యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేనెందుకు ఆ వ్యక్తిని గూర్చి తలంచకుండా ఉండలేకపోతున్నాను?
“మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు లైంగికతను గూర్చిన మీ జిజ్ఞాస మీకు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది, మీరు లైంగిక విషయాలను గూర్చి మరీ ఎక్కువగా తలపోస్తారు,” అని యౌవనస్థురాలైన లరేన్ వివరిస్తున్నది.
మీరు మేల్కొని ఉన్న సమయాల్లో, ఎక్కువసేపు ఆ వ్యక్తిని గూర్చి తలపోస్తూ, మాట్లాడుతూ, చూస్తూ గడుపుతారా? మధ్యాహ్నం చూసిన అందమైన అబ్బాయిని లేదా, సౌందర్యవతియైన అమ్మాయిని గూర్చిన తలంపులను పారద్రోలేందుకు మాత్రమే, హోమ్ వర్క్ పూర్తి చేయాలని కూర్చుంటున్నారా? దారిన వెళ్ళే అందమైన వారిని దొంగచూపులు చూస్తూ మీ సంభాషణను కొనసాగిస్తున్నారా? వ్యతిరేక లింగ వ్యక్తులను గూర్చి ఆలోచించడం ఆపలేనందు వల్లే, చదవడంలో, పఠించడంలో, క్రైస్తవ కూటాల్లో, సమావేశాల్లో కూడా ఏకాగ్రతను నిలపలేకపోతున్నారా?
అలాగైతే, మీరు పిచ్చివారైపోతున్నారని భయపడవచ్చు! ఒక యౌవనస్థుడు యిలా ఒప్పుకుంటున్నాడు: “నాకు లైంగిక పిచ్చి లేక వేరే ఏదో ఒకటుందని నేను అనుకుంటున్నాను. అంటే, నేను తరచూ అమ్మాయిలను గూర్చి తలస్తుంటాను, ఊహిస్తుంటాను . . . నేను మానసికంగా బాగున్నానని మీరనుకుంటున్నారా?” లిండా మాడెరస్ అనే రచయిత యిలా వ్రాస్తుంది, మీరు యౌవనస్థులుగా ఉన్నప్పుడు, “ప్రణయ భావాలు, లేక లైంగిక తలంపులు బలీయంగా ఉండగలవు. కొన్ని సార్లు, ప్రణయము, లైంగికత అనేవి మాత్రమే మీరు తలంచగలిగేవని మీకనిపించవచ్చు!”a
లైంగిక తలంపులు కలిగి ఉండడంలో చెడేమీ లేదు. స్త్రీ, పురుషులు పరస్పరం బలమైన ఆకర్షణ కలిగి ఉండే విధంగా దేవుడు వారిని సృష్టించాడు. వారు వివాహం చేసుకొని, నీతిమంతులైన పిల్లలతో ‘భూమిని నిండించాలనే’ ఆయన సంకల్పానికి యిది అనుగుణంగా ఉంది. (ఆదికాండము 1:28) వివాహిత దంపతులకు లైంగిక సంబంధాలు గొప్ప సంతోషానికి కారణం కాగలవని బైబిలు కూడా ఎంతో నిర్మొహమాటంగా చెబుతుంది.—సామెతలు 5:19.
సమస్య ఏంటంటే, అపరిపూర్ణ మానవులమైన మనం తరచూ మన భావోద్రేకాలను అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. (ఆదికాండము 6:5 పోల్చండి.) “శరీరాశ” అధిగమించలేనంత శక్తిమంతమైనదిగా ఉన్నట్లనిపిస్తుంది! (1 యోహాను 2:16) మీరు యౌవనస్థులు కాబట్టి, ముఖ్యంగా మీకు వ్యతిరేక లింగ వ్యక్తులను గూర్చి తలంచడాన్ని ఆపేయడం కష్టం కావచ్చు, ఎందుకని?
యౌవన దశలో వచ్చే ఒత్తిళ్ళు
ఒక కారణమేమంటే, లైంగిక కోరికలు ఉచ్ఛస్థాయికి చేరుకొనే “యుక్త వయస్సుకు” మీరు వస్తున్నారు. (1 కొరింథీయులు 7:36) డా. బెట్టి బి. యన్స్ యిలా వివరిస్తుంది: “యుక్త వయస్సులో హార్మోన్ల సంఖ్య అతి వేగంగా పెరుగుతుంది. పిల్లల దేహాన్ని పెద్దల దేహంగా మార్చే శారీరక మార్పులకు ఇవే కారణాలు. ఎక్కువవుతున్న హార్మోన్ల సంఖ్య పెద్దరికంతోపాటు, భావోద్రేకపరంగాను, ప్రవర్తనలోను మార్పులు తెస్తుంది.”
ఎలాంటి మార్పులు? పెద్ద మార్పుల్లో, వ్యతిరేక లింగ వ్యక్తుల యెడల గల భావాల్లోని మార్పులు తరచూ మిళితమై ఉన్నాయి. రూత్ బెల్ అనే రచయిత యిలా అంటున్నారు: “యుక్త వయస్సులోని శారీరక మార్పులు తరచూ తీవ్రమైన లైంగిక భావాలను కలిగిస్తాయి. మీరు లైంగికతను గూర్చి ఎక్కువగా తలుస్తున్నట్లు, మరింత సులభంగా లైంగికంగా రేకెత్తించబడుతున్నట్లు, కొన్నిసార్లు లైంగికతను గూర్చే తలుస్తున్నట్లు మీరే కనుగొనవచ్చు. పందొమ్మిదేళ్ళలోపు యౌవనస్థులు వీధిల్లో నడిచేటప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు, తమ శరీరమంతా లైంగిక ఉద్రేకంతో, ఉత్సాహంతో ఊగిసలాడుతున్నట్లు భావిస్తారు.” యౌవనస్థులు తప్పనిసరిగా పోరాడవలసిన అనేక “యౌవనేచ్ఛల్లో” వ్యతిరేక లింగ వ్యక్తులను గూర్చి తలంచడం ఒకటి.—2 తిమోతి 2:22.
వినిమయ సాధనాల ప్రభావం, స్నేహితుల ప్రభావం
అయినప్పటికీ, యీ కోరిక అనే జ్వాల, బాహ్య ప్రభావాల వలన కలుగుతుంది. టి.వి. కార్యక్రమాలు, ప్రకటనలు, పుస్తకాలు, పత్రికలు, సంగీతం, సినిమా మొదలగు వాటిద్వారా లైంగిక క్రియలను ప్రేరేపించాలనే తీర్మానంతో ఉన్న సమాజంలో మనం జీవిస్తున్నాం. లైంగిక దుర్నీతిలో పాల్గొన్న ఒక క్రైస్తవ యువకుడు యీ విధంగా నివేదిస్తున్నాడు: “పాఠశాలలో అశ్లీల సాహిత్యమనేది సర్వసాధారణమే, అది నిజంగా లైంగిక తృష్ణను కలిగిస్తుంది. ఏది సరైనదో నాకు తెలుసు, కాని నా లైంగిక తలంపులు చాలా బలీయంగా ఉండేవి.”
అందుకే, తల్లిదండ్రుల కొరకు రాయబడిన ఒక పుస్తకం యిలా చెబుతుంది: “వినిమయ సాధనాలు గొప్ప ప్రభావాన్ని [కలిగి] ఉన్నాయి. మన యౌవనస్థులు తమ వయస్సేవున్న యువ మోడల్స్ అశ్లీలంగా ప్రవర్తించడం, లైంగిక వస్త్రాలను అమ్మడం చూస్తున్నారు; వారు సినిమాలోను, దూరదర్శినిలోను కౌమార దశలోని వారి మధ్య జరిగే లైంగికతను రేకెత్తించడం చూస్తున్నారు.” నిజానికి, కేబుల్ టి.వి., వీడియో క్యాసెట్టు రికార్డులు, లైంగిక కార్యాలను వర్ణించే అశ్లీల సాహిత్యాన్ని సులభంగా యౌవనస్థులకు అందిస్తున్నాయి. ఒక యౌవనస్థుడు యిలా ఒప్పుకుంటున్నాడు, “యీ వినిమయ సాధనాలు యౌవనస్థుని జిజ్ఞాసను, కోరికను రేకెత్తిస్తాయి.”
అయినప్పటికీ, అసభ్యకరంగా ఉండేందుకు ఒక పుస్తకమంతా అశ్లీలంగా ఉండనవసరం లేదు. ఒక క్రైస్తవ అమ్మాయి అనుభవాన్ని తలంచండి. ఆమె యిలా గుర్తు చేసుకుంటుంది: “నేను ఒక మంచి పుస్తకాన్ని చదువుతున్నాను. దాంట్లో ఒకటి రెండు పేరాల్లో మాత్రమే లైంగికతను గూర్చి చెబుతుంది. నేను ఆ పేరాలను వదిలిపెట్టడం మొదలెట్టాను, కాని దాన్ని మళ్ళీ చదివేలా ఏదో నన్ను ప్రేరేపించింది. ఎంత పెద్ద తప్పు చేశానో! తత్ఫలితంగా నేను భయంకరమైన కలలు కన్నాను.”
మీ స్నేహితులు, సహవాసులు మీ తలంపులపై గొప్ప ప్రభావాన్ని చూపగలరు. కౌమారదశకు ఎదగడాన్ని గూర్చి ఒక పుస్తకం యిలా చెబుతుంది: “వీధి మూలల్లోను, పాఠశాల హాల్లోను, కాఫీ కొట్లలోను, మార్కెట్లలోను కూర్చొని అమ్మాయిలను అబ్బాయిలను చూస్తూ ఉండడమే సాధారణ కాలక్షేపం.” యౌవనస్థులు అలా చూడకపోయినా, తరచూ వాళ్ళను గురించి మాట్లాడుతూ ఉంటారు. పద్దెనిమిదేండ్ల రాబర్ట్ యీ విధంగా ఒప్పుకుంటున్నాడు, “లైంగిక సంబంధాలు కలిగి ఉండాలనే ఒత్తిళ్ళు చాలా ఎక్కువగా ఉండేవి . . . పాఠశాలలోని బట్టలు మార్చుకొనే గదిలో వాటి గురించే ఎక్కువగా మాట్లాడేవారు.” మరొక యౌవనస్థురాలు యిలా ఒప్పుకుంటోంది: “బడి పిల్లల మధ్య సంభాషణకు లైంగికత అనేది మొదటి విషయంగా ఉండేది, కాబట్టి, అది ఒకరి ఆలోచనలపై ఎక్కువ అధికారం చెలాయించేది.”
అటువంటివారికి భిన్నంగా ఉండడం చాలా కష్టం. మీ తోటి వాళ్ళు ఎడతెగక వ్యతిరేక లింగ వ్యక్తులను గూర్చి నీచంగా, దుర్నీతికరంగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతోపాటు కలవడానికి అది మిమ్మల్ని పురికొల్పవచ్చు. కాని బైబిలిలా హెచ్చరిస్తుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”—సామెతలు 13:20.
సమతుల్యత అవసరం
దీని అర్థం వ్యతిరేక లింగ వ్యక్తులను చూడడం, వారిని గూర్చి మాట్లాడాలనుకోవడం తప్పా? కాదు, బైబిలు రచయితలు కూడా కొందరు స్త్రీ పురుషులు శారీరకంగా ఆకర్షణీయంగా ఉంటారని రాశారు. (1 సమూయేలు 9:2; ఎస్తేరు 2:7.) కాబట్టి, అందంగా ఉన్న ఒక స్త్రీని చూడడంలో తప్పుందని యేసు చెప్పడం లేదు. గాని, ‘స్త్రీని మోహించే విధంగా ఆమెను చూడ’ కూడదని యేసు క్రైస్తవులను బోధించాడు. (మత్తయి 5:28) అలాగే, గుడ్డిగా మోహించే విధంగా మిమ్మల్ని మీరు అనుమతించరాదు. మొదటి థెస్సలొనీకయులు 4:4, 5నందు మనకిలా చెప్పబడింది: “మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్య జనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.”
మనస్సులోకి తరచూ శృంగార తలంపులు వస్తుండగా, వాటిని గూర్చే మళ్ళీ తలపోయడం, ఆ పిచ్చిలోనే పడిపోవడానికి, ఆ తర్వాత పెద్ద సమస్యలు వృద్ధికావడానికి దారితీయవచ్చు. ప్రసంగి 5:3 యిలా చెబుతుంది: “విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును.” ఒకడు తన వ్యక్తిగత కోరికలను గూర్చి ఎక్కువ తలపోస్తూ ఉండడం, హానికరమైన ఊహలకు, పగటి కలలకు దారితీస్తుంది.b
తరచూ శృంగార సంబంధమైన తలంపులు రావడం సహజమైనప్పటికి, వాటిని గూర్చే తలపోస్తూ ఉండడమనేది మరో విషయం. రూత్ బెల్ అనే రచయిత యీ విధంగా రాస్తున్నాడు, “అప్పుడప్పుడు స్త్రీగాని, పురుషుడుగాని, దాదాపు పగలు, రాత్రి అంతా తాము ఊహల్లో తేలిపోతున్నామని కనుగొన్నారు. వాస్తవమైన వాటికన్నా అవే నిజమైనవని అనుకుంటారు.” వ్యామోహంలో పడ్డ ఒక అమ్మాయిని పరిశీలించండి. ఆమె యిలా అంటుంది: “నాకు 12 1/2 సంవత్సరాలు. మా రాజ్యమందిరానికి వచ్చే ఒక అబ్బాయియెడల నాకు గల భావోద్రేకాలు ఎంతో బలీయంగా ఉండేవి. డేటింగ్ చేయడానికి తగ్గ వయస్సు నాకు లేదని నాకు తెలుసు, కాని, అతనియెడల నాకు గల భావాలను అదుపులో పెట్టడం చాలా కష్టంగా ఉండేది.” ఇలాగే, కొందరు యౌవనస్థులు, తమ మనస్సుల్లో ప్రణయ భావాలు, లైంగిక ఆసక్తిని రేకెత్తించే తలంపులు నిండి ఉన్నప్పుడు, చదవడం, పఠించడం, తరగతిలో శ్రద్ధ నిలపడం, లేదా క్రైస్తవ కూటాలకు సిద్ధపడడం కష్టతరంగా ఉన్నట్లు కనుగొంటున్నారు.
ఒక యౌవనస్థుడు హస్తప్రయోగం ద్వారా అలాంటి ప్రేరణను తగ్గించడానికి ప్రయత్నం చేయడం పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. బైబిలు క్రైస్తవులను యిలా ఆజ్ఞాపిస్తుంది: “కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.” (కొలొస్సయులు 3:5) హస్తప్రయోగం క్రైస్తవులు విసర్జించవలసిన అపరిశుద్ధమైన అలవాటు, అది ‘శరీరాశను చంపివేసే’ క్రియకు వ్యతిరేకమైనది. అది ఆ చెడు క్రియను ప్రేరేపించి, వృద్ధిచేస్తుంది. తరచూ, అలాంటి కోరిక వాస్తవమౌతుంది. బైబిలు రచయితయైన యాకోబు యీ విధంగా వివరిస్తున్నాడు: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.”—యాకోబు 1:14, 15.
మరి మీరు, వ్యతిరేక లింగ వ్యక్తులను గూర్చి తలంచడం మానేయగలరా? దయచేసి, యీ పరంపరలోని తదుపరి శీర్షికను చదవండి.
[అధస్సూచీలు]
a మరొకవైపు, అల్వాన్ రాజెన్బామ్ అనే రచయిత యౌవనస్థులకు యిలా గుర్తు చేస్తున్నాడు: “లైంగిక భావాలు, దృక్పథాలు ఎంతో వేరుగా ఉంటాయి. కొందరు లైంగికతను గూర్చి తలంచడం మానివేయలేనట్లు కనిపిస్తే, మరి కొందరు లైంగితను గూర్చి తలంచనే తలంచరు. . . . రెండు ప్రతిస్పందనలు సహజమైనవే.” ఆయన యిలా కూడా అంటున్నాడు: “ఒక్కొక్కరు ఒక్కో కోణంలో తలస్తుంటారు.”
b పగటి కలలు కనడాన్ని గూర్చి యీ పత్రికల 1993 జూలై 8, జూలై 22 సంచికలను చూడవచ్చు.
[19వ పేజీలోని చిత్రం]
“ప్రణయ భావాలు లేదా లైంగిక తలంపులు చాలా బలీయంగా ఉండగలవు.”
[20వ పేజీలోని చిత్రం]
టి.వి. కార్యక్రమాలు, పత్రికాప్రకటనలు తరచు వ్యతిరేక లింగ వ్యక్తుల్లో హానికరమైన ఆసక్తిని పెంపొందిస్తాయి