ఐరోపాలోని ఆర్కిడ్‌ల కొరకైన అన్వేషణలో
నెదర్లాండ్స్‌లోని తేజరిల్లు! ప్రతినిధి
ఆర్కిడ్‌లు అన్ని చోట్ల ఉన్న ప్రజలను ఆకర్షిస్తాయి. ఈ మొక్కలు విదేశ సౌందర్యానికి, రంగురంగుల వైభవానికి పర్యాయపదాలవంటివి. అవి దుర్భేద్యమైన ఉష్ణమండల అడవుల్లో ఉండడం, వాటి చుట్టూ ఉన్న మార్మిక వాతావరణానికి తగినట్లుగా ఉంటుంది. ఆర్కిడ్‌లు ఉష్ణమండల ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావని అయితే, అవి మన భూగ్రహంలోని ఐరోపావంటి ఎంతో సమశీతోష్ణము గల ప్రాంతాల్లో కూడా కనబడతాయి అని కొందరికే తెలుసు.
ఆర్కిడ్ జాతులు ఆర్కిటిక్ మంచుప్రాంతం మొదలుకొని, అధిక ఉష్ణమండల ప్రాంతమైన గ్రీసు వరకున్న విభిన్న మండలాల్లో కనిపిస్తాయి. ఐరోపాలో మొత్తం 250 జాతులున్నాయి. అనేక ఉష్ణమండల జాతులకు భిన్నంగా, ఐరోపా జాతులు నేలపైనే ఉంటూ, వాటి వేర్లు ఇసుకలోనికి చొచ్చుకు పోతాయి. ఉష్ణమండల ఆర్కిడ్‌లలో ముఖ్యమైనవి వృక్షోపజీవులు, ముఖ్యంగా వాటి వేరులు వృక్షములపై నాటుకుని ఉంటాయి. అనేక ఉష్ణమండల జాతులు అందమైన పెద్ద పువ్వులను పూస్తాయి, అయితే, ఐరోపా ఆర్కిడ్ పుష్పాలు చాలా చిన్నవిగా ఉంటాయి.
ఐరోపాలో ఆర్కిడ్‌లను అన్వేషిస్తూ, చూస్తూ ప్రయాణం చేయడం చక్కని కాలక్షేపం, ఎందుకంటే అనేక జాతులు చక్కని పరిసరప్రాంతాల్లో పెరుగుతాయి. ఆర్కిడ్‌లు అవి విభిన్నమైన పరిసర పరిస్థితుల ఉనికిని సూచించే సూచకాలు. అనేక జాతులకు ప్రత్యేకమైన పర్యావరణ పరిస్థితులు అవసరము, అవి అక్కడే ఉండగల్గుతాయి, తమ అవసరాలను తీర్చుకోగల్గుతాయి. ఉదాహరణకు, డాక్టిలోర్హిజా ఇన్‌కార్‌నాటా వంటి చిత్తడి నేలలో పెరిగే ఆర్కిడ్‌లు, భూమి పొర క్రింది నీటిలో కావలసినంత సున్నము ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఇతర జాతులకన్నా మరి కొన్ని జాతులు ఎందుకు అరుదుగా ఉంటాయో దీని వలన తెలుస్తుంది. పరిమితమైన పరిస్థితుల్లో పెరిగే ఒక జాతికన్నా, మరొక ఆర్కిడ్ జాతికి అవసరమైన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి.
మనం నెదర్లాండ్స్ నుండి దక్షిణ ఇటలీ వరకున్న ఐరోపాకు ఒక ఊహా పర్యటన చేసినట్లయితే, మనం ప్రయాణం చేసే అనేక మండలాల్లో ఆర్కిడ్‌లు కనిపిస్తాయి. నెదర్లాండ్స్ నుండి మన పర్యటన ఆరంభించుదాం. పశ్చిమ ఐరోపాలోని ఈ చిన్న దేశంలో, మనం విస్తృతంగా చిత్తడి నేలలను, ఎగుడు దిగుడైన ఇసుక దిబ్బలను, పచ్చికబయళ్ళను చూస్తాము. మే, జూన్ నెలల్లో మైదానం డాక్టిలోర్హిజా జాతి ఆర్కిడ్‌లతో గులాబి మరియు ఊదా రంగుల్లోకి మారుతుంది. డాక్టిలోర్హిజా ప్రేటెర్‌మైసా అందంగా, వైభవోపేతంగా ఉండే జాతి. ఈ మొక్క ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది, దీనికి 60 వరకు పువ్వులుంటాయి. కుళ్ళిన మొక్కలు గల చిత్తడి నేలలు, అడవి పొదలు, ఆర్కిడ్‌లు పెరిగే స్థలాలు. ముఖ్యంగా తేమగానుండే అడవి పొదలుగల స్థలాల్లో డాక్టిలోర్హిజా మాకుల్టా కొన్నిసార్లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కుళ్ళిన మొక్కలు గల చిత్తడి నేలల్లో పచ్చని చిన్న హమ్మార్బియా పాలుడోసా పువ్వుల కొరకు మనం జాగ్రత్తగా వెదకవలసి ఉంటుంది. ఈ చిన్న ఆర్కిడ్‌లు ప్రవేశించడానికి వీలుకాని ప్రాంతాల్లో పెరుగుతాయి.
జర్మనీలో నడుమనుండే పర్వత శ్రేణుల్లోకి మనం ముందుకు ప్రయాణం చేస్తున్నాము. ఇక్కడ, మరిన్ని విభిన్నమైన ఆకురాల్చే వృక్షాల నడుమ ఎపిపాక్టీస్ జాతికి చెందినవి అనేకం కనిపిస్తాయి. ఇందులో కొన్ని చిక్కని నీడలు గల చోట్లలో పెరిగితే, ఎపిపాక్టీస్ ముల్లేరి వంటి మరి కొన్ని జాతులు అడవుల చివర్లను ఇష్టపడతాయి. వేసవి తుదిలోను, శరత్కాలములోను ఎపిపాక్టీస్ జాతులు పూయడంతో, ఐరోపాలోని ఆర్కిడ్‌ల కాలం ముగుస్తుంది. సమృద్ధిగా సున్నము గల కొండల ఏటవాళ్లలో ఉండే మోడువారిన ప్రత్యేక తరహా పచ్చికబయళ్ళలో, సున్నపు పచ్చికబయళ్ళలో ఆర్కిడ్‌లు విరాజిల్లుతాయి. మే, జూన్‌లలో డజన్ల కొలది జాతులను మనం చూడగలం, వాటిలో మనోహరమైన ఆర్కిస్ మిలిటారిస్ మరియు ఆర్కిస్ ఉస్తులాటాలు ఉన్నాయి.
జర్మనీ దక్షిణ భాగమందలి ఆల్ఫ్‌స్‌కు మనం చేరుకున్నాం. ఎత్తైన పచ్చిక మైదానాలు విస్తారమైన వాటి పువ్వులకు ప్రసిద్ధిగాంచాయి. ఆర్కిడ్‌లు ఈ పర్యావరణానికి తోడ్పడుతున్నాయి. ఇటలీలోని డొలొమైట్స్ వంటి కొన్ని ఎత్తయిన పచ్చిక మైదానాలు జూలై నెలలో ఆర్కిడ్‌లతో ఊదారంగు దాల్చి ఉంటాయి. ఇక్కడ నైగ్రీటల్లా నైగ్రా విభిన్నమైన వర్ణాల్లో సమృద్ధంగా కనిపిస్తాయి. నైగ్రీటల్లా ఘాటైన వెనీలాసువాసనను వెదజల్లుతుంది, అది ఉష్ణమండల ఆర్కిడ్ ఫలాల నుండి వెనీలా ఉత్పత్తి చేయబడుతుందని మనకు గుర్తుచేస్తుంది.
మూడు వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున కూడా ఆర్కిడ్‌లను కనుగొనవచ్చు. బహుశ, లోకంలోని అతి చిన్న ఆర్కిడైన, కామోర్కిస్ ఆల్పినా అంత ఎత్తున ఉండే సాధ్యత ఉంది. ఈ జాతి పుష్పముల పరిమాణం అడ్డంగా 5 మిల్లీమీటర్లకన్నా తక్కువగా ఉంటుంది. ఈ పువ్వులు పచ్చరంగులో ఉంటాయి కాబట్టి, ఏమంత ఆకర్షణీయంగా ఉండవు. అయితే, పర్వత శ్రేణుల్లోని ఆవరణ వ్యవస్థలో ఈ జాతులకు వాటి స్వంత ప్రత్యేక పాత్ర ఉంది.
ఆల్ఫ్‌స్ దాటుకొని ప్రయాణం చేసి, మనం ఐరోపా మధ్యధరాప్రాంతానికి చేరుకున్నాం. ఐరోపాలో మరెక్కడికన్నా, ఇక్కడే ఎక్కువ ఆర్కిడ్ జాతులను చూశాము. వాటి వైవిధ్యం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. చక్కని అందమైన ఈ జాతుల పువ్వులు తొలి వసంతంలోనే పూస్తాయి. మండు వేసవిలో, ఆర్కిడ్‌తో సహా గడ్డి, పార్చెస్‌లు, ముఖ్యంగా పూల మొక్కలేవి కనిపించవు. శరత్కాల ఆరంభంలో వర్షం కురిసిన తర్వాత మాత్రమే పచ్చని తాజా మొక్కలు మళ్ళీ మొలుస్తాయి.
ఈ వర్షపాతానికి ఆర్కిడ్‌లు పెరుగుతాయి. ఆ సమయంలో అనేక జాతుల మొక్కలకు ఆకులు వచ్చి పత్రగుచ్ఛంగా మారి శీతాకాలాన్ని తట్టుకుని, తొలి వసంతంలో మనోహరమైన పువ్వులు పూస్తాయి. ఓఫ్రిస్ జాతి పువ్వులు మధ్యదరా ప్రాంతపు పచ్చిక జాతికి చెందిన పువ్వు. జత అవ్వడానికి ఇష్టపడే భాగస్వామి కొరకు వెదకుతూ కీటకాన్ని పోలిన పువ్వును అది కీటకమేనని అపార్థం చేసుకునే మొగ కీటకాలపై ఈ జాతి మొక్కలు పరాగ సంపర్కం కొరకు ఆధారపడతాయి. అనేక జాతులకు అవి ఏ కీటకాలను పోలి ఉన్నాయో, వాటి పేర్లు, అంటే స్పైడెర్ ఆర్కిడ్, ప్లై ఆర్కిడ్, బంబుల్‌బీ ఆర్కిడ్ (ఆఫ్రిస్ స్ఫిగోడెస్, ఇన్‌సెక్టిఫెరా, హోలోసెరికా) వంటి కీటకాల పేర్లే పెట్టబడ్డాయి. మారు సంయోగం, పరాగ పొడిని అదే జాతికి చెందిన మరొక పువ్వులోనికి యాదృచ్ఛికంగానే తీసుకు వెళ్తుంది. పరాగ సంపర్కం జరుగుతుంది, ఆ విధంగా బీజోత్పత్తి మొదలవుతుంది. ఈ పరాగసంపర్క పద్ధతి ఆశ్చర్యకరంగా ఎంతో కచ్చితమైనది.
కొన్ని ఆఫిరస్ జాతుల్లో వివిధ ఉపజాతులున్నాయి. ప్రతి ఒక్కదాంట్లో ఒక్కో ప్రత్యేక కీటకం ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. పుప్పొడిని తీసుకువెళ్ళే కీటకాలు, ఒకే విధంగా కనిపించే విభిన్న జాతుల పువ్వులను కనుగొన్నప్పుడు, అవి వాటిపై పరాగసంపర్కం చేయడానికి నిరాకరిస్తాయి. కొన్నిసార్లు, “పొరపాట్లు” జరుగుతాయి, ఇతర జాతుల్లో తప్పుడు పరాగసంపర్కం జరుగుతుంది, అవి సంకరజాతులుగా మారుతాయి. కొన్నిసార్లు, ఈ సంకరజాతులు ఫలవంతమైన బీజాలను ఉత్పత్తి చేయగలవు, మరిన్ని విత్తనాలను మళ్ళీ ఉత్పత్తి చేయగలవు.
మధ్యధరాప్రాంతపు జాతియొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, టంగ్ ఆర్కిస్ (సెరాపియస్). ఈ జాతుల్లో రాత్రంతా దొంతరులుగా నున్న వాటి రంధ్రాల్లో కీటకాలు ఉండడంవలన పరాగసంపర్కం జరుగుతుంది. కీటకం మేలుకునే సమయానికెల్లా, పుప్పొడి కీటకం దేహానికి అంటుకొనిపోతుంది, అలా, మరుసటి రాత్రి మరొక పువ్వుపై పుప్పొడి వెదజల్లబడుతుంది.
ఐరోపాగుండా ప్రయాణం చేశాక, ఆర్కిడ్‌లతో నిండిన రమణీయమైన అనేక ప్రకృతి ప్రదేశాలను మనం చూశాం. అయినప్పటికీ, అనేకము అంతరించిపోయాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, అధిక జనాబాతో నిండిన, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన, ముఖ్యంగా, ప్రకృతి వనరులకు కేంద్రమైన ఐరోపా, అనేక అపాయకరమైన పరిస్థితులకు గురౌతున్నట్లు అనుమానించబడుతుంది. ఆమ్ల వర్షము, అనావృష్టి, వ్యవసాయ భూములను పంటకొరకు అమితంగా ఉపయోగించడం, వినోద యాత్ర, పట్టణాలను నెలకొల్పడం, అన్నీ ఆర్కిడ్‌పై తమ ప్రభావాన్ని చూపాయి. అనేక జాతులు అరుదుగా కనిపిస్తున్నాయి. అనేక దేశాల్లో, కొన్ని జాతులు చట్టబద్ధంగా సంరక్షించబడ్డాయి.
అయినప్పటికీ, చట్టరీత్యా ఏదో నిషేధించబడిందని చెప్పడం వలన ఏమీ ప్రయోజనం లేదు. మానవుడు తప్పనిసరిగా సృష్టిని గౌరవంగా చూసుకోవాలి. సృష్టికర్తయెడల, ఆయన సృష్టియెడల గౌరవం లోపించిన ప్రస్తుత, అపరిపూర్ణ విధానంలో, ప్రకృతి వర్ధిల్లుతుందని మనం నిరీక్షించం. క్రొత్త విధానం రానంతవరకు, నీతిమంతులైన ప్రజలు ప్రకృతి పొందికను ఆస్వాదించలేరు. (యెషయా 35:1) అప్పుడు, అనేక విధములైన ఆర్కిడ్‌లు వాటి విశేషతను బట్టి సరైన విధంగా మెచ్చుకోబడుతాయి.
[8,9వ పేజీలోని చిత్రాలు]
ఈ రెండు పేజీల్లో ఉన్న ఆర్కిడ్‌లు (1) ఇటలీ, (2) నెదర్‌లాండ్స్, (3) ఎత్తైన పచ్చిక మైదానాలు, (4) సున్నపు పచ్చికబయళ్ళు మరియు (5) అడవి పొదళ్ళనందలివి, (6) బటర్‌ప్లై ఆర్కిడ్