క్రెడిట్ కార్డులు—వాటిని మీరుపయోగించవచ్చా?
కాలిఫోర్నియాలోని ఒక వ్యక్తి, కొంతమంది చేత “మిస్టర్. క్రెడిట్ కార్డ్ ఎక్స్‌ట్రార్డినేయిర్,” అని పిలువబడ్డాడు, అతను 1,265 విలువగల క్రెడిట్ కార్డులను ప్రోగుచేశాడు. అయితే, అతను సగటు క్రెడిట్ కార్డ్ లబ్దిదారునికి ప్రాతినిధ్యం వహించడంలేదు. అయిననూ, క్రెడిట్ కార్డులను ఉపయోగించే పద్ధతి ఆధునిక పాశ్చాత్య సమాజంలో ఒక క్రమమైన భాగమై పోయిందను విషయం అందరూ ఒప్పుకుంటున్నదే.
మరి 1986లో అమెరికాలోని మూడవ వంతు గృహస్థులు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారని అమెరికన్ డెమోగ్రాఫిక్స్ పత్రిక చెబుతోంది. కేవలం అమెరికాలోనే 25,000 కంటే ఎక్కువ వేర్వేరు క్రెడిట్ కార్డులు లభ్యమౌతున్నాయి. చమురు కంపెనీలు, చిల్లర దుకాణాలు, మరియు విమానయాన సంస్థలు తమ తమ స్వంత కార్డులను యిస్తారు. అమెరికన్లు 1991లో 23 కోట్ల 20 లక్షల విలువచేసే మాస్టర్ కార్డ్‌లను వీసాలను కలిగి ఉండిరి. ఈ రెండూ ప్రఖ్యాతిగాంచిన కార్డులు.
ప్లాస్టిక్-డబ్బుగా పిలువబడుతున్న దాని పరిశ్రమ, ఆసక్తిగల వినియోగదారుల సహాయార్థం పోటీపడుతున్న బ్యాంకులు, ఋణాలిచ్చే కంపెనీల మధ్య తీవ్రమైన పోరాటాన్ని రేపుతూ ఐరోపాలో కూడ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య వంద కోట్లకుపైగా ఉంది! అవి అంత ఎక్కువగా ఎందుకు ఉన్నాయి? వాటిని ఉపయోగించడం వలన ఎవరు ఎక్కువ లాభం పొందుతారు? క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నవారు ఎదుర్కొనే కొన్ని ప్రమాదాలు, సమస్యలు ఏమిటి?
ఎవరు లాభం పొందుతారు?
బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు కేవలం ఫీజులు అంటే వార్షిక సభ్యత్వ ఫీజు, నిర్ణీత సమయానికి బిల్లును చెల్లించనందున కట్టవలసిన ఫీజు, కంపెనీవారు నియమించినంత డబ్బుకంటే ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టినందున వసూలు చేయబడే ఫీజు మాత్రమే కాక వారికి అప్పున్న డబ్బుపై వారు తీసుకునే అధికవడ్డీ వలన కూడ వారు చాలా ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. కానీ క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారు ఎక్కువ అప్పులను చేయకపోతే వారు ఆర్థిక వ్యయాలనుండి లాభం పొందలేరు. కేవలం అమెరికాలోనే, లక్షలాదిమంది ప్రజలు ఇష్టపూర్వకంగా తమను తాము ఈ శాశ్వత అప్పులకు అర్పించుకున్నారు. అమెరికాలో క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నవారిలో 75 శాతంమంది తమ బ్యాంకు ఖాతాల్లో ఇంకా చెల్లించని ఋణాలను కలిగి ఉన్నారు, మరి వారు దానికై ప్రతి నెల అధిక వడ్డీని చెల్లించాలి. అమెరికాలో క్రెడిట్ కార్డు కలిగి ఉన్న సగటు వ్యక్తి తన నెలసరి ఆదాయంలో 2,000 డాలర్ల వరకు ఋణపడి ఉంటాడు.
“కార్డు లబ్దిదారుల్లో 15 నుండి 20 శాతం మంది తమ బిల్లులు వచ్చిన వెంటనే వాటిని పూర్తిగా చెల్లించినప్పటికీ, బ్యాంకు నిర్వహణకు అవి ఏమాత్రం దోహదపడవు.” అని ఆల్ గ్రెఫిన్ ది క్రెడిట్ జంగిల్ అనే తన పుస్తకంలో చెబుతున్నారు. ఆయనింకా యిలా అన్నారు: “మిగిలిన 80 నుండి 85 శాతం మంది కార్డు లబ్దిదారులు క్రెడిట్ కార్డు పథకాన్ని బ్యాంకు కలిగి ఉన్న వాటన్నిటిలోకెల్లా లాభదాయకమైన పథకంగా చేస్తారు. 10 మిలియన్ డాలర్ల విలువచేసే బ్యాంకు కార్డులను కలిగియున్న అతి చిన్న సంస్థ సంవత్సరానికి 1.8 మిలియన్ డాలర్ల లాభాన్ని తీసుకురాగలదు.” క్రెడిట్ కార్డు వ్యాపారంలో 1990లో అతి పెద్ద షేరు కలిగి ఉన్న యు.ఎస్ బ్యాంకు తన వినియోగదారుల సేవలో, ముఖ్యంగా క్రెడిట్ కార్డులు గలవారికి ఆర్థిక సహాయం చేయడంలోనే 100 కోట్ల డాలర్లు గడించింది.
ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త
ఈ చిన్న ప్లాస్టిక్ ముక్కలకు ఇంకో ప్రతికూలమైన కోణంకూడ ఉంది. ఉదాహరణకు, మీరు ఒక బహుమతిని గెల్చుకున్నారని మీకు తెలియజేస్తూ ఒక అనామక కంపెనీనుండి వచ్చిన టెలిఫోను పిలుపును మీరు ఎప్పుడైనా అందుకున్నారా? చాలామంది అలా అందుకున్నారు. మీ బహుమతిని పొందడానికి మీరు చేయవలసిందల్లా కొన్ని సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం. కానీ టెలిఫోను చేసిన వ్యక్తి మీ క్రెడిట్ కార్డు సంఖ్య అడుగుతాడు. ఎందుకు? ఎందుకంటే వాస్తవానికి మీరు ఏ బహుమతిని గెలుచుకోలేదు. పోస్టు ఖర్చులు లేక టెలిఫోను ఖర్చులను మీ ఖాతాలో వేయడానికి ఆ విధంగా అడిగే వ్యక్తికి కేవలం మీ క్రెడిట్ కార్డు సంఖ్య కావాలి.
ప్రతి సంవత్సరం కోట్ల డాలర్లు ఖరీదు చేసే అనేక రకాలైన క్రెడిట్ కార్డు మోసాలు జరుగుతున్నాయి. మరి యీ సమస్యను మీరు నేరుగా ఎదుర్కొనక పోయినా, ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు ఉంటే, బహుశా మీరు ఎక్కువ ఫీజులు మరియు వడ్డీ లెక్కల ద్వారా అటువంటి కుంభకోణాలకు డబ్బు చెల్లిస్తుండవచ్చు.a
క్రెడిట్ కార్డుల్లోని అసలైన ప్రమాదం, మీరు అప్పుల్లో కూరుకుపోతే వచ్చే కష్టాలు మరియు శ్రమల్లోనే ఉంది. “డబ్బు చెల్లించి కొనవలసి వస్తే తాము భరించలేని విలువైన వస్తువులను, సేవలను పొందాలన్న శోధనను ఎదిరించగల అనేకమంది ప్రజలు తమ చేతిలో క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు ఆ శోధనను ఎదిరించడంలో పూర్తిగా నిస్సహాయులు అవుతున్నారు. చాలా కుటుంబాలు అంతకుముందు నెలలో క్రెడిట్ కార్డు మీద ఖరీదైన భోజనం చేసి దానిని చెల్లించిన తరువాత రెండు వారాలు సాధారణ భోజనం తిని గడుపుతున్నారు” అని ది క్రెడిట్ జంగిల్ చెబుతోంది.
మీ జీతంలో ఎక్కువభాగాన్ని మీ అప్పులే తినేస్తే మీ భోజన అలవాట్లకంటే ఇంకా ఎక్కువే నష్టానికి గురౌతాయి. క్రెడిట్—ది కట్టింగ్ ఎడ్జ్ అనే పుస్తకం “సగటున, ఒక అమెరికా దేశస్థుడు ఋణాలను, అప్పులను, మరియు క్రెడిట్ కార్డులను తీర్చడానికి తన నెలసరి ఆదాయంలో ఇంచుమించు 75 శాతం ఖర్చుపెడతాడని” నివేదిస్తుంది.
దుఃఖకరంగా, చాలామంది వినియోగదారులకు, క్రెడిట్ కార్డు, ఆర్థిక ఉద్యానవనానికి నడిపే ద్వారం కాదుగాని, దీర్ఘకాల అప్పులు మరియు చింతకు గురిచేసే జారుడు నేలే. ఉదాహరణకు, అమెరికాలోని వినియోగదారులు, గత కొద్ది సంవత్సరాలుగా క్రెడిట్ కార్డు అప్పులు ఎంత ఎక్కువగా చేశారంటే, అందు మూలంగా క్రెడిట్ కార్డు నేరాలు, నిర్ణీతకాలానికి పైకం చెల్లించకపోవడం, మరియు దివాలా తీయడాలు మరీ ఎక్కువయ్యాయి. అమెరికా వినియోగదారులు, 1990లో క్రెడిట్ కార్డులపై, కారు రుణాలపై, తాకట్లపై మొత్తం 3 లక్షలా 20,000 కోట్ల డాలర్లు అప్పులపాలయ్యారు! సగటు గృహస్థులు 35,000 డాలర్ల అప్పులో కూరుకుపోయి, ప్రతి సంవత్సరం 3,500 డాలర్ల వడ్డీ చెల్లించారు.
అంత ఆశ్చర్యం కలిగించనిదేమిటంటే, వ్యక్తిగతంగా దివాలా తీయడం మరీ ఎక్కువయ్యింది. మరి 1990లో 7,20,000 మంది అమెరికా వాసులు ఆర్థికంగా దివాలా తీసినట్లు నివేదించబడింది, అది 1989పై 17 శాతం అధికం. ఈ సంఖ్య 1991లో 8,00,000కు పెరిగింది, 1992లో వ్యక్తిగతంగా దివాలా తీసినవారి సంఖ్య 9,71,517కి చేరి ఒక క్రొత్త రికార్డు సృష్టించింది.
క్రెడిట్ కార్డులను ఉపయోగించే తమ అలవాటును అదుపు చేసుకొన లేమని తలంచినవారు కొంతమంది వాటిని ఉపయోగించకుండా మానుకొనడానికే నిర్ణయించుకున్నారు. అయినప్పటికిని, చాలామంది తమ జీవితాలను అనవసరంగా చిక్కుల్లో పడవేసుకొనకుండా క్రెడిట్ కార్డులను వివేకవంతంగా ఉపయోగించగల్గుతున్నారు. (g93 12/8)
[అధస్సూచీలు]
a క్రెడిట్-సార్డు మోసాలను తప్పించుకొనే మార్గాలను గూర్చిన సమాచారం కొరకు డిశంబరు 8, 1986, అవేక్!లోని “క్రెడిట్ కార్డ్స్—ఎ ‘ప్లాస్టిక్ ట్రాప్’?” అనే శీర్షికను దయచేసి చూడండి.