జాతి అంటే ఏమిటి?
జాతి! ఆ పదం మీకు దేనిని జ్ఞప్తికి తెస్తుంది? కొందరికైతే ఇది ద్వేషం, అణచివేత అనే భావాన్నిస్తుంది. ఇతరులకైతే, ఇది అసూయ, కలహం, మరియు హత్య కూడా అని భావమైయుంది.
అమెరికాలోని జాతి కలహాలతో మొదలుకొని దక్షిణాఫ్రికాలోని వర్ణవివతల వరకు, తూర్పు ఐరోపాలోని వేర్వేరు తెగల మధ్య యుద్ధాలు మొదలుకొని పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లోని పోరాటాల వరకు—జాతి అనేది మానవుని దారుణ బాధకు, విధ్వంసకాండకు కేంద్రస్థానమైంది.
అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? దాదాపు ప్రతీ విషయాన్ని కూడ సహించేలా కన్పించే ప్రజలున్న దేశాల్లో కూడ, జాతి అనేది ఎందుకంత విపరీత వివాదాంశమైంది? ఎంతో గందరగోళాన్ని, అన్యాయాన్ని రగిలించే ఒత్తిలా జాతిని తయారుచేసిందేమిటి? సరళంగా చెబితే, వేర్వేరు జాతుల ప్రజలు ఎందుకు కలిసిమెలసి జీవించలేరు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, మనం జాతి అంటే ఏమిటో, ఏ పద్ధతుల్లో జాతులు వేరైయున్నాయో అనే దానికంటే అధికంగా తెలిసికోవాల్సిన అవసరముంది. జాతుల్లో ఇటీవల ఏర్పడ్డ బంధుత్వంపై చరిత్ర వహించిన పాత్రను గూర్చి కూడా తెలుసుకోవాలి. అయినను, మొదటిగా, ఈ విషయాన్ని గూర్చి విజ్ఞానశాస్త్రం మనకేం చెప్పగలదో పరిశీలిద్దాం.
మానవుల వర్గీకరణలో సమస్య
ప్రపంచంలో వేర్వేరు ప్రదేశాల్లో నివసించే ప్రజలు వేర్వేరు భౌతిక లక్షణాలు కల్గివుంటారు. వీటిలో శరీర ఛాయ, ముఖకవళికలు, తలవెంట్రుకల తీరు, మొదలైనవి యిమిడివున్నాయి. అలాంటి భౌతిక భేదాలు ఒకజాతినుండి మరొకజాతిని వేరుచేస్తాయి.
అందుకే, శరీర ఛాయపై దృష్టినిల్పి, ప్రజలు సాధారణంగా శ్వేతజాతియని, నల్లజాతియని మాట్లాడుతుంటారు. కాని ప్రజలు పోర్చుగీసు, ఆసియా, స్కాండినేవియా, యూదా, రష్యా వారిని గూర్చి కూడ మాట్లాడుతుంటారు. తర్వాత చెప్పిన ఈ గుర్తులు భౌగోళిక, జాతీయ లేదా సాంస్కృతిక విభేదాలకంటే భౌతిక లక్షణాలను తక్కువగా సూచిస్తాయి. అయితే అనేకమందికి, జాతియనేది భౌతిక లక్షణాలబట్టే కాకుండా, అలవాట్లు, భాష, సంస్కృతి, మతం, జాతీయతలనుబట్టి కూడ నిర్ణయించబడుతుంది.
అయినను, ఈ అంశాన్ని వ్రాసే కొందరు రచయితలు “జాతి” అనే పదం ఉపయోగించటానికే సంశయించడం ఆసక్తిదాయకంగా ఉంది; వారు దానిని వ్రాసిన ప్రతీసారి ఆ పదాన్ని కొటేషన్ గుర్తుల్లో పెడతారు. మరికొందరైతే ఆ పదాన్నే పూర్తిగా వ్రాయడం మాని, దానికి బదులుగా “వర్గాలు,” “గుంపులు,” జనాబాలు,” మరియు “తరగతులు” అనే పదాలు వాడతారు. ఎందుకు? ఎందుకంటే మామూలుగా అర్థం చేసుకునే “జాతి,” అనే పదానికి ఎంత విపరీత అర్థాలు, భావాలు ఇవ్వబడ్డాయంటే సరియైన విశదీకరణ లేకుండా దాని చర్చనీయాంశం తరచూ అస్పష్టంగానే ఉంటుంది.
జీవశాస్త్రజ్ఞులు, మానవశాస్త్రజ్ఞులు తరచు జాతిని కేవలం “ప్రత్యేక భౌతిక లక్షణాలు సంక్రమించుకున్న ఒక జీవరాసిని మిగతా జీవరాసులనుండి విభాగించే ఒక ఉపవిభాగంగా మాత్రమే నిర్వచించారు.” అయినను, ప్రశ్న ఏమంటే, మానవజాతుల్లోనే వేర్వేరు వర్గాలను వర్ణించటానికి ఉపయోగించే లక్షణాలేమిటి?
శరీర ఛాయ, తల వెంట్రుకల తీరుతెన్నులు, కళ్లు ముక్కు ఆకారం, మెదడు పరిమాణం, రక్తం యొక్క గ్రూప్ మొదలైనవి కారకాలుగా ఉన్నాయని సలహా యివ్వబడింది, కాని మానవజాతులను వర్గీకరించుటకు వీటిలో ఏ ఒక్కటికూడ పూర్తిగా సంతృప్తికరమైనవిగా నిరూపించలేక పోయాయి. ఎందుకంటే అలాంటి లక్షణాలన్ని ఒకేరీతిలో అచ్చు గుద్దినట్లున్న సభ్యులుగల ప్రజలగుంపు ఏదీ లేనేలేదు.
శరీర ఛాయను పరిశీలించండి. శరీర ఛాయనుబట్టి మానవజాతిని ఐదు జాతులుగా సులభంగా విభజించవచ్చని చాలామంది నమ్ముతారు: శ్వేతజాతి, నలుపు, ఊదారంగు, పసుపు, ఎరుపు జాతులు. శ్వేతజాతి సాధారణంగా తెలుపు చర్మం, పాలిపోయిన రంగులో వెంట్రుకలు, నీలవర్ణంలో కళ్లు కలిగి వుంటుందని గ్రహించవచ్చు. అయినా, వాస్తవానికి, శ్వేతజాతివారని పిలువబడే ఈ జాతిలోనే పలురకాల వెంట్రుకల రంగు, కళ్ల రంగు, శరీర ఛాయ కల్గిన ప్రజలున్నారు. ది హ్యూమన్ స్పిసీస్ అనే పుస్తకం యిలా చెబుతుంది: “ఐరోపాలో ఒకే రకమైన సభ్యులున్న జనాబా ఈనాడే కాదు, ఇంతకు క్రితమెన్నడూ కూడ లేనేలేదు.”
నిజంగా, ది కైండ్స్ ఆఫ్ మ్యాన్‌కైండ్ అనే పుస్తకం పేర్కొన్నట్లుగా, మానవ జాతులను వర్గీకరించడం కష్టం: “మనమంతా చెప్పగల్గేదిదే: మానవులంతా ఒకేవిధంగా కన్పించకపోయినప్పటికి, ప్రజలంతా వేర్వేరు రీతుల్లో వేర్వేరుగా ఉన్నారని మనం స్పష్టంగా చూడగలం, అయినా శాస్త్రవేత్తలు ఎన్ని రకాల మానవులున్నారో ఖచ్చితంగా విభజించలేమని యింకనూ అంటున్నారు. వారు కనీసం వివిధ జాతులను ఏ లక్షణాలనుబట్టి వర్గీకరించాలో కూడ నిర్ణయించలేకపోయారు. ఈ సమస్య చాలా కష్టమైందని, దానికి పరిష్కారమంటూ ఏదీ లేదని శాస్త్రవేత్తలు కొందరు అన్వేషణను విరమించుకోడానికి సిద్ధపడ్డారు!”
ఇదంతా గందరగోళమనిపించవచ్చు. శాస్త్రజ్ఞులకు జంతువులను, వృక్షాలను జాతులు, ప్రజాతులు, ఉపజాతులుగా వర్గీకరించుటలో బహుశ అంత కష్టం లేకపోయినప్పటికి, మానవజాతిని జాతులుగా విభజించుటలో ఎందుకంత సమస్య ఉంది?
“అతి ప్రమాదకరమైన మానవుని కట్టుకథ”
మానవశాస్త్రజ్ఞుడైన ఆష్లే మొంటాగు ప్రకారం, చాలామంది నమ్మేదేమంటే, “భౌతిక, మానసిక చిహ్నాలు ఒకదానితో నొకటి జతచేయబడ్డాయి, కాబట్టి భౌతిక విభేదాలు మానసిక సామర్ధ్యతలలో నిర్ణయించిన విభేదాలపైన లేదా విభేదాలతోనే సంబంధం కల్గివున్నాయి, మరి ఈ విభేదాలను మేధాశక్తి పరీక్షలద్వారా, ఈ ప్రజలు సాంస్కృతికంగా సాధించిన వాటిద్వారా కొలవవచ్చును.”
కాబట్టి, అనేకమంది నమ్మేదేమంటే జాతులు వేర్వేరు భౌతిక లక్షణాలను స్వంతం చేసుకుంటాయి గనుక, ప్రత్యేకమైన జాతులు బుద్ధికుశలతలో హెచ్చుస్థాయిలోను, మిగిలినవి తక్కువ స్థాయిలోను ఉంటాయి. అయినను, అలాంటి ఆలోచనను “అత్యంత ప్రమాదకరమైన మానవుని కట్టుకథ” అని మొంటాగు పిలుస్తున్నాడు. దానికి ఇతర నిపుణులు కూడ ఒప్పుకుంటున్నారు.
మోర్టన్ క్లాస్, హాల్ హెల్‌మేన్ అనేవాళ్లు ది కైండ్స్ ఆఫ్ మ్యాన్‌కైండ్ అనే పుస్తకంలో యిలా వివరిస్తున్నారు: “వ్యక్తులలో బేధాలు ఉన్నాయి; అన్ని రకాల ప్రజల్లో మేధావులూ, మందబుద్ధిగలవారు ఉన్నారు. కాని, అన్వేషణ అంతా జరిపిన తర్వాత, బాధ్యతగల విద్యావంతులు వేర్వేరు ప్రజల్లో మేధాశక్తి, లేదా సామర్ధ్యతకు సంబంధించినంత వరకు, వారంగీకరించగల జన్యు సంబంధమైన తేడాలున్నాయనడానికి ఏ ఆధారం కూడా వారు చూడలేకపోయారు.”
అయితే, అనేకమంది బాహ్యంగా కన్పించే తేడాలంటే దాని భావం జాతులనేవి ప్రాథమికంగా బేధాన్ని కల్గియున్నాయని యింకా ఎందుకు నమ్ముతునే ఉన్నారు? నిజానికి, ఏవిధంగా జాతి అనేది అంత వివాదాంశంగా తయారైంది? ఈ విషయాలను మనం తర్వాతి శీర్షికలో పరిశీలిద్దాము.