ప్రపంచ పరిశీలన
ఫుట్‌బాల్ పిచ్చి
ఇంగ్లాండునందలి ఫుట్‌బాల్ ప్రియులు కొందరు తమ ఫుట్‌బాల్ పిచ్చిని మరింత విపరీత ధోరణికి తీసుకువెళ్లారు: వారు చనిపోయిన తర్వాత, తమ చితాభస్మాన్ని తమకు ప్రియమైన జట్టు ఆడే మైదానంపై చల్లాలని కోరారు. ఓ ప్రముఖ జట్టు అలాంటి 25 విన్నపాలను ప్రతి సంవత్సరం అందుకుంటుంది. ఆ అలవాటు ఎంత వ్యాప్తిచెందిందంటే, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ అస్సోసియేషన్ ఈ మానవ అవశేషాలను ఎలా చిలకరించాలన్న విషయంపై ఫుట్‌బాల్ క్లబ్బులకు హెచ్చరికలను యివ్వవలసి వచ్చింది. ది మెడికల్ పోస్ట్ అనే పత్రిక ప్రకారం ఈ క్రింది సలహా అందులో ఉంది: “భస్మాన్నంతటినీ చిలకరించనవసరం లేదు. అక్కడక్కడ కొంత చిలకరిస్తే సరిపోతుంది. ఎక్కువ మొత్తం ఒకే దగ్గిర వేస్తే గడ్డి వడిలిపోతుంది. . . . చీపురుతో ఆ కొద్దిపాటి భస్మాన్ని అంతటా సమ పాళ్లలో చిమ్మండి.” (g94 10/8)
ఒక్క “దయ్యం” తక్కువయ్యింది
ఒక టోక్యో జంట వారికి పుట్టిన శిశువుకు అకుమ అనే పేరు పెట్టారు, దాని అర్థం “దయ్యం.” “దీని ప్రభావం ఎంతగా ఉంటుందంటే, ఒక్కసారి దీన్ని మీరు వింటే, ఎన్నడు మరువరు” అని ఆ తండ్రి అన్నాడు. “నా కొడుకు పెరిగినప్పుడు, అనేకమంది ప్రజలను కలవడానికి సహాయపడేదే ఈ పేరు.” స్థానిక అధికారులు మొదట ఆ పేరును నమోదు చేయడానికి అంగీకరించారు, కాని తరువాత తలిదండ్రుల హక్కులను దుర్వినియోగపరుస్తున్నారని, యిది అపహాస్యము బేధభావమును ఆహ్వానిస్తుందని చెబుతూ దానిని అంగీకరింపరానిదిగా కొట్టివేశారు. నెలలపాటు న్యాయస్థానాలలో హోరాహోరీ పోరాటం జరిగిన తరువాత, ఆ తలిదండ్రులు ఓడిపోయారు. ఇకపై ఏ ఆటంకాలు లేకుండ జీవించేందుకు తమ పిల్లవాడిని మరో పేరుతో నమోదు చేయిస్తామని చెప్పారు. ఇంట్లోని పరిస్థితులను మాత్రం అది మార్చలేకపోయింది. “మామూలుగా మేము వాడ్ని అకుమ అనే పిలుస్తూవుంటామని” ఆ తండ్రి చెప్పాడు, ఈ పేరుకే ఆ పిల్లవాడు పలుకుతాడు. (g94 9/22)
కోపమూ గుండెపోటు
“హృద్రోగమున్న ప్రజలు వారికి కోపం వచ్చినప్పుడు తమకు గుండెపోటు సంభవించే అపాయాన్ని రెండింతలు అధికం చేసుకుంటారు, అంతేకాదు ఆ అపాయం రెండు గంటలవరకు కొనసాగుతుంది,” అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక నివేదిస్తుంది. మునుపు జరిపిన పరిశీలనలు కోపానికి, గుండె కొట్టుకునే వేగంలో పెరుగుదలకు, రక్తపోటు, దమన సంకోచం మధ్య సంబంధాలను చూపించినప్పటికీ కోపం గుండెపోటుకు దారితీయవచ్చని చెప్పడంలో ఈ కొత్త పరిశీలన వైజ్ఞానిక రుజువులను అందించింది. భావోద్రేక వివాదాలు ఎదురైనప్పుడు నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించడం ద్వారా ఈ అపాయాన్ని తగ్గించవచ్చని ఆ పరిశీలనలో ప్రముఖ రచయితైన డా. మర్రె మిటిల్‌మ్యాన్ చెప్పారు. “గుండెపోటు అపాయాన్ని తగ్గించే ఆస్ప్రిన్ను తీసుకునే ప్రజలు, తమ కోపం వల్ల వచ్చే ప్రభావాలనుండి కొంత మేరకు రక్షించబడతారు” అని ఆ శీర్షిక చెప్పింది. దానికి కారణం, బహుశ ఆస్ప్రిన్ ప్లాట్‌లెట్‌లు గడ్డకట్టకుండా, రక్తనాళాల్లో సంకోచం ఏర్పడకుండా ఉండేందుకు సహాయపడతాయి. కనుక కోపమే ప్లాట్‌లెట్‌లపై ప్రభావం చూపిస్తుంది కాబోలు అని డా. మిటిల్‌మ్యాన్ చెప్పారు. (g94 9/22)
నిద్ర, కాన్‌టాక్ట్ లెన్సులు సరితూగవు
నిద్రించేటప్పుడెల్లా తమ కాన్‌టాక్ట్ లెన్సులను పెట్టుకునేవారు, అలా పెట్టుకోనివారికంటే ఎనిమిది రెట్లు అధికంగా కంటి జబ్బులకు గురికాగలరని యిటీవల జరిపిన ఒక పరిశీలనలో తేలింది. లెన్స్‌ను ఎంతో జాగ్రత్తగా, శుభ్రంగా ఉంచుకోవడం కూడా, రాత్రిపూట లెన్సులను ఉంచుకోవడం వల్ల కలిగే అధిక అపాయం నుండి కాపాడదు అని ఇన్‌టర్‌నాషనెల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నివేదించింది. ఏ రకమైన లెన్స్ అయినప్పటికీ, రాత్రంతా పెట్టుకుంటే కంటిపై ఉండే స్పష్టమైన పొరయైన కోర్నియాకు క్రిములు, సూక్ష్మజీవులు సోకేలా చేస్తుంది. పడుకొనే ముందు కాంటాక్ట్ లెన్సులను తీసి పడుకోవడంవల్ల, వాటిని పెట్టుకునేవారు కోర్నియాకు మంటను కల్గించగల అవకాశాన్ని 74 శాతం వరకు తగ్గించుకోగలరు. (g94 9/22)
ప్రదర్శనా లేక ఆరోగ్యమా?
“సహజంగా, తమ తమ అథెలెటిక్ ప్రదర్శనను వృద్ధిపర్చుకునే ఉద్దేశంతోనే వృత్తి క్రీడలు ఆడడం జరుగుతుంది” అని ఆర్తోపెడిస్ట్ అయిన విక్టర్ మట్సూడో చెప్పినట్లుగా వెజా అనే పత్రిక సూచించింది. “ఆరోగ్య దారుఢ్యం కొరకు అథిలిట్ కావల్సిన అవసరం లేదు.” వాస్తవానికి “సమతూకం లేకుండా వ్యాయామం చేసేవాడు సామాన్యుడికంటే ముందే చనిపోతాడు” అని డా. మట్సూడో చెప్పాడు. ఆయన యింకా యిలా అన్నాడు: “సరైన వ్యాయామమంటే చమటపట్టించేంత కష్టంగా, బాధకలిగించేదిగా ఉండాలి అనే అభిప్రాయాన్ని అనేకమంది యింకా కల్గివున్నారు. అది నిజంకాదు. సరైన వ్యాయామమంటే బాధనుగానీ, అసౌఖ్యాన్ని లేక తిమ్ముర్లను కలిగించకుండ సరైన తీవ్రతను కల్గివుండాలి. . . . సామాన్యుడైయుండి, మంచి శారీరక స్థితిని పొందాలనుకునే వారికి యివ్వబడే ప్రధమ సలహా నడక.” వారానికి రెండు లేక మూడుసార్లు, అంటే వారానికి అరగంట లేక గంట నడవడం ద్వారా మరణించే అవకాశాన్ని వ్యాయామం చేయని వ్యక్తి కంటే 15 శాతం వరకు తగ్గించుకోగలడు. అలా నడవడం పల్లపు రోడ్డుపై నడవాలనీ అదీ, మరొకరితో మాట్లాడగల్గి సులభంగా శ్వాస తీసుకునేందుకు అనుమతించే వేగంలో మాత్రమే నడవాలని డా. మట్సూడో సలహానిచ్చాడు. (g94 9/22)