మీ పిల్లవాని ఒత్తిడికిగల సంకేతాలు గ్రహించుట
“ఒత్తిళ్లనేవి ప్రత్యక్ష ఆధారమేమీ లేకుండా ఊరకనే రావడం అరుదు: అవి సాధారణంగా ప్రత్యేకమైన సంఘటనకు లేదా పరిస్థితికి ప్రతిక్రియగా వచ్చేవే.”—డా. లిలియన్ జి. కాట్జ్.
పొగమంచులో చీకటి రాత్రిలో విమానంపై పయనిస్తూన్న పైలెట్‌కు తానెటు పయనిస్తున్నాడో ఎలా తెలుస్తుంది? పైకెగిరినప్పటినుండి మరలా భూమిపై దిగే వరకూ, అతడు సంకేతాలపై ఆధారపడతాడు. ఒక పెద్ద విమానపు డెక్పైనున్న పేనల్లో వందలకొద్దీ పరికరాలుంటాయి, ప్రతీది చాలా ప్రాముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తూ, రాబోయే ప్రమాదాలను గూర్చి పైలెట్‌ను హెచ్చరిస్తాయి.
ఒత్తిడితో నిండిన మన ప్రపంచంలో పెరగడమనేది తుఫానులో విమాన ప్రయాణం చేసినట్లుగావుంది. బాల్యంనుండి వయస్సొచ్చేంత వరకూ సాఫీగా సాగే పయనాన్ని తలిదండ్రులెలా నడిపించగలరు? చాలామంది పిల్లలు వారి ఒత్తిళ్లను గూర్చి చెప్పరు గనుక తలిదండ్రులు వారి సంకేతాలను గ్రహించడానికి నేర్చుకోవాలి.
శరీరం “మాట్లాడుతుంది”
పిల్లవాని ఒత్తిడి తరచు శరీరాన్నిబట్టి తెలుసుకోవచ్చును. కడుపు జబ్బులు, తలనొప్పులు, ఆయాసము, సరిగా నిద్రపోకపోవడం, మలవిసర్జనా సమస్యలతో పాటుగా మనోశారీరక ప్రతిక్రియలనేవి ఒకవేళ ఏదో పొరపాటు జరిగిందని తెల్పే సంకేతాలైయుండవచ్చు.a
షేరన్ తీవ్రమైన ఒంటరితనం అనుభవించిన తర్వాత చివరిగడియల్లో తన వినికిడి పోగొట్టుకున్నాడు. అమీ అనే అమ్మాయి పాఠశాలకు వెళ్లినప్పుడు తన తలిదండ్రులనుండి దూరమైనందున కలిగే భయం వల్ల ఆమెకు కడుపునొప్పి రావడం మొదలయ్యింది. జాన్ తన తలిదండ్రుల మధ్య జరిగిన భయంకరమైన యుద్ధాన్ని గమనించిన తొందర ఫలితంగా అతనికి మలబద్దకం వచ్చింది.
లైంగిక అత్యాచారం వలన 10 ఏండ్ల ఆష్లే భౌతిక దుష్పరిణామం అనుభవించింది. “నేను [అత్యాచారం చేయబడిన తర్వాత] జబ్బుపడినందువల్ల ఒక వారం రోజులపాటు పాఠశాలకు వెళ్లని విషయం నాకు జ్ఞాపకముంది,” అంటూ ఆమె గుర్తుకు తెచ్చుకుంటుంది. వెన్ యువర్ చైల్డ్ హేజ్ బీన్ మోలెస్టెడ్ అనే పుస్తకం యిలా వివరిస్తున్నది: “అత్యాచారం చేయబడ్డాననే చింత పసిపాపను అనారోగ్యం పాలుచేయవచ్చు.” ఇటువంటి అనారోగ్యానికి సంబంధించి వచ్చే భౌతిక సంకేతాలేవనగా గాయాలు, మలవిసర్జన సమయంలో నొప్పి, తరచూ కడుపునొప్పి రావడం, తలనొప్పి, తగిన కారణం లేకుండానే కీళ్లు లేదా కండరాలు నొప్పిపట్టడం.
అనారోగ్యం మనోశారీరకమైనదైతే, తలిదండ్రులు ఈ సంకేతాలను గంభీరంగా పరిగణించాలి. “పిల్లవాడు పైకి డాబుగా కనిపిస్తున్నాడా లేదా అనేది కాదుగాని, అసలు సమస్యేమిటీ అన్నదే ప్రాముఖ్యం” అని డా. ఆలిస్ ఎస్. హోనిగ్ చెబుతున్నది.
మాటలకంటే చేతలే గొప్ప
ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు కన్పించిందంటే మీ సహాయం అవసరమనే దాని భావం. గివింగ్ సారో వర్డ్స్ అనే పుస్తకం యిలా చెబుతుంది: “ఒక మంచి విద్యార్థికి తక్కువ గ్రేడులు వస్తున్నప్పుడు, అతని యెడల శ్రద్ధచూపించాల్సి ఉంటుంది, అలాగే ఒకప్పుడు బాగా అల్లరిచేసే పిల్లవాడు, బుద్ధిమంతునిగా మారితే, అతని యెడలకూడా శ్రద్ధ చూపాల్సిందే.
టిమీ తల్లి పూర్తిగా తన ఉద్యోగంలో మునిగి పోవడంతో, ఏడేండ్ల టిమీ హఠాత్తుగా అబద్ధాలాడటం మొదలుపెట్టాడు. ఆరు సంవత్సరాలుగల ఆడమ్ హఠాత్తుగా మోటుగా ప్రవర్తించడానికిగల మూలకారణం పాఠశాల్లో తాను అయోగ్యుడని తలంచడమే. ఏడు సంవత్సరాల కార్ల్, నిద్రలో తెలియకుండా మూత్రం విసర్జించడం మరలా మొదలుపెట్టాడంటే, ప్రస్తుతం తలిదండ్రులు తన చిన్న చెల్లాయివైపు చూపే ఆప్యాయతను తాను తీవ్రంగా కోరుతున్నాడన్నమాట.
ముఖ్యంగా స్వనాశనా ప్రవర్తన కలత చెందిస్తుంది. పన్నెండేళ్ల శారా తరచూ ఎదుర్కొనే ప్రమాదాలను గూర్చి కేవలం తన తెలివితక్కువతనానికి ముడిపెట్టకూడదు. తన తలిదండ్రులు విడాకులు పొందినప్పటినుండి తాను కోల్పోయిన తన తండ్రి ఆప్యాయతను పొందడానికి, తనకుతాను అనుకోకుండా శిక్షించుకొంటూంది. తనకుతాను కొట్టుకునేంత చిన్న దెబ్బలైనా లేదా ఆత్మహత్య చేసుకునేంత గంభీరమైనవైనా, స్వయంనాశక ప్రవర్తన ద్వారా లోలోపల రగిలే కలహమే, తీవ్రమైన ఒత్తిడికి ఒక సంకేతం.
హృదయం విప్పి మాట్లాడుట
“హృదయమందు నిండియున్న దానినిబట్టి నోరు మాటలాడును గదా,” అని యేసు చెప్పాడు. (మత్తయి 12:34) హృదయంలో వ్యతిరేక భావాలు ప్రబలంగా ఉన్నాయనేది పిల్లవాడు చెప్పేదాన్నిబట్టి బయట పడుతుంది.
“ఇంటికి వచ్చి ‘నన్నెవరూ యిష్టపడ్డంలేదు’ అని చెప్పే పిల్లలు నిజంగా తమ్మునుతామే యిష్టపడ్డంలేదనే మీతో చెబుతున్నారు,” అని డా. లోరన్ స్టెర్న్ చెబుతుంది. డంబాలుచెప్పడంలో కూడ యిది నిజమే కావచ్చు. స్వగౌరవానికి విరుద్ధంగా ఉన్నదాన్ని గూర్చి చెప్పడమే అయినప్పటికీ, వాస్తవమైన లేదా సాధించామని ఊహించిన వాటిగురించి డంబాలు చెప్పినప్పటికి, ఒకవేళ అయోగ్యులమనే అంతర్గత భావాలను ఎదుర్కోడానికి చేసే ప్రయత్నమే కావచ్చు.
నిజమే, పిల్లలందరూ నీరసపడటం, అప్పుడప్పుడు దురుసుగా ప్రవర్తించడం, వారికివారే నిరాశచెందడం జరుగుతుంది. కాని అలాంటి సమస్యలు ఒకే తరహాగా వస్తూ, తక్షణమే దానికిగల కారణం కన్పించకపోతే, తలిదండ్రులు వాటి భావాలను పరిశీలించాల్సి వుంటుంది.
తీవ్రమైన హింసాకాండతో కూడిన నేరాలు చేసిన ఆరుగురు యౌవనుల ప్రవర్తనా మాదిరులను పరిశీలించిన పిమ్మట, మేరీ సూసన్ మిల్లర్ యిలా పేర్కొంది: “కావలసినన్ని సూచనలున్నాయి. ఆ మగపిల్లలు తమ జీవన పద్ధతంతటిలోనూ సంవత్సరాల తరబడి, అట్టి సూచనలను కనబరిచారు, కాని యే ఒక్కరూ కూడ వారి యెడల అవధానం చూపెట్టలేదు. పెద్దవాళ్లు చూశారు, కాని వారి చేతులు దులుపుకున్నారు.”
తలిదండ్రులు ముందెన్నడూ లేనిరీతిగా బాల్యంలోని ఒత్తిడులకు సంబంధించిన సూచలను గుర్తించి, వాటికి తగినట్లు ప్రవర్తించాల్సివుంది.
[8వ పేజీలోని బాక్సు]
గర్భంలో కూడా ఒత్తిడా?
తల్లి తన రక్తంలోని రసాయన మార్పులద్వారా సంకేతాలందిస్తుంది గనుక పిండం కూడా ఒత్తిడి, భయం, మనస్తాపాల ఆచూకీ తెలుసుకోగలదు. “గర్భంతోనున్న స్త్రీ భావించే ఉద్రిక్తతలన్నింటినీ లోపల పెరుగుతున్న పిండం గ్రహిస్తుంది” అని గ్రోయింగ్ అప్ డివోర్స్డ్ అనే పుస్తకంలో, లిండా బర్డ్ ఫ్రాంకీ వ్రాస్తున్నది. “తల్లి, పిండం యొక్క నాడీ వ్యవస్థలు రెండునూ సూటిగా సంబంధం కల్గియుండనప్పటికి, యిద్దరి మధ్య తెగిపోని ఒకేవిధమైన బాంధవ్యం ఉంటుంది.” టైమ్ పత్రిక ప్రకారం, 18 నెలలు, అంతకంటే తక్కువ వయస్సున్న శిశువుల్లో 30 శాతంమంది, మనస్తాప ప్రతిచర్యలకు సంబంధించిన భావాత్మక కష్టాలవల్ల వచ్చే ఒత్తిడులననుభవిస్తున్నారని అంచనా వేయబడింది. “అసంతోషంగాను, నిరాశతోను ఉన్న స్త్రీలకు జన్మించే బిడ్డలు కూడా తరచూ అసంతోషంగాను, నిరాశతోనూ ఉంటారని,” ఫ్రేంకీ ముగింపులో చెబుతుంది.
[9వ పేజీలోని బాక్సు]
పిల్లవాడు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించినప్పుడు
“నేను ఒక వంద సంవత్సరాలు నిద్రపోతే యేమౌతుందంటా?” అని లెట్టీ తన తండ్రిని అడిగింది. అది ఏదో ఆకతాయి ప్రశ్నని తలంచాడు. కాని లెట్టి మాత్రం చిలిపిగా ప్రశ్నించలేదు. కొన్నిరోజుల తర్వాత ఒక సీసాడు నిద్ర మాత్రలను మ్రింగినందువల్ల ఆమె ఆసుపత్రి పాలయ్యింది.
ఒకవేళ మీ పసిబిడ్డ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తే లేదా ప్రయత్నిస్తే, మీరేం చేయాలి? “వెంటనే నిపుణుల సహాయాన్ని అర్థించండని,” డిప్రెషన్—వాట్ ఫ్యామిలీస్ షుడ్ నొ అనే పుస్తకం నొక్కిచెబుతుంది. “అభిరుచిగల క్రొత్తవారుగాని, అలాగే నిరాశచెందిన వ్యక్తులను గూర్చి ఎంతో శ్రద్ధతో వ్యవహరించేవారుగాని జరగబోయే ఆత్మహత్యలకు చికిత్స చేయలేరు. మీ పిల్లలు మౌనం వహిస్తూ, భయంకర ఫలితాలతో బ్రద్దలయ్యే వరకూ భావాలన్నీ లోలోపలే దాచుకుని కుమిలిపోతున్నప్పుడు కూడ, మీ కుటుంబ సభ్యునితో ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి ఒప్పించానని మీరనుకోవచ్చు.”
ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించే పసిబిడ్డకు సరైన చికిత్సతోపాటు, నిరీక్షణ కూడ ఉంది. “ఆత్మహత్యా ప్రయత్నం చేసే చాలామంది వాస్తవంగా తమకు తాము చంపుకోవాలని కోరుకోరని,” పైన తెల్పిన పుస్తకం వివరిస్తుంది. “వారు బాధించబడకుండా ఆపడానికే కోరుకుంటారు. వారి ప్రయత్నమంతా సహాయం కొరకు చేసే విజ్ఞాపనే.” క్రైస్తవ సంఘంలో, ఆత్మహత్యా ప్రవృత్తులతో వ్యవహరించడం తెలియని తలిదండ్రులు, సంఘపెద్దలనుండి ప్రేమతోకూడిన మద్దతును, మంచి లేఖనాధార సలహాను పొందవచ్చును.
[అధస్సూచీలు]
a తీవ్రమైన మనోవ్యాధి మూలంగా వచ్చే భయంవంటిది గాకుండా, ఈ మనోశారీరక వ్యాధి వాస్తవమే. అయినను, ఇది భావోద్రేకంగా వచ్చిందేకాని, భౌతికంగా వచ్చిందికాదు.