నారా దాదా?” ఆయన నవ్వు అంతా సవ్యంగానే ఉందని మాకు నమ్మకాన్ని ఇచ్చింది, ఆయన భార్య టీ తయారు చేయడానికి వడిగా వెళ్ళడం మేము చూశాము.
ఉదయం టీ తాగుతుండగా, ఈ సంవత్సరపు కోత ఎలా ఉందని మేము అడిగాము. “ఫర్వాలేదు” అని రైతుల మామూలు పక్కీలో నిట్టూర్పుతో బదులిచ్చాడు, కాని ఇటీవల సంవత్సరాల్లో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించడంతో భూవనరులపై అధిక భారం పడిందని ఆయన వాపోయాడు. మొదట్లో పంట అద్భుతంగా పండింది, కాని ఇప్పటి కథ వేరు. ఎక్కువ పంటనిచ్చే విత్తనాలకు అవసరమైన రసాయన ఎరువులు ఎంతో ఖరీదైనవి, మరి వాటిని ఆయన కొనలేరు.
నూర్చడం, ఉడకబెట్టడం
మేము అల్పాహారాన్ని ముగించాక, తమ కోత పనిని కొనసాగించమని, ఆ పనిని చూడడానికి మేము వచ్చామని ఈ కుటుంబాన్ని తొందర పెట్టాము. ఈ ఇంట్లో కోత నూర్చడం అప్పటికే అయిపోయింది. కొంచెం దూరాన, పొరుగు ఇంట్లో స్త్రీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పేర్చిన వెదురుకర్రలపై ఒక్కో వెన్నును కొడుతూ ఉంటే వాటి సందుల్లోనుండి గింజలు జారి పడుతున్నాయి. మిగిలిన గడ్డిని కుప్పగా వేస్తున్నారు.
మరపట్టించని బియ్యాన్ని వడ్లు అని కూడా పిలుస్తారు, దానిపై గరుకుగా ఉండే పొట్టు ఉంటుంది, అది జీర్ణము కాదు. కాబట్టి పచ్చి బియ్యం యిష్టపడేవారు, చేయవలసిన తరువాతి పని, పొట్టు తీయడమే, లేదా పరిశీలించి తీసుకునే విదేశీ మార్కెట్టు కొరకైతే, పొట్టు తొలగించడం మరియు బహుశ, కొంత పోలిషింగ్ చేసి, మర పట్టిస్తే సరిపోతుంది.
అయితే, ఇక్కడి పంట ఎగుమతి చేయడానికి కాదు గాని, రైతు కుటుంబాలవారే తింటారు. వారు విత్తనాలను టిక్రీలో లేదా కుటుంబానికి సరిపడే పరిమాణంలో గడ్డితో కప్పిన గోతిలో నిలువ ఉంచుతారు. గంగా డెల్టా ప్రజలు సాధారణంగా ఉప్పుడు బియ్యాన్ని తింటారు, కాని మేము మా అతిథేయునితో ఈ సంవత్సరం పచ్చిబియ్యం తయారు చేసుకోగలరని చెబుతూ, ఆయనను సున్నితంగా ఆటపట్టించాము.
“లేనే లేదు, ఈ ప్రాంతాల్లో మేము ఉప్పుడు బియ్యానికి అలవాటుపడ్డాము, ఎలాగైనా పచ్చిబియ్యానికి దానంత రుచి ఉండదు” అని ఆయన ప్రతిస్పందించాడు.
బియ్యాన్ని నానబెట్టి, కొద్దిగా ఉడకబెట్టి ఉప్పుడు బియ్యం చేస్తారని మేము విన్నాము, కాని ఎలా చేస్తారో మాకు కచ్చితంగా తెలియదు. మా స్నేహితుడు, తన కుటుంబం చేసే పద్ధతిని చూపిస్తామని చెప్పినప్పుడు సంతోషించాము. ప్రత్యేక పరికరము అవసరం లేదు. ఎందుకంటే, కుటుంబ అవసరాల కొరకు ప్రతి సారి ఒకటి రెండు వారాలకు సరిపడా తయారు చేసుకుంటారు. టిక్రీలో నిల్వచేసిన వడ్లను ఒక పెద్ద హాన్రీ లేదా వంట కుండలో నింపి, నాలుగో వంతు నీళ్ళు పోస్తారు. నీళ్ళు ఆవిరి అయ్యేంతవరకు, ఊనూన్ అని పిలువబడే గడ్డి పొయ్యి మీద చిన్న మంటలతో దాన్ని వేడి చేస్తారు. తర్వాత దానిలో ఉన్నదాన్ని రాత్రంతా స్వచ్ఛమైన నీళ్ళను నింపిన తొట్టిలో నానబెట్టాలి. దానిని వడగట్టిన తర్వాత, మరొకసారి తడారేంతవరకు హాన్రీలో ఉంచి వేడిచేయాలి. చివరికి, గింజలు గట్టిపడేలా వాటిని నేల మీద ఎండలో ఆరబెడుతారు, మధ్య మధ్యలో పాదాలతో వాటిని తిరగేస్తూ ఉంటారు.
ఇది ఎంతో అదనపు పని అన్నట్లుగా మాకు అనిపించింది, ఈ ప్రక్రియ కుటుంబ ఇష్టానికి అనుగుణంగా ఉండడమే కాకుండా, దీనివలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొద్దిగా ఉడకబెట్టడం వల్ల కొన్ని విటమిన్లు, మరియు పోషకాలు వరి గింజలోని బీజపోషక పదార్థములోనికి లేదా ఆహార భాగంలోనికి, వెళ్తుంది. ఇది తర్వాత కడిగేటప్పుడుగాని, వండేటప్పుడుగాని అంత సులభంగా తొలగించబడదు. దాని ఫలితం మరింత పోషక మూల్యం గల భోజనం. నిజంగా ముఖ్య ఆహారంగా బియ్యంపై ఆధారపడేవారికి ఆహారపు అదనపు మూల్యము అంటే అక్షరాలా జీవితానికి మరణానికి మధ్య ఉన్నంత తేడాగా ఉండగలదు.
రైతులు వెంటనే మెచ్చుకున్న మరో ప్రయోజనమేమంటే, ఉప్పుడు బియ్యాన్ని మరింత సులభంగా నిల్వ ఉంచుకోవచ్చు, పొట్టును సులభంగా తొలగించవచ్చు. అదనపు దృఢత్వం ఎక్కువ నూకలు కాకుండా ఉండేందుకు కారణమౌతుంది.
బియ్యం రుచి
“మళ్ళీ టీకి మరియు అల్పాహారానికి వేళయ్యింది,” అని మా అతిథేయుడు అన్నారు. మేము తిరిగి ఇంటికి వెళ్ళాము, దీదా (నాయనమ్మ) మూరీ తయారు చేస్తున్నారు. అప్పుడే చేసిన బొరుగులంటే అందరికీ, ముఖ్యంగా పిల్లలకు చాలా ఇష్టం. దీదా, ముందే నానబెట్టి, ఉప్పు కలిపిన కొన్ని కప్పుల పొట్టులేని ఉప్పుడు బియ్యాన్ని ఊనూన్ దగ్గర కూర్చుని వేయించుతున్నారు. ఇప్పుడు బియ్యం ఆరిపోయి పొడిగా ఉంది. అలా, ఆమె వేడి ఇసుక ఉన్న కళాయిలో ప్రతిసారి కొంచెం కొంచెం బియ్యం వేస్తూ ఉంటుంది. ఆమె ఇసుకను వేడి చేస్తూనే ఉన్నారు, అందులో ఉన్న బియ్యం, దాని సాధారణ పరిమాణాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉబ్బుతుంది. తయారైన మూరీ మాడిపోక ముందే యిసుక పై భాగం నుండి కొమ్మలతో తీస్తారు. ఆ కొమ్మలు వేడి మూరీ గల గంపలో ఆదుర్దాగా పెట్టే చిన్నారి చేతులకు శిక్ష విధించడానికి కూడా పనిచేస్తాయి.
మేము మూరీలను అప్పుడే కోసిన కొబ్బరి ముక్కలతో ఉల్లాసంగా తిన్నాము. అయితే భోజనవేళవుతుందని గుర్తుండడం వలన మరీ ఎక్కువగా తినకుండా జాగ్రత్తపడ్డాము.
చూడవలసిన చివరి ప్రక్రియ పొట్టుతీయడమే. పాదంతో నొక్కి నడిపించగల డెంకీ అని పిలిచే రోలు మరియు రోకలి ఈ మధ్య వరకు కూడా ఉపయోగించబడేవి, కాని ఇప్పుడు, మారుమూల ప్రాంతాల్లో కూడ త్వరగా పనిని ముగించే పొట్టు తీసే యంత్రోపకరణాలను ఉపయోగిస్తున్నారు. ఈ మార్పువలన కొందరు పాతకాలం మనుష్యులు బాధపడుతున్నారు, ఎందుకంటే, విశిష్టమైన రుచిని, ఆహారంలో అదనపు పోషకాలను ఇచ్చే గింజ ఎర్ర పొరను (పైపొర) తొలగించకుండా అలాగే ఉంచుతూ దాని పైపొట్టును మాత్రమే డెంకీ తీసివేస్తుంది. అయితే, యంత్రం అన్నింటిని, పొట్టును, తవుడును, గింజ అంకురాన్ని తీసివేస్తూ, నేడు అందరు ఇష్టపడుతున్న తెల్లని గంజి ఉన్న బీజ పోషక పదార్థాన్ని మాత్రమే మిగుల్చుతుంది.
ఇప్పుడు ఆ స్త్రీలు తాము చేసిన వంటను మేము ఆరగించాలన్న ఆకాంక్షతో ఉన్నారు. వారు ఉప్పుడు బియ్యాన్ని ఉడకబెట్టి వండి, ఆ వేడివేడి అన్నాన్ని అరటాకుల్లో వడ్డించారు. తర్వాత, చిక్కుడు కాయ కూరను, స్థానిక కూరగాయలను, చెరువు చేపలను అన్నంతో పాటు తినడానికి వడ్డించారు. మా సందర్శనంలో ఎక్కువ ఆస్వాదించగల సందర్భాల్లో అదొకటని మేమందరము ఒప్పుకున్నాము.
అవును, పచ్చి బియ్యమైనా, ఉప్పుడు బియ్యమైనా, అది పోషక సమృద్ధిగల పదార్థము. “నరుల ఉపయోగమునకు కూరమొక్కలను” మొలిపించుటకు దేవుడు సృష్టించిన శాఖాహార మొక్కల్లో అది ఒకటి.—కీర్తన 104:14.
[14వ పేజీలోని బాక్సు]
జాల్ మూరీ
భారతదేశంలోని అనేక భాగాల్లో, రంగురంగుల దుస్తులు ధరించిన అమ్మకందారులు వీధుల్లో బొరుగుల ఫలహారాన్ని అమ్ముతారు. రుచిగల, పోషక మూల్యము గల జాల్ మూరీని సులభంగా తయారు చేయవచ్చు, అలాగే పొట్లం కట్టబడే ఇతర ఫలహారాల కన్నా, ఇది భిన్నంగా ఉంటుంది.
కరకరలాడే తీపిలేని ఈ బొరుగులను తీసుకొని, రుచికరంగా ఉండేందుకు వాటికి చేర్చవలసినవి: చక్కగా తరిగిన టమాటాలు, ఉల్లిగడ్డలు, దోసకాయలు, కావాలనుకుంటే మీరియాలు, కొన్ని బఠాణీలు, (యిష్టమైతే) సెనగ-గింజలు, చాట్ మసాలా (ఇండియా దుకాణాల్లో లభ్యమయ్యే మసాల పొడుల మిశ్రమాలు) లేదా చిటికెడు ఉప్పు మిరియాలు, ఒక టీ స్పూన్ ఆవనూనె లేదా వేరే సాలెడ్ నూనె వేసి మిశ్రమాలను కలిపి వెంటనే ఆరగించాలి.
అభిరుచులు వేరుగా ఉంటాయి కాబట్టి, మూరీ అమ్మకందార్లు తాము పెట్టుకున్న, తరిగిన కూరగాయల్లోనుండి, మసాలల నుండి తినేవారిని ఎన్నుకోడానికి అనుమతిస్తాడు. అన్ని రకాల పదార్థాలను చిన్నచిన్న గిన్నెల్లోవుంచి మీ అతిథులే వాటిని వారికిష్టమైనది యిష్టమైనంత పరిమాణంలో కలుపుకునే విధంగా కూడా ఈ మూరీని అందించవచ్చు.
[12,13వ పేజీలోని చిత్రాలు]
(1) వరి కంకులను నూర్చడం (2) తూర్పారబట్టడం (3) దీదా “మూరీ” తయారు చేస్తున్నారు (4) వివిధ మిశ్రమాలు గల “మూరీ” గంప