పునర్జన్మవాదం వివరించబడింది
భూమి మీద ఉన్న ఎక్కువ మంది ప్రజలకు పూర్వం జీవించిన జ్ఞాపకాలు లేనే లేవన్నది, పునర్జన్మ సిద్ధాంతానికున్న వ్యతిరేకతల్లో ఒకటి. అంతేకాక, గత జన్మల్లో తాము జీవించి ఉండవచ్చని వారు తలంచడం కూడా లేదు.
ఒక మనిషిని మొదటిసారిగా కలిసినప్పుడు, కొన్నిసార్లు వారిని గుర్తించినట్లు వింతైన భావనలు కలుగుతాయనేది నిజమే. ఏదైనా ఒక యిల్లో, నగరమో, ప్రకృతి దృశ్యములున్న ప్రాంతాలనో మొదటిసారిగా చూస్తున్నామని తెలిసినప్పటికీ మనకది పరిచయమున్నట్లు అనిపిస్తుంది. అయినను, పునర్జన్మ సిద్ధాంతం లేకుండానే, యీ విషయాలను వివరించవచ్చును.
ఉదాహరణకు, దూరంగా విశాలంగా ఉన్న ప్రదేశాల్లోని కొన్ని స్థలాలు ఏదో కొంత సాదృశ్యాన్ని కలిగివుంటాయి, అందువలన మనం కొత్త ప్రదేశాలను సందర్శించినప్పుడు, క్రితం మనం అక్కడికి వెళ్ళనప్పటికీ మనం అంతకు ముందు అక్కడికి వెళ్ళామేమోనని భావించవచ్చు. ప్రపంచంలోని కొన్ని భాగాల్లోని అనేక యిండ్లు, కార్యాలయాలు, అంగళ్ళు, నగరాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, వేరే ప్రాంతాల్లోని వాటితో సాదృశంగా ఉంటాయి. మనం క్రితం చూసినవాటిని పోలినట్లు కనిపించడం, పూర్వజన్మలో మనమక్కడ ఉన్నామనడానికి ఆధారం కాదు. అవి కేవలం మనకు పరిచయమున్నవాటికి పోలినవి.
ప్రజల విషయంలో కూడా యిది నిజం. ఒకే రూపం గల మనుష్యులు యిద్దరున్నారా అనిపించేలా చూడ్డానికి కొందరు అచ్చం మరికొందరిలాగే ఉంటారు. ఒక వ్యక్తికి, జీవించివున్న మరొక వ్యక్తిని లేదా చనిపోయిన వ్యక్తిని మనకు గుర్తుచేసే అలవాట్లు ఉండవచ్చు. అయితే, మనకు ఆ ప్రజలు ప్రస్తుత జీవితంలోనే తెలుసు, కాని పూర్వజన్మలో కాదు. పోలికలో, వ్యక్తిత్వంలో సారూప్యం ఉన్నంత మాత్రాన, వాళ్ళు పూర్వ జన్మలో మనకు పరిచయమున్నారని అర్థం కాదు. మనమందరం ఏదో ఒక సమయాన ఒకరిని చూసి మరొకరని అపార్థం చేసుకున్నామనడంలో సందేహం లేదు. మీలాగే, ఆ యిద్దరు వ్యక్తులు కూడా ఒకే కాలంలో జీవిస్తున్నారు, అంతే కాని పూర్వజన్మలో కాదు. దానికి పూర్వజన్మతో సంబంధం లేదు.
వశీకరణ ప్రభావం
వశీకరణ ప్రభావంలోని అనుభవాలను పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధం లేకుండానే వివరించవచ్చు. మన చిన్న మెదడు మనం ఊహించేదానికన్నా ఎక్కువగా సమాచార గిడ్డంగిగా పనిచేస్తుంది. పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, టి.వి., రేడియో, మరితర అనుభవాల ద్వారా, పరిశీలనల ద్వారా యీ గిడ్డంగికి సమాచారం అందుతుంది.
మనకు యీ సమాచారంలోని అధికశాతం నేరుగా, లేదా వెంటనే ఉపయోగం లేనందువల్ల అది చిన్న మెదడులోని ఒక మూలన నిల్వ ఉంటుంది. మనకు ప్రస్తుతం అంత ఎక్కువ అవసరం లేక గ్రంథాలయంలోని వేరే అరలో ఉంచిన పుస్తకాల్లాంటిదే మన చిన్న మెదడు.
అయినను, వశీకరణ క్రింద, దాని ప్రభావంలో ఉన్న మనస్సుకు మరిచిపోయిన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చేలా చేయబడుతుంది. మర్చిపోయిన జ్ఞాపకాలను కొందరు పూర్వ జన్మలోని జ్ఞాపకాలని వ్యాఖ్యానిస్తారు. అయితే అవి మనం తాత్కాలికంగా మరిచిపోయిన ప్రస్తుత జీవిత అనుభవాలే తప్ప, అంతకు మించి ఏమీ కావు.
అయితే, సహజమైన విధంగా వివరించడానికి ఎంతో కష్టమైన కొన్ని సంఘటనలున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి వశీకరణ ప్రభావం వలన మరొక “భాష” మాట్లాడనారంభిస్తాడు. కొన్నిసార్లు ఆ భాష అర్థమౌతుంది, అయితే తరచూ అర్థం కాదు. అది ఆ వ్యక్తి తన పూర్వజన్మలో మాట్లాడిన భాష అని పునర్జన్మను విశ్వసించేవారు అనవచ్చును.
అయినా, ప్రజలు తత్వ సంబంధమైన భ్రమల్లో ఉన్నప్పుడు, లేదా మత పారవశ్యంలో ఉన్నప్పుడు అలాంటి భాషల్లో మాట్లాడుతారని అందరికీ తెలుసు. దీనికి పూర్వ జన్మతో సంబంధం ఏమీ లేదు కాని, తమ ప్రస్తుత జీవితంలో అదృశ్యమైన ఏదో ఒక శక్తి తమపై ప్రభావం చూపుతుందని అలాంటి అనుభవాలు గల వారు ఒప్పించబడ్డారు.
ఈ శక్తి ఏమిటి అనే దాని గురించిన అభిప్రాయాల్లో తేడా ఉంది. ఫౌంటైన్ ట్రస్ట్ మరియు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇవాంజెలికల్ కౌన్సిల్ కలిసి చేసిన ప్రకటనలో భాషలు మాట్లాడడాన్ని గూర్చి యిలా చెప్పబడింది. “ఇలాంటి అద్భుతాలు ఇంద్రజాలం వలన లేదా పైశాచిక ప్రభావం వలన సంభవించగలవని కూడా మనకు తెలుసు.” పూర్వజన్మలో జీవించామని చెప్పడానికి యిలాంటి అద్భుతం ఒక సాక్ష్యమని ఊహించడం అంటే తప్పుడు అభిప్రాయాన్ని పెంపొందించుకోవడమే అవుతుంది.
మరణాన్ని సమీపించిన అనుభవాలు
తమకు మరణాన్ని సమీపించిన అనుభవం ఉందని కొందరు చెబుతున్నారు కదా, మరి దాని మాటేమిటి? శరీరం మరణించిన తర్వాత కూడా బ్రతికి ఉండే ఆత్మ మానవునికి ఉందని యివన్నీ నిరూపిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానించారు. అయితే యిలాంటి అనుభవాలు యింతకన్నా చక్కగా సహజ మార్గంలో వివరించబడ్డాయి.
ఫ్రెంచ్ విజ్ఞాన పత్రికయైన సియాన్స్ అ వి మార్చి 1991వ సంచికలో మరణాన్ని సమీపించిన అనుభవాల్లోని వివిధ ఘట్టాలు “విశ్వవ్యాప్తంగా మతిభ్రమము వలన జరుగుతున్న సంఘటనలకు సాదృశ్యమైనవి” అని పిలువబడ్డాయి. ఇవి ఎంతో కాలంగా తెలిసినవే. ఇలాంటి అనుభవాలు మరణాన్ని సమీపించిన వారికి మాత్రమే పరిమితం కాలేదు. “బలహీనత, జ్వరం, మూర్ఛ రోగం, మత్తుమందుల దుర్వినియోగం” మొదలగు వాని వలన కూడా యిలా జరుగవచ్చు.
మూర్ఛ రోగులకు అనేస్తీషియా యిచ్చి శస్త్ర చికిత్స చేసిన న్యూరో సర్జరీ పయినీరైన వైల్డర్ పెన్‌ఫీల్డ్ ఒక ఆసక్తికరమైన పరిశోధన జరిపారు. ఆయన విద్యుత్ప్రవాహ నాళ సహాయంతో మెదడులోని వివిధ భాగాలను ప్రేరేపించడం ద్వారా ఆ రోగి తన శరీరం నుండి బయటికి వచ్చి సొరంగం గుండా ప్రయాణం చేసి, చనిపోయిన బంధువులను కలుసుకున్నట్లు అనుభూతిని పొందేలా చేయగలిగాడు.
ఈ విషయంలో మరో ఆసక్తికరమైన వివరమేమంటే మరణాన్ని సమీపించిన అనుభవాలు గల పిల్లలు, చనిపోయిన తమ బంధువులను కాదు గాని, బ్రతికివున్న తమ తోటి విద్యార్థులను లేదా ఉపాధ్యాయులను కలుసుకున్నారు. ఇలాంటి అనుభవాలు కొన్ని సంస్కృతులకు సంబంధించినవిగా ఉన్నట్లు చూపిస్తుంది. వాళ్ళ అనుభవం మరణం తర్వాతది కాకుండా ప్రస్తుత జీవితానికి సంబంధించినదై ఉంటుంది.
ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే పత్రికలో డా. రిచార్డ్ బ్లాకర్ యిలా వ్రాశారు: “చనిపోవడం లేదా శరీరం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం అన్నది క్రమంగా జరిగే పద్ధతి, మరణమన్నది ఒక అవస్థ,” మొదటి సారిగా అమెరికా నుండి ఐరోపాకు విమానంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటూ ఆయనిలా వ్రాశాడు. ఐరోపాకు బయలు దేరిన వ్యక్తి, “విమానంలో వెళ్తూ ఉంటే అతడు ఐరోపాలో ఉన్నట్లు కాదు,” ఐరోపాకు బయలుదేరిన వ్యక్తి ఎక్కిన విమానం అక్కడక్కడే తిరిగి, అది బయలు దేరిన కొద్ది నిమిషాల తర్వాత తిరిగి అక్కడికే వస్తే, అతడు ఐరోపాకు చేరుకున్నట్లు కాదు. అతడు ఐరోపాను గూర్చి ప్రజలకు ఏమీ చెప్పలేడు, అలాగే అపస్మారక స్థితినుండి స్మారకంలోకి తిరిగి వచ్చిన వ్యక్తి మరణాన్ని గూర్చి ప్రజలకు ఏమీ చెప్పలేడు.
మరొక మాటలో చెబితే, మరణాన్ని సమీపించిన వారు నిజానికి మరణించలేదు. వారు జీవించి ఉండగానే ఏదో అనుభవించారు. ఒక వ్యక్తి తాను చనిపోవడానికి సెకెండ్ల ముందు కూడా జీవించే ఉన్నాడు. వారు మరణాన్ని సమీపించారు గాని మరణించలేదు.
కొద్దిసేపు గుండె కొట్టుకోవడం ఆగిన తర్వాత, తిరిగి మామూలు స్థితికి తేబడినవారు “చనిపోయారని” చెప్పబడినను వారు స్పృహ తప్పి ఉన్న ఆ క్షణాలను నిజంగా గుర్తు చేసుకోలేరు. వారు ఏమైనా గుర్తు చేసుకుంటే, నిస్పృహను సమీపించిన ఆ సమయంలో జరిగినదాన్నే గాని, నిస్పృహలో ఉన్నప్పుడు కాదు.
ప్రతికూలమైన అనుభవాలు కూడా ఉన్నాయని తెలిసినప్పటికీ, మరణాన్ని సమీపించిన ప్రచురితమైన అనుభవాలు దాదాపు అన్నివేళలా అనుకూలంగా వర్ణించబడ్డాయి. ఫ్రెంచ్ మనోవిశ్లేషకురాలైన కాథరీన్ లామెర్ దీన్ని యీ విధంగా వివరిస్తున్నారు: “ఐ.ఎ.ఎన్.డి.ఎస్. [ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఫర్ నియర్-డెత్ స్టడీస్] చెప్పిన క్రమానికనుగుణమైన రీతిలో మరణాన్ని సమీపించిన అనుభవాలు లేనివారు తమ కథను చెప్పుకోడంలో ఆసక్తి లేదు.”
జ్ఞాపకం లేదు
వాస్తవమేంటంటే, మన ప్రస్తుత జీవితాన్ని గూర్చి తప్ప, పూర్వజన్మను గూర్చి లేదా మరణం తర్వాతి జీవితాన్ని గూర్చి మనకు తెలియదు. అందుచేత, నిజానికి మనం గడుపుతున్న జీవితానికి సంబంధించినవి తప్ప మరి వేటిని గూర్చి మనకు సరియైన జ్ఞాపకాలు ఏమీ లేవు.
పునర్జన్మలో విశ్వసించేవారు, పునర్జన్మించడం అంటే మన పరిస్థితులను మెరుగుపరచుకొనే కొత్త అవకాశాలు లభించడానికే అంటారు. మనం నిజంగా పూర్వ జన్మలో జీవించినట్లయితే, వాటిని మరిచిపోయాం, యిలాంటి మతిమరుపు నిజంగా పెద్ద అవరోధమే. మన తప్పులను గుర్తుచేసుకోవడం ద్వారా, వాటినుండి మనం ప్రయోజనం పొందగలం.
అలాగే, పునర్జన్మ చికిత్స అని పిలువబడేదాన్ని అంగీకరించేవారు వశీకరణ ద్వారా, పూర్వజన్మలను మీరు గుర్తు చేసుకోగలిగితే, ప్రస్తుత సమస్యలను యింకా చక్కగా పరిష్కరించుకోవచ్చు అని భావిస్తారు. ఆ సిద్ధాంతం చెప్పేదేమంటే, మనం ఏదో మెరుగు చేసుకోడానికే తిరిగి జన్మిస్తాం, అయినా ఆ మెరుగు చేసుకోవల్సిందేదో మనం మరిచిపోయాము.
ప్రస్తుత జీవితంలో మరచిపోవడమన్నది పెద్ద అవరోధంగా పరిగణించబడుతుంది. ఇది యీ విషయంలో కూడా అంతే. ఇంతకు ముందెన్నటి కన్నా మరి ఎక్కువగా దుష్టత్వం ప్రపంచ నటనను ఏలుతున్న యీ కాలాల్లో, మంచి ప్రజలు మాత్రమే తిరిగి మానవులుగా జన్మిస్తారని చెబుతూ మతిమరుపు అన్నది అంత పట్టించుకోవలసిందే కాదు అని అభ్యంతరం చెప్పడం అంత సరైన తర్కం కాదు. మంచి ప్రజలు మాత్రమే మానవులుగా తిరిగి జన్మించేటట్లయితే, దుష్టులైన ప్రజలందరూ ఎక్కడి నుండి వచ్చారు? కొద్దిమంది, చాలా కొద్దిమంది మాత్రమే దుష్టులైన ప్రజలుండాలి కదా? నిజమేంటంటే: మంచి వ్యక్తియైనా, చెడు వ్యక్తియైనా మానవునిగానో వేరే రూపంలోనో మరొక జీవితాన్ని ఆరంభించడానికి ఎన్నడూ పునర్జన్మించలేదు.
అయినప్పటికీ, మీరిలా చెప్పవచ్చు, ‘పునర్జన్మ అనేది బైబిలు బోధ కాదా?’ ఈ ప్రశ్నను తదుపరి శీర్షికలో చూద్దాం. (g94 6/8)
[6వ పేజీలోని చిత్రం]
మన చిన్న మెదడు, కొంతకాలం వరకు ప్రక్కనబెట్టి తర్వాత జ్ఞాపకానికి వచ్చే గ్రంథాలయ సమాచారం వంటిది
[7వ పేజీలోని చిత్రం]
“మరణం అనేది ఒక అవస్థ,” క్రమపద్ధతి కాదు.—ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో డా. రిచార్డ్ బ్లాకర్ వ్రాశాడు