మీ జీవితం విసుగ్గా ఉందా? మీరు దాన్ని మార్చుకోగలరు!
స్పెయిన్‌లోని తేజరిల్లు! ప్రతినిధి
మార్గరెట్ మరియు బ్రెయిన్, తమ 50వ పడిలో ఉండగా తమకు ఒక సువర్ణావకాశం లభించింది: మంచి ఫించనుతో ముందుగా ఉద్యోగవిరమణ. ఇక వారు మధ్యదరా ప్రాంతంలోని సూర్యరశ్మి కొరకు మరియు సైకత తీరాలను చూడడానికి దక్షిణానికి వెళ్ళాలని తీర్మానించుకున్నారు. ఇక చీకూ, చింతలు లేవు—సముద్ర తీరాన కుటీరంలో వారికొరకు సుఖజీవితం వేచి ఉంది.
రెండు సంవత్సరాల తర్వాత ఆ కల చెదిరిపోయింది. బ్రెయిన్ యిలా వివరించాడు: “అది అంతా అర్థం లేనట్లుగా కనిపించింది—ఒక్కో రోజు గడుస్తున్న కొలది ఏమీ చేయడానికి లేదు. నిజమే, నేను ఈదుతాను, కొంచెం సేపు గోల్ఫ్ లేదా కొంచెం సేపు టెన్నిస్ ఆడతాను, వినేవారెవరైనా ఉంటే, ఆపకుండా మాట్లాడుతాను. దేన్ని గురించి? సాధారణ విషయాల గురించే.”
తన 20వ పడి తొలి దశలో ఉన్న గీసెలా అనే తల్లికి ఒక అందమైన చిన్న పాప ఉంది. మధ్యాహ్నం తల్లి, కూతురు అలవాటుగా పార్కుకు వెళ్తారు, అక్కడ కూతురు ఇసుక గుట్టల మీద సంతోషంగా ఇసుకను కుప్పలు చేస్తూ, ఇండ్లు కట్టి ఆడుకుంటూ పూర్తిగా నిమగ్నమవుతుంది. అదే సమయంలో, తల్లి, దగ్గరలో ఉన్న పార్క్‌లోని బెంచీ మీద కూర్చుని, తన చంటి పాపను గమనిస్తూ ఉంటుంది. నిజంగా గమనిస్తుందా? ఆమె అక్కడ కూర్చుని తన పోర్టబుల్ రేడియోను శ్రద్ధగా వింటుంది. తన సిగరెట్టు పొగలో తన చిన్న పాపను ఇక ఏమాత్రం చూడనే చూడలేదు. ఆమెకు ఏడ్పొచ్చేంతగా విసుగెత్తింది.
పదిహేడేండ్ల ఉన్నత పాఠశాల విద్యార్థియగు పీటర్ తన గదిలో తన చుట్టూ ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను పెట్టుకొని కూర్చుంటాడు. తన వీడియో ఆటల్లో ఒకదాన్ని ఆన్ చేస్తాడు. అదీ, తనకెంత మాత్రం ఆసక్తి కలిగించనిదే. అతడు ఇప్పటికే వంద సార్లు ఆ ఆట ఆడాడు. ఆ ఆటలో ఎలా నెగ్గాలో అతనికి ఇప్పటికే బాగా తెలుసు. ఏదైనా సంగీతం వినాలా? ఇప్పటికే, తాను డజన్ల సార్లు వినకుండా ఉన్న రికార్డులేమీ తన దగ్గర లేవు. తనకు చచ్చేంత విసుగొచ్చేసిందంటూ అతడిలా విలపిస్తున్నాడు: “ఏం చేయాలో నాకు తెలియదు.”
మీరు కాలయాపన చేస్తున్నారా?
ప్రతి ఒక్కరి జీవితం ఉల్లాసరహితంగాను, నిరుత్సాహంగాను ఉండదనడం నిశ్చయం. అనేకులు కొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా, తమ సృజనాత్మక అభిరుచులను తృప్తిపరచుకోవడం ద్వారా ఇతరులతోను మరియు దేవునితోను మంచి సంబంధాలను వృద్ధిచేసుకోవడం ద్వారా సఫలతను పొందుతూ సంతోషకరమైన, ఇప్పటికీ, అర్థవంతమైన జీవితాలను గడుపుతున్నారు.
అయినప్పటికీ, విసుగు అన్ని తరహాల ప్రజలను బాధిస్తుంది—ప్రతి ముగ్గురు జర్మనీవారిలో ఒకరిని అది బాధిస్తుందని ఇటీవల జరిపిన ఎన్నిక తెలియజేస్తుంది. తాము నివసిస్తున్న నగరంలోని ప్రసిద్ధమైన అన్ని వినోద స్థలాలకు ఎడతెగక వెళ్తుండే ఉత్సుకతగల యుప్పీ ప్రజలు, సంగీతంతోను, చౌకబారు బీరుతోను కాలయాపన చేసే నిరుద్యోగులైన యువకులు, దూరదర్శినిని తిలకిస్తూ వారాంతాలను వృథా చేసే మధ్యవయస్కులైన శ్రామికులు, ఆఫీసును వదిలి పెట్టిన తర్వాత ఏదో కోల్పోయినట్లు భావించే అధికారులు—అందరూ ఒకే ఫిర్యాదుతో బాధపడుతున్నారు: విసుగు.
పురాతన తత్త్వవేత్తలు దీన్ని టైడ్యూమ్ వీటై (లాటిన్లో జీవిత అలుపు) అని పిలిచారు. జర్మనీలో దీన్ని లోంజ్వెయిలా (ఎంతో సమయం) అంటారు. సమయం నెమ్మదిగా వెళ్ళడం, పనికి అర్థం లేనట్లు కనిపించడం, “వీటన్నింటినుండి పారిపోవాలని” అనిపించడం, విసుగుకు సాధారణమైన సూచనలు.
ధనవంతులు కూడా మినహాయించబడలేదు. ఐశ్వర్యవంతుల విలాస జీవిత విధానాన్ని వర్ణించిన తర్వాత, టైమ్ పత్రికలో రాగర్ రాజెన్బ్లాట్ ఈ విధంగా అభిప్రాయపడ్డాడు: “ప్రపంచంలోని అనేక మంది ఐశ్వర్యవంతులు పెద్ద ఇండ్లను, పెద్ద తోటలను పెద్ద జంతువులను సంపాదించుకుని, పార్టీలకు వెళ్ళి, ప్రముఖులతో పరిచయం పొందిన తర్వాత ఏమని ప్రకటిస్తున్నారు? వాళ్ళు విసిగిపోయారని. విసిగిపోయారు.”
విసుగుకు, ఎక్కువ విశ్రాంతి తీసుకోవడమే విరుగుడని ఒకప్పుడు అనుకొనబడింది. పని స్థలాల్లో సానుభూతిని చూపించడం, గతంలోని యాంత్రికమైన, కష్టమైన పనిని అంతం చేయడం, మరియు కావలసినంత ఖాళీ సమయం ఉండడం, సగటు మానవుని జీవితాన్ని ప్రతిఫలదాయకంగా మార్చుతాయని ఊహించబడింది. దురదృష్టమేమంటే, అదంత సరళమైనది కాదు. ఈ విశ్రాంతి సమయమంతటితో ఏమి చేయాలో తీర్మానించుకోవడం అనుకున్నదానికన్నా మరింత కష్టతరమని తేలింది. అనేకులు వారమంతా, ఆనందభరితమైన వారాంతం కొరకు ఆతురతతో ఎదురు చూస్తారు, అది వచ్చినప్పుడు, అది తాము అనుకున్నంత ఆనందదాయకమేమీ కాదని వారు తెలుసుకుంటారు.
విసుగు యొక్క ప్రతికూల ఫలితాలు
విసుగు నుండి తప్పించుకోడానికి, కొందరు మరీ విపరీత కార్యాల్లో మునుగుతారు. కొందరు తప్పనిసరై పనికి దాసులయ్యారు, ఎందుకంటే, ఆఫీసు నుండి వచ్చిన తర్వాతి సమయంలో ఏమి చేయాలో వారికి తెలియదు. కొందరు తమ విసుగును మద్యంతో తగ్గించుకోవాలని చూస్తారు లేదా మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తూ, ఉల్లాసం కొరకు అన్వేషిస్తారు. వినోద లోకంలో తీరికలేని అనేకమంది తారలు శూన్యభావాన్ని ఎదుర్కోడానికి, కరతాళధ్వనులతో తమ కార్యక్రమం ముగిసిన తర్వాత, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తారు. కౌమార ప్రాయంలోని అవివాహిత తల్లుల సంఖ్య పెరుగుతూ ఉండడానికి విసుగు ఒక కారణం అని చెప్పబడింది. వారిలో చాలా మంది, తమకు ఒక బిడ్డ ఉంటే తమ అర్థరహిత జీవితాలు సార్థకమౌతాయని అనుకొని ఉండవచ్చు.
విసుగు, పెరుగుతున్న నేరాల సంఖ్యతో కూడా ముడిపెట్టబడింది. అనేక మంది యౌవనస్థులు 16 ఏండ్ల ప్రాయంలో పాఠశాలను ముగిస్తారు, వారికి చేయడానికి పని ఏమీ ఉండదు, ఉద్యోగం చేస్తున్న తమ తోటివారితో తమను పోల్చుకునే పశ్చిమ ఐరోపా నిరుద్యోగులు, “ఆత్మహత్య చేసుకొనే సాధ్యత ఎక్కువ ఉందని, మాదక ద్రవ్యాలకు దాసులయ్యే అవకాశం ఎక్కువ ఉందని, వివాహం కాకుండానే గర్భం ధరించడానికి ఎక్కువ ఇష్టపడతారని, నియమాన్ని ఉల్లంఘించడానికి ఎక్కువ మొగ్గు చూపించవచ్చని,” టైమ్ పత్రిక అభిప్రాయపడింది. “పనిలేని చేతులకు చేయడానికి సాతాను కొన్ని ప్రమాదకరమైన పనులను కనుగొంటున్నాడు,” అనే పాత సామెత ఎంతో సరైనదని ఇది మరొకసారి రూఢిచేస్తుంది.—ఎఫెసీయులు 4:28 పోల్చండి.