దేవుని వాక్యం పునర్జన్మను బోధిస్తుందా?
బైబిలు పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతునిస్తుందనే నిరీక్షణతో దాన్ని పరిశోధించే ఎవరైనా నిరాశపడవలసిందే. మానవులు పూర్వజన్మలో జీవించినట్లు బైబిల్లో మీరెక్కడా చూడలేరు. అంతేకాకుండా, “పునర్జన్మ” లేదా “ఆత్మ దేహాంతరం పొందుట” లేదా “అమర్త్య ఆత్మ” వంటి పదాలను బైబిలులో మీరు కనుగొనలేరు.
ఏమైనప్పటికీ, ప్రాచీన కాలాల్లో పునర్జన్మను నమ్మడం సాధారణమైనందున, దాన్ని వివరించడం అనవసరంగా ఉండేదని చెబుతూ పునర్జన్మను నమ్మే కొందరు, బైబిలు మద్దతివ్వక పోవడానికి గల కారణాన్ని వివరించడానికి ప్రయత్నిస్తారు. పునర్జన్మ సిద్ధాంతం అతి పురాతనమైనదన్నది నిజమే. అయితే, అది ఎంత పాతదైనా, అది ఎంత సాధారణమైనా కాకపోయినా, బైబిలు దానిని బోధిస్తుందా? అనే ప్రశ్న యిప్పటికీ మిగిలింది.
అపొస్తలుడైన పౌలు, 2 తిమోతి 3:16, 17నందు యిలా రాశాడు: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది.” అవును, బైబిలు దైవ ప్రేరేపిత వాక్యం, మానవ కుటుంబంతో ఆయన చెప్పిన మాటలే. మరి పౌలు రాసినట్లు, యథార్థంగా అన్వేషించేవాడు భూత, భవిష్యత్, వర్తమానాలతో సహా జీవితాన్ని గూర్చిన ముఖ్యమైన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ‘సన్నద్ధుడై, పూర్ణముగా సిద్ధపడివుండేలా’ చేస్తుంది.
పౌలు యిలా కూడా పేర్కొన్నాడు: “మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాము.” (1 థెస్సలొనీకయులు 2:13) బైబిలులో ఉన్నవి అపరిపూర్ణ మానవునివి కాక దేవుని తలంపులే కాబట్టి, మానవ తలంపులు సంవత్సరాలనుండి ప్రఖ్యాతిగాంచినప్పటికీ, బైబిలు తరచూ వాటినుండి విభిన్నంగా ఉండడం మనకు ఆశ్చర్యం కలిగించడం లేదు. అయితే మీరిలా అనవచ్చు, ‘బైబిలు కొన్ని చోట్ల, పునర్జన్మను కనీసం సూచించడం కూడా లేదా?’
వచనాలు అపార్థం చేసుకోబడ్డాయి
పునర్జన్మను నమ్మేవారు మత్తయి 17:11-13 లో బైబిలు యీ అంశాన్ని క్లుప్తంగా సూచిస్తుందని అంటారు, యేసు అక్కడ బాప్తిస్మమిచ్చే యోహానును ప్రాచీన ఏలీయా ప్రవక్తతో జత కలుపుతున్నాడు. ఈ లేఖనంలో యిలా ఉంది: “‘ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; . . .’ అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.”
ఇలా చెప్పడంలో, ఏలీయా ప్రవక్త, బాప్తిస్మమిచ్చే యోహానుగా పునర్జన్మించాడని యేసు భావమా? తాను అలా కాడని యోహానుకే తెలుసు. ఒక సందర్భంలో ఆయనను “నీవు ఏలీయావా?” అని అడుగగా ‘నేను కాను’ అని ఆయన స్పష్టంగా జవాబిచ్చాడు. (యోహాను 1:21) అయినప్పటికీ, “ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై” యోహాను మెస్సీయాకు ముందుగా వస్తాడని ప్రవచించబడింది. (లూకా 1:17; మలాకీ 4:5, 6) మరో మాటలో చెబితే, బాప్తిస్మమిచ్చే యోహాను ఏలీయా చేసిన పనిని పోలిన పనిని చేశాడు అనే అర్థంలో ఆయన “ఏలీయాయే.”
యోహాను 9:1, 2 లో మనమిలా చదువుతాము: “ఆయన [యేసు] మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు—‘బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా?’” అని అడిగారు. ఈ మనుష్యుడు గ్రుడ్డివాడుగా పుట్టాడు గనుక, అతడు తన పూర్వజన్మలో పాపము చేసి ఉండవచ్చు అని పునర్జన్మలో నమ్మేవారు అంటారు.
శిష్యుల ప్రశ్నకు కారణమేదైనప్పటికీ, యేసు యిచ్చిన జవాబు దాని నిర్థారణకు తోడ్పడేదై ఉండాలి. ఆయన యిలా తెలియజేశాడు: “వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు.” (యోహాను 9:3) పూర్వజన్మలో చేసిన పాపాల వలననే అంగవైకల్యాలు కలుగుతాయి అని బోధించే పునర్జన్మ సిద్ధాంతాన్ని యిది ఖండిస్తుంది. ఏశావు, యాకోబులను గూర్చి “పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే” అని రాస్తూ, పుట్టక ముందే ఎవరూ పాపము చేయలేరని పౌలు సూచించాడు.—రోమీయులు 9:11.
పునరుత్థానము, పునర్జన్మ కాదు
బైబిలు పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతునివ్వకపోయినప్పటికీ, ఎవరూ నిరాశపడనవసరం లేదు. రోగం, దుఃఖం, వేదన, మరణం ఉన్న ప్రపంచంలో తిరిగి జన్మించుట అనే తలంపుకన్నా మరి ఎక్కువ ఊరట కలిగించే వేరొకదాన్ని బైబిలు సందేశం వాగ్దానం చేస్తుంది. బైబిలు అందించేది ఊరట కలిగించడం మాత్రమే కాక, అది సత్యము, దేవుని స్వంత వాక్యం కూడాను.
పౌలు ప్రోత్సాహకరమైన విశ్వాసాన్ని యీ విధంగా కనబరచాడు: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . నేను కూడా దేవునియందు నిరీక్షణయుంచి ఉన్నాను.’ “పునరుత్థానము,” లేదా దాని మరో పదము క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో 50 కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తుంది, యిది క్రైస్తవ విశ్వాసం యొక్క ముఖ్య బోధ అన్నట్లు మాట్లాడుతున్నాడు.—అపొస్తలుల కార్యములు 24:15; హెబ్రీయులు 6:1, 2.
చనిపోయినవారి నుండి పునరుత్థానమంటే, స్పష్టంగా మరణమనేది ఉంది. మానవునికి అమర్త్య ఆత్మ ఉందనే భావాన్ని బైబిలులో మీరెక్కడా చూడలేరు. మానవునికి అమర్త్య ఆత్మ ఉండి మరణమందు అది దేహము నుండి విడిపోయి స్వర్గానికో, నరకానికో వెళ్ళి అక్కడే నిత్యమూ ఉండే విధియైతే, లేదా మళ్ళీ జన్మిస్తే, పునరుత్థానము యొక్క అవసరమే లేదు. మరొక వైపు, మానవుని ఆత్మ అమర్త్యం కాదని, మర్త్యమేనని, అది నశించగలదని కొన్ని వందల బైబిలు లేఖనాలు చూపిస్తున్నాయి. నాస్తికత్వానికి అస్తిత్వం ఎలా విరుద్ధంగా ఉందో, అలాగే మరణం జీవానికి వ్యతిరేకమని బైబిలు ఎడతెగక చెబుతుంది.
ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినందుకు శిక్ష, మరణము లేదా నాస్తికత్వం. అది శిక్ష, అంతేగాని, వేరే ఎక్కడో అమర్త్య జీవనానికి ప్రవేశ ద్వారంగా కాదు. వారెక్కడి నుండి వచ్చారో—అక్కడికే—నేలమట్టికే తిరిగి వెళ్ళమని దేవుడు స్పష్టంగా చెప్పాడు: ‘నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.’ (ఆదికాండము 3:19) దేవుడు వారిని సృష్టించి భూమిపైన ఏదేను తోటలో ఉంచక మునుపు వారికి అమర్త్య ఆత్మ ఉండేది కాదు, వారు మరణించిన తర్వాత వారిక లేరు.
మరణము నుండి పునరుత్థానమన్నది నిద్ర, లేదా విశ్రమము నుండి మేల్కొల్పడానితో పోల్చబడింది. ఉదాహరణకు, ‘లాజరు నిద్రించుచున్నాడు; అతని మేల్కొల్పడానికి వెళ్తున్నాను.’ అని యేసు తాను పునరుత్థానం చేయబోతున్న లాజరును గూర్చి చెప్పాడు. (యోహాను 11:11) దానియేలు ప్రవక్తను గూర్చి మనమిలా చదువుతాం: ‘నీవు విశ్రాంతినొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.’—దానియేలు 12:13.
భూమి మీద నిత్య జీవము
మరణం నుండి పునరుత్థానమై వచ్చే వారికి లభించే ప్రతిఫలమేమిటి? బైబిలు రెండు రకాల పునరుత్థానాలను గూర్చి చెబుతుంది—ఒకటి పరలోక సంబంధమైనది, మరొకటి భూసంబంధమైనది. భూసంబంధమైన పునరుత్థానం ఒకప్పుడు జీవించి చనిపోయిన అధిక సంఖ్యాక ప్రజలకు ప్రతిఫలమై ఉంటుంది. దేవుని పరలోక రాజ్యంలో క్రీస్తుతో పాటు ఏలడానికి, కొద్ది మందికి మాత్రమే పరలోక సంబంధ పునరుత్థానం ఉంటుంది. (ప్రకటన 14:1-3; 20:4) భూ సంబంధమైన పునరుత్థానం ఎప్పుడు ఆరంభమౌతుంది? ప్రస్తుత దుష్ట విధానాన్ని దేవుడు నిర్మూలం చేసిన తర్వాత, “క్రొత్త భూమి” అంటే నీతిమంతుల క్రొత్త మానవ సమాజం అన్నది వాస్తవమైనప్పుడు అది ఆరంభమౌతుంది.—2 పేతురు 3:13; సామెతలు 2:21, 22; దానియేలు 2:44.
“క్రొత్త భూమి”లో రోగము, కష్టాలు యిక ఉండవు. కనీసం మరణమనేది కూడా యిక ఎన్నటికీ ఉండదు, దాని స్థానమున నిత్యజీవమనే నిరీక్షణ ఉంటుంది. “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (ప్రకటన 21:4) అలాగే కీర్తన రచయిత యిలా ప్రవచించాడు: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) దీనికి సాదృశ్యంగా యేసు యిలా చెప్పాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.”—మత్తయి 5:5.
దేవుని ఆ గొప్ప వాగ్దానాలను పునర్జన్మ సిద్ధాంతంతో పోల్చండి. ఆ తలంపు ప్రకారం, మీరు మళ్ళీ మళ్ళీ మోసపూరితమైన యీ పాత విధానంలోకే తిరిగి వస్తారు. దాని అర్థం మీరు దుష్టత్వము, కష్టాలు, రోగం, మరణం అనే అనంతమైన చక్రంలో చుట్టబడుతూనే ఉంటారు. ఎంత నిరీక్షణరహితమైన దృక్పథమది!
కాబట్టి, మీరు పూర్వం జీవించారా? మీరు మరలా జీవిస్తారా? అనే ప్రశ్నలకు బైబిలు యిలా జవాబిస్తుంది: లేదు, ప్రస్తుత జీవితం కాకుండా, మరే జన్మలోను మీరు జీవించలేదు. అయితే మీ జీవితాన్ని నిలిచేదిగా, నిజంగా, నిత్యమూ నిలిచేదిగా చేసుకోవడం సాధ్యమే. నేడు, ప్రస్తుత విధానం యొక్క “అంత్య దినములలో” లోకాంతం నుండి తప్పించుకొని, మరణం లేని దేవుని కొత్త లోకంలోనికి ప్రవేశాన్ని పొందే నిరీక్షణను మీరు కలిగివుండగలరు. (2 తిమోతి 3:1-5; ప్రకటన 7:9-15) లేదా, మీరు దేవుని కొత్త లోకం రాకముందే చనిపోయినట్లయితే, భూ పరదైసుపై నిత్యజీవం కొరకు పునరుత్థానం పొందే నిరీక్షణను కలిగి ఉండగలరు.—లూకా 23:43.
మీరు యేసుయందు విశ్వాసం కనబరచినట్లయితే, ఏం జరిగినా పర్వాలేదు, మార్త సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు యేసు ఆమెతో చెప్పిన మాటలు మీకు కూడా అన్వయించబడతాయి: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.”—యోహాను 11:25, 26. (g94 6/8)
[8వ పేజీలోని చిత్రం]
ఆదాముకు అమర్త్య ఆత్మ లేదు, అతడు చనిపోయినప్పుడు తిరిగి నేలమట్టిలో చేరాడు
[9వ పేజీలోని చిత్రం]
దేవుని వాక్యం పునరుత్థానాన్ని బోధిస్తుంది కాని, పునర్జన్మను కాదు