విసుగుదలను పారద్రోలుటకు సులభమైన పరిష్కారమా?
విసుగుచెందిన లక్షలాది మంది వినియోగదారులకు లెక్కలేనన్ని వినోదాలను కలిగించడం ఇప్పుడొక పెద్ద వ్యాపారం. అసాధారణమైన సెలవుదినాలు, అధునాతన ఎలక్ట్రానిక్ యంత్ర పరికరాలు, విస్తృతమైన సరదాలన్నీ వినియోగదార్ల కాలక్షేపం కొరకే ఏర్పాటు చేయబడ్డాయి. అయినప్పటికీ, విసుగు అనేది ఓ పెద్ద సమస్యగా ఉంది. సెలవు రోజుల్లో కూడా, విసుగెత్తి, సెలవు తీసుకున్నవారు సంతోషంగా ఉండేందుకు వారికి బాహ్య ప్రేరకము అవసరముంది. పట్టుదలగా జాగింగ్‌ను చేపట్టిన అనేకులు కూడా తమతో పాటు పోర్టబుల్ రేడియో లేకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తారు.
దూరదర్శిని వంటి వినోదాన్నిచ్చేది ఉల్లాసాన్ని కలిగించి, విసుగును తీసివేస్తుందనడంలో సందేహం లేదు. కాని అది ఎంతవరకు? కొందరికి అది మాదక ద్రవ్యాలకు అలవాటు కావడం వంటిదే. తర్వాతి సమయంలో, మరింత ప్రోత్సాహం, మరింత ఉల్లాసం అవసరం—లేకపోతే అంతకు ముందే అంతా చూశామన్న భావనతో మళ్ళీ విసుగనిపిస్తుంది. అది పరిష్కారంగా ఉండే బదులు, అలాంటి వినోదం చివరికి విసుగుకు ఒక కారణం కాగలదు.
టి.వి.యే విసుగుకు కారణం కాదు, అయితే అమితంగా దూరదర్శినిని చూడడం విసుగును పారద్రోలదు. దానికి బదులు, మీరు ఎంతగా టి.వి. సెట్టుకు ‘చేరువవుతారో’ మీరు వాస్తవము నుండి అంతగా దూరమవుతారు. పిల్లల విషయంలో, ఇలా తరచుగా జరుగుతుంది. నాలుగేండ్ల పిల్లలను, ఐదేండ్ల పిల్లలను మీరు టి.వి.ని వదిలిపెట్టడానికి ఇష్టపడతారా, మీ తండ్రిని వదిలిపెట్టడానికి ఇష్టపడతారా అని అడిగిన ఒక అధ్యయనంలో, ప్రతి ముగ్గురులో ఒకరు నాన్న లేక పోయినా జీవించవచ్చని తీర్మానించుకున్నారు!
ప్రతి కోర్కెను తీర్చుకోవడం కూడా పరిష్కారం కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలు “అన్ని రకాల ఆటబొమ్మలతోను, సెలవుదినాలన్నింటిలోను, అన్ని రకాల ఫ్యాషన్లను కలిగివుండి సిరి సంపదలతో పెరుగుతున్నారు,” అని జర్మనీ పార్లమెంటులోని సోష్యల్ డెమోక్రాటిక్ డెప్యూటీ అభిప్రాయపడ్డాడు. వారికి ఇంకా ఎక్కువగా ఉత్తేజాన్ని కలిగించేదేమైనా ఉందా? సద్గుణవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు కావలసినన్ని ఆధునిక చమత్కార సాధనాలను విరివిగా ఇవ్వడం నిజంగా వాస్తవానికి దీర్ఘకాలం విసుగుదలచే వేధించబడే యౌవనానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
విసుగు చెందడానికి ముఖ్య కారణాలు
విసుగుదలను పూర్తిగా పారద్రోలడం వాస్తవమయ్యే లక్ష్యం కాదు. ఈ లోకంలో జీవితం ఎడతెగక ఉల్లాసంగా, సంతోషంగా ఉండదు. ఇలాంటి అవాస్తవికమైన నిరీక్షణ అనవసరమైన అసంతృప్తికి కారణం కాగలదు. అదే సమయంలో, విషయాలను మరింత తీవ్రతరం చేసే కచ్చితమైన కారణాలు కూడా ఉన్నాయి.
ఉదాహరణకు, నేడు అంతకంతకు మరిన్ని కుటుంబాలు విచ్ఛిన్నమౌతున్నాయి. ఇక ఏమాత్రం పిల్లలతో కావలసినంత సమయాన్ని గడపలేనంతగా తల్లిదండ్రులు తమ వినోదాల్లో తామే నిమగ్నమై ఉండడం జరుగుతుందా? కౌమార ప్రాయంలోని పిల్లలు డిస్కోల్లోను, వీడియో పార్లర్లలోను, షాపింగ్ సెంటర్ల వంటి వాటిలోను తమను తాము వినోదింపజేసుకునేందుకు తమ దారి చూసుకోడంలో ఆశ్చర్యమేమీ లేదు. దాని ఫలితంగా, అనేక గృహాల్లో కుటుంబం కలిసి బయటకు వెళ్ళడం, కలిసి పని చేయడం గత స్మృతులుగా మారాయి.
ఇంకా, కొందరు మందకొడిగా ఉండే తమ జీవితాలతో ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే, వారు తెలియకుండానే తమ లోకంలోనికి తమను తాము ఖైదీగా చేసుకొంటూ, తమ పనులను మాత్రం చేసుకొంటూ, ఎవరినైనా విస్మరిస్తున్నారు. వారు తమను తాము మరింత ఒంటరిగా చేసుకుంటూ, తమను తాము గుర్తించుకోవాలనే లక్ష్యాన్ని సాధించాలనే తలంపుతో ఉంటారు. కాని, అది అలా జరుగదు. దానికి విరుద్ధంగా ఏ మానవుడు ఒంటరిగా ఉండలేడు. మనకు సహవాసము మరియు సంభాషణ అవసరము. ఇది అనివార్యము, కాబట్టి తమను తాము ఒంటరిగా చేసుకునే వారు ఎక్కువ విసుగుచెందుతారు, తమకు తెలియకుండానే, తమ జీవితాన్ని, తమ చుట్టూ ఉన్నవారి జీవితాన్ని కూడా విషాదభరితం చేస్తారు.
సమస్య మరింత గంభీరమైనదే, 17వ శతాబ్దపు ఫ్రెంచ్ మనశ్శాస్త్రవేత్త అయిన బ్లాజ్ పాస్కల్ ఈ విషయాన్ని గూర్చి ఈ విధంగా అభిప్రాయపడ్డాడు: “విసుగు, హృదయాంతరాల నుండి [వస్తుంది] దాని నైసర్గిక మూలమక్కడే ఉంటుంది అది మనస్సును విషంతో [నింపుతుంది].” ఎంత నిజం!
జీవితం అర్థమేమిటి, నేనెందుకు ఇక్కడ ఉన్నాను అనే విసిగించే సందేహాలతో హృదయం నిండి ఉన్నంతకాలం, విసుగు అలాగే ఉండిపోతుంది. తన వ్యక్తిగత జీవితానికి అర్థముందని మనస్సారా నమ్మగలిగే దృఢ విశ్వాసం అవసరం. అయితే, తాను ఇక్కడ ఎందుకున్నాడో తెలియకుండా, లక్ష్యాలు లేకుండా, భవిష్యత్తు కొరకు దృఢమైన ఆధారం గల నిరీక్షణలు లేకుండా ఎవరైనా అనుకూల దృక్పథంతో జీవితాన్ని ఎలా ఎదుర్కోగలరు?
ఇక్కడే కొన్ని అవిభాగిత ప్రశ్నలు తలెత్తుతాయి: జీవితం అంటే అర్థమేమిటి? నేను ఇక్కడ ఎందుకున్నాను? నేను ఎక్కడికి వెళ్తున్నాను? “తన జీవితంలో అర్థమేమిటో గ్రహించడం ఒకనికి ప్రేరణాత్మకంగా ఉండగలదు,” అని డా. విక్టర్ ఫ్రాంకెల్ అభిప్రాయపడ్డాడు. అయితే, అలాంటి అర్థాన్ని ఎక్కడ కనుగొనవచ్చు? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు ఎక్కడనుండి లభిస్తాయి?
ఎక్కువ విసుగు లేకపోవడం—ఎలా?
అతి పురాతన పుస్తకం ఇలాంటి అవిభాగిత ప్రశ్నలకు వివరణాత్మకమైన జవాబులనిస్తుంది. హెయిన్రిక్ హెయిన్ అనే 19వ శతాబ్దపు జర్మనీ కవి ఇలా అన్నాడు: “ఆ పుస్తకాన్ని చదవడం వలన కలిగిన జ్ఞానాన్ని బట్టి ఋణపడి ఉన్నాను.” అది ఏ పుస్తకం? అదే బైబిలు. అలాగే చార్ల్స్ డికెన్స్ ఈ విధంగా అన్నాడు: “ఈ పుస్తకం ప్రస్తుతం, అలాగే భవిష్యత్తులోను, లోకంలోని పుస్తకాలన్నింటికన్నా శ్రేష్ఠమైన పుస్తకం, ఎందుకంటే, ఏ మానవుడినైనా చక్కగా నడిపించగల . . . శ్రేష్ఠమైన పాఠాలను అది నేర్పిస్తుంది.”
దాని గురించి సందేహమే లేదు. అర్థవంతమైన జీవితానికి బైబిలు కచ్చితమైన మార్గదర్శి. మానవుడు చేయడానికి దేవుడు పని ఇచ్చాడనే విషయాన్ని, అది ఆరంభం నుండి అంతం వరకు స్పష్టంగా చూపిస్తుంది. మానవుడు భూమిని చూసుకోవలసి ఉంది, దాన్ని మరింత మనోహరంగా మార్చవలసి ఉంది, వన్యప్రాణులను ప్రేమపూర్వకంగా చూసుకోవలసి ఉంది, అన్నింటికంటే మిన్నగా, సృష్టికర్తయైన యెహోవాను స్తుతించవలసి ఉంది. అది చేయవలసిన పని, విసుగుకు అవకాశమివ్వని పని! లక్షలాదిమంది చురుకైన క్రైస్తవులు దేవునికి తమను తాము సమర్పించుకుని, సంపూర్ణంగా అంకితం చేసుకున్నారు గనుక, ఆయన పక్షానికి మద్దతునివ్వడం, నిజంగా జీవితానికి మరింత అర్థాన్నిస్తుందని, విసుగును తొలగిస్తుందని గ్రహించారు.
ఆధునిక కాలంలో అన్నిచోట్ల కనిపించే పదమే విసుగు—అనేక అతి పురాతన భాషల్లో దీనికి పదమే లేదు. అయినప్పటికీ, బైబిలు, జీవితానికి అర్థాన్ని తెలపడంతో పాటు, విసుగును అధిగమించడానికి అవసరమైన ఆచరణాత్మక సలహాలను కూడా ఇస్తుంది. ఉదాహరణకు, అది ఇలా చెబుతుంది, ‘వేరుండగోరువాడు లెస్సైన జ్ఞానానికి విరోధి.’ (సామెతలు 18:1) మరొక మాటలో చెప్పాలంటే తన లోకంలోనికి తనను ఖైదీగా చేసుకొనకూడదు!
మానవుడు సహజంగా సంఘజీవి. అతడు ఇతరులతో మాట్లాడవలసిన అవసరముంది, సహవసించవలసిన అవసరతతోనే పుట్టాడు. ఇతర ప్రజలతో కలిసిపోవాలనే ఈ సాధారణమైన కోరికను అణచివేయడం—ఒంటరిగా ఉండడం, కేవలం ప్రేక్షకునిగా ఉండడం—అవివేకం. అలాగే ప్రముఖులతో మాత్రమే మన వ్యక్తిగత సంబంధాలను పరిమితం చేసుకోవడం, ఆచరణాత్మక జ్ఞానాన్ని అలక్ష్యంచేయడంతో సమానం.
ఊరకనే సినిమాలను చూడడం, లేదా కంప్యూటర్లోకి సమాచారాన్ని ఎక్కించడం వరకే మన సహవాసాన్ని పరిమితం చేయడం నిజంగా సులభమే. ఇతరులతో సర్దుకుపోవడం నిజంగా ఒక సవాలే. అయితే, చెప్పడానికి ప్రయోజనకరమైన విషయాలు ఉండడం, తలంపులను, అనుభూతులను మరొకరితో పంచుకోవడం అనేది ప్రతిఫలదాయకంగాను, విసుగు లేకుండాను చేస్తుంది.—అపొస్తలుల కార్యములు 20:35.
మానవ నైజాన్ని జాగ్రత్తగా గమనించిన సొలొమోను, ఈ శక్తివంతమైన సిఫారసునిచ్చాడు: “కోర్కెలకు పగ్గాలివ్వడంకంటే, మీ కళ్ళెదుట ఉన్నదానితో తృప్తికలిగియుండుట మేలు.” (ప్రసంగి 6:9 ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) మరో మాటలో చెప్పాలంటే, మీ ప్రస్తుత పరిస్థితులనుండి సాధ్యమైనంత మేరకు ప్రయోజనం పొందండి. మీరిప్పుడు చూస్తున్న దానిపై ఏకాగ్రత నిలపండి. వాస్తవము కాని దాని కొరకు వేచి ఉండడం కన్నా లేక సొలొమోను చెప్పినట్లు ‘కోర్కెలకు పగ్గాలివ్వడంకన్నా,’ అదే మిన్న.
ముందుగా పథకం వేసుకున్న రోజులు, కచ్చితమైన లక్ష్యాలు, నేర్చుకుంటూ ఉండాలనే నిజమైన కోరిక మీరు విసుగును అధిగమించడానికి తోడ్పడతాయి. ఎందుకు, ఉద్యోగ విరమణ తర్వాత కూడా, ఒక వ్యక్తి ఎన్నో కార్యాలను సాధించగలడు. బాలరిక్ దీవుల్లో ఉద్యోగ విరమణ చేసిన ఒక యెహోవాసాక్షి, తన 70వ పడి తొలి దశలోను ఆతురతతో జర్మన్ భాష నేర్చుకుంటున్నాడు. ఆయన లక్ష్యమేంటి? జర్మనీ నుండి విసుగుచెంది సెలవులకు వచ్చే ఏ సందర్శకునితోనైనా మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజంగా విసుగు ఆయనకు ఒక సమస్యే కాదు!
చివరిగా, మీ చేతులతో ఏదైనా పని చేయడాన్ని గూర్చిన మాటేమిటి? ఏవైనా చేతిపనుల్లో, పెయింటింగ్‌లో లేదా ఏదైనా సంగీత ఉపకరణాన్ని వాయించడంలో నిపుణతలను ఎందుకు సంపాదించుకోకూడదు? మీరేదైనా సాధించారన్నప్పుడు, ఆత్మగౌరవం పెరుగుతుంది. మీ చొక్కా చేతులను మడిచి, మీ ఇంట్లో సహాయం చేయడాన్ని గూర్చి ఎందుకు ఆలోచించకూడదు? ఏ ఇంట్లోనైనా ఎల్లప్పుడూ చేయవలసిన కొన్ని చిన్న పనులు ఉంటాయి. విసుగెత్తించే మీ జీవితాన్ని గూర్చి ఆలోచించే బదులు, మీరు కొంత సమయం తీసుకుని, ఇంట్లో అర్థవంతమైన పనులు చేయడానికి, ఏదైనా చేతిపనిలో నిపుణులు కావడానికి సిద్ధంకండి. మీకు ప్రతిఫలం లభించకపోదు.—సామెతలు 22:29.
అంతేకాక, మనం ఏ పథకాన్ని చేపట్టినా, మనస్ఫూర్తిగా చేయాలని బైబిలు సలహా ఇస్తుంది. (కొలొస్సయులు 3:23) నిజమే, మనం చేస్తున్నదానిలో లీనమవ్వాలి, మనం చేస్తున్నదానిలో నిజమైన ఆసక్తిగలవారమై ఉండాలని దాని భావం. ఆంగ్లంలో “ఇంటెరెస్ట్” అనే పదము లాటిన్లోని ఇంటెరెసెస్ నుండి వచ్చిందని, అది అక్షరార్థంగా “మధ్య, నడుమ” అని, మరొక మాటలో చెప్పాలంటే, చేస్తున్న పనిలో లీనమై పోవడమని గుర్తుంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అది దాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది.
ఈ మంచి సలహా సంవత్సరాల క్రితమే వ్రాయబడింది, దాన్ని అన్వర్తించి ఉంటే, తీరిక వేళల్లో కృంగిపోయేవారి పరిస్థితి ఎంతో భిన్నంగా ఉండేది. కాబట్టి, మీరు చేసే పనిలో లీనమవ్వండి. ఇతర ప్రజలతో కలవండి. ఇతరులకొరకు పనులు చేయండి. నేర్చుకుంటూనే ఉండండి. ఇతరులతో కలివిడిగా మాట్లాడండి. జీవితం యొక్క నిజమైన సంకల్పాన్ని గూర్చి తెలుసుకోండి. ఇదంతా చేయడం ద్వారా, ‘జీవితం ఎందుకు ఇంత విసుగ్గా ఉంది?’ అని మీరు నిట్టూర్చవలసిన అవసరం రాదు.
[7వ పేజీలోని బాక్సు]
విసుగుదలను ఎలా పారద్రోలవచ్చు
1. రెడీమేడ్ వినోదం మీ వ్యక్తిగత చొరవను బలహీనపరచడానికి అనుమతించకండి. ఉల్లాసాలను, వినోదాలను సరైన విధంగా ఎన్నుకొనేవారై ఉండండి.
2. ప్రజలతో మాట్లాడండి.
3. నేర్చుకుంటూ ఉండండి. వ్యక్తిగత లక్ష్యాలను కలిగి ఉండండి.
4. సృజనాత్మకత గలవారై ఉండండి. మీ చేతులతో ఏదైనా పని చేయండి.
5. అంతేకాక, జీవితంలో సంకల్పం కలిగి ఉండండి. దేవుని గూర్చి ధ్యానించండి.