మేము హిట్లర్ యుద్ధానికి మద్దతునివ్వలేదు
ఫ్రాంజ్ వోల్‌ఫార్ట్ చెప్పింది
నా తండ్రి అయిన గ్రెగర్ వోల్‌ఫార్ట్, మొదటి ప్రపంచ యుద్ధ సమయమందు (1914 నుండి 1918 వరకు) ఆస్ట్రియా సైన్యంలో పనిచేసి, ఇటలీకి విరుద్ధంగా పోరాడారు. మొత్తం లక్షలాదిమంది ఆస్ట్రియా మరియు ఇటలీ వారు హతమార్చబడ్డారు. ఆ అనుభవాన్ని గూర్చిన ఘోరకృత్యాలు, మతం మరియు యుద్ధాన్ని గూర్చిన నాన్న ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చి వేశాయి.
ఆస్ట్రియా మత గురువులు సైన్యాలను ఆశీర్వదించడాన్ని నాన్న చూశారు, మరో వైపున ఉన్న ఇటలీ మత గురువులు కూడా అదే చేస్తున్నారని ఆయన తెలుసుకున్నారు. అందుకని ఆయనిలా అడిగారు: “యితర కాథోలిక్‌లను చంపాలని కాథోలిక్ సైనికులు ఎందుకు పురికొల్పబడుతున్నారు? క్రైస్తవులు ఒకరికి విరుద్ధంగా మరొకరు యుద్ధం చేయవచ్చా?” మత గురువులవద్ద సంతృప్తిదాయకమైన జవాబులేదు.
నాన్న ప్రశ్నలకు జవాబులు
యుద్ధం తర్వాత నాన్న వివాహం చేసుకుని, ఇటలీ యుగోస్లావియాల సరిహద్దులవద్ద, ఆస్ట్రియా పర్వతాలలో స్థిరపడ్డారు. ఆరుగురి పిల్లల్లో మొదటివాడినైన నేను, అక్కడ 1920లో జన్మించాను. నేను ఆరు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, కొన్ని మైళ్ల దూరంలో తూర్పుకు, పర్యటనా కేంద్రమైన పోర్ట్‌షాక్‌కు దగ్గరగా వున్న సెయింట్ మార్టిన్‌కు మేము వెళ్లాము.
మేము అక్కడ నివసిస్తున్నప్పుడు, యెహోవాసాక్షుల పరిచారకులు (అప్పుడు బైబిలు విద్యార్థులని పిలువబడే వారు) నా తలిదండ్రులను సందర్శించారు. మరి 1929లో వాళ్లు అభ్యుదయం నిశ్చయము (ఆంగ్లం) అనే చిన్నపుస్తకాన్ని యిచ్చి వెళ్లారు, అది నాన్నకున్న అనేక ప్రశ్నలకు జవాబిచ్చింది. సాతాను, దయ్యం అని పిలువబడే అదృశ్య పరిపాలకునిచే ప్రపంచం అదుపు చేయబడుతుందని అది బైబిలు నుండి చూపించింది. (యోహాను 12:31; 2 కొరింథీయులు 4:4; ప్రకటన 12:9) ఈ ప్రపంచ మతం, రాజకీయం, మరియు వ్యాపారంపై అతను కలిగున్న ప్రభావమే, మొదటి ప్రపంచ యుద్ధంలో నాన్న చూసిన ఘోరాలకు కారణము. చివరకు నాన్న వెదుకుతుండిన జవాబులను ఆయన కనుగొన్నారు.
ఉత్సాహవంతమైన పరిచర్య
నాన్న వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ నుండి ప్రచురణలను ఆర్డరు చేసి వాటిని తన బంధువులకు, తర్వాత యింటింట పంచిపెట్టడం ప్రారంభించారు. కేవలం 20 సంవత్సరాలే ఉన్న హాన్స్ స్టోషియర్ అనే పక్కింటి అబ్బాయి, త్వరలోనే నాన్నతోపాటు యింటింటి పరిచర్యలో పాల్గొన్నాడు. కొద్దికాలానికి, మా బంధువుల్లో ఐదుగురు కూడా సాక్షులయ్యారు—నాన్న అన్న అయిన ఫ్రాంజ్, ఆయన భార్య ఆన్, తర్వాత వాళ్ల అబ్బాయి ఆంటన్, నాన్న చెల్లి అయిన మారియా, ఆమె భర్త హెర్‌మాన్.
మా చిన్న గ్రామమైన సెయింట్ మార్టిన్‌లో యిది ఎంతో కోలాహలాన్ని రేపింది. పాఠశాలవద్ద ఒక విద్యార్థిని మా కాథోలిక్ బోధకున్ని యిలా అడిగింది, “ఫాదర్ లోయిగే, వోల్‌ఫార్ట్ వాళ్లు ఆరాధిస్తున్న యెహోవా అనే ఈ క్రొత్త దేవుడెవరు?”
“అది కాదు పిల్లలు, ఆయన క్రొత్త దేవుడు కాదు. యెహోవా అంటే యేసుక్రీస్తు తండ్రి. ఆ దేవునిపై ప్రేమతో వాళ్లు ఆ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారంటే అదెంతో మంచి విషయం” అని గురువు జవాబిచ్చాడు.
మా నాన్న రాత్రి ఒంటి గంటకు, బైబిలు ప్రచురణలు మోసుకుని ఒక సాండ్‌విచ్ తీసుకుని బయల్దేరడం నాకు జ్ఞాపకముంది. ఆరు లేక ఏడు గంటల తర్వాత, ఇటలీ సరిహద్దువద్ద తన ప్రకటనా ప్రాంతంలోని సుదూర ప్రదేశాన్ని ఆయన చేరుకుంటారు. తక్కువ దూరాలకు నేను ఆయన వెంట వెళ్లేవాన్ని.
తాను బహిరంగ పరిచర్య చేస్తున్నప్పటికీ, నాన్న తన స్వంత కుటుంబ ఆత్మీయ అవసరతలను అలక్ష్యం చేయలేదు. నాకు దాదాపు పదేళ్లున్నప్పుడు, ఆయన దేవుని వీణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఉపయోగించి, మా ఆరుగురితో వారపు క్రమ బైబిలు పఠనాన్ని ప్రారంభించారు. ఇతర సమయాల్లో ఆసక్తిగల పొరుగువారు, బంధువులతో మా యిల్లు నిండిపోయేది. త్వరలోనే 26 మంది రాజ్య ప్రచారకులుండే సంఘం మా చిన్న పట్టణంలో ఏర్పడింది.
హిట్లర్ అధికారానికి వస్తున్నాడు
హిట్లర్ 1933లో జర్మనీనందు అధికారానికి వచ్చాడు, దాని తర్వాత వెంటనే యెహోవాసాక్షులను హింసించడం అధికమైంది. చెకోస్లొవాకియా, ప్రేగునుందు 1937లో నాన్న ఒక సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వారు రాబోయే హింసను గురించి హెచ్చరింపబడ్డారు, అందుకని తాను తిరిగి వచ్చినప్పుడు, హింసల కొరకు సిద్ధపడమని నాన్న మమ్మల్ని అందరినీ పురికొల్పారు.
ఈ మధ్యలో, 16 సంవత్సరాల వయస్సప్పుడు, యిళ్లకు రంగులేసే శిక్షణార్థి పెయింటర్‌గా నేను పని చేయడం ప్రారంభించాను. నేను అనుభవంగల పెయింటర్‌తో కలిసి నివసిస్తూ, వర్తక పాఠశాలకు హాజరయ్యేవాన్ని. నాజీ గుంపును తప్పించుకోడానికని జర్మనీనుండి పారిపోయి వచ్చిన పెద్ద వయస్కుడైన ఒక మత గురువు, పాఠశాలలో మతపర బోధనా తరగతిని నిర్వహించాడు. “హెయిల్ హిట్లర్!” అని పిల్లలు ఆయనకు నమస్కారం చేసినప్పుడు, ఆయన అయిష్టపడి, యిలా అడిగాడు: “మన విశ్వాసంలో ఉన్న లోపమేమిటి?”
నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, యేసు తన అనుచరులు అందరూ సహోదరులని ఆయన చెప్పాడు గనుక, కాథోలిక్‌లు “యువర్ ఎమినెన్స్” మరియు “హోలీ ఫాదర్” అన్న బిరుదులను ఎందుకు ఉపయోగిస్తారు అని నేను ఆయనను అడిగాను. (మత్తయి 23:8-10) అలా చేయడం తప్పని, బిషప్పు ఎదుట వంగి అతని చేతిని ముద్దు పెట్టుకోడానికి నిరాకరించినందుకు తాను కూడా చిక్కుల్లో పడ్డానని ఆ మతగురువు ఒప్పుకున్నాడు. తర్వాత నేనిలా అడిగాను: “చర్చి ఆశీర్వాదంతో తోటి కాథోలిక్‌లను చంపడం ఎలా సాధ్యమౌతుంది?”
“అది ఎంతో అవమానకరమైన విషయం! అది మళ్లీ యింకెప్పుడూ జరుగ కూడదు. మనం క్రైస్తవులం, యుద్ధంలో చర్చి జోక్యం చేసుకోకూడదు,” అని ఆ మతగురువు నొక్కి చెప్పాడు.
మార్చి 12, 1938నందు హిట్లర్ సైన్యాలు ఎదురు లేకుండా ముందుకుసాగి ఆస్ట్రియాలోకి వచ్చి, కొద్ది కాలానికే దాన్ని జర్మనీలో ఒక భాగంగా చేసుకున్నాయి. చర్చీలు వెంటనే అతనికి తమ మద్దతునిచ్చాయి. వాస్తవానికి, వారంకంటే తక్కువ వ్యవధిలోపే, కార్డినల్ తియోడర్ యినీట్జర్‌తో సహా, ఆస్ట్రియాకు చెందిన ఆరుగురు బిషప్పులు, రాబోయే ఎన్నికల్లో, “నాజీ సైనిక దళానికి వోటు వేయడం, జర్మనీ వారిగా, బిషప్పులుగా మనకున్న జాతీయ కర్తవ్యమని” సూచిస్తున, ఎంతో అనుకూల దృక్పథం కలిగున్న ఒక “సత్యనిష్ఠాప్రకటన”పై సంతకం చేశారు. (పేజి 9 చూడండి.) వియన్నాలో గొప్ప విందు ఏర్పాటు చేయబడింది, అక్కడ హిట్లర్‌కు నాజీ పద్ధతిలో సెల్యూట్ చేసిన వారిలో కార్డినల్ యినిట్జర్ మొదటివాడు. ఆ స్వస్తికా పతాకాన్ని ఎగురవేయాలని, తమ గంటలను మ్రోగించాలని, నాజీ నియంత కొరకు ప్రార్థించాలని, ఆస్ట్రియాలోని అన్ని చర్చీలకు కార్డినల్ ఆజ్ఞ జారీ చేశాడు.
ఆస్ట్రియాలో రాజకీయ పరిస్థితి అకస్మాత్తుగా మారిపోయింది. స్వస్తికా చేతి పట్టీలను ధరించుకుని, నశం రంగు దుస్తులను ధరించిన సైనికులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చారు. “హెయిల్ హిట్లర్!” అని చెప్పడానికి నిరాకరించిన కొద్దిమంది మత గురువుల్లో, చర్చి యుద్ధాల్లో పాల్గొనకూడదని యింతకు పూర్వం చెప్పిన మతగురువు కూడా ఉన్నాడు. తర్వాతి వారంలో కొత్త మతగురువు ఆయన స్థానంలో వచ్చాడు. అతను తన కాళ్లను నేలకు గట్టిగా కొట్టి శబ్దం చేస్తూ, సెల్యూట్ చేయడానికి తన చేతిని పైకెత్తి, “హెయిల్ హిట్లర్!” అని అనటమే, తరగతిలోకి వచ్చిన తర్వాత అతను చేసిన మొదటి పని.
లొంగిపోవాలన్న ఒత్తిడి
నాజీల ఒత్తిడి అందరిపై ఎక్కువగా ఉండేది. నేను ప్రజలకు “హెయిల్ హిట్లర్”కు బదులు “గూటెన్ టేగ్” (నమస్కారం) అని చెప్పినప్పుడు వారికి నాపై కోపం వచ్చేది. గెస్టపోకు నన్ను గురించి సుమారు 12 సార్లు ఫిర్యాదు చేయబడింది. ఒకసారి నాజీ సైనికుల గుంపు, నేను సెల్యూట్ చేయకపోతే, హిట్లర్ యువత ఉద్యమంలో చేరకపోతే, నన్ను కాన్సంట్రేషన్ క్యాంపుకు పంపుతామంటూ, నేను కలిసి ఉంటున్న మాస్టర్ పెయింటర్‌ను బెదిరించారు. నాజీలకు మద్దతునిచ్చేవాడైన ఆ పెయింటర్, నేను తుదకు మారతానని అతనికి పూర్తి నమ్మకం ఉంది గనుక నాతో ఓపిక వహించమని వారినడిగాడు. నేను మంచిగా పని చేయగల వాడిని గనుక నన్ను వదులుకోడం తనకు యిష్టం లేదని అతను వివరించాడు.
నాజీలు అధికారంలోకి రావడంతో, రాత్రుల్లో చాలా సమయం వరకూ సైనిక కవాతులు జరిగేవి, ప్రజలు వెర్రిఆవేశంలో బిగ్గరగా నినాదాలను పలికేవారు. హిట్లర్, గోబెల్స్ మరియు యితరుల ప్రసంగాలు ప్రతి రోజు రేడియోలో మారు మ్రోగేవి. మతగురువులు హిట్లర్‌ను క్రమంగా ఆశీర్వదించి, అతని కొరకు ప్రార్థించడంతో, హిట్లర్‌కు కాథోలిక్ చర్చి లోబడటం మరీ ఎక్కువైంది.
దృఢ నిశ్చయం చేసుకుని, యెహోవాకు నా జీవితాన్ని సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవలసిన అవసరాన్ని గురించి నాన్న నాకు జ్ఞాపకం చేశారు. బైబిలు సత్యాలపట్ల దృఢమైన తీర్మానాన్ని చేసుకున్న, మా పక్కింటి హాన్స్ చెల్లి అయిన, మారియా స్టోసియర్‌ను గురించి కూడా ఆయన నాకు చెప్పారు. నేను మారియా వివాహం చేసుకోవాలని అనుకున్నాము, ఆమెకు ఆత్మీయంగా ప్రోత్సాహకరంగా ఉండమని నాన్న నన్ను పురికొల్పారు. ఆగస్టు 1939లో నేను మారియా ఆమె అన్న చేత బాప్తిస్మం తీసుకున్నాము.
నాన్న మాదిరికరమైన యథార్థత
మర్నాడు నాన్న సైనిక సేవ చేయడానికి పిలువబడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన అనుభవించిన కష్టాల వలన పాడైన ఆయన ఆరోగ్యం, యుద్ధంలో పాల్గొనకుండా ఆయనను నివారించి ఉండేదే, అయినా తాను కాథోలిక్‌గా ఉన్నప్పుడు చేసినట్లు యిప్పుడు క్రైస్తవునిగా యుద్ధంలో ఎన్నటికీ పాల్గొననని నాన్న ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వారికి చెప్పారు. అలా అన్నందుకు ఆయనపై యింకా తదుపరి దర్యాప్తు చేయబడింది.
రెండు వారాల తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభిస్తూ జర్మనీ పోలండ్‌పై దండెత్తినప్పుడు, ఆయన వియాన్నాకు కొనిపోబడ్డారు. ఆయన అక్కడ ఉంచబడినప్పుడు, యితర సాక్షులు హిట్లర్‌కు మద్దతు యివ్వకపోడానికి నాన్న బాధ్యుడని, అందుకని నాన్నను చంపివేయాలని ఆరోపిస్తూ మా జిల్లా మేయరు ఉత్తరం వ్రాశాడు. తత్ఫలితంగా, నాన్న బెర్లిన్‌కు పంపబడ్డారు మరియు దాని తర్వాత వెంటనే శిరచ్ఛేదం కావించబడడానికి శిక్ష విధింపబడింది. మొవాబిట్ జైలులో రాత్రింబవళ్లు గొలుసులతో బంధింపబడి ఉండేవారు.
ఈ మధ్యలో, మీ నమ్మకమైన మాదిరిని అనుకరించాలని మేమందరమూ నిశ్చయించుకున్నామని చెబుతూ, నాన్నకు కుటుంబమంతటి తరపున నేను ఉత్తరం వ్రాశాను. నాన్న సాధారణంగా భావోద్రేకమైన వ్యక్తి కాదు, అయితే ఆయన మాకు వ్రాసిన చివరి ఉత్తరంపై కన్నీటి చారికలను చూసి ఆయన ఎలా భావించారో మేము తెలుసుకోగలిగాము. మేము ఆయన నిర్ణయాన్ని అర్థం చేసుకున్నామని ఆయనెంతో సంతోషించారు. మా అందరి పేర్లను వ్యక్తిగతంగా ప్రస్తావించి, నమ్మకంగా ఉండమని మమ్మల్ని పురికొల్పుతూ, ఆయన ప్రోత్సాహకరమైన మాటలను వ్రాశారు. పునరుత్థానాన్ని గూర్చిన ఆయన నిరీక్షణ ఎంతో దృఢంగా ఉండినది.
నాన్న కాకుండా, యింకా దాదాపు రెండు డజన్లమంది యితర సాక్షులు బెర్లిన్ జైలులో ఉంచబడ్డారు. హిట్లర్ ఉన్నత శ్రేణి అధికారులు, తమ విశ్వాసాన్ని వదలుకోమని వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు కాని సఫలత పొందలేదు. డిశంబరు 1939నందు దాదాపు 25 మంది సాక్షులు చంపబడ్డారు. నాన్న చంపబడడాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, మరణం వరకు నమ్మకంగా ఉండడానికి నాన్నకు శక్తిని యిచ్చినందుకు తాను యెహోవాకు ఎంత కృతజ్ఞత కలిగుందో అమ్మ వ్యక్తం చేసింది.
నా పరీక్షలు మొదలయ్యాయి
కొన్ని వారాల తర్వాత, నేను పని చేయడానికి పిలువబడ్డాను అయితే అక్కడ ముఖ్యంగా చేయవలసినది సైనిక సంబంధమైన పనని నేను త్వరలోనే తెలుసుకున్నాను. నేను సైన్యంలో పని చేయనని, అయితే వేరే పనేదైనా చేస్తానని నేను వివరించాను. అయితే, నాజీ పోరాట గీతాలను పాడడానికి నేను నిరాకరించినప్పుడు, అధికారులు కోపోద్రిక్తులయ్యారు.
మర్నాటి ఉదయం మాకివ్వబడిన సైనిక దుస్తులకు బదులు నేను మామూలు బట్టలు ధరించుకొని కనిపించాను. నన్ను చెరసాలలో వేయడం తప్ప తనకు మరో మార్గం లేదని చార్జిలో ఉన్న అధికారి చెప్పాడు. నేనక్కడ బ్రెడ్డు నీళ్లతో జీవనం సాగించాను. జెండా వందన ఉత్సవం ఉంటుందని, అందులో పాల్గొనడానికి నిరాకరిస్తే నేను కాల్చి చంపబడడానికి దారి తీస్తుందని నాకు తర్వాత హెచ్చరిక యివ్వబడింది.
శిక్షణా మైదానంలో 300 మంది సిపాయిలు అలాగే సైనిక అధికారులు ఉన్నారు. అధికారులకు, స్వస్తికా పతాకానికి ప్రక్కగా నడుస్తూ, హిట్లర్ సెల్యూట్ చేయాలని వారు నాకు ఆజ్ఞాపించారు. ముగ్గురు హెబ్రీయులను గురించిన బైబిలు వృత్తాంతం నుండి ఆత్మీయ బలాన్ని పొంది, నేను అక్కడినుండి వెళ్తూ కేవలం “గూటెన్ టాగ్” (నమస్కారం), అని మాత్రమే చెప్పాను. (దానియేలు 3:1-30) నేను మళ్లీ తిరిగి వెళ్ల వలసిందిగా నాకు ఆజ్ఞ యిచ్చారు. ఈసారి నేనేమి చెప్పలేదు, చిన్నగా నవ్వానంతే.
ఆ నలుగురు అధికారులు నన్ను చెరసాలలోకి వెనక్కి తీసుకువచ్చినప్పుడు, నేను కాల్చివేయబడతానని వాళ్లు ఊహించారు గనుక వాళ్లు ఎంతో వణికిపోయారని నాకు చెప్పారు. “మేము ఒక వైపు భయపడుతుంటే నువ్వేమో చిరునవ్వు నవ్వుతున్నావు. నీకు అదెలా సాధ్యమయ్యింది?” అని వారు నన్ను అడిగారు. తమకు నాకుండినంత ధైర్యం ఉండివుంటే బాగుండునని తాము భావించామని అన్నారు.
కొన్ని రోజుల తర్వాత, బెర్లిన్‌లోని హిట్లర్ ప్రధాన కార్యకేంద్రం నుండి వచ్చిన ఒక ఉన్నతాధికారి అయిన డా. అల్మెండింగర్ శిబిరానికి వచ్చాడు. నేను అతని యెదుటకు పిలువబడ్డాను. చట్టాలు చాలా కఠినంగా మారాయని అతను నాకు వివరించాడు. “నువ్వు ఎటువంటి కష్టాలను ఎదుర్కోబోతున్నావో నీకు తెలియదు,” అని అతను చెప్పాడు.
“ఆహా, నాకు బాగా తెలుసు, యిదే కారణాన్నిబట్టి కేవలం కొన్ని వారాల క్రితమే నా తండ్రి శిరచ్ఛేదం కావించబడ్డాడు,” అని నేను జవాబిచ్చాను. అతనెంతో నిర్ఘాంతపోయి, మౌనుడయ్యాడు.
తర్వాత బెర్లిన్‌నుండి మరొక ఉన్నతాధికారి వచ్చాడు, నా మనస్సు మార్చడానికి తదుపరి ప్రయత్నాలు జరుపబడ్డాయి. నేను దేవుని చట్టాన్ని ఎందుకు ఎదిరించనో విన్న తర్వాత, ఆయన నా చేతిని పట్టుకుని, తన కళ్ల వెంట కన్నీటి వరద వస్తుంటే, యిలా చెప్పాడు: “నేను నీ ప్రాణాన్ని కాపాడాలని యిష్టపడుతున్నాను!” మమ్మల్ని చూస్తున్న అధికారులందరూ ఎంతో చలించారు. నన్ను మళ్లీ చెరసాలలోకి తీసుకు వెళ్లారు, నేను అక్కడ మొత్తం 33 దినాలు గడిపాను.
శ్రమలు మరియు ఖైదు
మార్చి 1940లో నేను ఫర్స్‌టెన్‌ఫిల్ట్‌లోని జైలుకు మార్చబడ్డాను. కొన్ని రోజుల తర్వాత నాకు ప్రధానం చేయబడిన మారియా, నా తమ్ముడైన గ్రెగర్ నన్ను దర్శించారు. గ్రెగర్ నాకంటే కేవలం ఒకటిన్నర సంవత్సరాలే చిన్నవాడు, పాఠశాలయందు వాడు బైబిలు విషయాల్లో దృఢ నిశ్చయతను తీసుకున్నాడు. యెహోవాను సేవించడమే మనకున్న ఏకైక లక్ష్యమని చెబుతూ, హింసకొరకు సిద్ధంగా ఉండమని అతడు మా చిన్న తమ్ముళ్లను పురికొల్పడం నాకు జ్ఞాపకముంది! ఒకరినొకరం ప్రోత్సహించుకోడానికి గడిపిన ఆ విలువైన గంట సమయంలోనే నేను అతన్ని సజీవంగా చివరిసారిగా చూశాను. తర్వాత, క్రాట్జ్‌లో నాకు ఐదేళ్ల కఠిన శ్రమ శిక్ష విధించబడింది.
మరి 1940 ఆకులురాలే కాలంలో, చెకోస్లవాకియాలోని శ్రామిక శిబిరానికి వెళ్లే రైలులో నన్ను ఎక్కించారు, కాని నన్ను వియన్నాలో దింపేసి అక్కడి జైలులో ఉంచారు. పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నేను ఆకలి బాధ అనుభవించడమే కాక, రాత్రుల్లో పెద్ద నల్లులు, రక్తంకారి మంట కలిగేంతగా నా చర్మాన్ని కుట్టేవి. నాకు తెలియని కారణాన్నిబట్టి నన్ను క్రాగ్జ్‌లోని జైలుకు పంపించారు.
యెహోవాసాక్షులు పరలోక పునరుత్థానాన్ని పొందడానికి మరణ శిక్షను యిష్టపడే మతమూఢ త్యాగజీవులని గెస్టపో వివరించాడు గనుక నా విషయంలో ఆసక్తి ఉంది. తత్ఫలితంగా, యేసుతోపాటు పరిపాలించడానికి కేవలం 1,44,000 మంది వ్యక్తులు మాత్రమే పరలోకానికి తీసుకోబడతారని వివరిస్తూ, క్రాగ్జ్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన ఒక విద్వాంసుడు, ఎనిమిదిమంది విద్యార్థుల యెదుట రెండు రోజులపాటు మాట్లాడగల చక్కని అవకాశం నాకు లభించింది. (ప్రకటన 14:1-3) భూమిపై పరదైసు పరిస్థితిలో నిత్యజీవాన్ని ఆనందించడమే నా నిరీక్షణయని నేను చెప్పాను.—కీర్తన 37:29; ప్రకటన 21:3, 4.
రెండు రోజులు ప్రశ్నించిన తర్వాత, ఆ విద్వాంసుడు యిలా అన్నాడు: “నీ రెండు కాళ్లూ భూమ్మీదే ఉన్నాయన్న ముగింపుకు నేను వచ్చాను. నీవు చనిపోయి పరలోకానికి వెళ్లాలన్నది నీ కోరికకాదు.” యెహోవాసాక్షులను హింసించడాన్ని గురించి అతను తన దుఃఖాన్ని వ్యక్తం చేసి, నాకు మేలు జరగాలని ఆశించాడు.
మరి 1941 తొలి భాగంలో, జర్మనీలోని రోల్‌వాల్ట్ కఠిన శ్రమ శిబిరానికి వెళ్లే రైలులో నేనున్నాను.
కఠినమైన శిబిర జీవితం
రోల్‌వాల్ట్, ఫ్రాంక్‌ఫర్ట్ మరియు డార్మ్‌స్టాడ్ట్ పట్టణాల మధ్యలో ఉంది, అందులో దాదాపు 5,000 మంది ఖైదీలు ఉన్నారు. హాజరు పిలవడంతో ఉదయం 5:00 గంటలకు ప్రతి దినం ప్రారంభమయ్యేది, అధికారులు ఖైదీల జాబితాను తీరికగా సరిచేయడానికి యించుమించు రెండు గంటలు పట్టేది. మేము కదలకుండా నిలబడాల్సి ఉంటుంది, పూర్తి నిశ్చలంగా నిలబడనందుకు అనేకమంది ఖైదీలు బాగా దెబ్బలు తిన్నారు.
పిండి, రంపపుపొట్టు, మరియు తరచుగా కుళ్లిపోయి ఉండే బంగాళాదుంపలతో చేసిన బ్రెడ్డే మాకు నాస్తాగా యివ్వబడేది. తర్వాత, వ్యవసాయం కొరకు పొలంలోని నీళ్లను బయటకు తీయడానికి, కాలువలు త్రవ్వేందుకు చిత్తడి నేలలో పనిచేయడానికి మేము వెళ్లాము. సరైన బూట్లు లేకుండా చిత్తడి నేలలో రోజంతా పనిచేసిన తర్వాత, మా కాళ్లు స్పాంజిల్లా ఉబ్బేవి. ఒకసారి నా కాళ్లలో కొరుకుడు పుండు వంటిది వచ్చింది, నా కాళ్లను తీసేయాల్సి వస్తుందేమోనని నేను భయపడ్డాను.
మధ్యాహ్నం పని స్థలంలో, సూప్ అని పిలువబడేదాని పరిశోధనాత్మక మిశ్రమం మాకు యివ్వబడేది. దాంట్లో దుంపలు లేక కాబేజి, కొన్నిసార్లు చనిపోయిన జంతువుల పాతిపెట్టబడిన కళేబరాలను పొడిచేసి కలిపేవారు. మా నోళ్లు, గొంతులు మండేవి, మాలో చాలామందికి పెద్ద కురుపులు వచ్చాయి. సాయంత్రం మాకు యింకా ఎక్కువ “సూప్” యిచ్చేవారు. అనేకమంది ఖైదీల పళ్లు ఊడిపోయాయి, కాని పళ్లను బలంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను గురించి నాకు చెప్పబడింది. నేను దేవదారు చెక్క చిన్న ముక్కను లేక హేజల్ కొమ్మలను నమిలే వాన్ని, అందువల్ల నేను నా పళ్లను పోగొట్టుకోలేదు.
ఆత్మీయంగా బలంగా ఉండటం
నేను నా విశ్వాసాన్ని కోల్పోయేలా చేసే ప్రయత్నంగా, యితర సాక్షులతో కలవకుండా గార్డులు నన్ను ఒంటరిగా ఉంచారు. నావద్ద బైబిలు సాహిత్యాలు లేనందుకు, ‘మన పూర్ణహృదయంతో యెహోవాయందు నమ్మకముంచమని’ మనల్ని పురికొల్పుతున్న సామెతలు 3:5, 6, యెహోవా ‘మనం సహింపగలిగినంతకంటె ఎక్కువగా మనల్ని శోధింపబడనియ్యడని’ వాగ్దానం చేస్తున్న 1 కొరింథీయులు 10:13 వంటి, నాకు జ్ఞాపకమున్న లేఖనాలను గుర్తుచేసుకునే వాన్ని. అటువంటి లేఖనాలను నా మనస్సులో ధ్యానించుకోడం ద్వారా, ప్రార్థనలో యెహోవాపై ఆధారపడటం ద్వారా, నేను బలపర్చబడ్డాను.
కొన్నిసార్లు మరొక శిబిరంనుండి తీసుకు రాబడుతున్న సాక్షిని నేను చూడగలిగేవాన్ని. మాకు మాట్లాడుకునే అవకాశం లేనప్పుడు, తల ఊపడం లేక పిడికిలి బిగించిన చేతిని పైకెత్తడం ద్వారా దృఢంగా ఉండమని మేము ఒకరినొకరం ప్రోత్సహించుకునే వాళ్లము. అప్పుడప్పుడు మారియా నుండి, అమ్మ దగ్గరనుండి నాకు ఉత్తరాలు వచ్చేవి. ఒక దాంట్లో నా ప్రియ తమ్ముడైన గ్రెగర్ మరణాన్ని గురించి, మరో దాంట్లో యుద్ధం అంతమౌతున్నప్పుడు, మారియా అన్నయైన హాన్స్ స్టోషియర్ చంపబడడాన్ని గురించి నేను తెలుసుకున్నాను.
తర్వాత, ఒక ఖైదీ మా శిబిరానికి బదిలీ చేయబడ్డాడు, అతను బెర్లిన్‌లోని మెయాబిట్ జైలులో గ్రెగర్‌తో కలిసి ఉన్నాడు, అతనికి గ్రెగర్ తెలుసు. జరిగిన దాన్ని గూర్చిన వివరాలను నేను అతనినుండి తెలుసుకున్నాను. గ్రెగర్ ఉరితీసి చంపబడాలని శిక్ష విధించబడింది, కాని అతను తన యథార్థతను కోల్పోయేలా చేసే ప్రయత్నంలో, చంపకముందు రివాజుగా ఉండే కొంతకాల వ్యవధి నాల్గునెలలకు హెచ్చించబడింది. అతను రాజీపడేలా చేయడానికి ఆ సమయంలో అన్ని రకాలైన వత్తిళ్లు అతనిపైకి తీసుకురాబడ్డాయి—అతని కాళ్లు, చేతులకు బరువైన గొలుసులు వేశారు, అతనికి అప్పుడప్పుడు మాత్రమే తిండి పెట్టబడేది. అయినప్పటికీ, అతనెప్పుడూ తొనకలేదు. అతను తన జీవితం యొక్క చివరిగడియ అయిన మార్చి 14, 1942 వరకు నమ్మకంగా ఉన్నాడు. ఆ వార్తనుబట్టి దుఃఖపడినా, ఏది ఎదురైనా యెహోవాకు నమ్మకంగా ఉండాలని నేను దాని ద్వారా బలపర్చబడ్డాను.
నా తమ్ముళ్లైన క్రిస్టియన్, విల్లీబాల్ట్ మరియు నా చెల్లెళ్లైన ఏడా, ఆన్‌లు జర్మనీలోని లాండావు పట్టణమందలి సంస్కరణ గృహంగా ఉపయోగింపబడుతున్న కాన్వెంటుకు తీసుకుపోబడ్డారని కూడా నేను కొద్ది కాలానికి తెలుసుకున్నాను. హెయిల్ హిట్లర్ అనడానికి నిరాకరించినందుకు మగపిల్లలను తీవ్రంగా కొట్టారు.
సాక్ష్యమివ్వడానికి అవకాశాలు
నేను నివసిస్తుండిన బారకులలో ఎక్కువమంది రాజకీయ ఖైదీలు, నేరస్థులు. నేను సాయంత్రాలు వాళ్లకు సాక్ష్యమిస్తూ గడిపేవాన్ని. ఒకతను యెహన్ లిస్ట్ అనే పేరుగల, కాఫెన్‌బెర్గ్ నుండి వచ్చిన కాథోలిక్ మత గురువు. బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్‌లో విన్న సంగతులను గురించి తన సంఘంతో మాట్లాడినందుకు అతను జైలులో వేయబడ్డాడు.
యోహన్‌కు కఠినమైన శారీరక పని అలవాటు లేదు గనుక అతనికి ఎంతో కష్టంగా ఉండేది. అతను మంచి వ్యక్తి, అతను మళ్లీ చిక్కుల్లో పడకుండా నేను అతని పనిని కూడా కొంచెం చేసేవాన్ని. తాను క్రైస్తవ నియమాలకు హత్తుకున్నందుకు కాక రాజకీయ కారణాలను బట్టి ఖైదు చేయబడినందుకు తను సిగ్గుపడుతున్నానని అతను చెప్పాడు. “నీవు క్రైస్తవునిగా యథార్థంగా శ్రమలు అనుభవిస్తున్నావు,” అని అతనన్నాడు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత అతను విడుదల చేయబడినప్పుడు, మా అమ్మను, మారియాను సందర్శిస్తానని అతను వాగ్దానం చేశాడు, అతను ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు.
నా జీవితం మెరుగవుతుంది
మరి 1943 చివరి భాగంలో, కార్ల్ స్టూంప్ అనే పేరుగల తెల్ల జుట్టున్న కొత్త శిబిర కమాండరు వచ్చి, పరిస్థితిని మెరుగుపర్చడం ప్రారంభించాడు. అతని భవనానికి రంగు వేయవలసి ఉంది, నేను వృత్తి పరంగా పెయింటర్‌ను అన్న విషయం అతనికి తెలిసినప్పుడు, ఆ పని నాకు అప్పగించబడింది. చిత్తడి నేలలో పనిచేయడం నుండి నేను అప్పుడే మొదటిసారిగా బయటకు పిలువబడ్డాను.
యెహోవాసాక్షుల్లో ఒకరిగా నేను కలిగి వున్న విశ్వాసాన్నిబట్టి నేనక్కడ ఉన్నానని ఆమె భర్త వివరించినా, నేనెందుకు జైలులో పెట్టబడ్డానో అర్థం చేసుకోడం కమాండర్ భార్యకు చాలా కష్టం అయ్యింది. నేను బక్కచిక్కి ఉన్నందుకు ఆమె నాపై జాలిపడి నాకు ఆహారాన్ని యిచ్చింది. నేను శారీరకంగా బలపడడానికి ఆమె నాకు ఎక్కువ పనులను కల్పించింది.
మరి 1943 చివరి భాగంలో, యుద్ధరంగంలో పోరాడడానికి శిబిరాల్లోని ఖైదీలు పిలువబడుతూ ఉండినప్పుడు, కమాండర్ స్టూంప్‌తో నాకుండిన మంచి సంబంధం నన్ను రక్షించింది. యుద్ధంలో పాల్గొనడం ద్వారా రక్తాపరాధిని అవ్వడానికి బదులు నేను మరణ శిక్షను అనుభవించగలనని నేను అతనికి వివరించాను. నేను వహించిన తటస్థ వైఖరి అతన్ని కష్టతరమైన పరిస్థితిలో పడవేసినా, పిలువబడిన వారి పేర్ల పట్టికలోనుండి అతను నా పేరును తీసేయగలిగాడు.
యుద్ధం యొక్క చివరి దినాలు
మరి 1945 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో, క్రిందగా ఎగురుతున్న అమెరికా విమానాలు, యుద్ధం అంతం కాబోతుందని చెబుతున్న కరపత్రాలను పడవేయడం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించాయి. నా ప్రాణాలను రక్షించిన కమాండర్ స్టూంప్, నాకు మాములు దుస్తులు యిచ్చి, తన భవంతిలో దాగుకొనడానికి వీలు కల్గించాడు. శిబిరాన్ని వదిలి వెళ్తూ, నేను తీవ్రమైన గలిబిలిని చూశాను. ఉదాహరణకు, యుద్ధరంగపు దుస్తులు, పరికరాలు ధరించిన పిల్లల మొహాలలో కన్నీళ్లతో అమెరికా వారి ముందునుండి పారిపోతున్నారు. నేను ఎస్‌ఎస్ అధికారుల కంటబడితే, నేనెందుకు తుపాకీ పట్టుకోలేదని వారు ఆలోచిస్తారని భయపడి నేను శిబిరానికి తిరిగి వెళ్లాలని తీర్మానించుకున్నాను.
త్వరలోనే మా శిబిరం అమెరికా సైనిక దళాలచేత చుట్టుముట్టబడింది. మరి 1945 మార్చి 24న, శ్వేత పతాకాలను ఎగురవేసి, మా శిబిరం లొంగిపోయింది. శిబిరంలో యితర సాక్షులు ఉన్నారని, చంపబడకుండా వారు కూడా కమాండర్ స్టూంప్ చేత రక్షింపబడ్డారని తెలుసుకుని నేనెంత ఆశ్చర్యపోయానో! ఒకరినొకరం కలుసుకుని మేమెంత ఆనందించామో! కమాండర్ స్టూంప్ జైలులో వేయబడినప్పుడు, మాలో అనేకులం అతని పక్షంగా అమెరికా అధికారులకు వ్యక్తిగతంగా, ఉత్తరం ద్వారా సాక్ష్యమిచ్చాము. తత్ఫలితంగా, మూడు రోజుల తర్వాత అతను విడిపించబడ్డాడు.
స్వతంత్రంగా వెళ్లడానికి అనుమతింపబడిన దాదాపు 5,000 మంది ఖైదీల్లో నేనే మొదటి వాడినని తెలుసుకోడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత, నేను కల కంటున్నానేమో అని భావించాను. నన్ను సజీవంగా కాపాడినందుకు ప్రార్థన ద్వారా నేను యెహోవాకు ఆనందబాష్పాలతో, కృతజ్ఞతలు చెప్పుకున్నాను. దాదాపు ఆరు వారాల తర్వాత, 1945 మే 7 వరకూ జర్మనీ లొంగిపోలేదు.
నేను విడుదల అయినప్పుడు, ఆ ప్రాంతంలోని యితర సాక్షులతో వెంటనే సంబంధాన్ని ఏర్పరచుకున్నాను. ఒక బైబిలు పఠన గుంపు ఏర్పర్చబడింది, ఆ తర్వాతి వారాల్లో శిబిరం చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలకు సాక్ష్యమివ్వడంలో నేను అనేక గంటలు గడిపాను. అదే సమయంలో, పెయింటర్‌గా నేను ఉద్యోగాన్ని కూడా సంపాదించాను.
మళ్లీ యింటికి వెళ్లడం
జూలైలో నేను ఒక మోటర్‌సైకిల్ కొనగలిగాను, అప్పుడు యింటికి సుదూర ప్రయాణం ప్రారంభమైంది. రహదారిలోని అనేక వంతెనలు పేల్చివేయబడ్డాయి గనుక, ప్రయాణానికి అనేక దినాలు పట్టింది. చివరకు నేను సెయింట్ మార్టిన్‌లో వున్న యింటికి వచ్చినప్పుడు, దారిలో వస్తుండగా మారియాను గోదుమల పొలంలో పంటకోస్తుండగా నేను చూశాను. ఆమె నన్ను చివరకు గుర్తుపట్టిన తర్వాత, పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ ఆనందమయమైన కలయికను మీరు ఊహించగలరు. అమ్మ తన కొడవలి క్రింద పడేసి తాను కూడా పరుగెత్తుకుంటూ వచ్చింది. మరి 49 ఏళ్ల తర్వాత, 96 సంవత్సరాల వయస్సులో అమ్మ యిప్పుడు అంధురాలు. అయినప్పటికీ ఆమె మనస్సు యింకా చురుకుగా ఉంది, ఆమె యెహోవా యొక్క నమ్మకమైన సాక్షిగా కొనసాగుతుంది.
మరి 1945 అక్టోబరులో నాకు మారియాకు వివాహం జరిగింది, ఆ తర్వాతి సంవత్సరాల్లో మేము యెహోవాను కలిసి సేవించడంలో ఎంతో ఆనందించాము. మేము ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు, ఆరుగురు మనుమలతో ఆశీర్వదించబడ్డాము, వాళ్లందరు యెహోవాను ఉత్సాహంగా సేవిస్తున్నారు. ఈ సంవత్సరాల్లో నేను అనేకమంది ప్రజలు బైబిలు సత్యాల కొరకు దృఢంగా నిలబడడానికి సహాయం చేశానన్న సంతృప్తి నాకు లభించింది.
సహించడానికి ధైర్యం
ఒక యౌవనస్థునిగా మరణాన్ని భయం లేకుండా ఎలా ఎదుర్కోగలిగావని నన్ను అనేకసార్లు అడిగారు. మీరు యథార్థంగా ఉండాలని తీర్మానించుకుంటే సహించడానికి యెహోవా దేవుడు శక్తినిస్తాడని—నిశ్చింతగా ఉండండి. ప్రార్థన ద్వారా ఆయనపై ఆధారపడడాన్ని ఒకరు ఎంతో త్వరగా నేర్చుకుంటారు. నా స్వంత తండ్రి మరియు తమ్మునితో సహా యితరులు మరణం వరకూ నమ్మకంగా సహించారని తెలుసుకోడం నేను కూడా యథార్థంగా ఉండడానికి సహాయం చేసేందుకు తోడ్పడింది.
యెహోవా ప్రజలు యుద్ధంలో ఒక పక్షం వహించకపోవడం కేవలం ఐరోపాలో మాత్రమే జరగలేదు. గత 1946లో న్యూరెంబర్గ్ శ్రమల సమయమందు, హిట్లర్ ఉన్నతాధికారుల్లో ఒకతను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో యెహోవాసాక్షుల హింసను గురించి ప్రశ్నింపబడిన విషయం నాకు జ్ఞాపకముంది. అమెరికాలోని వేలకొలది మంది యెహోవాసాక్షులు, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తాము కలిగున్న తటస్థత విషయమై అమెరికా జైళ్లలో ఉన్నారని నివేదిస్తున్న ఒక వార్తల క్లిప్పింగ్‌ను తన జేబులోనుండి అతను తీశాడు.
వాస్తవానికి నిజమైన క్రైస్తవులు, తన జీవితంలోని చివరి గడియ వరకు యథార్థంగా నిలిచిన యేసుక్రీస్తు మాదిరిని ధైర్యంగా అనుకరిస్తారు. మరి 1930 నాటి సెయింట్ మార్టిన్‌లోని మా చిన్న సంఘమందలి 14 మంది సభ్యుల గురించి ఈ రోజు వరకూ నేను తరచుగా ఆలోచిస్తాను. వారికి దేవునిపట్ల తమ తోటి మానవులపట్ల ప్రేమ ఉన్నందుకు హిట్లర్ యుద్ధానికి మద్దతునివ్వడానికి నిరాకరించి, ఆ కారణం చేత చంపబడ్డారు. దేవుని నూతన లోకంలో జీవాన్ని నిరంతరం ఆనందించడానికి వారు తిరిగి రప్పించబడినప్పుడు అదెంత గొప్ప కలయికగా ఉంటుంది!
[8వ పేజీలోని చిత్రం]
మా నాన్న
[8,9వ పేజీలోని చిత్రాలు]
క్రింద మరియు ఎడమవైపు: జర్మనీ సామ్రాజ్యానికి మద్దతునిస్తూ, కార్డినల్ యినిట్జెర్ వోటు వేయడం
కుడివైపు: ‘జర్మనీ సామ్రాజ్యానికి వోటు వేయడం తమ జాతీయ ధర్మమని’ ఆరుగురు బిషప్పులు తీర్మానించిన “సత్యనిష్ఠాప్రకటన”
[క్రెడిట్ లైను]
UPI/Bettmann
[10వ పేజీలోని చిత్రం]
నాకు మారియాకు 1939లో ప్రధానం జరిగింది
[13వ పేజీలోని చిత్రం]
మా కుటుంబం. ఎడమ నుండి కుడికి: గ్రెగర్ (శిరచ్ఛేదం కావించబడ్డాడు), ఆనీ, ఫ్రాంజ్, విల్లీబాల్డ్, ఏడా, గ్రెగర్ (నాన్న, శిరచ్ఛేదం కావించబడ్డారు), బార్‌బారా (అమ్మ), మరియు క్రిస్టియన్
[15వ పేజీలోని చిత్రం]
నేడు మారియాతో