ఒంటరితనం—దీనితో పోరాడి విజయం సాధించాలని నీవు నిశ్చయించుకున్నావా?
నీవు ఒంటరి వాడవా? నీవు వివాహితుడవైనా లేదా అవివాహితుడవైనా, నీవు పురుషుడవైనా లేదా స్త్రీవైనా, నీవు వృద్ధుడవైనా లేదా యౌవనుడవైనా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్నట్లు భావించడం సహజమే. ఒంటరిగా ఉండటమనేదే ఒంటరితనానికి కారణం కాదని కూడ గుర్తించండి. ఒంటరిగా తన పరిశోధనలో నిమగ్నమైన విద్యావంతుడు ఒంటరిగా ఉన్నట్లు భావించడు. చిత్రాన్ని రూపించే ఒంటరి కళాకారునికి తాను ఒంటరిగా ఉన్నట్లు భావించే సమయమే ఉండదు. ఏకాంత క్షణాలను వాళ్లు ఆహ్వానిస్తారు, అప్పుడు ఏకాంతవాసమే వాళ్లకు మంచి నేస్తం.
నిజమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామనే భావన బాహ్యంగా కాదుగాని అంతర్గతంగా ఏర్పడేదే. మరణం, విడాకులు, ఉద్యోగం కోల్పోడం, ఏదో రకమైన దుఃఖించే విషాద సంఘటనల మూలంగా ఒంటరితనమనేది పెల్లుబుక వచ్చును. మన అంతరంగాన్ని మనం కాంతివంతంచేసినపుడు, ఒంటరితనాన్ని కాంతివిహీనం చేయవచ్చు, బహుశ తగిన కాలంలో దాన్ని అదృశ్యం చేయవచ్చు కూడ. మనకు కలిగిన బాధను సర్దుకుపోవచ్చు, సహించుకోవచ్చు.
భావాలనేవి నీ ఆలోచనల నుండి పెల్లుబుకుతాయి. నష్టాన్ని సహించిన తర్వాత, దానివల్ల వచ్చిన భావాలు వాటి పూర్వస్థితికి చేరుటకై అనుమతించినప్పుడు, చురుకైన నీ జీవితంలో కొనసాగడానికి నిన్ను అనుమతించే ప్రోత్సాహకర ఆలోచనలకు ప్రాముఖ్యతనిచ్చే సమయమదే.
చురుకుదనం పొందండి. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోండి. సకారాత్మక పనులు చేయాల్సి ఉంది. కాబట్టి బయటకు షికారుకు వెళ్తూండండి. ఎవరికైనా ఫోన్ చేయండి. ఉత్తరం వ్రాయండి. పుస్తకం చదవండి. ప్రజలను మీ యింటికి ఆహ్వానించండి. ఆలోచనలను పంచుకోండి. స్నేహితులను పొందాలంటే, మీకై మీరు స్నేహశీలంగా ఉండాలి. మీ స్వబుద్ధిని పరీక్షించుకోండి, తద్వారా మీరు ఇతరులకు సహాయపడగలరు. దయతో కూడిన చిన్న చిన్న పనులు చేయండి. ఓదార్పునిచ్చే కొన్ని ఆత్మీయ సమాచారాల్ని ఇతరులతో పంచుకోండి. యేసు మాటలు వాస్తవమని అప్పుడు నీవు గుర్తించగలవు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” నీవు మరొక సామెత సత్యాన్ని గుర్తిస్తావు: “నీళ్లుపోయువారికి నీళ్లుపోయబడును.”—అపొస్తలుల కార్యములు 20:35; సామెతలు 11:25.
ఇది మీ బాధ్యతే
దీన్ని చేయడం కష్టమా? చేయడం కంటే చెప్పడమే చాలా సులభమనే రీతిలో నీవు భావిస్తున్నావా? విలువైంది ప్రతీది చేయడం కంటే చెప్పడమే సులభం. అదే దీన్ని చేయడంలో నిన్ను తృప్తిపర్చేది. నీవు ప్రత్యేక కృషి చేయాల్సివుంది. నీలో ఒక భాగం ఇచ్చుటలో పాలుపొందితే, నీలో సంతృప్తి, ఆనందం అనేవి ఎంతో తేజరిల్లుతాయి. నిన్ను అధిగమించాలని చూస్తున్న ఒంటరితనాన్ని పెరికివేయడానికి ప్రయత్నించడం నీ బాధ్యతే. మోడరన్ మెచ్యూరిటీ పత్రిక రచయిత యిలా చెప్పాడు: “నీ ఒంటరితనానికి వేరేవాళ్లెవరూ బాధ్యులు కాదుగాని, దీన్ని గూర్చి ఏదైనా చేయగల్గేది నీవే. ఏ ఒక్కరి స్నేహంతోనైనా, నీ జీవితాన్ని విస్తరించుకోగలవు. నిన్ను నొప్పించారని నీవు భావించిన ఎవరోకర్ని క్షమించవచ్చు. నీవు ఉత్తరం వ్రాయవచ్చు. ఫోన్ చేయవచ్చు. కేవలం నీ జీవితాన్ని నీవే మార్చగలవు. దీన్ని నీ కొరకు చేయగల వేరే మానవుడెవడూ లేడు.” ఆయన అందుకున్న ఒక ఉత్తరం నుండి ఎత్తి వ్రాసిందే, “విషయాన్ని ఖచ్చితంగా వివరించింది: ‘నిష్ఫలంగా లేదా ఒంటరిగా ఉండకుండా కాపాడుకోవాలంటే అది వాళ్లలోనే ఉందని నేను ప్రజలకు చెబుతాను. చురుకుగావుండి, ఏదొకటి చేయండి!’”
మీకు సహాయాన్నందించే స్నేహితులు మానవులు మాత్రమే కానక్కర్లేదు. పశువైద్యానికి సంబంధించిన వైద్యుడొకడు యిలా చెప్పాడు: “వృద్ధులు ఎదుర్కొనే గొప్ప సమస్యలు భౌతిక అంగవైకల్యతలు కావుగాని వారనుభవించే ఒంటరితనము మరియు విడనాడబడటమే. తరచూ సమాజం నుండి దూరమైన సమయంలో . . . సహవాసులను పెంపుడు జంతువులను (కుక్కలతో సహా) దయచేయడం ద్వారా వృద్ధులకు లక్ష్యాన్ని, అర్థాన్ని ఇస్తుంది.” బెటర్ హోమ్స్ అండ్ గార్డెన్స్ అనే పత్రిక యిలా చెప్పింది: “మానసికంగా కలతచెందిన వారితో వ్యవహరించడానికి పెంపుడు జంతువులు సహాయం చేస్తాయి; అవి భౌతికంగా అనారోగ్యులైనవారిని, అంగవైకల్యులను, అసమర్థులను పురికొల్పుతాయి; ఒంటరివారిని, వృద్ధులను శక్తివంతం చేస్తాయి.” కొత్తగా పెంపుడు జంతువుల యెడల ఆసక్తిని చూపే వారిని గూర్చి మాట్లాడుతూ మరొక పత్రికా శీర్షిక యిలా చెప్పింది: “రోగుల మనస్తాపాలు తగ్గించబడతాయి, నిరాకరించబడతామనే భయంలేకుండానే తమ ప్రేమను వారి పెంపుడు జంతువులకు కనబర్చవచ్చును. మొదటిగా తమ పెంపుడు జంతువుల సంరక్షణ గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత ప్రజలతో మాట్లాడటం మొదలుపెడతారు. బాధ్యత వారిపైబడినట్లు భావించడం మొదలిడతారు. వారి అవసరత ఇతరులకు వుందని, వారిపై ఏదొకటి ఆధారపడివుందని భావిస్తారు.”
బహు తరచుగా ఒంటరితనంతో బాధపడేవ్యక్తి తనకు తాను తగినంత సహాయం చేసుకోడానికి, తనను తన నిరాశనుండి పుంజుకోవడానికి తనకుతాను శక్తివంతం కాలేడు. ఆ స్థాయికి చేరుకోడానికి అతనిలో అచేతనం, అంటే అయిష్టత అనేది వుంది, కాని అతడు తన ఒంటరితనానికిగల అసలు కారణం తెలుసుకోగల్గితే, తప్పక ఆస్థాయికి చేరుకుంటాడు. సలహా అంగీకరించడం కష్టంగా భావించే ప్రజలనుగూర్చి డా. జేమ్స్ లించ్ యిలా వ్రాశాడు: “మనకు యిష్టంలేని సమాచారం వినకుండా ప్రతిఘటించడం, లేదా కనీసం దానిని మనం అమలులో పెట్టకుండా ప్రతిఘటించడం సాధారణ మానవ నైజం.” ఒక వ్యక్తి తన ఒంటరితనం నుండి తప్పించుకోవాలని కోరుకోవచ్చు కాని, అతడు దానినుండి బయటపడటానికి ప్రభావితం చేసే సంకల్పశక్తిని ఒక్కటిగా చేయడానికి ఇష్టపడకపోవచ్చును.
మీరెలా భావించాలని కోరుకుంటారో ఆలాగే పనిచేయండి
తీవ్రమైన నిరాశను అధిగమించాలంటే, వాస్తవమైన ఉత్సాహం, దయాళుత్వం చూపుటలో పట్టుదల కలిగి ఉండాలి. (అపొస్తలుల కార్యములు 20:35 పోల్చండి.) మరణకరమైన ఒంటరితనపు సుస్తీకి విరుద్ధంగా పనిచేయడం ద్వారా అక్రమంగా ప్రవేశించినటువంటి మనోభావాలను తెంచుకొని బయటకు రావడం అవసరం. సంతోషంగా ఉండండి, గంతులెయ్యండి, ఆనంద రాగాలు పాడండి. సంతోషాన్ని వెలిబుచ్చే దేన్నైనా చేయండి. సంతోషకరమైన ఆలోచనలతో దీన్ని గొప్పగా చేయండి, మితిమీరి చేయండి, చిరచిరలాడే భావాలను సంతోష తలంపులతో బయటకు నెట్టండి. ఆ సంతోష తలంపులు ఎలాంటివి?
ఫిలిప్పీయులు 4:8లో వివరించినట్లుగా: “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.”
మీ జీవితంలో ఒక అర్థాన్ని ప్రవేశపెట్టే అవసరత ఉంది. మీ జీవితానికి కొంచెం అర్థమంటూ ఉందని మీరు భావిస్తే, మీరు దానికి స్పందించడానికి, దాన్ని నెరవేర్చడానికి శక్తిమంతులౌతారు. మీరు ధైర్యంచెడిన ఒంటరితనమనే భావాల్లో పడే అవకాశం లేదు. విక్టర్ ఫ్రాంక్లిన్ పుస్తకమైన మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్‌లో ఈ విషయం ఆసక్తిదాయకంగా చూపబడింది. ఆయన దీన్ని హిట్లర్ కాన్సెన్ట్రేషన్ క్యాంపుల్లోని బంధీలతో సాపేక్షంగా చర్చించాడు. తమ జీవితాలకు అర్థంలేదనే భావాలున్నవారు ఒంటరితనానికి లోనై, జీవించాలనే కోరికను కోల్పోయారు. కాని “ఒకరి మనస్సాక్షి యొక్క అంతర్గత విలువలు ఉన్నతమైన, మెండైన ఆత్మీయ విషయాలపై ఆధారపడినట్లైతే, కాన్సెంట్రేషన్ క్యాంపు జీవితంతో అతడు చలించిపోడు.” ఆయనింకా యిలా అంటున్నాడు: “స్వయం త్యాగానికున్న అర్థం వలెనే ఏదోవిధంగా అర్థాన్ని కనుగొన్నట్లైతే ఆ క్షణంలో బాధ బాధగానే మిగిలిపోదు. . . . మానవుని ముఖ్యమైన ఆవేదన ఆనందాన్ని పొందడానికి లేదా బాధను తొలగించడానికి కాదుగాని, బదులుగా జీవితంలో అర్థాన్ని చూడడానికే. అందుకే మానవుడు తానున్న పరిస్థితిలో, తాననుభవించే బాధకు ఒక అర్థమంటూవుంటే, నిజంగా బాధననుభవించడానికి కూడ సిద్ధపడతాడు.”
మీకవసరమైన చిట్టచివరి బాంధవ్యం
నిజమైన ఆత్మీయతను సాధించే మార్గమేమంటే, దేవునికి ఆయన వాక్యమైన బైబిలుకు పూర్తిగా బద్ధుడవైయుండుటకు నిర్ణయించుకోవడమే. దేవుని యందు విశ్వాసముంచడం, ఆయనకు పట్టుదలతో ప్రార్థించడం మన జీవితాలకు అర్థాన్నివ్వగలదు. ఆ తర్వాత, మానవ బాంధవ్యాలు విడిపోయినప్పటికీ కూడ, మనం ఒంటరివాళ్లం కాదు, ఒంటరితనంతో శిక్షించబడం. ఫ్రాంకిల్ చెప్పినట్లుగా, అర్థవంతమైన బాధ సహింపదగినది, ఆనందానికి కూడ అది మూలమే. మానవ నైజం పరిశీలకుడు యిలా చెప్పాడు: “హతసాక్షికి హింసాకొయ్యపై సంతోషముండవచ్చు, కాని రాజుకైతే సింహాసనంపై కూడ అసూయ ఉండవచ్చును.”
మనుష్యులచే హింసింపబడినప్పుడు, యేసు అపొస్తలులు యెహోవానుండి ఆనందం పొందారు; అలాంటి హింస వారికి గొప్ప భావాన్నిచ్చింది. “నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” (మత్తయి 5:10-12) అదే ప్రతిస్పందన అపొస్తలుల కార్యములు 5:40, 41 వచనాల్లో వ్రాయబడింది: “వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి—యేసు నామమునుబట్టి బోధింప కూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహా సభయెదుటనుండి వెళ్లిపోయిరి.”
నీవు గులాబీలు పెంచే తోటలో, గచ్చపొద పెరగజాలదు
మీ మనస్సనే నేలను సుందరమైన, సదుద్దేశాలనే విత్తనాలతో నింపండి; తీవ్రమైన ఒంటరితనం, నిరాశకు సంబంధించిన చెడు విత్తనాలకు తావివ్వవద్దు. (కొలొస్సయులు 3:2; 4:2 పోల్చండి.) అది చేయడం కష్టమా? ప్రత్యేక పరిస్థితుల్లో అది చేయడం అసాధ్యమన్పించవచ్చు. ఒక కవి యిలా పేర్కొన్నాడు: “నీవు గులాబీలు పెంచే తోటలో, . . . గచ్చపొద పెరగజాలదు,” అంటే దీనికి కూడ సకారాత్మక కృషి, మరియు నిశ్చయించుకున్న అభీష్టాన్ని అమలుచేయడం అవసరం. కాని దీనిని చేయవచ్చు, కొందరు చేశారు కూడ.
లారెల్ నిజ్బెట్ ఉదాహరణను గమనించండి. ఆమెకు పోలియో వచ్చింది, 36వ యేట కృత్రిమ ఊపిరితిత్తులు అమర్చబడ్డాయి, అలాగే ఆమె 37 సంవత్సరాలపాటు వెల్లకిలా పడుకోవాల్సొచ్చేది. మెడ దగ్గరనుండి కాలివరకూ పూర్తిగా పక్షవాతం వచ్చింది, ఆమె తన తలను మాత్రమే త్రిప్పగలదు. మొట్టమొదట ఆమె నిరాశతో చాలా కృంగిపోయింది. ఆ తర్వాత, రోజంతా తనలోతాను చాలా బాధపడి, తాను ‘పడిన బాధ సరిపోతుందిలే’ అని అనుకుంది. ఆమె ఇద్దరు పిల్లలను పెంచాలి, భర్తను చూసుకోవాలి కూడ. తన జీవితాన్ని పునఃస్థాపించడాని కారంభించింది. ఆమె తన కృత్రిమ ఊపిరితిత్తులను కలిగి కూడ తన గృహాన్ని చూడ్డం నేర్చుకుంది.
లారెల్ చాలా తక్కువ నిద్రపోయేది. రాత్రంతా నిద్రలేకుండా ఎలా గడిపేది? ఒంటరితనంతోనా? లేదు. ఆమె తన పరలోకపు తండ్రియైన యెహోవాకు ప్రార్థించింది. తనకు శక్తిని దయచేయమని ప్రార్థించింది, తన క్రైస్తవ సహోదర సహోదరీల కొరకు ప్రార్థించింది, దేవుని రాజ్యాన్ని గూర్చి యితరులకు సాక్ష్యమిచ్చే అవకాశాల కొరకు ప్రార్థించింది. ఆమె సువార్త ప్రకటించే మార్గాలను గూర్చి ఆలోచించింది, యెహోవా నామం కొరకు తాను సాక్ష్యమిచ్చుట ద్వారా అనేకమందిని మెప్పించింది. ఆమె ఒంటరితనమనే గచ్చపొదలు పెరగటానికి అవకాశమియ్యలేదు; ఆమె జీవితాన్ని సునాయాసంగా కొనసాగించుటలో రద్దీగా ఉండేది.
వాచ్‌టవర్ మిషనరీ అయిన హారాల్డ్ కింగ్ విషయంలో కూడ అదే జరిగింది. చైనా దేశంలో ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించబడటంతో ఆయన బహుశ దీర్ఘకాలం ఒంటరితనం అనుభవించాల్సి వచ్చింది. అయినప్పటికి, ఆయన ఆ ప్రతికూల ధోరణిని త్రోసిపుచ్చి, వేరే విధంగా స్థిరచిత్తంతో తన మనస్సును నింపాడు. ఆ తర్వాత ఆయన దీన్ని ఈ క్రింది విధంగా వివరించాడు:
“నేను ‘సువార్త సేవా’ పనికి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను. కాని ఒకవ్యక్తి ఏకాంత బందీగృహంలో సువార్తను ఎవరికి ప్రకటించగలడు? నేను జ్ఞాపకం చేసుకోగల విషయాలకు తగినటువంటి కొన్ని బైబిలు ప్రసంగాలను సిద్ధంచేసుకుని, తర్వాత వ్యక్తులను ఊహించుకుని వారికి సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. తలుపులను తట్టి, ఇంటివారికి సాక్ష్యమిచ్చినట్లు, ఆ విధంగా ఆ ఉదయం అనేక గృహాలను సందర్శించినట్లు ఊహిస్తూ సువార్త మొదలు పెట్టాను. తగినకాలంలో ఆసక్తి చూపిన కార్టర్ అనే వ్యక్తిని కలిసినట్లు ఊహించి, ఆ తర్వాత అనేక పునఃదర్శనాలు చేసి, చివరకు మేము ఒక క్రమబైబిలు పఠనానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్టడీలో ‘లెట్ గాడ్ బీ ట్రూ’ అనే పుస్తకంనుండి నాకు జ్ఞాపకమున్న ముఖ్యాంశాలను అధ్యయనం చేశాము. ఇదంతా నేను బిగ్గరగా మాట్లాడుతూ చేశాను, తద్వారా ఈ విషయాల ప్రతిధ్వని, అవి యింకా ఎక్కువ నా మనస్సులో నాటుకునేటట్టు చేసింది.”
హిట్లర్ కాన్సెన్ట్రేషన్ క్యాంపుల్లో బందీలైన వేలాదిమంది యెహోవాసాక్షులు కేవలం తమ విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లైతే, స్వతంత్రులయ్యుండేవారు. ఆవిధంగా చాలా తక్కువమంది చేశారు. కొందరు ఉరితీయబడ్డారు, కొందరు జబ్బుపడి, కుపోషణతోను—వేలాదిమంది విశ్వాసులుగానే చనిపోయారు. సాక్షియైన యోజెఫ్ అనే పేరుగల ఖైదీ ఇద్దరు అన్నలు వేరే క్యాంపుల్లో ఉన్నారు. బోర్లగా పడుకుని తన ముఖం పైకెత్తి క్రిందికి పడుతున్న కత్తిని చూడమని ఒక అన్నను బలవంతం చేశారు, ఆ కత్తి అతని తలను ఛేదించింది. యోజెఫ్ యిలా వివరించాడు: “దీన్ని గూర్చి యితరులు విన్నప్పుడు, వారు నన్ను అభినందించారు. వారి సరియైన మనోభావం నా హృదయాన్ని తాకింది. యథార్థంగా ఉండటం జీవించడంకంటే మాకు ఎక్కువ భావాన్ని కల్గివుంది.”
అతని మరొక అన్నను, తుపాకీ ధరించిన సైనికులముందు నిలబెట్టి, అతడేమైనా చెప్పదలచుకుంటే చెప్పమని అడిగారు. అతడు ప్రార్థించడానికి అనుమతించమని అడుగగా, అనుమతి యివ్వబడింది. కాల్చివేయండని ఆజ్ఞాపించే సరికి సైనికుల్లో ఏ ఒక్కరూ దానికి లోబడకపోవడమనేది కరుణారసాన్ని విరజిమ్మి, హృదయానందాన్ని కలుగజేసింది. ఆజ్ఞ మరలా యివ్వబడింది, దాంతో తుపాకీని ఒకరే పేల్చి, శరీరాన్ని గాయంచేశారు. దీనికి సైనిక ఆఫీసరు కోపంతో రగిలిపోతూ, తన స్వంత పిస్తోలు తీసి అతన్ని హతమార్చాడు.
జీవితాలను నిజంగా అర్థవంతం చేయగల్గేదేమిటి?
ఈ ఉదాహరణలన్నీ దేవుని యందు దృఢమైన విశ్వాసంతో ముడిపడివున్నాయి. అన్ని రకాల పద్ధతుల ప్రయత్నించి, విఫలమైతే, దీని ద్వారా ఒంటరితనంపై విజయం సాధించడం ఎల్లప్పుడూ సాధ్యమే, ఒకసారి నిరర్థకమైన జీవితాన్ని ఇది అర్థవంతం చేస్తుంది. లోకం దృష్టిలో అర్థవంతమైనవిగా ఎంచబడిన అనేక జీవితాలు వాస్తవంగా నిరర్థకమైనవి. ఎందుకు? ఎందుకంటే వీటి పర్యవసానం మరణమే, వారు మంటిపాలౌతారు, మరువబడతారు, వారి జీవితవిధానం సామాన్య ప్రజానీకంపై ఎలాంటి ప్రాముఖ్యతను కలిగివుండదు. అది ప్రసంగి 9:5లో చెప్పినట్లుగా ఉంటుంది: “బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారి పేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.” యెహోవా ఉద్దేశాలను విడిచి జీవించిన జీవితాలకు ఏ అర్థమూ లేదు, అవి వ్యర్థమే.
నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని తిలకించి, తలపైనున్న ఈ చీకటి గుడారపు విస్తారతను స్ఫురించండి, మీరు ఏమీ ప్రాముఖ్యత లేనివారుగా భావిస్తారు. కీర్తనల గ్రంథకర్త దావీదు ఈ మాటలు వ్రాసినప్పుడు అతనికున్న భావాలను మీరు అర్థంచేసుకుంటారు: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?” దావీదు కుమారుడైన సొలొమోను “సమస్తమును వ్యర్థమని” చెబుతూ, మానవుని కార్యాలను త్రోసిపుచ్చి, ముగింపులో యిలా చెప్పాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటి ఇదియే విధి.”—కీర్తన 8:3, 4; ప్రసంగి 12:8, 13.
ఆ తర్వాత, అంతిమ పరిశీలనలో, ఒంటరివ్యక్తి, లేదా మరితరులెవరైనా ఈ విషయంలో తన జీవితమందలి అర్థాన్ని ఎలా నాటుకోగలరు? దేవునియందు భయభక్తులు కలిగి, దేవుని కట్టడలను అనుసరించి నడుచుచు, అతని జీవితాన్ని కొనసాగించడం ద్వారానే. కేవలం ఆ తర్వాతనే అతడు ఈ అనంత విశ్వానికి సృష్టికర్తయైన, దేవుని ఉద్దేశాలకు అనుగుణంగాను, నిత్యమైన దైవిక ఏర్పాటులో భాగంగాను ఉంటాడు.
దేవుడు మీతో ఉన్నట్లైతే, మీరెన్నడూ ఒంటరివాళ్లు కారు
ఆఫ్రికాలో విశ్వాసురాలైన ఒక యెహోవాసాక్షి, భయంకరమైన హింసను, విడనాడబడెననే భావాలను ఓర్చుకున్న తర్వాత, తన మానవ సంబంధాలు విఫలమైనప్పటికీ తాను ఒంటరిగా లేనని చెప్పింది. ఆమె కీర్తన 27:10వ వచనాన్ని పేర్కొంది: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” యేసు అదేరీతిలో భావించాడు: “యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.”—యోహాను 16:32.
యేసు ఒంటరిగా ఉండటానికి భయపడలేదు. ఆయన తరచూ ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏకాంతంగా ఉన్నా ఒంటరివాడు కాదు. ఆయన తనకుతాను దేవుని ఆత్మను తనలో పొర్లిపోనిచ్చాడు, తన చుట్టున్న దేవుని సృష్టిని తలపోస్తూ ఆయనకు సన్నిహితుడయ్యాడు. అప్పుడప్పుడు ప్రజలతో సహవసించడం వ్యతిరేకించాడు, తద్వారా దేవునితో ఏకాంతంగా సహవసించగల్గాడు. ఆయన ‘దేవునికి సన్నిహితుడయ్యాడు; దేవుడాయనకు సన్నిహితుడయ్యాడు.’ (యాకోబు 4:8) నిస్సందేహంగా ఆయన దేవునికి అతి సన్నిహిత స్నేహితుడు.
లేఖనాల్లో వర్ణించినటువంటి స్నేహితుడు అమూల్యమైనవాడు. (సామెతలు 17:17; 18:24) యెహోవా దేవుని యందు అబ్రాహాము చూపిన పూర్ణ విశ్వాసం, నిస్సందేహమైన విధేయతనుబట్టి “‘దేవుని స్నేహితుడ’ని అతనికి పేరుకలిగెను.” (యాకోబు 2:23) యేసు తన అనుచరులకు యిలా చెప్పాడు: “నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.”—యోహాను 15:14, 15.
యెహోవా దేవుడు, యేసుక్రీస్తువంటి స్నేహితులుండి, విశ్వాసమున్నవారు ఒంటరితనానికి వ్యతిరేకంగా చేసే సమరంలో విజయం సాధించకుండా ఎలా విఫలులౌతారు? (g93 9/22)
[8,9వ పేజీలోని చిత్రాలు]
ప్రార్థన మరియు యితర కార్యకలాపాలు ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి మీకు సహాయం చేయగలవు
[10వ పేజీలోని చిత్రం]
నికృష్ట పరిస్థితుల్లోకూడ దేవునియందు విశ్వాసమనేది ఒంటరితనాన్ని జయించగలదని కాన్సెన్ట్రేషన్ క్యాంపుల్లో ఉన్న హారాల్డ్ కింగ్ మరియు వేలాదిమంది యితర యెహోవాసాక్షుల అనుభవాలు చూపిస్తున్నాయి
[క్రెడిట్ లైను]
U.S. National Archives photo