జీవిత మర్మాలకు పునర్జన్మ కీలకమా?
మీరు పూర్వము జీవించారా?
మీరు చనిపోయిన తర్వాత, ఏదో ఒక జీవి రూపంలో మరలా జీవిస్తారా?
ఈ ప్రశ్నలు మీకు పునర్జన్మ సిద్ధాంతాన్ని గుర్తు చేయవచ్చు.
ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా “పునర్జన్మను” యీ విధంగా నిర్వచిస్తుంది: “ఆత్మ ఒకసారి లేదా అంతకన్నా ఎక్కువసార్లు అంటే, బహుశా, మానవునిగానో, జంతువుగానో, లేదా కొన్నిసార్లు మొక్కగానో మళ్ళీ జన్మిస్తుందనే నమ్మకము.”
తూర్పు దేశాల్లోని మతాల్లో, విశేషంగా ఇండియాలో ఉద్భవించిన బౌద్ధ, హిందూ, జైన, సిక్కువంటి మతాల్లో పునర్జన్మ ఒక ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ఉదాహరణకు, జీవితమన్నది మరణము, మరియు తిరిగి జన్మించుట అనే ఎడతెగని చక్రమని ఇండియాలోని హిందువుల మధ్య పరిగణించబడుతుంది.
అయినప్పటికీ, యిటీవలి కాలాల్లో, పునర్జన్మను గూర్చిన ఆలోచన పశ్చిమార్థగోళంలో జీవించే అనేక మంది యౌవనస్థులతో సహా ఎందరినో ఆకర్షించింది. కెనడాలోని సన్‌డే స్టార్ అనే పత్రికలో రాసే ఒక వ్యాస రచయిత అభిప్రాయం ప్రకారం, దీనిపై ఎక్కువ ఆసక్తి ఉండడానికి కారణం “మన పశ్చిమ సమాజంపై 1960లలో మొదలైన తూర్పు మత సిద్ధాంతాల ప్రభావ ఫలితమే.”
ప్రఖ్యాతిగాంచిన కొందరు వ్యక్తులు, తాము పూర్వం ఒకటి లేక అంతకన్నా ఎక్కువ జన్మల్లో జీవించామని బహిరంగంగా గంభీరంగా నొక్కి చెప్పడమే పునర్జన్మలో ఆసక్తి పెరగడానికి మరొక కారణం. డాక్టర్లు ఉపాధ్యాయులు వంటి అనేకమంది ఉన్నతస్థాయిలోని వ్యక్తులేగాక, రేడియో, టి.వి., పత్రికలు, యితర వార్తా మాధ్యమాలు కూడా పునర్జన్మలో ఆసక్తిని చూపించాయి.
ఇదంతా ఎంతో ఉత్కంఠను రేకెత్తించింది. అలా, కొన్ని జాబితాల ప్రకారం, కెనడా, అమెరికానందలి ప్రజల్లో నాలుగింటిలో ఒక వంతు పునర్జన్మను కొంతవరకు అంగీకరిస్తున్నట్లు బహిరంగంగా ఒప్పుకున్నారు.
పూర్వ_జన్మ అనుభవాలను గూర్చిన వాదాలు
షెర్లీ మాక్లేన్ అనే నటి, లేడీస్ హోమ్ జర్నల్‌లో ఫిలిస్ బాటలేకు యిచ్చిన ఇంటర్‌వ్యూలో, తాను గతకాల ప్రవాహంలో అనేక “ఊహాపర్యటనలు” చేసిందని చెబుతుంది. “కొన్నిసార్లు నేనొక స్త్రీగాను, మరికొన్నిసార్లు పురుషునిగాను జీవించిన నా అనేక పూర్వజన్మలను గుర్తు చేసుకున్నాను,” అని ఆమె చెప్పింది.
కమింగ్ బ్యాక్ అనే తన పుస్తకంలో డా. రెయ్‌మండ్ మూడీ తన విద్యార్థులపైన, యితరులపైన తాను జరిపిన పరిశోధనలను వివరించాడు. వశీకరణ (హిప్నోసిస్) ద్వారా వారిని వారి పుట్టుకకు ముందటి సంగతుల దగ్గరికి తాను తీసుకు వెళ్ళానని, వారికి తమ పూర్వజన్మలోని విషయాలు గుర్తున్నాయంటూ వాదిస్తున్నారని, ఆయన చెబుతున్నాడు. తాను ఎస్కిమో సమాజంలో ఒక ఎస్కిమోగా జీవించానని ఒక వ్యక్తి అన్నాడు. అనేక వేల సంవత్సరాల క్రితం తాను ‘రాతి యుగంలో’ జీవించానని మరొక వ్యక్తి నొక్కి చెప్పాడు.
డా. మూడి తాను పూర్వం తొమ్మిది జన్మల్లో జీవించానని వాదిస్తున్నాడు. ఆయన గడిపిన విభిన్న జీవితాల్లో, “చెట్లమీద జీవించిన అనాగరిక మానవుని పూర్వపు దశ” నుండి రోమా సామ్రాజ్యపు కాలంలో ప్రదర్శనశాలలో సింహం చేత ఆక్రమించబడి, చంపబడిన జీవితం కూడా ఉంది.
ఆలోచించగల ప్రజలను వశీకరణ ద్వారా వారి పుట్టుటకు పూర్వపు కాలానికి తీసుకువెళ్ళడం యితరులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పబడింది. భావోద్రేక సంబంధమైన క్రమ రాహిత్యాలను నయం చేయడానికి డాక్టర్లు దీన్ని ఉపయోగించారు. వివరించలేని విపరీత భయానికి కారణమైన పూర్వ జన్మలోని సంఘటనను తెలుసుకోవడం ద్వారా, ఆ భయాన్ని తీసివేయవచ్చని కూడా చెప్పబడింది. ఈ ఆలోచన ఎంత వరకు వాస్తవమైనది?
మరణాన్ని సమీపించిన అనుభవాలు చెప్పబడ్డాయి
మరణాన్ని సమీపించిన అనుభవాలను కొందరు ప్రజలు చెప్పడం పునర్జన్మ అనే ఆలోచన ప్రచారం కావడానికి తోడ్పడింది. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే పుస్తకంలో డా. మూడి మరణాన్ని సమీపించిన 50 మంది ప్రజల అనుభవాలను గూర్చి నివేదిస్తున్నాడు.
వారి అనుభవాలు విభిన్నంగా ఉన్నప్పటికీ, అవన్నీ ఒకే విధంగా ఉన్నాయని మూడి తలస్తున్నాడు. ఈ ప్రజలు చీకటిగా ఉన్న పొడవైన సొరంగం గుండా ప్రయాణం చేస్తున్న అనుభవాన్ని పొందారు. వారు తమ శరీరాల నుండి వేరై, స్వతంత్రంగా తేలుతున్నట్లు భావించారు. వారు సొరంగం గుండా అతి వేగంగా ప్రకాశవంతమైన వెలుతురులోకి, వెళ్తున్నట్లుగా గ్రహించారు, ఆ సొరంగం చివర ఎంతో కాలం క్రింద చనిపోయిన కుటుంబ సభ్యులను చూశారు. చివరికి, వాళ్ళు తమ శరీరాల్లోనే మేలుకున్నారు. అయితే, అందరూ యీ దశలన్నింటినీ అనుభవించలేదు.
ఇలాంటి అనుభవాలు కల్గిన వారిపై అవి అనుకూలమైన ప్రభావం చూపాయని చెప్పబడింది. అది నిజమైతే, మరణాన్ని గూర్చిన భయాన్ని వారు కోల్పోయేలా అది వారికి సహాయపడాలి, జీవితానికి అర్థం ఉందనే నమ్మకాన్ని అది వారికిచ్చి ఉండాలి. కాని ఎల్లప్పుడూ అలా జరుగలేదు. అనేకులు ఎల్లప్పుడూ మరణమంటే భయపడుతూ, జీవితానికి యథార్థమైన అర్థం ఉందన్న నమ్మకం లేకుండా ఉన్నారు.
పునర్జన్మలో విశ్వాసముంచే వారు మానవుల ఆత్మ విభిన్న రూపాల జీవులుగా తిరిగి జన్మిస్తుందన్న ఆలోచనకు మద్దతునిచ్చే ఆధారాన్ని ఆ అనుభవాల్లో కనుగొన్నామని చెబుతారు. అయితే యీ సిద్ధాంతానికి నమ్మదగిన ఆధారమేమైనా ఉందా? పునర్జన్మ జీవిత మర్మాలను విశదపరుస్తుందా? మీరు పూర్వం జీవించారా? మీరు మరలా జీవిస్తారా? మరణమందు శరీరాన్ని వదిలిపెట్టే ఆత్మ మానవునికుందా? అనే ప్రశ్నలకు అసలు జవాబు పొందగలమా? ఈ ప్రశ్నలు తదుపరి శీర్షికల్లో చర్చించబడుతాయి. (g94 6/8)
[4వ పేజీలోని చిత్రం]
తూర్పుదేశ మతాల్లో పునర్జన్మ అనేది ప్రాథమికమైన సిద్ధాంతం
[4వ పేజీలోని చిత్రం]
హిందూ జీవిత చక్రం