కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 2/8 పేజీలు 24-27
  • మారణహోమానికి ప్రత్యక్ష నిదర్శనం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మారణహోమానికి ప్రత్యక్ష నిదర్శనం
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గుర్తుంచుకోవలసిన ఒక యాత్ర
  • బోధించటానికి ఒక ప్రదర్శనశాల
  • మారణహోమాన్ని తప్పించుకున్నవారు
  • ప్రదర్శనశాల విలువ
  • మారణహోమంలో యెహోవాసాక్షుల్ని చంపేయడం—బైబిలు ఏం చెప్తోంది?
    అదనపు అంశాలు
  • మారణహోమం ఎందుకు జరిగింది? దేవుడు దాన్ని ఎందుకు ఆపలేదు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ధైర్యంగా యథార్థతను కాపాడుకున్న వ్యక్తులు, నాజీ హింసపై విజయం సాధించారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మేము హిట్లర్‌ యుద్ధానికి మద్దతునివ్వలేదు
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 2/8 పేజీలు 24-27

మారణహోమానికి ప్రత్యక్ష నిదర్శనం

పూర్తిగా దిగజారిపోయిన మానవత్వాన్ని ప్రదర్శిస్తున్న స్థలంలోకి ప్రవేశిస్తుండగా మీకు, “మీరు నాకు సాక్షులు,” అన్న పరిశుద్ధ గ్రంథంలోని మాటలు రాతిపై చెక్కబడివుండటం చూస్తే వింతగా తోస్తుంది. అయినా, బైబిలులోనుండి కనీసం ఆ లేఖనం ఉదహరింపబడటానికి ఇదే తగినస్థలంలా కన్పిస్తుంది.—యెషయా 43:10.

వాషింగ్‌టన్‌, డి.సి.లో ఏప్రిల్‌ 22, 1993న ప్రారంభమైన ది యునైటెడ్‌ స్టేట్స్‌ హోలోకాస్ట్‌ మెమోరియల్‌ మ్యూజియం, నైతిక విలువలు లేని రెచ్చగొట్టే నాయకుల మూలంగా మూగవోయిన మరణకర యంత్రంగా మారిన సాంకేతిక పరిజ్ఞానానికి సంపూర్ణమైన, స్థిరమైన జ్ఞాపికగా నిలిచియుంది. నాజీ నిరంకుశత్వానికి బలియైన వారిని, తమను తాము రక్షించుకోలేనివారిని—అంటే దాదాపు 60 లక్షలమంది యూదులు, లక్షలాదిమంది పోలండ్‌ దేశస్థులు, స్లావ్‌ జాతీయులు, యెహోవాసాక్షులు, సంచారజాతివారు, సలింగసంయోగులు, వికలాంగుల వంటి ఇతర ప్రజల జాబితాను చూస్తే మన మనస్సు మొద్దుబారిపోతుంది.

గుర్తుంచుకోవలసిన ఒక యాత్ర

పైకి తీసుకెళ్లే ఒక చల్లని, బూడిదరంగు స్టీలు యంత్రం మనల్ని మొదటి అంతస్థులోని సాక్ష్యపుహాలు నుండి నాలుగవ అంతస్థులోనికి తీసుకెళ్లడంతో మన యాత్ర మొదలవుతుంది. సందర్శకులు పైఅంతస్థుల నుండి క్రింది అంతస్థులకు దిగివస్తుండగా, నాజీ ప్రచారం నుండి హిట్లర్‌ అధికారానికి రావడం వరకు, బాధితులను నిర్భందించడం, మరణ గుడారాల నుండి స్వతంత్రులను గావించడం వరకు, మారణహోమపు అన్ని దశలను వారు చూడవచ్చు. నిరంతరం అగ్ని వెలుగుతూ ఉండే జ్ఞాపకార్థ హాలుకు చేరడంతో యాత్ర ముగుస్తుంది. ఈ అసహ్యం కలిగించే కథను చెప్పటానికి సహాయంగా, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు, నిశ్చల చిత్రాలు, కదిలే చిత్రాలు, సంగీతం, కళాత్మకత మొదలైనవన్నీ ఉపయోగింపబడ్డాయి.

ఎడతెరిపి లేకుండా కన్నీళ్లు తెప్పించే, దుఃఖం కల్గించే ఈ శాశ్వత ప్రదర్శనను సందర్శకులు మూడు స్థాయిల్లో చూస్తారు. మరీ భయంకరమైనవాటిలో కొన్నిటిని 1.2 మీటర్ల ఎత్తున్న గోడల వెనుక, పిల్లలు చూడలేనంత ఎత్తులోవుంచారు.

బోధించటానికి ఒక ప్రదర్శనశాల

ప్రదర్శనశాల యొక్క హోలోకాస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక సమగ్ర గ్రంథాలయం, ఒక పురావస్తు నిలయం కూడా ఉన్నాయి. హోలోకాస్ట్‌ స్కాలర్‌షిప్‌ల కొరకు అది అంతర్జాతీయ కేంద్రంగా కూడా పనికొస్తుంది. “ప్రజలకు ఉపదేశించటానికి, తెలియజేయటానికి మేము సమర్పించుకున్నాము,” అని ప్రదర్శనశాల గ్రంథాలయ అధ్యక్షురాలు డా. ఎలిజబెత్‌ కోయినిగ్‌ చెబుతున్నది. కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లోవున్న అల్పసంఖ్యాకుల్లోని కొందరిని గూర్చిన సమాచారం గ్రంథాలయంలో ఉంటుంది. ఆమె ఇలా అంటుంది: “యెహోవాసాక్షుల గురించి ఇప్పటికే మావద్ద చాలా సమాచారం ఉంది.”

హిట్లర్‌ 1933లో యెహోవాసాక్షులను నిర్మూలించటానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. జర్మనీ, ఆస్ట్రియా, పోలండ్‌, మునుపటి జెకోస్లోవాకియా, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, మరితర దేశాలనుండి వేలాదిమంది సాక్షులు కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులకు తరలించబడ్డారు. వారు కేవలం మతసంబంధంగానే హింసించబడ్డారు. ఆ క్యాంపుల నుండి ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని ప్రదర్శనశాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.

మారణహోమాన్ని తప్పించుకున్నవారు

అలా తప్పించుకున్నవారిలో ఒకరైన 73 సంవత్సరాల ఫ్రాన్స్‌ వోల్‌ఫార్ట్‌, తన స్వంత కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం 15 మంది, సాక్షులైనందుకు నిర్భంధింపబడే సంఘటనను కళ్లార చూశారు. ఆయనిలా గుర్తుచేసుకుంటున్నారు: “వారిలో ఏడుగురు ఉరితీయబడ్డారు, అనేకుల తలలు నరికివేయబడ్డాయి. గదిలో విడిచిన విషవాయువు వలన ఒకరు, కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లోను, గెస్టెపో జైళ్లలో ఇతరులు చనిపోయారు.”

ఆ క్యాంపుల్లోనుండి తప్పించుకుని జీవించగలనని ఆయన ఎప్పుడైనా అనుకున్నారా? ఫ్రాన్స్‌ ఇలా చెప్పారు: “ఒకవేళ యుద్ధంలో జర్మనీ ఓడిపోయినా, నన్ను చంపగలిగేంత మందుగుండు సామగ్రి తమ దగ్గర ఉందని కావలివారు దాదాపు ప్రతిరోజు నాకు గుర్తుచేసేవారు.”

తన మతవిశ్వాసం కొరకు ఖైదీగా ఉన్నందుకు ఆయన బాధపడ్డారా? ఆ తలంపే తన దృఢసంకల్పానికి అవమానమన్నట్లు ఫ్రాన్స్‌ ఇలా అన్నారు: “ఎన్నడు బాధపడలేదు! ఎన్నడు బాధపడలేదు! మేమెప్పుడూ సంతోషంగా ఉండేవాళ్లం. అనేకసార్లు కావలివారు నన్ను ఆపి ఇలా అడిగారు: ‘ఇంత బాధలోకూడా మీ ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది, కారణమేమిటి?’ దానికి నేను: ‘ఈనాడు మేము అనుభవించే ఈ కష్టసమయాన్ని మించిన నిరీక్షణ—అంతా మంచిగా మారిపోయి, ప్రతిదీ తిరిగి స్థాపించబడనైయున్న దేవుని రాజ్యాన్ని గూర్చిన మా నిరీక్షణే నా యీ చిరునవ్వుకు కారణం’ అని చెప్పాను.”

నాజీ సైనికులను తప్పించుకుంటూ, ఆస్ట్రియాలో రహస్యంగా బైబిలు సాహిత్యాన్ని ముద్రించి, పంచిపెట్టే పనిని చేసిన యోసెఫ్‌ స్కోయెన్‌ అనే వ్యక్తి 1910లో జన్మించారు, ఆయన 1940లో నాజీ సైనికుల వలన నిర్భంధించబడే వరకు తానలాగే చేయగలిగారు. ఆయనను 1943 నుండి 1945 వరకు చంపుతామని బెదిరించారు. సమావేశమైయున్న సిబ్బంది ఎదుట, 1943లో కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపు నాయకుడు, ప్రత్యేకంగా యోసెఫ్‌ను ఉద్దేశించి, “నీవు ఇంకా యెహోవా దేవున్నే నమ్ముతున్నావా” అని గట్టిగా అడిగాడు.

“అవును,” అని యోసెఫ్‌ జవాబిచ్చారు.

“అయితే నీ తల తీసివేయబడుతుంది!”

యోసెఫ్‌ను 1945లో చంపేయటానికి డచావుకు తీసుకెళ్తున్నారు. “శరీర సంబంధంగా నేను కృంగిపోయాను కాని, విశ్వాసంలో మాత్రం అప్పుడున్నంత దృఢంగా నేనెప్పుడూ ఉండలేదు,” అని ఆయన గుర్తుచేసుకుంటున్నారు.

ప్రదర్శనశాలను దర్శించి, తాను ఖైదీగా ఉన్న దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనిలా అంటున్నారు: “నేనప్పుడసలు భయపడలేదు. మీకేది కావాలో అది, ఎప్పుడు కావాలో అప్పుడు యెహోవా ఇస్తాడు. యెహోవా మీద ఎలా ఆధారపడాలో మీరు నేర్చుకోవాలి, పరిస్థితి మరీ చేయిదాటిపోయేలా ఉన్నప్పుడు ఆయన ఎంత వాస్తవమై ఉన్నాడో చూడవచ్చు. ఘనత అంతా ఆయనకే చెందుతుంది. మేమెవరం వీరులం కాదు. మేము కేవలం యెహోవాపైన ఆధారపడ్డాము.”

ప్రదర్శనశాల విలువ

ఇంగ్లాండ్‌లోని స్టాఫోర్డ్‌షైర్‌ విశ్వవిద్యాలయ ప్రత్యామ్నాయ ఉపాధ్యక్షురాలైన డా. క్రిస్టీన్‌ ఎలిజబెత్‌ కింగ్‌ అనే చరిత్రకారిణి ఇలా చెప్పింది: “ఈ ప్రదర్శనశాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు నాకనిపిస్తుంది, మొదటగా, అది ప్రత్యక్ష రికార్డు. ‘ఇది ఎన్నడు జరగలేదు’ అని చెప్పేవారిని కాదనటానికే అదిక్కడుంది. ఆ మారణహోమాన్ని తప్పించుకుని జీవించిన సజీవ సాక్షులతోపాటు దీనికి కొండంత సాక్ష్యముంది. రెండవదిగా, ప్రదర్శనశాల చక్కని బోధనా సాధనము.”

ఆమె ఇలా కొనసాగించింది: “హింసింపబడిన, చనిపోయిన, జీవితాలను అర్పించిన తమ సహోదర సహోదరీలను చూడగలుగుతున్నందుకు యెహోవాసాక్షులకు అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ రికార్డును చూడగలగటం ఎంతో ప్రత్యేకమైన విషయము.” (g93 11/8)

[26వ పేజీలోని బాక్సు]

ఆ కాలమ్‌లోవున్న వ్యాఖ్యానం ఇలా ఉంది:

“యెహోవాసాక్షులు”

“యెహోవాసాక్షులను నాజీలు హింసించడం 1933లో మొదలైంది. వారు సైనిక సేవలో చేరటానికి నిరాకరించి, నాజీ పాలనకు భక్తివిశ్వాసాలను కనబరచలేదు గనుకనే సాక్షులు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, గూఢాచారులని తరచూ నిందింపబడేవారు. భవిష్యత్‌ అరాచకత్వాన్ని గురించి సాక్షులు ప్రవచించినప్పుడు, నాజీలు దాన్ని తిరుగుబాటు బెదిరింపులని, యూదులు పాలస్తీనాకు తిరిగి వస్తారన్న ప్రవచనాలను యూదాసంబంధ వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకున్నారు.

“అయినప్పటికీ, సాక్షులు సంఘంగా కూడటం, ప్రకటించడం, సాహిత్యాన్ని పంచి పెట్టడం కొనసాగించారు. వారు తమ ఉద్యోగాలను, ఫించన్లను, అన్ని పౌర హక్కులను పోగొట్టుకున్నారు, 1937లో నుండి వారు కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులకు వెళ్లడం మొదలయ్యింది. అక్కడ నాజీలు వారికి ‘స్వచ్ఛంద ఖైదీలని’ పేరు పెట్టారు: తమ విశ్వాసాన్ని విడిచిపెట్టిన యెహోవాసాక్షులను వదిలేసేవారు. ఒక్కరు కూడా విడిచిపెట్టబడలేదు.”

[27వ పేజీలోని బాక్సు]

“అది చెప్పవలసిన అతి ప్రాముఖ్యమైన కథ”

“యెహోవాసాక్షుల కథ గుర్తుంచుకోవలసిన వాటిలో ఒకటి. వారి మతసంబంధమైన నమ్మకాలను బట్టి, 1933లో నాజీ జర్మన్‌ ప్రభుత్వం నిషేధించిన మతాల్లో వారిది మొదటిది. ఎందుకంటే వారు, తమ ఆరాధన గురించి, అత్యున్నత ఆజ్ఞలైన దేవుని ఆజ్ఞలకు లోబడవలసిన తమ బాధ్యతను గురించి తెలుసుకున్నారు. దీని కారణంగా వారు, యూదులు, సంచారజాతివారు హింసించబడినంత నిర్దయగానే హింసించబడి, కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో వేయబడ్డారు. అక్కడే అనేకులు తమ ప్రాణాలు కూడా కోల్పోయారు.

“అది చెప్పవలసిన అతి ప్రాముఖ్యమైన కథ. దాని అత్యంత దుఃఖకరమైన భాగం యెహోవాసాక్షుల పిల్లలదే. వారి తండ్రి ఒక క్యాంపుకు తీసుకువెళ్లబడి, తల్లి నిర్భందంలో ఉన్నపుడు, యూదుల, సంచారజాతి పిల్లలతోపాటు వారిని పాఠశాలలో చివరి వరుసల్లో ఉంచేవారు. ఒకవేళ పిల్లలు ‘హిట్లర్‌కు జై!’ అనే స్తుతిపదాన్ని ఉపయోగించటానికి లేక నాజీ దేశానికి మరేవిధమైన ఆరాధనను చేయటానికి అంగీకరించకపోతే, కేవలం వారి నమ్మకాల కొరకు వారు బాలనేరస్థులుగా పరిగణించబడేవారు. మనస్సాక్షికి సంబంధించిన నేరాలైన తమ తలిదండ్రుల ప్రత్యక్ష, ఆరోపిత నేరాల కొరకేగాక, వారి పిల్లలైనందుకు కూడా వారు శిక్ష అనుభవించవలసి వచ్చింది.”—డా. సైబెల్‌ మిల్టన్‌, ప్రదర్శనశాల ప్రధాన చరిత్రకారిణి.

[24వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులను గుర్తించటానికి కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపు కోటుల మీద ఉన్న వంకాయరంగు త్రిభుజాకార బాడ్జీలు

[25వ పేజీలోని చిత్రం]

మారణహోమాన్ని తప్పించుకున్న ఫ్రాన్స్‌ వోల్‌ఫార్ట్‌ (ఎడమ వైపు) మరియు “ది విక్టిమ్స్‌” ప్రదర్శన వద్ద చరిత్రకారిణియైన డా. క్రిస్టీన్‌ కింగ్‌తోపాటు యోసెఫ్‌ స్కోయెన్‌

[25వ పేజీలోని చిత్రం]

వోల్‌ఫార్ట్‌ను, స్కోయెన్‌ను ఇలాంటి బాక్స్‌కార్లలోనే కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులకు తోసుకుంటూ వెళ్లారు

[26వ పేజీలోని చిత్రం]

పైన: యెహోవాసాక్షులు కూడ ఉన్న “ఎనిమీస్‌ ఆఫ్‌ ది స్టేట్‌” అనబడే వీడియో చరిత్ర ప్రదర్శన వద్ద, తప్పించుకొనిన వోల్‌ఫార్ట్‌ (ఎడమ), స్కోయెన్‌

[26వ పేజీలోని చిత్రం]

క్రింద: మారియా అన్నయైన యోహాన్‌ స్టోస్సీర్‌కు చెందిన బైబిలు ప్రదర్శించబడిన దానివద్ద మారియ, ఫ్రాన్స్‌ వోల్‌ఫార్ట్‌. “యోహాన్‌ దాన్ని ఎక్కువ సేపు దాచకముందే వారు దాన్ని కనుగొన్నారు, అతన్ని ఉరితీసినప్పుడు అతని తల్లికి పంపటానికి మిగిలివున్న ఒకే ఒక వస్తువు ఆ బైబిలు” అని ఫ్రాన్స్‌ చెప్పారు.

[26వ పేజీలోని చిత్రం]

ప్రదర్శింపబడిన బైబిలు ప్రక్కనే ఇలా వ్రాసివుంది: “జాక్సెన్‌హాజెన్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులో బంధింపబడిన యెహోవాసాక్షియైన యోహాన్‌ స్టోస్సీర్‌కు చెందిన బైబిలు.” క్యాంపును రష్యాదళాలు స్వతంత్రం గావించటానికి కొంచెం ముందే స్టోస్సీర్‌ మరణించాడు.

[27వ పేజీలోని చిత్రం]

ప్రదర్శనశాలను ప్రతిష్ఠ చేసేటప్పుడు, “ప్రజాపరిరక్షణలు ఎంత దుర్భలంగా ఉన్నాయి” అన్నారు అమెరికా అధ్యక్షుడైన క్లిన్‌టన్‌. “విలువలు లేని జ్ఞానం కేవలం మానవ పీడకలను పెంచటానికే దోహదపడుతుందని, హృదయంలేని శిరస్సు మానవత్వం కాదని, ఈ మారణహోమం మనకెప్పటికీ గుర్తుచేస్తుంది”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి