యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
గ్లూ ఆవిరిని పీల్చుట—నాకు నిజంగా హాని కల్గిస్తుందా?
“అది అమోఘంగా వుంది, కార్టూన్ సినిమా చూసినట్టే ఉంది,” అని రష్యాలోని మాస్కో,నందు నివసిస్తున్న 13 ఏండ్ల స్వేతా అంటుంది.a అయినా స్వేతా ఒక క్రొత్త సినిమాను లేక వీడియోను పొగడడం లేదు. లోకవ్యాప్తంగా వేలాదిమంది యౌవనస్థులలో ఆదరణ పొందుతున్న మాదక ద్రవ్య దుర్వినియోగము ద్వారా పొందిన తన అనుభూతిని ఆమె వర్ణిస్తుంది, అదేమంటే గ్లూ (ఆవిరిని వెలువర్చే ఒకరకమైన జిగురు పదార్థాన్ని) పీల్చడం.
యౌవనస్థులు పీల్చడానికి ఉపయోగిస్తున్న అనేక పదార్థాలలో గ్లూ (ఆవిరిని వెలువర్చే ఒకరకమైన జిగురు పదార్థము) అనేది ఒక్కటి మాత్రమే. ఉదాహరణకు, బ్రిటన్‌లో గాలిని శుభ్రపరిచే ద్రవాలు, లైటర్ ఇంధనం మరియు యంగ్ పీపుల్ నవ్ అనే పత్రిక ప్రకారం “20 నండి 30 వరకు ఇంట్లో సాధారణంగా శుభ్రపరచడానికి, బాగుచేయడానికి వాడే పదార్థాలు దుర్వినియోగానికి గురౌతున్నాయి.” ఇందులో “నొప్పిని నివారించే స్ప్రేలు, గృహోపకరణముల పాలిష్‌లు, టైర్లను బాగుచేయుటకు వాడే పదార్థాలు” కూడా ఇమిడివున్నాయి. ఆశ్చర్యకరంగా, కొందరు యౌవనస్థులు అగ్ని మాపకానికి వాడే పదార్థాల ఆవిరులను కూడా పీలుస్తుంటారు! కావున ఈ హానికరమైన, ప్రజాదరణగల అలవాటును “సాల్వెంట్ (కరిగించు ద్రవముల) దుర్వినియోగము” లేదా “ఆవిరయ్యే పదార్థాల దుర్వినియోగము” అని పిలుచుట సరైనది. కొందరు నిపుణులు అలాగే పిలుస్తున్నారు.
వాళ్లు దుర్వినియోగము చేసేది గ్లూ అయినా లేక గృహోపకరణముల పాలిష్ అయినా, పీల్చేవారు వెతికే ఫలితం ఒకటే. ఒకరు చెప్పినట్లుగా, వాళ్లు “మద్యపానము వల్ల కలిగే మత్తు వంటి ‘నిషా’ పొందాలని చూస్తుంటారు.” కొకెయిన్ వంటి మాదకద్రవ్యాలకన్నా, సాల్వెంట్లు తక్కువ ధరకు, సులభంగా దొరుకుతాయి. బ్రిటన్ నందలి న్యూ సైంటిస్ట్ పత్రిక ఇలా నివేదించింది: “సాల్వెంట్లు మరొకసారి పేదవారు, యౌవనస్థులు మరియు గృహాలులేనివారు ఉపయోగించే మత్తుపదార్థంగా తయారయ్యింది: గ్వాటిమాలాలోని గృహాల్లేని వీధి పిల్లలు, ఉత్తరమెరికాలోని సహజ అమెరికన్లు, అలాగే బ్రిటన్‌లో హస్టల్లలో నివసిస్తున్న, ఇండ్లులేనివారు రాత్రులు గడిపే స్థలాల్లోని యౌవనస్థులు.” బ్రిటన్లోనున్న యౌవన అమ్మాయిలు అబ్బాయిలలో 10 మందిలో ఒకరు సాల్వెంట్ ఆవిరులను పీలుస్తుంటారని కొందరు అధికారులు నమ్ముతున్నారు. దాని ప్రభావాలు నిశ్చయంగా హానికరమైనవే.
డ్రగ్స్ మిస్యూజ్ అనే పుస్తకము ఇలా వివరిస్తుంది “సాల్వెంట్ ఆవిరులను పీల్చినప్పుడు, అవి ఊపిరితిత్తుల ద్వారా త్వరగా మెదడుకు చేరుకుంటాయి. మద్యపానమువలె ఈ ఆవిరులు కేంద్రీయ నాడీమండలంపై ప్రభావాన్ని కలిగించి, తాత్కాలికమైన ఆహ్లాదాన్ని ఇవ్వవచ్చును. వాటిని ఉపయోగించే కొందరిలో అవి తాత్కాలికమైన భ్రమలను కూడా కలిగిస్తాయి, అయితే అన్నీ కూడా మొదట్లో స్వేతా చెప్పినట్లుగా ఆనందకరంగా ఉండకపోవచ్చును. “నాకు ఎన్నో ఎలుకలు కనిపించేవి” అని డేవిడ్ అనే యౌవనుడు చెబుతున్నాడు, అతడు 14 ఏండ్లప్పుడు గ్లూను పీల్చేవాడు. “వేవేల ఎలుకలను చూసేవాడ్ని, పెద్దవాటినుండి చిన్నవి బయటకి వచ్చేవి. అవి నా స్నేహితున్ని తింటున్నట్లు అనిపించేది.” జపాన్‌కు చెందిన కజుహికో అనే యౌవనస్థుడు 17 ఏండ్లప్పుడు గ్లూను పీల్చడం మొదలుపెట్టాడు. అతడిలా గుర్తుచేసుకుంటున్నాడు: “నేను నేల చీలిపోవడము, దానిలోనుండి వచ్చిన క్రూరమృగాలు నాపై దాడిచేయడం చూశాను.”
అయితే కరిగించే పదార్థాలను పీల్చడం యౌవనస్థులకు ఎందుకంత ఆకర్షణీయంగా ఉంటుంది? లీ అనే యౌవనస్థుడు తాను 13 ఏండ్లప్పుడే గ్లూను పీల్చేవాడు, అతడిలా చెబుతున్నాడు: “సాధారణంగా, నిజ జీవితంనుండి తప్పించుకోవడానికి ప్రజలిలా చేస్తుంటారు.” అవును కరిగించు పదార్థాలను పీల్చి నిషా పొందడమనేది కొందరు యౌవనస్థులు సమస్యలను మరిచిపోవడానికి ఒక మార్గం. ఇతరులు ఆహ్లాదాన్ని కోరుతుంటారు: భయంకరమైన భ్రమలు, భయానక చిత్రాలవలె వినోదకరమైనదని వారనుకుంటారు. ఐర్లాండ్ ఆరోగ్య విభాగం ఇలా చెబుతుంది, “ఇతర కారణాలేవనగా, ఎలాగుంటుందో తెలుసుకోవాలనే కుతూహలము, స్నేహితులనుండి వచ్చే ఒత్తిడి, హోదానుపొందాలనే ప్రయత్నం, ఆత్మాభిమానలోపాన్ని లేక తానుతక్కువ అనే భావాలను కప్పిపుచ్చుకోడానికి చేసే ప్రయత్నము.”
ఆకస్మిక మరణం
దాని ఆకర్షణ ఏమైనప్పటికిని, కరిగించు పదార్థాలను పీల్చడం మరణకరమైన అలవాటు! అది 1990లో బ్రిటన్‌లో 149 మరణాలకు కారణమైంది, మరియు అది కొన్నిసార్లు నిమిషాల్లో చంపుతుంది. “పీల్చేవారి ఆకస్మిక మరణము” అని అది పిలువబడుతుంది. ఉదాహరణకు, రేచెల్ అనే అమ్మాయి బడిలో ఉన్నపుడు అలవాటుగా టైప్‌రైటర్ తప్పులు దిద్దడానికి ఉపయోగించే ద్రవాన్ని తనడ్రెస్పై పోసి దాన్ని పీల్చేది. ఒకరోజు ఆమె బస్సులో ప్రయాణము చేసేటప్పుడు దాన్ని పీల్చింది. ఆమె బస్సు దిగేటప్పుడు క్రింద పడింది. ఒక్క క్షణం ఆమె లేచి నిలబడింది గాని వెంటనే పడిపోయి చనిపోయింది. రేచెల్ 15 ఏండ్ల ప్రాయంగలది.
మరెక్కువ భయాన్ని కలిగించే వాస్తవమేమనగా కరిగించే పదార్థాలు వాటిని దుర్వినియోగము చేసిన మొదటిసారే చంపగలవు. రి-సాల్వ్ అనే బ్రిటిష్ ధర్మార్థ సంస్థ కరిగించు పదార్థాల దుర్వినియోగముతో పోరాడడానికి స్థాపించబడింది. అది ఇలా నివేదిస్తుంది, “1971 నుండి 1989 వరకు కరిగించు పదార్థాల దుర్వినియోగము చేసి మరణించిన వారిలో 18% మొదటిసారి పీల్చిన వారే.” మరణించిన వారిలో అతి చిన్నవాడు కేవలము తొమ్మిదేండ్లవాడే. మద్యపాన దుర్వినియోగము వలెనే సాల్వెంట్ దుర్వినియోగము కూడా “సర్పమువలె కరచును, కట్లపామువలె కాటువేయును,” అని చెప్పవచ్చును.—సామెతలు 23:32.
పీల్చేవారు మత్తులో ఉండడం వలన కలిగే ప్రమాదాలవలన కూడా మరణించవచ్చును. కొందరు బిల్డింగ్లపైనుండి పడ్డారు ఇతరులు నీళ్లల్లో మునిగిపోయారు. ఇతరులు స్పృహ తప్పిన తరువాత వాంతిచేసుకొని ఊపిరాడక చనిపోయారు. ఇతరులు ప్లాస్టిక్ సంచిని తలపై వేసుకొని పీల్చడం ద్వారా చనిపోయారు; వారికి ఎక్కువ మత్తు వచ్చి సంచిని తీయలేకపొయి ఊపిరాడక చనిపోయారు. మరితరులు సాల్వెంట్లకు నిప్పంటుకున్నపుడు కాలి చనిపోయారు.
శరీర కలుషితము, మరితర ప్రమాదాలు
అటువంటి విపరీతమైన పరిణామాలను అందరు అనుభవించనప్పటికిని, ఒక నిపుణుడు ఇలా వ్రాస్తున్నాడు: “వాటిని క్రమంగా దుర్వినియోగం చేసేవాడికి తన శరీరాన్ని కలుషితం చేసుకుంటున్నాడని తెలుసు మరి అతడు ఛాతి నొప్పిని, సమతూకాన్ని కోల్పోవడం, తలనొప్పి, జ్ఞాపక శక్తి క్షీణించడం వంటివి అనుభవిస్తాడు, అంతేకాకుండా అతడు ఒప్పుకోవడానికి ఇష్టపడని అనేక ఇతర సూచనలను అనుభవిస్తాడు.” (మునుపు చెప్పిన) లీ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “నా జీవితంలో ముందెన్నడూ రానంత అతి తీవ్రమైన తలనొప్పి వచ్చింది.” రిసాల్వ్ అనే సంస్థ కరిగించు పదార్థాలను పీల్చడం ఊపిరితిత్తులను, మూత్రపిండాన్ని, కాలేయాన్ని కూడా పాడుచేయగలదని, మెదడుకు హాని కలుగజేయగలదని, కృంగుదలకు కారణం కాగలదని చెబుతుంది.
తరువాత నైతిక ప్రమాదాలు కూడా ఉన్నాయి. కొందరు తమ అలవాటును కొనసాగించడానికి దొంగలుగా తయారయ్యారు. లేదా జపాన్‌లోని డెయిలీ యమూరీ నివేదికను గమనించండి: “ఒక యౌవన అమ్మాయిని హత్యచేసిన ముగ్గురు యౌవనస్థులలో ఒకడు ఆ అమ్మాయిని చంపేటప్పుడు అతనికి తప్పుచేస్తున్నానని అనిపించలేదని చెప్పాడు ఎందుకంటే అతడు సాల్వెంట్ల ప్రభావములో ఉన్నాడు.”
చివరిగా, సాల్వెంట్ల దుర్వినియోగము వాటిపై భావనాత్మకంగా ఆధారపడడానికి, వాటికి బానిసలవ్వడానికి దారితీయవచ్చును. “ఈ సాల్వెంట్లను దుర్వినియోగము చేసేవారిలో 10% మంది వాటికి బానిసలౌతారు.” అని స్కాట్లాండ్కు చెందిన గ్లాస్గో హెరాల్డ్ చెబుతుంది. ఇది ఒకని భావనాత్మక, ఆత్మీయ ఎదుగుదల కుంటుపడేలా చేస్తుంది. బైబిలు నందలి 1 కొరింథీయులు 14:20లో చెప్పిన మాటలను గమనించండి: “మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక . . . బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.” ఈ విధంగా ఒకడు ఎలా ఎదగగలడు? బైబిలు హెబ్రీయులు 5:14లో ఇలా వివరిస్తుంది: “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” అలవాటుకు బానిసలైన వాళ్లు జ్ఞానేంద్రియములను వృద్ధిచేయడంలో విఫలులౌతారు. సమస్యలను ఎదుర్కొనే బదులు, అతడు మాదకద్రవ్యాల ద్వారా వచ్చే మత్తులో తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. యంగ్ పీపుల్ నవ్ పత్రిక, పీల్చే అలవాటుకు బానిసలైన వారు “చిన్న వయస్కులుగానే బంధించబడి, వయోజనులుగా ఎదగలేరు,” అని చెబుతుంది.
వాటిని తీసుకోవడానికి ప్రయత్నించకండి!
సాల్వెంట్లను పీల్చిన స్నేహితులు నీకు తెలిసి ఉండవచ్చును, కాబట్టి తెలుసుకోవాలనే కుతూహలం కలగడం సహజమే. అయితే బైబిలు ఇలా చెబుతుంది: “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి పవిత్రులనుగా చేసికొందము.” (2 కొరింథీయులు 7:1) మీ శరీరమును కలుషితపరచి, తాత్కాలికంగానైనా మీ మనస్సుపై నియంత్రణను కోల్పోయేలా చేసే దానిని మీరెందుకు ప్రయత్నించాలి? బైబిలు మనకిచ్చే సలహా ఏమంటే, “మత్తులుకాక యుందము.” (1 థెస్సలొనీకయులు 5:6) ఈ పదము యొక్క అక్షరార్థ భావమేమనగా ‘మనము మెలుకువగా ఉందము.’ తన అమూల్యమైన ఆలోచనా శక్తులను కలుషితము చేసే బదులు, ఒక క్రైస్తవుడు వాటిని కాపాడుకుంటాడు.—సామెతలు 2:11; 5:2.
కాజుహికో ఇలా చెబుతున్నాడు: “నేను ఆ అలవాటు ప్రారంభించినందుకు ఎంతో పశ్చాత్తాపపడుతున్నాను.” దానికి లీ కూడా ఏకీభవిస్తున్నాడు. “అది బుద్ధిలేని పని. అది చాలా, చాలా ప్రమాదకరమైనది.” సాల్వెంట్లను పీల్చే అలవాటు అసలు మొదలు పెట్టకుండా, ఎంతో వేదన, దుఃఖము నుండి నిన్ను నీవు కాపాడుకో. బైబిలు చెప్పినట్లు చేయుము: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”—సామెతలు 22:3.
అయితే, ఈ సలహాను పాఠించుట సులభము కాకపోవచ్చును. సాల్వెంట్ల దుర్వినియోగమనే ఎరలో చిక్కుకోవడానికి అతి సాధారణమైన కారణమేదనగా “స్నేహితుల ఒత్తిడి” అని తేలింది. “నా సహోదరుడు నాకు గ్లూను పీల్చడంలో ఆసక్తిని కలిగించాడు,” అని డేవిడ్ చెబుతున్నాడు. “నా స్నేహితులు నాకు పరిచయం చేశారు,” అని కాజుహికో అంటున్నాడు. అవును, 1 కొరింథీయులు 15:33 చెప్పినట్లుగా, “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” నీ స్నేహితులు నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎందుకు అనుమతించాలి? మన పరలోకపు తండ్రియైన యెహోవా దేవుడు ఇలా ఉద్బోధిస్తున్నాడు: “నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.”—సామెతలు 1:10.
జ్ఞానయుక్తంగా, ఇతరులు మాదక ద్రవ్యములను ఉపయోగించడానికి మీపై ఒత్తిడి తెచ్చినట్లయితే మీ తలిదండ్రులకు తెలుపండి. వద్దని చెప్పే మీ దృఢనిశ్చయాన్ని వారు బలపరచవచ్చును. లేదా, మీరు ఒత్తిడులకు గురై లేక సమస్యలతో సతమతమౌతున్నందున సాల్వెంట్లను పీల్చాలనే శోధన కలుగవచ్చును. ఉపశమనం పొందడానికి, దానికంటే ఒక మంచి పద్ధతేమంటే మీ సమస్యలను మీ తల్లిదండ్రులతో, లేక మిమ్ములను అర్థంచేసుకోగల అనుభవజ్ఞులతో పంచుకోండి. మీకు నడిపింపు కావాలి, కాని మత్తుపదార్థాలతో తప్పించుకోవడం కాదు. మీరు తాళుకోవడానికి సహాయపడటానికి, ప్రార్థన అనే ఏర్పాటునుండి ప్రయోజనం పొందవచ్చును. “యెల్లప్పుడు ఆయన యందు నమ్మిక యుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి.”—కీర్తన 62:8.
సాల్వెంట్ని పీల్చడం ఉత్తేజకరంగా కన్పించవచ్చు, అయినా మీ సమస్యలను అది పరిష్కరించదు. నిశ్చయంగా, మీ జీవితాలను అది నాశనం చేయగలదు. చురుకుగా ఉండండి. వాటిని తీసుకోవడానికి ప్రయత్నించకండి. (g94 6/22)
[అధస్సూచీలు]
a కొన్ని పేర్లు మార్చబడ్దాయి.
[13వ పేజీలోని చిత్రం]
స్నేహితుల ఒత్తిడి మిమ్ములను మరణకరమైన అలవాటుకు మళ్లించ నియ్యకండి