ప్రపంచ పరిశీలన
ఎలుక ఆరాధన?
భారతదేశంలోని దేశ్‌నోక్ గ్రామమందలి కర్నీమాతా ఆలయాన్ని ప్రతిరోజు దాదాపు 1,000 మంది ఆరాధికులు, 70 మంది సందర్శకులు దర్శిస్తారు. ఎందుకు? విగ్రహాలకు భక్తులు అర్పణలు అర్పిస్తుండగా దాదాపు 300 ఎలుకలు ఆ ఆలయంలో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఎలుకలు “పూజింపబడుతున్నాయి, వాటి ప్రతి అవసరత అంకితులైన ఆరాధికులచే తీర్చబడుతుంది” అని న్యూజీలాండ్ ఈవినింగ్ పోస్ట్ తెలియజేస్తున్నది. ఆలయ అర్చకులు, ఎలుకలు ఒకే పాత్రలలో నుండి తింటారు, ఒకే నీటిని త్రాగుతారు. అర్చకులలో ఒకరు “ఇవి ఎలుకలు కావు, దేవుని దూతలు, దేవత మాకిచ్చిన వరం” అని తెలియజేస్తున్నారు. పోస్ట్ అనే ఆ పత్రిక తెలియజేసిన ప్రకారం, ఆలయ అర్చకులు చనిపోయినప్పుడు, వారు ఎలుకలుగా తిరిగి జన్మించడం ద్వారా రక్షణ పొందుతారని అర్చకుడు చెప్పాడు. ఎలుకలు చనిపోయినప్పుడు, అవి అర్చకులుగా తిరిగి జన్మిస్తాయని కూడా ఆయన చెప్పాడు. (g93 11/8)
బైబిలు భాగాలు రెండు వేలకంటే ఎక్కువ భాషల్లో ఉన్నాయి
బైబిలు భాగాలు, 1992 సం.లో 31 కంటే ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయని యునైటెడ్ బైబిల్ సొసైటీస్ (యు.బి.యస్.) ప్రకటించింది; అందుచేత బైబిలులో కనీసం ఒక పుస్తకమైనా లభించే భాషల మొత్తం సంఖ్య ఇప్పుడు 2,009కు చేరింది. బైబిలు భాగాలను యు.బి.యస్. 419 అదనపు భాషల్లోకి అనువదిస్తుంది కాబట్టి త్వరలోనే ఈ సంఖ్య పెరుగుతుంది. పూర్తి బైబిళ్లు ఇప్పుడు 329 భాషల్లో, “క్రొత్త నిబంధన“ 770 ఇతర భాషల్లో లభ్యమౌతున్నాయి. “ప్రపంచంలో మొత్తం భాషలు 5,000 నుండి 6,500 వరకు ఉన్నట్లు అంచనా వేయబడుతున్నది” అని ఎకుమెనికల్ ప్రెస్ సర్వీస్ వ్రాస్తున్నది. ఆసక్తికరంగా, 1993 నాటికి వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సంస్థ మొత్తంగా, లేక భాగంగా బైబిళ్లను తయారు చేసిన సంఖ్య మొత్తం 8.3 కోట్ల కంటే ఎక్కువే. (g93 10/22)
ప్రయోజనకరమైన పాత రబ్బరు టైర్లు
బ్రెజిల్‌లో, ప్రతి సంవత్సరం 1.7 కోట్ల కారు టైర్లను మార్చవలసివస్తుంది. అయితే, అలాంటి పాత టైర్ల రబ్బరును కరిగించి, దానితో రహదార్లను సమంగా చేయటానికి ఉపయోగించే అస్పాల్ట్‌ను కలపడం ద్వారా వాటిని మళ్లీ ఉపయోగించవచ్చని సూపరిన్‌టెరెస్సాన్‌టె పత్రిక తెలియజేస్తున్నది. రబ్బరు టైర్లను కరిగించి వాడడం క్రొత్తదేమి కాకపోయినప్పటికీ, అస్పాల్ట్‌లో టైర్లను వాడటం క్రొత పద్ధతే. ఈ పద్ధతి “భూగ్రహంపై పేరుకుపోతున్న పెద్ద పెద్ద చెత్త కుప్పలను బాగా తగ్గిస్తుందని” అనుకుంటున్నారు. (g93 10/22)
కలరాను నిరోధించటం
బ్రెజీలియన్ పత్రికయైన మాన్‌షెటె ప్రకారం, రెడ్ వైన్ వినిగర్ కలరా వ్యాప్తిని నిరోధించగలదు. కలుషితమైన కూరగాయలను శుభ్రపరచడంలో రెడ్ వినిగర్ వందరెట్లు ప్రభావవంతమైనదని సావొ పౌలోలోని ఫుడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సప్లైస్ నిర్వహించిన ఒక పరీక్షలో వెల్లడైంది. ఒక విధమైన కూరాకు మొక్కపై ఉండే కలరా సూక్ష్మక్రిములను వినిగర్ 10,000 రెట్లు తగ్గిస్తే, క్లోరినేటెడ్ నీళ్లు కేవలం 100 రెట్లు మాత్రమే తగ్గించిందని ఆ పత్రిక నివేదించింది. ప్రతి పావులీటరు నీటికి ఐదు చెంచాల వినిగర్ కలిపిన ద్రావకం సిఫారసు చేయబడుతున్నది. (g93 11/8)
రాబీస్ పునరాగమనం
దక్షిణాఫ్రికాలోని నేటల్ ప్రాంతంలో పుట్టి ఒకప్పుడు నిర్మూలించబడిన రాబీస్ మళ్లీ విజృంభిస్తుంది. నేటల్ ప్రాంతానికి పొరుగు దేశమైన మొజాంబిక్‌లో, అనేకులు తమ గ్రామీణ ప్రాంతాలను వదిలి నగర ప్రాంతాలకు తమ పెంపుడు జంతువులతో సహా వలస వచ్చారు. తమ స్థలాలను విడిచి వచ్చిన ఈ ప్రజలకు టీకాలు వేసే అవకాశం లేకపోయింది. ఆ ప్రాంతంలో 1992లో 300 కంటే ఎక్కువ రాబీస్ కేసులు రిపోర్టు చేయబడ్డాయి. తత్ఫలితంగా 29 మంది పిల్లలు మరణించారు. జంతువైద్య సేవల ప్రాంతీయ అధ్యక్షుడైన పాల్ క్లోయెక్ భయంతో ఇలా అంటున్నాడు: “తాత్కాలిక నివాసాలలో జీవిస్తున్న అనేకమందిని సమీపించడం ఎంతో కష్టతరంగా ఉంది. రాజకీయ దౌర్జన్యం, సామాజిక ఆటంకాలు, గుంపుల భయం మా కార్యక్రమాలను ఆటంకపరుస్తున్నాయి.” (g93 10/22)
జాజ్‌తో బౌద్ధమతం
ఒక విచిత్రమైన సమైక్యతతో, జపాన్ అంతటి నుండి వేలాదిమంది బౌద్ధ భిక్షువులు, టోక్యో యొక్క పెద్ద నిప్పోన్ బుడోకాన్‌లో ప్రముఖ జాజ్ సంగీతకారులతో శామ్యో మరియు జాజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి సమావేశమయ్యారు. శామ్యో అంటే ప్రాధమికంగా, పాశ్చాత్య సంగీతానికి ఎంతో వేరైయున్న, భారతీయ పద్ధతిలో వుండే, ఆధునికీకరించబడిన మంత్రోచ్ఛరణ లేక పాటలే. జాజ్ సంగీతకారులు వారి పలువిధాలైన సంగీతంతో కూడా, తమ సంగీతానికి మంత్రాలను కలపటానికి ఏమాత్రం కష్టపడలేదు. “మతంలో ఆత్మీయ మేలుకొల్పు ఆధునికీకరణతో దగ్గరి సంబంధాన్ని కలిగివున్నదని నేననుకొంటున్నాను,” అని ఒక పేరుపొందిన జాజ్ పియానో విద్వాంసుడు అన్నట్లు ది డైలీ యమూరి తెలియజేస్తుంది. ఇంకా ఆయనిలా అన్నాడు: “కొన్నిసార్లు నేను కాదు గాని వేరే లోకం నుండి ఏదో వింత శక్తి పియానో వాయిస్తున్నట్లు నేను భావిస్తాను.” (g93 10/22)
“ప్రపంచంలో హత్యల రాజధాని”
“జొహన్నాస్‌బర్గ్ వాస్తవానికి ప్రపంచంలో హత్యల రాజధానిగా పేరు పొందింది,” అని ఒక దక్షిణాఫ్రికా వార్తాపత్రిక అయిన ది స్టార్ తెలియజేసింది. “పోలీసుల లెక్కల ప్రకారం, జొహన్నాస్‌బర్గ్ మరియు సొవెటొ రెండింటిలో కలిపి 1992లో 3 402 హత్యలు జరిగాయి అంటే ఒక రోజుకు 9,3 చొప్పున లేక ప్రతి రెండున్నర గంటలకు ఒక హత్య జరిగాయి.” ఇది మునుపటి “హత్యల రాజధాని” అయిన రియో డె జనెయిరోను రెండవ స్థానానికి నెట్టివేసింది. గత దశాబ్దానికి రియోలో ప్రతి సంవత్సరం సగటున 8,722 హత్యలు జరిగాయి. అయినా, రియో జనాబా 1 కోటికి మించగా, జోహన్నాస్‌బర్గ్ మరియు సావెటోల జనాబా 22 లక్షలే. జోహన్నాస్‌బర్గ్‌కు సమానమైన జనాబా గల పారిస్‌లో సంవత్సరానికి సగటున 153 హత్యలు జరిగాయి. హత్యలు జరిగే అవకాశాలు ఇలా ఇవ్వబడ్డాయి: జోహన్నాస్‌బర్గ్‌లో 647 మందికి ఒకటి; రియో డి జనెయిరోలో 1,158 మందికి ఒకటి; లాస్ ఏంజిల్స్‌లో 3,196 మందికి ఒకటి; న్యూయార్క్‌లో 4,303 మందికి ఒకటి; మియామిలో 6,272 మందికి ఒకటి; మాస్కోలో 10,120 మందికి ఒకటి; పారిస్‌లో 14,065 మందికి ఒకటి. (g93 11/8)
తప్పిపోతున్న పిల్లలు
ఇటలీలో ప్రతి సంవత్సరం వందలాదిమంది పిల్లల ఆచూకి లేకుండా పోతున్నారు. అనేకమంది ఉదయం పాఠశాలకు వెళ్లటానికి ఇంటి నుండి బయలుదేరి ఇక ఎన్నటికీ తిరిగిరారు. కేవలం 1992లోనే 734 మంది పిల్లలు అదృశ్యమయ్యారు, గత సంవత్సరం కంటే 245 మంది ఎక్కువ. ఇటలీ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, క్రొత్తగా 3,063 కేసుల గురించి తెలిసింది. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువమంది అదృశ్యమవుతున్నారు. (g93 10/22)
మిమ్మల్నేది సంతోషపరుస్తుంది?
అధిక డబ్బు ప్రజలను సంతోషభరితులను చేయలేదనడం వాస్తవమే. సైకాలజీ టుడే పత్రిక ఇలా అంటున్నది: “ఒకరి ఆదాయం ఒకసారి దారిద్ర్యరేఖను దాటిన తరువాత, రాబడిలో పెరుగుదలకు వ్యక్తిగత సంతోషానికి చాలా తక్కువ సంబంధంవుంటుంది.” ఈ క్రింది విషయాలు సంతోషానికి ప్రాముఖ్యమని చెప్పబడ్డాయి: “వాస్తవమైన ఆశాజనకదృష్టి; కలుపుగోలుగా ఉంటూ స్నేహం చేయటం; తన జీవితం అదుపులో ఉందన్న భావం, అందులో “ఒకరి సమయాన్ని ప్రభావవంతంగా నడిపించుకోవడం” చేరివుంది; మరియు “చురుకైన మతసంబంధ విశ్వాసం” కలిగివుండటం మంచిది. (g93 10/22)
మానివేయటానికి సమయమింకా మించిపోలేదు
మీరు పొగత్రాగటం ఎంత త్వరగా మానేస్తే, శ్వాసకోశ క్యాన్సరుతో చనిపోయే అవకాశం అంత తగ్గుతుంది. ఇటీవల 9,00,000 మంది అమెరికా దేశస్థులపై చేయబడిన పరిశీలన ఈ విషయాన్ని వెల్లడిచేసిందని ది లాన్‌సెట్ తెలియజేసింది. పొగత్రాగని ప్రజల్లో 1,00,000 మందికి 50 కంటే తక్కువమందే డెబ్భై ఐదు సంవత్సరాలు రాకముందు శ్వాసకోశ క్యాన్సరుతో మరణించారు. తమ 30వ పడిలో పొగత్రాగటం మానివేసిన పురుషులలో, మరణ రేటు దాదాపు 1,00,000 మందికి 100కు పెరిగింది. తమ 60వ పడిలో మానేసిన వారిలో, మరణాలు 1,00,000 మందికి 550కి పెరిగింది. అసలు మానేయని వారిలో, శ్వాసకోశ క్యాన్సరు వల్ల 1,00,000 మందికి 1,250 మంది చనిపోయారు. శ్వాసకోశ క్యాన్సరు మరణాలరేటు స్త్రీలలో తక్కువగా ఉన్నా, దాదాపు ఇదే మాదిరిగా ఉంది. (g93 10/22)
పరిశోధనాశాలలో పొరపాట్లు
వైద్య పరిశోధనాశాలల్లో జరిగే పొరపాట్ల మూలంగా ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ప్రజలు చనిపోవటం లేక తీవ్ర అనారోగ్యానికి గురికావటం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. రోగాన్ని పరిశోధించి, ధ్రువపర్చడానికి రక్తం మరియు మానవ ధాతువులను పరీక్షించటంలో పరిశోధనాశాలలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. తప్పుడు పరీక్షా ఫలితాలు తప్పు వ్యాధి నిర్ణయానికి, తప్పుడు చికిత్సకు దారి తీయవచ్చు. ఈ సమస్యను గూర్చి చర్చించటానికి గత ఏప్రిల్ నెలలో, ప్రపంచమంతటిలోని 90 కంటే ఎక్కువమంది నిపుణులు స్విట్జర్‌లాండ్ నందలి జెనీవాలో సమావేశమయ్యారు. (g93 10/22)
“మహానగరాలు”
“ఈ శతాబ్దం తిరిగేసరికి, ఒక కోటి లేక ఎక్కువ జనాబా గల 21 ‘పెద్ద నగరాలు’ ఉంటాయి, వీటిలో కొన్ని ప్రపంచంలోని అతిపేద దేశాలతో సహా 18 వర్ధమాన దేశాల్లో ఉంటాయి” అని టైమ్ పత్రిక అంటున్నది. ఇప్పటికే 13 దేశాలు తమ నగర ప్రాంతాల్లో ఒక కోటి లేక ఎక్కువమంది ప్రజలు ఉన్నట్లు లెక్కలువేసి ఉంచాయి. దాదాపు 2 కోట్ల 60 లక్షల మంది నివాసులతో టోక్యో ముందుండగా, దాని వెనుక సావొ పౌలో, న్యూయార్క్ నగరం, మెక్సికో నగరం, శాంగాయ్, బొంబాయి, లాస్ ఏంజిల్స్, బ్యూనోస్ ఎయిర్స్, సియోల్, బీజింగ్, రియో డి జనెయిరో, కలకత్తా, జకార్తా ఉన్నాయి. ఆఫ్రికాలోని కొన్ని నగరాల్లో సంవత్సరానికి 10 శాతం జనాబా పెరుగుతుంది, ఇది పట్టణ నివాస చరిత్రలో మునుపెన్నడూ నమోదు చేయబడని వేగంగా పెరుగుతున్నదని ప్రపంచ బ్యాంకు చెబుతున్నది. అధిక జనాబాలతో తరచూ అధిక కాలుష్యం, వ్యాధిభయం వెన్నంటి ఉంటాయి. (g93 10/22)
బాలల హంతకులు
వర్థమాన ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఒక కోటి ముప్పయి లక్షల పిల్లల్లోని దాదాపు మూడింట రెండొంతులమంది మరణించటానికి మూడు వ్యాధులు కారణమౌతున్నాయని ఆఫ్రికా వార్తాపత్రికయైన లెసోతో టుడే తెలియజేసింది. ఈ వ్యాధులు ఏవంటే, నిమోనియా, అతిసార వ్యాధి మరియు తట్టు. అలాంటి వ్యాధులను అందుబాటులోవున్న, ఖర్చులు భరించగల సాధనముల ద్వారా చికిత్సచేయవచ్చు, లేక నివారించవచ్చునని కూడా ఆ నివేదిక అంటున్నది. ఉదాహరణకు, అతి పెద్ద బాలల హంతకియైన నిమోనియా సంవత్సరానికి 35 లక్షల బాల మరణాలకు కారణమైంది. అనేక కేసులలో సమస్య అతి సూక్ష్మజీవులకు సంబంధించినది, అమెరికా డాలరులో 25 సెంట్లు ఖరీదు చేసే మందుతో, ఐదు రోజులపాటు చేసే వైద్యంతో దీన్ని అదుపుచేయవచ్చు. అతిసారవ్యాధి సంవత్సరానికి 30 లక్షల మంది చిన్నారుల మరణాలకు కారణమౌతున్నది. ఎక్కువ ఖరీదులేని, నోటిద్వారా తీసుకునే మందుల వైద్యాన్ని తలిదండ్రులు వాడితే, వాటిలో సగం మరణాలను అరికట్టవచ్చు. తట్టువల్ల ప్రతి సంవత్సరం 8,00,000 బాల మరణాలు సంభవిస్తున్నాయి. టీకాల ద్వారా దీన్ని అరికట్టవచ్చునని నివేదిక సూచిస్తున్నది. ఒక బాలుడికి ఆ టీకా మందు 50 సెంట్లకంటే తక్కువ ఖరీదుకే లభ్యమవుతుంది. (g93 11/8)