మూత్రపిండంలో రాళ్లు పురాతన రోగానికి చికిత్స
బహుశ మూత్రపిండంలో రాళ్లతో బాధపడిన ఎవరో ఒకరిని గూర్చి మీరు వినే వుంటారు. ప్రతియేటా అమెరికాలో, 3,00,000 మంది మూత్రపిండంలో రాళ్లతో బాధపడేవారు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ బాధ చాలా వ్యధకల్గించేదై, కాన్పు నొప్పులతో సమానంగా ఉండవచ్చును.
మూత్రపిండంలో రాళ్లనేది ఈ మధ్యనే వచ్చిన ఆరోగ్య సమస్యని, ఆధునిక ఆహారం, లేదా జీవనవిధానం వల్ల వచ్చిందేనని చాలామంది అనుకుంటారు. అయినను, వాస్తవంగా, మూత్రనాళంలో రాళ్లు మానవజాతిని శతాబ్దాలుగా పీడించాయి. అవి వేల సంవత్సరాల క్రితంనాటి ఐగుప్తీయుల మమ్మీలలో [భద్రపర్చిన శవాల్లో] సహితం కనిపించాయి.
మూత్రంలోని ఖనిజాలు కరిగిపోయి శరీరంనుండి బయటకు పోయే బదులు, అవి ఒకటిగా చేరి మొద్దుబారి పెరిగినప్పుడు రాళ్లు ఏర్పడతాయి. అవి అనేక పదార్థాలతో సమ్మిళితమై వేర్వేరు ఆకారాలను ధరిస్తాయి. క్లినికల్ సింపోజియా యిలా చెబుతుంది: “అమెరికాలో, దాదాపు [మూత్రపిండంలో] రాళ్లన్నింటిలో 75% ప్రథమంగా కాల్షియమ్ ఆక్జలేట్‌తోను, మిగతా 5% మంచి కాల్షియమ్ ఫాస్ఫేట్‌తోను తయారయ్యాయి.”
వాటి విస్తారత, కారణాలు
ఒక నివేదిక ప్రకారం, ఉత్తర అమెరికాలో దాదాపు 10 శాతం పురుషులకు, 5 శాతం స్త్రీలకు తమ జీవితకాలంలో మూత్రపిండంలో రాళ్లు వృద్ధవుతాయి. పునరావృతమయ్యే రేటు చాలా అధికం. మూత్రపిండంలో రాళ్లున్న ఐదుగురిలో ఒకరికి ఐదు సంవత్సరాల్లోనే మరొక రాయి వృద్ధవుతుంది.
కొందరికి మాత్రమే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి, మరికొందరికి లేకపోవడం వైద్యులను అనేక సంవత్సరాలుగా కలవర పెట్టింది. రాళ్లు ఏర్పడటం అనేక కారణాలవల్ల జరుగవచ్చును. శరీర కణముల మార్పుల్లో అస్తవ్యస్థత, అంటురోగం, సంక్రమిత లోపాలు, దీర్ఘకాలిక నిర్జలీకరణం, ఆహారం మొదలైనవి ఈ కారణాల్లో యిమిడివున్నాయి.
మూత్రపిండంలోని రాళ్లు దాదాపు 80 శాతం మూత్రవిసర్జన సమయంలో ధారాళంగా విసర్జించబడతాయి. వాటిని విసర్జించేందుకు రోగగ్రస్థులు అమితంగా నీళ్లు తాగాలని ప్రోత్సహింపబడ్డారు. ఆ రాళ్లు చూడటానికి చిన్నవే అయినప్పటికి, తరచూ కంటికి స్పష్టంగా కనబడతాయి, నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మూత్రవిసర్జన నాళం సరిగ్గా లేకపోతే, లేదా విసర్జించలేనంత పెద్దగా రాయి ఉంటే (అవి 4 సెం. మీ. వ్యాసమున్న చిన్న బంతి పరిమాణం కల్గివుంటాయి), రోగి ఆరోగ్యం కాపాడటానికి వైద్య చికిత్స చేయాల్సివుంటుంది.
నూతన చికిత్సలు
తమంతటతాము బయటకు విసర్జించలేని రాళ్లను తొలగించటానికి 1980 వరకు కూడ, పెద్ద శస్త్రచికిత్స అవసరమయ్యేది. మూత్రనాళంలో, లేదా మూత్రపిండంలో అడ్డుకున్న రాయిని చేరుకోడానికి, చాలా నొప్పి కల్గించేవిధంగా, డొక్క క్రిందిబాగంలో 30 సెంటీమీటర్ల పొడవున కోసేవారు. శస్త్రచికిత్స జరిపినప్పుడు సాధారణంగా రెండు వారాలు ఆసుపత్రిలో ఉండాల్సివచ్చేది, తర్వాత దాదాపు రెండు మాసాలు, స్వస్థతపొందేవరకూ ఇంట్లోనే ఉండాలి. కాని “ఆధునిక సాంకేతిక పురోభివృద్ధితో శస్త్రచికిత్స చేయవలసిన అవసరత చాలా అరుదైంది” అని వైద్య పాఠ్యపుస్తకమైన కాన్స్ కరెంట్ థెరపీ చెబుతుంది.
ప్రస్తుతం, కష్టమైన రాళ్లు కేవలం స్వల్ప శస్త్రచికిత్స మాత్రమేచేసి సాంకేతిక పరిజ్ఞానంతో బయటకు తీయవచ్చును. ఈనాడు విస్తారంగా ఉపయోగిస్తున్న మరొక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్స్‌ట్రాకార్పొరెల్ షాక్ వేవ్ లిథోట్రిప్సి (ఇఎస్‌డబ్ల్యుఎల్) అని అంటారు, దీనికి ఏవిధమైన శస్త్రచికిత్స కూడ అవసరముండదు. ఈ సరిక్రొత్త మార్పులు గూర్చి వివరిస్తూ, కాన్స్ కరెంట్ థెరపీ చెప్పేదేమంటే, “బహుశ [మూత్రపిండాల్లోని రాళ్లన్నింటిలోనూ] కేవలం ఒక శాతం మాత్రమే” పెద్ద శస్త్రచికిత్స చేసి తీయవలసివుంటుంది.
అతిస్వల్ప శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానం
అతిస్వల్ప శస్త్రచికిత్స అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్నిసార్లు పెర్‌క్యుటేనియస్ అల్ట్రాసోనిక్ లిథోట్రిప్సీ అని పిలుస్తారు. “పెర్‌క్యుటేనియస్” అనగా “శరీరం గుండా” అని, “లిథోట్రిప్సీ” అనగా అక్షరార్థంగా “పొడిచేయడం” అని భావం. ఈ శస్త్రచికిత్సకు కేవలం ఒక సెంటీమీటరు మాత్రమే డొక్కలో రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఈ రంధ్రంగుండా నెఫ్రోస్కోప్ అని పిలువబడే సిస్టోస్కోప్ లాంటి ఒక సాధనం ప్రవేశపెట్టబడుతుంది ఈ సాధనం ద్వారా మూత్రపిండం లోపలిభాగాన్ని, బాధకల్గిస్తున్న రాయిని చూడవచ్చును.
రాయి నెఫ్రోస్కోప్ ద్వారా బయటకు తీయజాలనంత పెద్దదిగా ఉన్నట్లైతే, అల్ట్రాసోనిక్ ప్రోబ్‌ను నెఫ్రోస్కోప్‌లోని ద్వారం గుండా, తద్వారా మూత్రపిండంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత, రాయి లేదా రాళ్లను ముక్కలు చేయడానికి, రంధ్రంగల ఈ ప్రోబ్‌ను అల్ట్రాసౌండ్ జనరేటర్‌కు కలుపుతారు, తద్వారా అది దాదాపు ఒక సెకనుకు 23,000 నుండి 25,000 సార్లు ప్రోబ్‌ను కంపింపజేస్తుంది. అల్ట్రాసోనిక్ తరంగాలు ప్రోబ్‌ను జాక్‌హేమర్ వలే పనిచేయించి, రాళ్లన్నింటిని ధ్వంసం చేస్తాయి, కాని గట్టిగా ఉండే రాళ్లను పీల్చేస్తాయి.
తదేకంగా ఈ ప్రోబ్ ద్వారా పీల్చడం వల్ల ఇది అక్షరార్థంగా మూత్రపిండం లోపలిభాగాన్నంతా ఖాళీచేస్తుంది, తద్వారా చిన్న రాళ్ల ముక్కలను కూడా లేకుండా చేస్తుంది. రాళ్ల పొడియంతా ప్రోబ్ ద్వారా పూర్తిగా తీసివేయబడిందని జాగ్రత్తగా పరిశోధించి తెలుసుకునేంత వరకూ ముక్కలు చేయడం పీల్చడం అనే పని కొనసాగుతూనే ఉంటుంది.
అయినను, కొన్నిసార్లు ఇంకా కొన్ని రాళ్ల ముక్కలు స్థానభ్రంశం చెందవు. అలాంటి సందర్భాల్లో, వైద్యుడు నెఫ్రోస్కోప్ ద్వారా సూక్ష్మమైన శ్రావణం అమర్చబడిన సాధనం గల ఒక పలుచని నాళాన్ని లోనికి ప్రవేశపెట్టగలడు. ఆ తర్వాత వైద్యుడు శ్రావణం తెరచి, రాయిని పట్టుకుని, దాన్ని బయటకు లాగగలడు.
పెర్‌క్యుటేనియస్ శస్త్రచికిత్స అమలుపరుస్తూ చాలా పద్ధతులను ఉపయోగించారు. కొన్ని సంవత్సరాల క్రితం, యూరొలాజికల్ క్లినిక్స్ ఆఫ్ నార్త్ అమెరికా అనే వైద్యపత్రిక యిలా చెప్పింది: “పెర్‌క్యుటేనియస్ పద్ధతుల్లో రాళ్లను నిర్మూలించే క్రొత్త పద్ధతులు ప్రతి నెలా వైద్య పత్రికల్లో క్రొత్త సంచికలుగా వెలువడుతున్నట్లు కన్పిస్తున్నాయి.” ఈ పత్రిక పరిశీలించిందేమంటే, ఈ పద్ధతి విజయం సాధించడమనేది బహుశా “రాయి పరిమాణం, దాని స్థానాన్ని బట్టి మారుతుంది.” కాని విజయానికి అతి ప్రాముఖ్యమైన కారకం “వైద్యుని నిపుణత, అనుభవమేనని” ఈ పత్రిక వివరించింది.
రాళ్లను కరిగించడానికి కావలసినంత శక్తి ఉత్పత్తి చేయబడినప్పటికి, ఈ పద్ధతే చాలా సురక్షితమైనది. “రక్తస్రావం అనేది అంత ప్రాముఖ్యమైన సమస్య కాదు,” అని క్లినికల్ సింపోజియా అనే వైద్య పత్రిక చెబుతుంది. అయినను, 4 శాతం రోగులకు విస్తారంగా రక్తస్రావమయ్యిందని ఒక రిపోర్టు చెబుతుంది.
స్వల్ప అసౌకర్యం మాత్రమే కలగడం, కోలుకునే వ్యవధి తక్కువ కావడం అనేవి ఈ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు. చాలామంది రోగులు కేవలం ఐదు లేదా ఆరు రోజులు ఆసుపత్రిలో గడిపారు, మరికొందరైతే కేవలం మూడు రోజుల తర్వాతనే ఇంటికి వెళ్లారు. ఆసుపత్రిని వదలిన వెంటనే పనికి వెళ్లడానికి సిద్ధపడే, రోజువారీ కూలిపని చేసుకుని సంపాదించే వారికి, ఈ సదుపాయం చాలా ఉపయుక్తమైంది.
శస్త్రచికిత్స లేకుండానే చికిత్స
ఎక్స్‌ట్రాకార్పొరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని పిలువబడే ఒక అద్భుతమైన క్రొత్త చికిత్స 1980లో జర్మనీలోని మ్యూనిచ్‌లో పరిచయం చేయబడింది. ఏవిధంగాను శరీరాన్ని కోయకుండా, ఎలాంటి రాళ్లయినప్పటికి వాటిని తునకలు చేయడానికి ఇది అమితమైన శక్తిని ప్రయోగిస్తుంది.
నులువెచ్చని నీటితో సగంవరకూ నింపబడిన స్టెయిన్‌లెస్ స్టీల్ టాంక్‌లో రోగిని దింపుతారు. నీటి క్రిందిబాగాన ఉంచిన విద్యుత్ ప్రవాహశక్తి ద్వారా ఉత్పత్తిచేయబడ్డ షాక్ తరంగాలు చికిత్స చేయవలసిన మూత్రపిండం వైపు ఉండేటట్లు అతనిని జాగ్రత్తగా ఉంచుతారు. ఈ తరంగాలు వాటి శక్తిని కోల్పోకుండా మృదువైన మానవ శరీరం గుండా సులభంగా లోనికి చేరతాయి. రాయి కరిగిపోయేంత వరకూ అవి దానిని తదేకంగా పొడుస్తాయి. చాలామంది రోగులు ఆ తర్వాత సులభంగా రాతి పొడిని విసర్జిస్తారు.
పందొమ్మిది వందల తొంభై నాటికి, 80 శాతం రాళ్లు నిర్మూలించడానికి ఇఎస్‌డబ్ల్యుఎల్ పద్ధతే ఉపయోగించబడేది. గత సంవత్సరం ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ ఫిజీషియన్ అనే పత్రిక నివేదించేదేమంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానం పరిచయమైన నాటినుండి, “మూత్రపిండంలో రాళ్లను కరిగించడానికి రకరకాల షాక్ తరంగాలను ఉత్పత్తిచేసే సాధనాల నుపయోగిస్తూ, 1,100 కంటే ఎక్కువ యంత్రాలపై ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకంటే ఎక్కువమంది రోగులు చికిత్స చేయబడ్డారు.”
ఈ ఇఎస్‌డబ్ల్యుఎల్ పద్ధతి మూత్రపిండ ప్రాంతంలో కొన్ని గాయాలు చేసినప్పటికి, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ ఫిజీషియన్ అనే పత్రిక యిలా వివరిస్తుంది: “మూత్రపిండానికి దగ్గరలోనున్న శరీరభాగాలైన పైత్యకోశం, కాలేయము, జఠరగ్రంథి, వృక్వకమును పాడుచేయడం చాలా అరుదు. కేవలం ఒక మోస్తరు గాయపడిన రోగి కొద్దిపాటి నొప్పిని సులభంగా తట్టుకోగలడు, చాలామంది రోగులు కేవలం కడుపులో [కండరాలు, ఎముకల నొప్పి] కొద్దిగానే ఉన్నట్లు, మరికొందరు చికిత్స అయిన తర్వాత 24 నుండి 48 గంటల వరకూ [మూత్రంలో రక్తం] కొద్దిగా పడినట్లు ఫిర్యాదు చేస్తున్నారు.” పిల్లలకు కూడా విజయవంతంగా చికిత్స చేయబడుతుంది. ఈ ఆస్ట్రేలియన్ పత్రిక ముగింపులో యిలా చెప్పింది: “పది సంవత్సరాలు పరిశోధించిన తర్వాత ఇఎస్‌డబ్ల్యుఎల్ పూర్తిగా సురక్షితమైనట్లుగా కన్పిస్తుంది.”
నిజంగా, ఈ చికిత్స చాలా ప్రభావవంతమైంది కనుక గత సంవత్సరం కాన్స్ కరెంట్ థెరపీ యిలా వివరించింది: “రాళ్లుగా కన్పించే వాటిని కూడా చాలా సులభంగా నిర్మూలించడానికి ఈ (ఇఎస్‌డబ్ల్యుఎల్) పద్ధతి అనుకూలతనిచ్చింది, అలాంటి ధీమా ఉండటం వల్ల రోగులు, వైద్యులు కూడా మూత్రంలో రాళ్లకు సంబంధించిన వ్యాధిని గూర్చి అంత తీవ్రమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడంలేదు.”
అయినను, మూత్రపిండంలో రాళ్లుండటం చాలా బాధతో కూడిన వ్యాధి, నిజంగా మీరు అది కావాలని కోరుకోరు. వాటిని రాకుండా కాపాడుకోడానికి మీరేం చేయవచ్చు?
నిరోధించుట
మూత్రపిండంలో రాళ్లు తరచు పునరావృతమౌతాయి గనుక, ఇవి మీకుంటే, అమితంగా నీళ్లు త్రాగాలనే హెచ్చరికను మీరు వింటారు. బయటకు విసర్జించే మూత్రం రోజుకు 2 కంటే ఎక్కువ లీటర్లు ఉండాలని సిఫారస్ చేయబడింది, అంటే దాని భావం ఎక్కువగా నీళ్లు త్రాగవలసిందే!
దానితో పాటు, మీ ఆహార అలవాట్లు సరిచేసుకోవడం మంచిది. రాళ్లు ఏర్పడటానికి సహకరిస్తుందని విశ్వసించే ఆక్జలేట్ ఎక్కువగా వున్న ఆహారం, మాంసం, ఉప్పు, తినడం తక్కువ చేయమని వైద్యులు సలహా యిస్తున్నారు. ఈ ఆహారాల్లో దినుసులు, చాక్‌లెట్, మిరియాలు, చుక్కకూర వంటి పచ్చని ఆకుకూరలు కూడా యిమిడివున్నాయి. వైద్యులు ఒకప్పుడు కాల్షియమ్ తీసుకోవడం తగ్గించమని సలహా యిచ్చారు, కాని ఇటీవలి పరిశోధనలు గుర్తించిందేమంటే కాల్షియమ్ ఎక్కువగా వున్న ఆహారం తీసుకుంటే అది రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.
అయినను, మీరు ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికి, మీ మూత్ర పిండంలో మరలా రాళ్లు ఏర్పడితే, వాటిని చికిత్స చేయడానికి యింకా ఆధునిక పద్ధతులున్నాయని తెలుసుకోవడం మీకు ఓదార్పునిస్తుంది. (g93 8/22)
[Picture Credit Line on page 15]
Leonardo On The Human Body/Dover Publications, Inc.
[16వ పేజీలోని చిత్రం]
లిథోట్రిప్టర్ అని పిలువబడే యంత్రాన్నుపయోగించి శస్త్రచికిత్స లేకుండానే మూత్రపిండంలోని రాళ్లకు చికిత్సచేయుట
[క్రెడిట్ లైను]
S.I.U./Science Source/PR