మా పాఠకులనుండి
ప్రత్యామ్నాయ మాతృత్వం “ప్రత్యామ్నాయ మాతృత్వం—క్రైస్తవులకు తగునా?” (జూన్ 8, 1993) అనే శీర్షికలో, “నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనము చేయకూడదు” అనివున్న లేవీయకాండము 18:20ని మీరు ఉదహరించారు. అయితే కింగ్ జేమ్స్ వర్షన్ కేవలం ఇలా చెబుతున్నది: “నీవు నీ పొరుగువాని భార్యతో శారీరకంగా శయనించకూడదు.” ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ మరియు న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ కూడా అలాగే వ్రాశాయి. మీరు లేఖనాలను మారుస్తున్నారు. దేవుని మూలవాక్యం ఏమని తెలియజేస్తున్నది?
ఎస్. ఎస్., అమెరికా
చాలా తర్జుమాలు ఈ వచనాన్ని భావానువాదం చేశాయి. “న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్” దాన్ని అక్షరార్థంగా అనువదించింది, “ది ఎన్.ఐ.వి. ఇంటర్‌లీనియర్ హీబ్రూ-ఇంగ్లీష్ ఓల్డ్ టెస్ట్‌మెంట్” మరియు “ది ఇంటర్‌లీనియర్ హీబ్రూ/గ్రీక్ ఇంగ్లీష్ బైబిల్” కూడా అలాగే చేశాయి. ఈ రెండవది ఆ వచనాన్ని ఇలా అనువదించింది: “నీవు నీ సంయోగభీజమును నీ పొరుగువాని భార్యకు ఇవ్వకూడదు.”—ఎడిటర్.
కన్నీళ్లు “కన్నీళ్లన్నీ ఎందుకు వస్తాయి?” (జనవరి 8, 1993) అనే శీర్షిక నన్ను బాగా కదిలించింది. మనం ఎందుకు ఏడుస్తామో, కన్నీళ్ల పాత్ర ఏమిటో తెలుసుకోవాలని నేను కొద్ది రోజులుగా అనుకుంటున్నాను. చక్కగా వ్రాసిన యీ శీర్షిక కొరకు మీకు కృతజ్ఞతలు, చివరకు ఆ విషయం నాకు అర్థమైంది. మనల్ని మహాద్భుతమైన విధంగా సృష్టించినందుకు యెహోవా యెడల నాలో అది ఎంతో కృతజ్ఞతాభావాన్ని కలిగించింది.
ఎఫ్. జి., పోర్చుగల్
ఇంట్లో విద్యాబోధన “ఇంట్లో విద్యాబోధన—మీ కొరకా?” (జూలై 8, 1993) అనే శీర్షిక కొరకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేయాలనుంది. నా నలుగురు పిల్లలలో ఇద్దరికి నేను ప్రస్తుతం ఇంటివద్దనే విద్య నేర్పిస్తున్నాను. నేను నా పిల్లలను మరీ ఎక్కువగా కాపాడుతున్నానని చాలాసార్లు ఇతరులు నాకు చెప్పారు. కాబట్టి, ఈ విషయంలో మీరు వహించిన తటస్థ వైఖరి గొప్పగా మెచ్చుకొన తగింది.
బి. డబ్ల్యూ., అమెరికా
అత్యాచారం “అత్యాచారం—స్త్రీకి భయంకరమైన పీడకల” అనే అంశం ఉన్న జూన్ 8, 1993 సంచికను అందుకున్నప్పుడు నేను రెండు విధాలైన భావాలను కలిగివున్నాను. పూర్తికాల సువార్తికురాలైన నా తల్లి అనేక సంవత్సరాల క్రితం తన ఇంట్లోనే దౌర్జన్యానికి, అత్యాచారయత్నానికి గురైంది. ఈ శీర్షికలను చదవటంవల్ల కుదుట పడడానికి అవి సహాయం చేశాయి.
పి. జి., అమెరికా
వలసవెళ్లడం “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . మరింత సంపన్నమైన దేశానికి నేను తరలివెళ్లాలా?” (ఆగస్టు 8, 1993) అనే శీర్షిక కొరకు కృతజ్ఞత తెలియజేయటానికి నేనానందిస్తున్నాను. నా వయస్సు 16 సంవత్సరాలు, నేను జీవితంలో మంచి అవకాశాలు దొరికే దేశానికి వెళ్లాలనుకున్నాను. కాని ఈ శీర్షిక చదివిన తరువాత, మనమెక్కడ జీవిస్తామన్నది ప్రధానం కాదని భావిస్తున్నాను. మన జీవితాల్లో యెహోవా రాజ్యానికి మొదటి స్థానం ఇస్తే, యెహోవా మనకు సహాయం చేస్తాడు గనుక మనం కచ్చితంగా [ఆత్మీయంగా] ధనవంతులౌతాము.
వి. ఎల్. ఎ., బ్రెజిల్
ఆతిథ్యమివ్వటం “మీరు మీ స్నేహితులకు ఆతిథ్యమిచ్చుటకు ఇష్టపడతారా?” (సెప్టెంబరు 8, 1993) అనే శీర్షిక కొరకు మిమ్మల్ని మెచ్చుకుందామని వ్రాస్తున్నాను. ఒక సంగీతంలో ఆసక్తిగలవానిగా నేను దాని నుండి గొప్ప మేలు పొందాను. ఆడటం, పాడటం ద్వారా సాంఘిక సమావేశాలను ఉత్తేజకరం చేయటానికి నా స్నేహితులు నన్ను తరచూ ఆహ్వానిస్తుంటారు. ఒక ప్రదర్శన పట్టికను సిద్ధం చేసుకుని, ప్రేక్షకులను కూడా కార్యక్రమంలో చేర్చుకోవటాన్ని గూర్చిన మీ సలహాలు ఎంతో అద్భుతం!
పి. ఎస్. ఎస్. ఎమ్., బ్రెజిల్
గర్భస్రావం “గర్భస్రావం—జీవాన్ని ఇవ్వటం తీసివేయటం” (సెప్టెంబరు 8, 1993) అనే మీ శీర్షికల పరంపర నాకు కన్నీళ్లను, హృదయ వేదనను కలిగించాయి. నేను ఈ సమాచారాన్ని ఎనిమిదేళ్ల క్రితమే చదివి ఉంటే, నేను గర్భస్రావం చేయించుకొని ఉండేదాన్నే కాదు. ఇప్పటికే తండ్రియై ఉండవలసిన నా భర్త యెదుట నేను ఈ పాపాన్ని ఒప్పుకోటానికి నాకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది. గర్భస్రావం గురించి ఆలోచిస్తున్న ఎవరైనా ఈ శీర్షికలు చదివి జీవం అమూల్యమైనదని, దేవుడిచ్చిన బహుమానమని గ్రహించుకుంటారని నేను ఆశిస్తున్నాను.
జి. డి., అమెరికా
నా వయస్సు 16 సంవత్సరాలు, మేము గర్భస్రావం గురించి బడిలో నేర్చుకున్నాం. అయినా, నేను బిడ్డకు కలిగే నొప్పి ఏమిటో గ్రహించలేదు. నేను ఈ పత్రిక చదివినప్పుడు, ఆపుకోలేని కన్నీళ్లతో పాటు నాకు చాలా కోపం వచ్చింది. యెహోవా కనికరంతో ఇచ్చే ప్రశస్తమైన జీవాన్ని ప్రజలు అంత తేలిగ్గా ఎలా దృష్టించగలరు?
ఎన్. కె., జపాన్
నేను ఈ పత్రికను నాతోపాటు బడికి తీసుకువెళ్లాను, విద్యార్థులందరూ దాన్ని ఇష్టపడటం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది! అది నా తరగతివారి హృదయాలను ఎంతగా స్పర్శించిందంటే, ఒక అమ్మాయి ఆపుకోలేక ఏడ్చేసింది కూడా. కొన్ని రోజుల క్రితమే ఆమె గర్భస్రావం చేయించుకుంది.
ఎల్. ఎస్., అమెరికా