జాతులన్నీ సమాధానంగా కలిసి జీవించినప్పుడు
“యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన [దేవుడు] యొకనినుండి ప్రతిజాతి మనుష్యులను” సృష్టించాడు. (అపొస్తలుల కార్యములు 17:26) ఇది మానవజాతి పుట్టుకను గూర్చి బైబిల్లోని మామూలు వాక్యం.
ఇది సూచించేదేమంటే, మానవజాతంతా, ఎక్కడ జీవిస్తున్నప్పటికి లేదా వారెలాంటి భౌతిక లక్షణాలు కలిగి ఉన్నప్పటికి ఒకే ఒక సామాన్య మూలం నుండి వచ్చింది. పరిశీలించదగిన విభేదాలెన్నో ఉన్నప్పటికి, “ప్రతి జాతి మనుష్యులు” సామర్ధ్యతలు, మేధాశక్తి విషయంలో ఒకేరకమైన సామర్ధ్యాన్ని కల్గివున్నారు. ఔను, అన్ని రాష్ట్రాల, జాతుల మానవులు దేవుని దృష్టిలో సమానమే.—అపొస్తలుల కార్యములు 10:34, 35.
బైబిలు దృక్పథం సరైనదైతే, జాతి విభేదాలపై ఆధారపడిన జాతివైషమ్యాలు, అక్రమాలు నిర్మూలించబడగలవనే నిరీక్షణవుంది. అంతేకాకుండా, మానవజాతి ఆరంభాన్ని గూర్చి బైబిలు ఖచ్చితమైనదైతే, న్యాయబద్ధంగా మానవజాతి సమాధానంగా ఎలా కలిసి జీవించగలదో బయల్పరచే సమాచారం కూడ అదే పుస్తకం మనకు అందించగలదు.
అయితే, వాస్తవాలు చూపేదేమిటి? మానవ ఆరంభాన్ని గూర్చిన బైబిల్లోని సమాచారాన్ని విజ్ఞానశాస్త్రం బలపర్చుతుందా?
వైజ్ఞానిక సాక్ష్యం
మానవ శాస్త్రజ్ఞులైన రూత్ బెనెడిక్ట్, జీన్ వెల్ట్‌ఫిస్ వ్రాసిన ది రేసెస్ ఆఫ్ మ్యాన్‌కైండ్ అనే సాహిత్యం యిలా తెల్పుతుంది: “శతాబ్దాల పూర్వం ఆదాము హవ్వలు మొత్తం మానవజాతికే తలిదండ్రులని చెప్పిన బైబిలు కథ సత్యాన్నే ఈనాడు విజ్ఞానశాస్త్రం చూపిస్తుంది: అంటే భూమ్మీదనున్న ప్రజలందరు ఒకే కుటుంబం, ఒకే సామాన్య ఆరంభాన్ని కల్గియున్నారు.” “అతి చిక్కైన మానవ శరీర నిర్మాణం . . . మనుష్యులందరిలోనూ ఒకే రీతిలో ఉండేలా వారు ఒకే సామాన్య ఆరంభం లేకపోయినట్లైతే, ‘కేవలం యాదృచ్చికంగా’ ఏర్పడటం అసాధ్యమే” అని కూడ ఈ రచయితలు సూచిస్తున్నారు.
కొలంబియా యూనివర్సిటీలో జంతుశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లెస్లీ కి డెన్ వ్రాసిన రేస్ అండ్ బయాలజీ అనే కరపత్రం యిలా చెబుతుంది: “మనుష్యులందరూ అన్ని ప్రాథమిక భౌతిక లక్షణాలన్నింటిలోను ఒకే తరహాగా వున్నందువల్ల వారు స్పష్టంగా ఒకే జాతికి చెందినవారు. అన్ని వర్గాల సభ్యులూ కులాంతర వివాహం చేసుకోవచ్చు, నిజంగా అలా చేసుకుంటున్నారు.” ఆ తర్వాత ఇది యింకా వివరించేదేమంటే: “అయినను ప్రతి మనిషి ప్రత్యేకంగా ఉన్నాడు, అతి చిన్న విషయాల్లో కూడ యితర మానవులందరికీ భిన్నంగా వుంటాడు. కొంతమేరకు ప్రజలు సంక్రమించుకున్న జన్యువుల్లోని తేడాలవల్ల, మరి కొంతమేరకు వారు వేర్వేరు వాతావరణాల్లో నివసించడం వల్ల ఇలా జరుగుతుంది.”
వైజ్ఞానిక సాక్ష్యం నిస్సంశయమైనది. జీవశాస్త్ర సంబంధంగా మాట్లాడితే, ఉన్నతజాతి, తక్కువజాతి, శ్రేష్ఠమైన, మలినమైన జాతులనేవి లేనేలేవు. కొందరు జాతిపరంగా ఒక వ్యక్తియొక్క శరీరఛాయ, వెంట్రుకలు, కళ్ల వర్ణం ప్రాముఖ్యమైన విషయాలని దృష్టించినట్లుగా—అవి ఒక వ్యక్తియొక్క మేధాశక్తి, సామర్ధ్యతలకు సూచనలుకావు. బదులుగా, అవి సంక్రమించిన జన్యువుల ఫలితంగా ఏర్పడినవే.
హేంప్టన్ ఎల్. కేర్సన్ హెరిడిటరీ అండ్ హ్యూమన్ లైఫ్ అనే పుస్తకంలో, నిజంగా, జాతివైషమ్యాలనేవి చాలా సూక్ష్మమైనవి: “ప్రతి మానవ వర్గం విభేదంగానున్నట్లు బాహ్యంగా కనబడుతుందనేదే మనకెదురయ్యే విరుద్ధత, అయినా ఈ విభేదాల వెనుక ఒక ప్రాథమిక అనురూపత వుంది.”
మానవులందరూ నిజంగా ఒకే కుటుంబానికి చెందిన వారైతే, భయంకరమైన జాతి సమస్యలెందుకు ఉన్నాయి?
సమస్య ఎందుకు?
జాత్యహంకారం ఉండడానికి గల ప్రాథమిక కారణమేమంటే, మొట్టమొదటి మానవ తలిదండ్రులు తమ సంతానానికి యిచ్చిన చెడు ఆరంభమే. ఆదాము, హవ్వ ఇష్టపూర్వకంగా దేవునిపై తిరుగుబాటుచేసి, తద్వారా అపరిపూర్ణులు, లోపంగలవారుగా తయారయ్యారు. ఫలితంగా, ఆదాము అసంపూర్ణత అనగా చెడు చేయాలనే కోరిక అతని సంతానానికి కూడా సంప్రాప్తమయ్యింది. (రోమీయులు 5:12) కాబట్టి పుట్టుకతోనే, మానవులందరూ స్వార్థము, గర్వమువైపే మొగ్గు చూపడంవల్ల జాతి వైషమ్యాలకు, పోరాటాలకు నడిపింది.
జాత్యహంకారానికి మరొక కారణం కూడ ఉంది. ఆదాము, హవ్వ దేవుని ఆధిపత్యానికి దూరమైనప్పుడు, వారు సాతాను, లేదా దయ్యము అని బైబిలు పిలిచే దుష్టాత్మ పరిపాలన క్రిందకు వచ్చారు. “సర్వలోకమును మోసపుచ్చు”వాని ప్రభావం క్రింద, జాతి విషయంలో తరచు ప్రజలను మోసపుచ్చుటకు బాహాటంగా ప్రయత్నాలు జరిగాయి. (ప్రకటన 12:9; 2 కొరింథీయులు 4:4) జాత్యభిమానం అనగా ఒకని స్వంత జాతి మాత్రమే ఉన్నతమైందనే యోచన—దహించే అగ్నిలా రగిలింది, అంతేకాకుండా తెలిసో, తెలియకనో వేలకొలది ప్రజలు దుష్ఫలితాలకు తీవ్రంగా ప్రభావితులయ్యారు.
బాహాటంగా చెప్పాలంటే, జాతివైషమ్యాలకు మూల కారణమైన జాతిని గూర్చిన అబద్ధ బోధలన్నీ సాతాను ప్రభావానికి లోనైన స్వార్థపరులు, అపరిపూర్ణులైన మానవులే వ్యాప్తిచేశారు.
కాబట్టి, మానవజాతంతా ఐక్యం కావాలంటే, మనమంతా ఒకే కుటుంబమని, అనగా దేవుడు “యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన [దేవుడు] యొకనినుండి ప్రతిజాతి మనుష్యులను” సృష్టించాడని మనమందరం నమ్మాలి. (అపొస్తలుల కార్యములు 17:26) ఇంకనూ, జాతులన్నియు కలిసి సమాధానంగా జీవించడానికి, మానవ కార్యకలాపాల్లో సాతాను ప్రభావం నిర్మూలించబడాలి. ఇవన్నీ ఎన్నడైనా నెరవేరునా? అవి నెరవేరునని ఏదైనా ఆధారముందా?
జాతి దురభిమానం అంతమగుట
యేసు క్రీస్తు తన అనుచరులను యేవిధంగా ప్రేమించాడో అలాగే “ఒకరినొకరు ప్రేమించుడని” వారికి ఆజ్ఞనిచ్చినప్పుడు జాతి దురభిమానం ఎలా నిర్మూలించబడునో బయల్పర్చాడు. (యోహాను 13:34, 35) ఈ ప్రేమ కేవలం ఒక ప్రత్యేకమైన జాతి లేదా జాతుల సభ్యులకు మాత్రమే కాదు. నిశ్చయంగా కాదు! “అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడని,” ఆయన తన శిష్యులలో ఒకరిని ప్రోత్సహించాడు.—1 పేతురు 2:17.
ఈ క్రైస్తవ ప్రేమ ఎలా ప్రదర్శించబడుతుంది? బైబిలు యిలా అర్ధించి వివరిస్తుంది: “సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగముగలవారై” యుండుడి. (రోమీయులు 12:10) ఇలా చేసినప్పుడు దాని ఫలితమేమైయుంటుందో ఊహించండి! ప్రతి ఒక్కరూ యితరులను, జాతి లేదా దేశమేదైనప్పటికి, వారిని తక్కువవారిగా ఎంచకుండా, నిజమైన అనురాగం, గౌరవంతో వాస్తవంగా ‘తనకంటే యోగ్యులని యెంచుచు’ వ్యవహరిస్తారు. (ఫిలిప్పీయులు 2:3) అలాంటి స్ఫూర్తిగల నిజమైన క్రైస్తవ ప్రేమ ఉన్నప్పుడు, జాతి దురభిమానం అనే సమస్య పరిష్కారమౌతుంది.
నిజమే, జాతి దురభిమానంతో మునిగి తేలిన ఒక వ్యక్తి, సాతానువల్ల ప్రేరేపించబడ్డ అలాంటి ఆలోచనలు విడనాడటానికి అసాధారణ కృషి సల్పడం అవసరం. కాని ఇది సాధ్యమేనా! మొదటి శతాబ్దంలో, క్రైస్తవ సంఘంలోకి వచ్చిన వారంతా అసాధారణమైన ఏకత్వాన్ని అనుభవించారు. దానిని గూర్చి అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.” (గలతీయులు 3:28) వాస్తవంగా, నిజమైన క్రీస్తు అనుచరులు శ్రేష్ఠమైన సహోదరత్వాన్ని అనుభవించారు.
కాని, ‘ఈనాడు ఇదెన్నటికీ జరగదు’ అని కొందరు దీనిని ఖండించవచ్చు. అయినా, ఇది నలభై ఐదు లక్షలకంటే ఎక్కువమంది ప్రజలున్న సంస్థయైన యెహోవాసాక్షుల మధ్య అది యిప్పటికే సంభవించింది! దైవభీతిలేని ఈ దుష్టవ్యవస్థ నుండి నేర్చుకున్న జాతి దురభిమానాలకు సాక్షులందరూ పరిపూర్ణంగా దూరంకాలేదన్న మాట ఒప్పుకోవలసిందే. అమెరికాకు చెందిన నల్లజాతి స్త్రీ తన తోటి సాక్షులైన శ్వేతజాతి వారి గురించి వాస్తవంగా యిలా పేర్కొంది: “వారిలో కొందరికి జాత్యహంకారానికి సంబంధించిన కొన్ని దృక్పథాలున్నట్లు నేను కనుగొన్నాను, మరి వారిలో కొందరు వేరే జాతి ప్రజలతో సన్నిహితంగా వారు సహవసించినప్పుడు కొంచెం చింగ్గా ఉన్నట్లు నేను కొన్నిసార్లు గమనించాను.”
అయినను, ఆమె యిలా ఒప్పుకుంది: “యెహోవా సాక్షులు తమనుండి జాతి దురభిమానాన్ని దూరం చేశారు, కొంతమేరకు వారు భూమిపై మరే యితర ప్రజలకు పోల్చదగినవారుకారు. వారు ఏ జాతివారినైనా ప్రేమించడానికి కృషిచేస్తారు . . . ఒక సందర్భంలో శ్వేతజాతి సాక్షుల నిజమైన ప్రేమను చవిచూచినప్పుడు ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగిపోయింది.”
జాతి భేదం లేని ఐక్యతను కొందరు మాత్రమే అనుభవిస్తున్నప్పుడు—వీరు కేవలం లక్షల కొలదిగా నున్నప్పటికి—అనేక లక్షలమంది యితరులు జాత్యహంకారమనే సాతాను యోచనలతో ప్రభావితులైయుండగా ఇది అంత చెప్పుకోదగినదేనా? లేదు, అది జాతి సమస్యను పరిష్కరిస్తుందని మనం అంగీకరించము. ఇది మానవ ప్రయత్నాల కంటే అతీతమైనది. కేవలం మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు.
సంతోషదాయకంగా, ప్రస్తుతం అతి తొందరలోనే, యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ఆధిపత్యంలోనున్న తన రాజ్యం ద్వారా, భూమిపైనున్న అక్రమాన్నంతటిని, భేదభావం, ద్వేషం, జాతికి సంబంధించిన లేదా మరితర పద్ధతులను స్వార్ధంతో ప్రోత్సహించే వారిని నిర్మూలం చేస్తాడు. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) ఆ తర్వాత, క్రీస్తు కార్యనిర్వహణలో శ్రేష్ఠమైన విద్యాకార్యక్రమం ద్వారా జాతులన్నియు ఐక్యమౌతాయి. ఆ విద్యాకార్యక్రమం కొనసాగుచుండగా, జాతి భేదభావాలనేవి ఏ కోశానా లేకుండా వారు పరిపూర్ణ అనుగుణ్యతలో జీవిస్తారు. చివరకు దేవుని వాగ్దానం నెరవేరుతుంది: “మొదటి సంగతులు గతించెపోయెనని . . . ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను.”—ప్రకటన 21:4, 5.
నీవు, జాతులన్నియు సమాధానంగా కలిసి జీవించినప్పుడు, నిజమైన సహోదరత్వము ప్రజ్వరిల్లే సమయం కొరకు ఎదురుచూచే వ్యక్తివేనా? అయితే, మీకు సమీపంలో యెహోవా సాక్షులు బైబిలు అధ్యయనం చేయడానికి క్రమంగా కలుసుకునే రాజ్యమందిరానికి హాజరు కమ్మని మేము మిమ్మును ఆహ్వానిస్తున్నాము. అన్ని జాతుల ప్రజలకు వారు నిజమైన క్రైస్తవ ప్రేమను కనబరుస్తారేమో మీయంతట మీరే చూడండి. (g93 8/22)
[10వ పేజీలోని చిత్రం]
తొందరలోనే అన్ని జాతుల ప్రజలు ప్రతిచోట సమాధానంగా కలిసి జీవిస్తారు