కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 1/8 పేజీలు 12-14
  • తల్లిపాలకు అనుకూలమైన సాక్ష్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తల్లిపాలకు అనుకూలమైన సాక్ష్యం
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శ్రేష్ఠమైన పోషకాహారం
  • తల్లిపాలు ప్రాణాలను రక్షిస్తుంది
  • తల్లులకు ప్రయోజనం
  • చనుపాలివ్వడానికి తీర్మానించుట
  • పాలిచ్చేటప్పుడు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు
    తేజరిల్లు!—1994
  • రొమ్ము క్యాన్సర్‌ను గురించి స్త్రీలు తెలుసుకోవలసిన విషయాలు
    తేజరిల్లు!—1994
  • సంతానం కలిగియుండుట—ఒక బాధ్యత, ఒక బహుమానం
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • పసిపిల్లలకు అవసరమైనదేమిటి, వాళ్ళు కోరుకునేదేమిటి?
    తేజరిల్లు!—2004
తేజరిల్లు!—1994
g94 1/8 పేజీలు 12-14

తల్లిపాలకు అనుకూలమైన సాక్ష్యం

నైజీరియాలోని అవేక్‌! ప్రతినిధి

రుచిగా ఉండి, సులభంగా జీర్ణమయ్యే, పెరిగే పిల్లలకు అవసరమైన పోషక విలువలన్నీ ఉన్న ఆహారాన్ని గూర్చి తలంచండి. రోగాన్ని నిరోధించి, నయం చేసే ఒక “అద్భుతమైన మందులా” పనిచేసే ఆహారాన్ని గూర్చి తలంచండి. భూమి మీద ప్రతిచోట ఉన్న కుటుంబాలకు ఏ ఖర్చు లేకుండా సులభంగా లభ్యమయ్యే ఆహారాన్ని గూర్చి ఊహించండి.

అలాంటిది దొరకడం అసాధ్యమని మీరంటారా? సరే, అలాంటి ఆహారాన్ని పారిశ్రామిక శాస్త్రవేత్తలు తయారు చేయలేక పోయినను, అలాంటి ఆహారం ఉంది. అది తల్లిపాలే.

మానవ చరిత్ర అంతటిలో ఈ అద్భుతమైన ఆహారం శిశు పోషణకు ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు, ఫరో కుమార్తె బాలుడైన మోషేను చూసినపుడు, అతనికి పాలివ్వడానికి “ఒక దాదిని” తీసుకురమ్మని అతని అక్కతో చెప్పింది. (నిర్గమకాండము 2:5-9) ఆ తర్వాత గ్రీకు, రోమా సమాజాల్లో, ధనవంతులైన తలిదండ్రులు తమ శిశువులకు పాలివ్వడానికి ఆరోగ్యవంతులైన దాదీలను పెట్టుకునేవారు. అయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తయారు చేసే శిశు ఆహారం కన్నా, తల్లిపాలకు తక్కువ గుణమే ఉందన్న ప్రకటనల వలన ఇటీవల దశాబ్దాల్లో చనుపాలిచ్చే అలవాటు చాలా తగ్గిపోయింది. నేడు, చాలామంది తల్లులు, “చను-పాలివ్వడమే శ్రేష్ఠం” అని గుర్తించడం వల్ల ఆ ధోరణి మారిపోయింది.

శ్రేష్ఠమైన పోషకాహారం

సృష్టికర్త ఏర్పాటు చేసిన శిశుపోషణా విధానాన్ని విజ్ఞాన శాస్త్రజ్ఞులు మెరుగుపర్చారా? లేదు, యూనిసెఫ్‌ (ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి) ఇలా చెబుతుంది: “జీవితంలోని మొదటి నాలుగు నుండి ఆరు నెలల వరకు చిన్న బిడ్డలకు అతి శ్రేష్ఠమైన ఆహారం, పానీయం తల్లిపాలే.” జీవితంలోని మొదటి నెలల్లో శిశువు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమయ్యే మూల పదార్థాలైన ప్రోటీన్లు, పెరుగుదలను ఉత్తేజపర్చే పదార్థాలు, క్రొవ్వు, పిండి పదార్థం, సేంద్రియ పదార్థం, విటమిన్లు, తల్లిపాలలో ఉన్నాయి.

క్రొత్తగా జన్మించిన శిశువులకు తల్లిపాలు శ్రేష్ఠమైన ఆహారమేకాకుండా, వారికి అత్యవసరమైన ఒకే ఒక ఆహారం కూడా అదే. మే 1992లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సమావేశం, “జీవితంలోని మొదటి నాలుగు నుండి ఆరు నెలల వరకు సాధారణంగా శిశు పోషణకు తల్లిపాలు తప్ప, ఇతర ఆహారంగానీ, ద్రావకంగానీ, కనీసం నీళ్ళు కూడా అవసరం లేదు” అని మళ్ళీ ధృవపర్చింది. వేడిగా, పొడిగా ఉన్న వాతావరణంలో కూడా శిశువు దాహం తీర్చుకోడానికి అవసరమైన నీరు తల్లి పాలల్లో ఉంది. సీసాతో నీళ్ళు, పంచదార పానీయాలు పట్టించడం అనవసరమేకాకుండా, పిల్లలు సామాన్యంగా సీసాతో తాగడానికే ఇష్టపడతారు కనుక, బిడ్డ తల్లిపాలను పూర్తిగా మానివేసేలా చేయవచ్చు. అయినా, బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలల తర్వాత, వానికిచ్చే పాలతో పాటు ఇతర ఆహార, పానీయాలు చేర్చవచ్చు.

శిశువుల మంచి పెరుగుదలకు, అభివృద్ధికి తోడ్పడడానికి అవసరమైనవన్నీ సమపాళ్ళలో ఉన్న ఆహారం మరొకటి లేదు. రిప్రొడక్టివ్‌ హెల్త్‌—గ్లోబల్‌ ఇష్యూ అనే పుస్తకం చెప్పేదేమంటే, “తల్లిపాల ప్రత్యామ్నాయాల కొరకైన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చరిత్ర పుస్తకాల్లో, శిశువుల పోషణ గురించి, తల్లిపాలు తాగని శిశువులు, తల్లిపాలు తాగిన శిశువులకన్నా ఎక్కువగా అంటు రోగానికి, కుపోషణకు గురౌతున్నారనుటకు అనేక రుజువులున్నాయి.”

తల్లిపాలు ప్రాణాలను రక్షిస్తుంది

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, శిశువుల జీవితంలో మొదటి నాలుగు నుండి ఆరు నెలల వరకు అందరు తల్లులు తమ బిడ్డలకు తల్లిపాలు తప్ప మరేదీ ఇవ్వకపోతే, లోకవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షల శిశుమరణాలను తగ్గించవచ్చు. యూనిసెఫ్‌ వారి స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ చిల్డ్రన్‌ 1992 నివేదిక యిలా పేర్కొంది: “పేద కుటుంబాల్లో సీసా పాలు తాగే పిల్లలు, తల్లిపాలు మాత్రం తాగే పిల్లలకన్నా 15 రెట్లకంటే ఎక్కువగా నీళ్ళ విరేచనాల వలన, 4 రెట్లకంటే ఎక్కువగా శ్వాసకోశవాపు వలన చనిపోతున్నారు.”

ఎందుకిలా జరుగుతుంది? ఒక కారణం, పాలపొడిలో తల్లిపాలకన్నా తక్కువ పోషక గుణాలుండడమేకాక, తరచూ దానిలో అపరిశుభ్రమైన నీళ్ళను ఎక్కువగా కలిపి, శుభ్రం చేయని సీసాతో పట్టడమే. కాబట్టి వర్థమాన దేశాల్లో అనేక మంది శిశుమరణానికి కారణమౌతున్న అతిసారవ్యాధి, శ్వాసకోశవ్యాధికి సంబంధించిన సూక్ష్మ క్రిములవల్ల సీసాలోని పాలు సులభంగా మలినం కావచ్చు. దీనికి భిన్నంగా, స్తనాలనుండి నేరుగా వచ్చే పాలు త్వరగా మలినం కావు, వాటికి ఏమి కలపనవసరం లేదు, పాడవ్వవు, ఎక్కువ పలుచగా కావు.

తల్లిపాలు ప్రాణాలను రక్షించడానికి రెండవ కారణమేమంటే, తల్లి పాలల్లో శిశువును రోగాలనుండి సంరక్షించే రోగ నిరోధక పదార్థాలు ఉన్నాయి. అతిసారవ్యాధి, లేదా ఇతర వ్యాధులు సోకినప్పటికీ, తల్లిపాలు తాగే పిల్లలకు అవి అంత తీవ్రరూపం దాల్చవు. వాటిని సులభంగా నయం చేయవచ్చు. పరిశోధకులు చెప్పేదేమంటే తల్లిపాలు తాగే పిల్లలకు దంతరోగాలు, కేన్సర్‌, మధుమేహవ్యాధి, అలర్జీలు సోకే అవకాశం చాలా తక్కువ. పాలు చురుగ్గా నోటితో గట్టిగా పట్టి త్రాగాలి. కనుక తల్లి పాలు తాగడం వలన శిశువుల ముఖంలోని ఎముకలు, కండరాలు అభివృద్ధిచెందడానికి తోడ్పడవచ్చు.

తల్లులకు ప్రయోజనం

చను పాలివ్వడం వలన శిశువుకు మాత్రమే కాక, తల్లికి కూడ ప్రయోజనం కల్గుతుంది. ఒకటేమంటే, బిడ్డ పాలు తాగడం వలన, పాలు విడుదల చేయడానికి సహాయపడే ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదవడానికి ప్రేరేపించబడడమే కాక, గర్భాశయం సంకోచించడానికి కూడ సహాయపడుతుంది. ప్రసవించిన వెంటనే గర్భాశయం సంకోచించినట్లయితే, దీర్ఘకాల రక్తస్రావం తగ్గిపోతుంది. పాలివ్వడం వల్ల స్త్రీ బీజాణువు తయారవడానికి, రుతుస్రావం ప్రారంభం కావడానికి ఆలస్యం అవుతుంది. ఇందువల్ల తరువాతి గర్భధారణ ఆలస్యం అవుతుంది. గర్భధారణల మధ్య దీర్ఘకాల విరామం, అంటే తల్లులు, పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అర్థం.

పాలిచ్చే స్త్రీలకు మరొక గొప్ప ప్రయోజనమేమంటే వారికి అండాశయ రోగం, రొమ్ము కేన్సరు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తన బిడ్డకు పాలిచ్చే స్త్రీకన్నా పాలివ్వని స్త్రీకి, రొమ్ము కేన్సరు రెండు రెట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

పాలివ్వడంవలన కల్గే ప్రయోజనాలను పేర్కొనేటప్పుడు తల్లి, బిడ్డల అనుబంధాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందులో ఆహారమివ్వడమే కాక, మాటలద్వారా, ఇద్దరి దేహాలు స్పర్శించడం ద్వారా ఉండే సాన్నిహిత్యం, శారీరక వెచ్చదనం యిమిడి ఉంది. కనుక పాలివ్వడం తల్లికి బిడ్డకు మధ్య మంచి బంధాన్ని అభివృద్ధి చేయడమే కాక, బిడ్డలో భావోద్రేక, సామాజిక అభివృద్ధిని కల్గిస్తుంది.

చనుపాలివ్వడానికి తీర్మానించుట

దాదాపు అందరు తల్లులు అవసరమైన చర్యలు తీసుకుంటే, వారి పిల్లలకు కావలసినన్ని పాలివ్వగలరు. పుట్టిన వెంటనే సాధ్యమైనంత త్వరగా, ప్రసవించిన మొదటి గంటలోనే పాలివ్వడం మొదలు పెట్టాలి. (మొదట వచ్చే పాలలో ముదురు పసుపుగా ఉండే కొలోస్ట్రం అనే పదార్థం, శిశువులకు ప్రయోజనకరంగా ఉంటుంది, అది వారిని అంటువ్యాధుల నుండి సంరక్షించడానికి సహాయం చేస్తుంది.) అటు తర్వాత, ఒక కాలపట్టిక లేకుండా, బిడ్డకు ఆకలైనప్పుడెల్లా, రాత్రుల్లో కూడ పాలివ్వాలి. బిడ్డను స్తనమువద్ద సరైన విధంగా పడుకోబెట్టడం కూడ ప్రాముఖ్యమే. అనుభవం, సానుభూతి కల ఉపదేశకులు ఈ విషయాల్లో సహాయపడగలరు.

నిస్సంకోచంగా, ఒక తల్లి తన బిడ్డకు పాలివ్వాలా వద్దా అన్న తీర్మానం, ఆమె శారీరక ఆరోగ్యం కన్నా ఎక్కువగా మరో దానిపై ఆధారపడి ఉంటుంది. ది స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ చిల్డ్రన్స్‌ 1992 ఇలా నివేదిస్తుంది: “తల్లులు వారి పిల్లలకు శ్రేష్ఠమైన ప్రారంభం ఇవ్వాలంటే తల్లులకు ఆసుపత్రుల మద్దతు కావాలి; ఆ పిదప పాలివ్వడం కొనసాగించాలంటే పురుషులు, యజమానులు, ట్రేడ్‌ యూనియన్‌లు, సమాజాలు కూడా వారికి మద్దతునివ్వాలి.” (g93 9/22)

[13వ పేజీలోని బాక్సు]

అభివృద్ధిచెందుతున్న దేశాల్లో తల్లిపాలివ్వడం

1. జీవితంలోని మొదటి నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే అతి శ్రేష్ఠమైన ఆహారం, పానీయం.

2. శక్యమైతే బిడ్డలు పుట్టినవెంటనే పాలివ్వడం మొదలు పెట్టాలి. దాదాపు ప్రతి తల్లి తన బిడ్డకు పాలివ్వగలదు.

3. బిడ్డ అవసరాలకు తగినంత పాలు తయారవడానికి తరచూ పాలిస్తూ ఉండాలి.

4. సీసా పాలివ్వడం తీవ్రమైన రోగాలకు, మరణానికి దారితీస్తుంది.

5. బిడ్డ జీవితంలోని రెండవ సంవత్సరంలో కూడ పాలిస్తూ, సాధ్యమైనంత కాలం పాలివ్వడం కొనసాగించవచ్చు.

ఆధారం: యూనిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్యసంస్థ, యునెస్కో కలిసి ప్రచురించిన ఫ్యాక్ట్స్‌ ఫర్‌ లైఫ్‌.

[14వ పేజీలోని బాక్సు]

తల్లి-పాలు, ఎయిడ్స్‌

ఏప్రిల్‌ 1992 చివర్లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ కలిసి తల్లి-పాలకు ఎయిడ్స్‌కు కల సంబంధాన్ని పరిశీలించడానికి ఒక అంతర్జాతీయ నిపుణుల సంఘాన్ని సమావేశపర్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న ఎయిడ్స్‌కు సంబంధించిన ప్రపంచవ్యాప్త కార్యక్రమానికి డైరెక్టరైన, డా. మైకెల్‌ మెర్‌సెన్‌ ఆ సమావేశం యొక్క ఉద్దేశాన్ని విశదపర్చాడు. ఆయన యిలా అన్నాడు: “చిన్న బిడ్డ మనుగడకు తల్లి-పాలివ్వడమే కీలకం. ఒక బిడ్డ తల్లి-పాలు తాగడం వలన ఎయిడ్స్‌ సోకి చనిపోయే ప్రమాదాన్ని, తల్లి-పాలు తాగకపోతే ఇతర కారణాలవల్ల చనిపోయే ప్రమాదాన్ని సరిపోల్చాలి.”

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఎచ్‌.ఐ.వి. సోకిన తల్లులకు పుట్టిన ప్రతి ముగ్గురు బిడ్డల్లో దాదాపు ఒక బిడ్డకు ఎచ్‌.ఐ.వి. సోకుతుంది. చాలా వరకు గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో తల్లికున్న వ్యాధులు బిడ్డకు సోకుతాయి, తాను పాలివ్వడం ద్వారా కూడ అలా జరుగుతుందని రుజువుంది. అయినను, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదేమంటే, “ఎచ్‌.ఐ.వి. సోకిన తల్లుల పాలు తాగిన చాలామంది పిల్లలకు చను-పాల ద్వారా ఆ వ్యాధి సోకలేదు.”

కొంతమంది నిపుణులు యిలాంటి నిర్ణయానికొచ్చారు, “కుపోషణ, అంటువ్యాధులు, శిశుమరణాలకు ముఖ్యకారణాలుగా ఉన్నచోట, శిశుమరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట, పిల్లలకు తమ పాలివ్వమనే గర్భిణీ స్త్రీలకు, హెచ్‌.ఐ.వి. సోకిన వారికి కూడ సాధారణంగా సలహా యివ్వబడుతుంది. ఎందుకంటే, పిల్లలు తమ పాలు తాగడం వలన హెచ్‌.ఐ.వి. సోకే ప్రమాదంకన్న, తల్లి-పాలు తాగక ఇతర కారణాలవల్ల చనిపోయే ప్రమాదమే ఎక్కువ.

“మరొకవైపు, శిశుమరణాలకు ముఖ్య కారణం అంటువ్యాధులు కాని సందర్భాల్లో, శిశు మరణాల సంఖ్య కూడ తక్కువగా ఉన్న సందర్భంలో . . , హెచ్‌.ఐ.వి. సోకిందని తెలిసిన గర్భిణీ స్త్రీలు పిల్లలకు తమ పాలిచ్చే బదులు వేరే సురక్షితమైన పాలివ్వాలని సాధారణంగా సలహా యివ్వబడుతుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి