వృద్ధులకు వ్యాయామం మేలు చేయగలదా?
“వ్యాయామం వృద్ధాప్యాన్ని మార్చగలదా?” దాదాపు ఐదేళ్ల క్రితం ది న్యూయార్క్ టైమ్స్‌లో అదొక పెద్ద వార్తాశీర్షిక. ఆ శీర్షిక ఇలా తెలియజేసింది: “దాదాపు 90 ఏళ్ల వయస్సువారు కూడా శక్తివంతమైన, బరువుతగ్గించే-శిక్షణా నియమాన్ని కలిగివుంటే వారు పటిష్ఠంగావుండగలరని, వారి కండరాల పరిణామాన్ని కూడా పెంచుకోవచ్చని [బోస్టన్‌లోని] టెఫ్‌ట్స్ విశ్వవిద్యాలయ వైద్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు.”
వృద్ధులు వ్యాయామం ద్వారా నిజంగా మేలు పొందగలరన్న దానికి రుజువు పెరిగిపోతున్నది. హార్‌వార్డ్ హెల్త్ లెటర్ ఫిబ్రవరి 1991 సంచిక 1990లో జరిపిన అధ్యయనాన్ని గురించి ఇలా నివేదిస్తున్నది: “ఆసుపత్రిలోవున్న 87 నుండి 96 సంవత్సరాల వయస్సుగల తొమ్మిదిమంది రెండు నెల్లపాటు తమ కండరాలను బలపర్చే తీవ్రమైన శారీరక వ్యాయామం చేశారు.” ఈ పరిశోధనను గురించి, మాయో క్లినిక్ న్యూట్రిషన్ లెటర్ ఇలా వివరించింది: “పాల్గొన్నవారి కాలి కండరాల బలం దాదాపు రెట్టింపైంది, తొడ కండరాల పరిమాణం 9 శాతం పెరిగింది, చలనశీల పరీక్షలలో కూడా వారిలో మెరుగు కనిపించింది.”
పరిశోధకులు ఇలా నివేదించారు: “మా విషయాలలో బలం పొందడానికి ఇచ్చే శిక్షణకు వచ్చిన అనుకూల ప్రతిస్పందన చాలా విశేషంగా ఉంది, ప్రాముఖ్యంగా వారి పెద్ద వయస్సునుబట్టి, ఎక్కువగా కూర్చునివుండే అలవాట్లు, అనేక దీర్ఘకాల రోగాలు, అవయవాలు సరిగ్గా పనిచేయకపోవటం, పౌష్టికాహార లోపాలు వంటివాటిని దృష్టిలోకి తీసుకున్నప్పుడు వారి స్పందన విశేషంగా ఉంది.” వ్యాయామం యొక్క విలువ మళ్లీ మళ్లీ నిరూపించబడింది.
ఉదాహరణకు, 90 సంవత్సరాల జాక్ సేబర్ట్‌ను పరిశీలిద్దాము, ఆయనకు 1979లో వచ్చిన పక్షవాతం, చేతికర్ర లేనిదే నడవడానికి వీలులేకుండా అతని కుడిభాగాన్ని నిస్సత్తువ చేసేసింది. పదేళ్ల కంటే పైనే ప్రతి ఉదయం ఆయన పడకలోనే పడుకుని, పక్షవాతం రాని ఎడమకాలిని పైకి ఎత్తిపెట్టి, దాదాపు 20 నిమిషాలపాటు దాన్ని సైకిలు తొక్కేటప్పుడు కదిపినట్లు కదిపేవాడు. కొన్నిసార్లు ఆయన ఎడమకాలి మీద పక్షవాతం వచ్చిన కుడికాలిని ఉంచి (చిత్రంలో చూస్తున్నట్లు) రెండిటిని కలిపి త్రిప్పేవాడు. ఈ క్రమమైన వ్యాయామం ఆయన ఇప్పటికీ చేతికర్ర సహాయంతో నడవగలిగేలా చేసి ఆయన కాలి కండరాలను బలపర్చడమే కాకుండా, గుండెనాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయటానికి సహాయంచేసి, మానసికంగా ఆయనను చురుగ్గా ఉంచింది.
కాబట్టి, వ్యాయామం చేయడం మొదలు పెట్టడానికి ఎన్నడు సమయం మించిపోదని గుర్తుంచుకోండి. అవును, 1990లో 82 సంవత్సరాల జాన్ కెల్లీ, బోస్టన్ పరుగుపందెంలో ఐదు గంటల ఐదు నిమిషాల్లో 42 కిలోమీటర్లు పరుగెత్తినట్లు మీరు ఎప్పటికీ పరుగెత్తకపోవచ్చు. అలాగే 1991లో 84 సంవత్సరాల ముత్తవ్వ, మావిస్ లిన్డ్‌గ్రెన్ ఆ దూరాన్ని ఏడుగంటల తొమ్మిది నిమిషాల్లో పూర్తిచేసినట్లు మీరు చేయలేకపోవచ్చు. అయినప్పటికీ, అమెరికా హార్ట్ అసోషియేషన్ పత్రికయైన సర్క్యులేషన్ గత సంవత్సరం ఇలా కోరింది: “చురుకుగా ఉండగలగడానికి మార్గాలను వెతికే అలవాటు కలిగివుండటం ప్రాముఖ్యము.”
ఆ పత్రిక ఇలా వివరించింది: “ప్రతిరోజు చిన్నచిన్న పనులు చేసినా అవి దీర్ఘకాల ఆరోగ్యకరమైన మేలు చేయగలవు, హృద్రోగాన్ని కూడా తగ్గిస్తాయి. సరదాగా నడవటం, తోటపని చేయటం, పెరటిపని, ఇంటిపని, డాన్సు చేయడం, ఇంటివద్ద నిర్దిష్టంగా చేసే వ్యాయామం వంటివి అలాంటి పనుల్లో చేరివున్నాయి.” (g93 10/22)
[31వ పేజీలోని చిత్రం]
పక్షవాతం వచ్చిన ఈ 90 సంవత్సరాల వ్యక్తిలాగానే, వృద్ధుడైన శక్తిహీనుడైన వ్యక్తి వ్యాయామం ద్వారా మేలు పొందవచ్చు