బైబిలు ఉద్దేశము
“బలహీనమైన ఘటము”—స్త్రీలకు అవమానమా?
“స్త్రీలను వారి అనుభవాన్ని, సామర్థ్యాన్ని, తెలివినిబట్టి గాక వారి లింగాన్ని బట్టి ఎందుకు తీర్పుతీరుస్తారు?”—బెట్టి ఎ.
“స్త్రీలు వారు అల్పమైన మనుషులని తలంచులాగున నేర్పబడుతున్నారు.”—లిన్ హెచ్.
“బలహీనమైన ఘటము” అను బైబిలు పదము స్త్రీల గౌరవాన్ని తగ్గిస్తుందా? చర్చలో ఉన్న బైబిలు వచనమైన 1 పేతురు 3:7 ఇలా చెబుతుంది: “అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.”
పేతురు తోటి క్రైస్తవులకు ఈ మాటలను వ్రాసినప్పుడు, ప్రాచీన అన్య లోకంలోనే కాక మతభ్రష్ట యూదా సమాజమందు కూడ, స్త్రీలకు అతి తక్కువ హక్కులు వుండేవి. పేతురు మరి తొలి క్రైస్తవులు స్త్రీలనుగూర్చి అప్పుడు ప్రబలివున్న దృష్టిని సిఫారసుచేసారా?
అల్పమైన ఘటాలా?
“బలహీనమైన ఘటము” అనే పదమును ఉపయోగించిన పేతురు మాటలను తొలిశతాబ్ద పాఠకులు ఎలా అర్థంచేసుకున్నారు? ఘటమునకు గ్రీకు పదము (స్కూవస్) గ్రీకు లేఖనాలలో అనేక మార్లు ఉపయోగించబడింది మరి అది వివిధమైన పాత్రలను, పనిముట్లను, ఉపకరణములను మరి సాధనములను సూచిస్తుంది. స్త్రీలను “బలహీనమైన ఘటము” అని పిలుచుటలో, పేతురు స్త్రీలను అగౌరవపర్చడం లేదు, ఎందుకనగా పురుషుడు కూడ సున్నితమైన లేక బలహీనమైన ఘటమని ఆ ఉచ్చారణ భావము. “మంటి ఘటాలు” అని (2 కొరింథీయులు 4:7) మరి “కరుణా పాత్ర ఘటములు” అని (రోమా 9:23) స్త్రీ పురుషులిరువురిని సూచించుటలో ఇతర బైబిలు లేఖనాలు అలంకారిక దృష్టాంతాలను వాడాయి. నిజమే, స్త్రీలు “బలహీనమైన” లింగములని పేతురు వర్ణిస్తున్నాడు. కాని రోమా 5:6 “బలహీనము” అనేది మానవులందరికి, స్త్రీకి మరి పురుషునికి వర్తించే రీతిగా ఉపయోగిస్తుంది. కనుక, తొలి క్రైస్తవులు “బలహీనమైన ఘటము” అనే పదాన్ని స్త్రీలకు అగౌరవమైనదానిగా భావించి ఉండకపోవచ్చు.
బదులుగా, స్త్రీల స్థితిని ఉన్నత పరుస్తున్నట్లుగా పేతురు మాటలు దృష్టింపబడి వుండెడివి. పేతురు దినాలలో స్త్రీలను గౌరవించడమనేది అరుదై యుండెను. దేవుడు చాలాకాలం ముందే జరుగబోయే దానిని గ్రహించినరీతిగా, పురుషులు తరచు వారి భార్యలపై శారీరకంగా, లైంగికంగా, మరి భావోద్రేకపరంగా దురాచారము జరిపి అధికారము చెలాయించారు. (ఆదికాండము 3:16) పురుషులకు లోక సమాజమిచ్చిన శక్తిని దుర్వినియోగము చేయకూడదని క్రైస్తవ భర్తలకు పేతురు యొక్క సలహా సూచించినది.
మనము “బలహీనమైన” అనే పదాన్ని లోతుగా పరిశీలిద్దాము. ఈ లేఖనములో పేతురు, భావోద్రేక లక్షణాలు కాదు కాని, భౌతిక లక్షణాలను సూచిస్తున్నాడు. పురుషులు బలహీన ఘటాలు, అయితే వారితో పోల్చినప్పుడు స్త్రీలు బలహీనమైన ఘటాలు. అదెలా? ఎముకలు, కండరాల నిర్మాణమువంటివాటిలో సాధారణంగా పురుషులు అధిక భౌతిక శక్తిని కలిగివున్నారు. అయినప్పటికిని, పేతురు నైతిక, ఆత్మీయ, లేక మానసిక శక్తిని సరిపోలుస్తున్నట్లు యే సూచన లేదు. నిజంగా, సంఘటనలకు ప్రతిస్పందించే విషయంలో, స్త్రీలు పురుషులకంటే బలహీనమైన వారు లేక బలమైనవారు అని చెప్పేదానికంటే, వారు విభిన్నంగా ఉన్నారని చెప్పడం సరైనది. స్థిరమైన నైతిక స్వభావము, సహనము, వివేచన కలిగి దేవుని మార్గాన్ని అనుసరించిన స్త్రీలైన శారా, దెబోరా, రూతు, ఎస్తేరు వంటి కొద్ది మందిని గూర్చి బైబిలు వివరిస్తున్నది. వినయంగల పురుషులు, స్త్రీలు తమ కన్నా ఎక్కువ తెలివి కలిగియుండ గలరని గుర్తించడం కష్టంగా భావించరు.
ఏమైనను, స్త్రీలను “బలహీనమైన” వారిగా సూచించుటలోని భావము వారు అల్పమైన వ్యక్తులని కొందరు విశ్వసిస్తారు. కాని ఈ ఉదాహరణను ఆలోచించండి. ఒక వ్యక్తి రెండు ఉపయోగకరమైన పాత్రలను కలిగి వున్నాడు. ఒకటి గట్టిది, మరొకటి అంత గట్టిదికాదు. రెండవ పాత్ర గట్టిగా లేనందు వల్ల దాని విలువను తక్కువగా గుర్తిస్తారా? నిజానికి, గట్టిదాని కన్నా గట్టిగాలేనిదానిని సాదారణంగా ఎక్కువ శ్రద్ధతోను మరి గౌరవముతోను ఉపయోగిస్తారు. అందువల్ల, స్త్రీ పురుషుని కన్నా తక్కువ భౌతిక శక్తిని కల్గివున్నందుకు ఆమెకు తక్కువ విలువనిస్తారా? నిశ్చయంగా అలా కాదు! స్త్రీలను చులకనచేయుటలేదు కాని, వారి గౌరవమును కాపాడటానికి, “బలహీనమైన ఘటము” అనే పదాన్ని పేతురు ఉపయోగిస్తున్నాడు.
“అటువలెనే . . . జ్ఞానము చొప్పున”
“అటువలెనే జ్ఞానము చొప్పున వారితో [వారి భార్యలతో] కాపురము చేయుడి” అని పేతురు పురుషులను ఉద్బోధించాడు. “అటువలెనే” అనేది ఎవరిని? పేతురు దానికి ముందున్న వచనాలలో క్రీస్తు తన అనుచరుల యెడల చూపిన ప్రేమగల శ్రద్ధను చర్చిస్తూ, “అటువలెనే” వారి భార్యల యెడల శ్రద్ధ కల్గివుండాలని అయన పురుషులకు ఉపదేశించాడు. (1 పేతురు 2:21-25; 3:7) క్రీస్తు ఎల్లప్పుడు తన శిష్యుల క్షేమాన్ని మరి ఆసక్తులను తన స్వంత వ్యక్తిగత కోరికలు ఇష్టాలకంటే ముందు ఉంచాడు. అయన వారి హద్దులను దృష్టిలోకి తీసుకొని వారి ఆత్మీయ, భౌతిక క్షేమములో ఆసక్తి కల్గివుండెను. “అటువలెనే” వారి భార్యల యెడల ప్రవర్తించుటకు, పురుషులు క్రీస్తు యొక్క ప్రేమగల మాదిరిని అనుసరించవలెను.
సుఖవంతమైన వివాహము అకస్మాత్తుగా సంభవించేది కాదు. భార్య భర్తలిరువురు విజయవంతమైన వివాహానికి ఎలా తోడ్పడాలో తెలుసుకోవాలి. కనుక, “జ్ఞానము చొప్పున” వారి భార్యలతో కాపురము చేయాలి అని పురుషులకు పేతురు సలహా యిస్తున్నాడు. యెహోవా మరి ఆయన కుమారుడైన, యేసు క్రీస్తు స్త్రీలతో ఎలా వ్యవహరించారనేది పురుషులు అభ్యాసము చేయాలి. వారు వారి భార్యలను ఎలా ఆదరించాలని దేవుడు కోరుతున్నాడో వారు తెలుసుకోవాలి.
అదనంగా, పురుషులు వారి భార్యలను బాగుగా తెలుసుకోవలసిన అవసరముంది—వారి భావాలను, శక్తులను, హద్దులను, యిష్టాలను మరి అయిష్టాలను తెలుసుకోవాలి. వారి భార్యల యొక్క తెలివిని, అనుభవమును మరి ఆత్మాభిమానమును ఎలా గౌరవించాలో వారు తెలుసుకోవాలి. బైబిలు ఇలా చెబుతుంది: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.”—ఎఫెసీయులు 5:25, 28, 29.
వారికి ఘనత నివ్వండి
పేతురు స్త్రీలను “బలహీనమైన ఘటము” అని సూచించేటప్పుడు, పురుషులు వారిని “సన్మానించాలని” కూడా తెలియజేసాడు. గ్రీకులో, టైమ్ అనే నామవాచకము ఘనత, గౌరవము, విలువ, అమూల్యత అనే భావాన్ని తెలియజేస్తుంది. ఇతర మాటల్లో, సన్మానించడమనేది కేవలం వారిపై దయచూపించడం కాదుగాని వారు దానిని పొందనర్హులని గుర్తించడము. స్త్రీలకు మరి పురుషులకు, క్రైస్తవులందరికి పౌలు యిలా ఉపదేశించాడు: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.”—రోమీయులు 12:10.
యెహోవా దేవుడు నిజంగా స్త్రీలను కేవలం ప్రదర్శనబొమ్మలుగా పరిగణించడు. ఇశ్రాయేలులో వ్యభిచారము, రక్తసంబంధులతో లైంగిక సంబంధాన్ని కల్గివుండడము, జంతువుల వలన అపవిత్రతను కలుగజేసుకొనడం, మరి ఇతర నేరాల అపరాధాన్ని కల్గివున్న స్త్రీపురుషులిరువురికి దేవుని ఆజ్ఞలు సమానముగా వర్తించేవి. (లేవీయకాండము 18:6-17, 23, 29; 20:10-12) విశ్రాంతిదినములు, నాజీరులను నడిపించు ఆజ్ఞలు, పండుగలు, మరి అనేక ఇతర ఆజ్ఞల ఏర్పాట్ల ప్రయోజనాల్ని స్త్రీలు అనుభవించేవారు. (నిర్గమకాండము 20:10; సంఖ్యాకాండము 6:2; ద్వితీయోపదేశకాండము 12:18; 16:11, 14) తల్లిని అలాగే తండ్రిని సన్మానించి వారికి విధేయత చూపవలసియుండెను.—లేవీయకాండము 19:3; 20:9; ద్వితీయోపదేశకాండము 5:16; 27:16; సామెతలు 1:8.
సామెతలు 31వ అధ్యాయంలోని 10 నుండి 31 వచనాలు నమ్మకముగల, కష్టపడి పనిచేయునట్టి, మరి తన అనేక బాధ్యతలను చూసుకొనుటలో జ్ఞానముగల “ఒక గుణవతియైన భార్యను” సన్మానిస్తుంది. కుటుంబ పనులు చేయుటలో, మరి ఇతర ఆర్థిక విషయాలలో తన పాత్రను గూర్చి ఆమె సరిగా గుర్తింపబడింది. స్త్రీలను కేవలం భూషణములుగా తలంచే కొద్ది మంది పురుషుల స్వభావము ఎంత భిన్నమైనది! తరువాత, తొలి క్రైస్తవ సంఘములో, స్త్రీలు క్రీస్తు సాక్షులుగా పరిశుద్ధాత్మవలన అధికారాన్ని పొందారు. (అపొస్తలుల కార్యములు 1:14, 15; 2:3, 4; యోవేలు 2: 28, 29.పోల్చండి) ఇంకను, పురుషులకు, స్త్రీలకు, మరి దేవదూతలకును పరలోక న్యాయాధిపతులుగా కొద్ది మంది స్త్రీలు ఉండుటకు నియమింపబడిరి. (1 కొరింథీయులు 6:2, 3) నిజమే, స్త్రీలను సంఘ కూటములో బోధింపనివ్వలేదు; అయినప్పటికిని, క్రైస్తవ స్త్రీలు ప్రార్థించగల్గిన లేక ప్రవచింపగల్గిన సందర్భాలనేవి ఉండినవి. యౌవన స్త్రీలకు, పిల్లలకు, మరి సంఘం వెలుపలి వారికి బోధకురాల్లుగా ఉండుటకు వారిని నియమించారు.—మత్తయి 24: 14; 1 కొరింథీయులు 11:3-6; తీతుకు 2:3-5; కీర్తనలు 68:11 పోల్చండి.
వారికి ఘనత నివ్వండని పేతురు చెప్పినప్పుడు అయన మనస్సులో ఉన్నదేమిటో సూచించేది 2 పేతురు 1:17 నందు కనుగొనబడింది. “ఈయన నా ప్రియకుమారుడు” అని ఇతరుల సముఖమందు తెల్పుతు అయన యెడల తన అంగీకారాన్ని వ్యక్తపర్చడంచేత అక్కడ యెహోవా యేసును సన్మానించాడని మనము చదువుతాము. అదేవిధంగా, ఒక భర్త తన భార్యను సన్మానిస్తున్నాడని బహిరంగంగా మరి ఏకాంతంగా క్రియలచేత చూపించాలి.
జీవిత భాగస్వాములు
చరిత్రంతటిలో, పురుషులు తరుచుగా స్త్రీలను సన్మానించడానికి లేక గౌరవించడానికి తక్కువ యోగ్యతగలవారిగా దృష్టించారు—ఒక దాసిగా, లేక కేవలం పురుషులను సంతోషపరచు ఒక సాధనంగా పరిగణించారు. స్త్రీలను సన్మానించడమనే క్రైస్తవ భావము నిజంగా వారిని గౌరవము యొక్క ఉన్నతస్థాయికి చేరుస్తుంది. బార్‌నెస్ నోట్స్ ఆన్ ది న్యూ టెస్ట్‌మెంట్ పేతురు ఇచ్చిన సలహా “స్త్రీ జాతి సంబంధంగా ప్రాముఖ్యమైన సత్యాన్ని కల్గివుందని గమనిస్తుంది. క్రైస్తవ విధానంలో తప్ప, మరి ఇతర మత విధానాలన్నిటిలో, స్త్రీ ప్రతివిషయంలో పురుషునికన్నా తక్కువ మాన్యతను పొందింది. క్రైస్తవత్వం బోధించేదేమంటె . . . మతం ఇచ్చే అన్ని నిరీక్షణలు, వాగ్దానాలకు ఆమె హక్కును కలిగివుంది. ఈ ఒక్క సత్యము స్త్రీ జాతిని ప్రతివిధమైన హీనస్థితినుండి పైకెత్తుతుంది మరి మానవజాతి యొక్క సగం సాంఘిక కీడులను వెంటనే అంతమొందిస్తుంది.”
స్త్రీ పురుషులిరువురిపై క్రీస్తు యాజమాన్యాన్ని కలిగి వున్నందున, భర్తలు వారి భార్యలను క్రీస్తు ఆస్తిగా భావించడానికి గంభీరమైన కారణమున్నది. స్త్రీలను “బలహీనమైన ఘటము” అని సూచించిన వెంటనే, పేతురు మాటలు ఇలా కొనసాగాయి: “జీవమను కృపావరములో. . .మీతో పాలివారైయున్నారని. . .మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు.” (1 పేతురు 3:7) ఒక భర్త తన భార్యతో తప్పుగా వ్యవహరిస్తున్నట్లైతే దేవునితో ఆయనకుగల సంబంధం పాడవుతుందని, ఆయన ప్రార్థనలకు అభ్యంతరము కలుగుతుందని పేతురు సూచించాడు.
“బలహీనమైన ఘటము” అనే పదము యే భావములోను స్త్రీలను అవమానపరచ నుద్దేశించలేదు. యెహోవా, ఇంటివారిపై శిరస్సుగా పురుషులను పెట్టినందున, పురుషులు స్త్రీలను అవమానపరచడమనేది ఆయన అంగీకరించడు. బదులుగా, ఆయన చెప్పునదేమంటే పురుషుడు, స్త్రీని ఎరిగి, ఆమెకు శ్రద్ధ గౌరవములనివ్వాలి.
వారిని అల్పమైన వ్యక్తులుగా చూడకుండా, స్త్రీలకు ఘనతనివ్వండని బైబిలు వివాహిత మరియు అవివాహిత పురుషుల కిరువురికి ఆజ్ఞాపిస్తుంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ, దేవున్ని పట్టుదలతో ఆరాధించే స్త్రీ పురుషులు దేవుని హస్తం నుండి గొప్ప ఆశీర్వాదములను పొందుతారు.—1 కొరింథీయులు 7:16 పోల్చండి. (g94 10/8)
[Picture Credit Line on page 26]
Miss G. E. K. / Artist: Alice D. Kellogg 1862-1900
Courtesy of Joanne W. Bowie