ఒత్తిడికి గురౌతున్న అనేకమంది పిల్లలు
“రేండీ!” అని రీటా తన ఇంటిని సమీపిస్తూ దూరంనుండి తాను చూచిన దృశ్యానికి భయకంపితురాలై, పెద్దగా అరిచింది. అక్కడ ఆమె కుమారుడు రేండీ, కాంక్రీట్ వరండాకు 8 మీటర్ల ఎత్తులోనున్న పై అంతస్థులోని పడకగది కిటికీ నుండి వ్రేలాడుతూ కన్పించాడు. లారే తన భార్య పెట్టే భయకంపిత బొబ్బలను విని, దఢాలున లేచాడు. మెట్లపై పరుగెడుతూ, పడకగదిలో చొరబడి, రేండీని పట్టుకుని, అతనిని ఆయన క్షేమంగా లోనికి లాగాడు. రేండీ తలిదండ్రులకు తక్షణ జవాబులు కావాలి. “నీవెందుకు అలా చేశావు? ఎందుకు?” అని నమ్మలేక అడిగారు. “నీకు దెబ్బలు తగిలుండేవి గదా; నీవు చనిపోయుండే వాడవే!” “నేను చావాలనుకున్నాను,” అని రేండీ అలక్ష్యంగా సమాధానమిచ్చాడు. రేండీ వయస్సు కేవలం ఐదు సంవత్సరాలే.
చూడ్డానికి రేండీ మంచి ఆరోగ్యవంతుడిలా కన్పించాడు. అతడు రహస్యంగా చనిపోవాలని అనుకుంటున్నాడని ఎవరూ సందేహించలేదు. అయినప్పటికి, రేండీ తీవ్రమైన ఒత్తిడికి గురైన ఒక పిల్లవాడని తర్వాత జరిపిన పరిశీలనలో బయటపడింది.
రేండీ వలెనే ఈనాడు అనేకమంది పిల్లలు అపరిమిత సంక్షోభకు గురవుతున్నారు. వారి ఆవేదనను అణచుకోగల సరైన మార్గాలు కనుగొనలేక, కొందరు వారి మనస్తాపాన్ని అణచివేయడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. కాని అణచిపెట్టబడిన ఒత్తిడి చివరకు బయటపడే మార్గాన్ని వెతుకుతుంది. కొందరికైతే, బయటకు వ్యక్తం చేయలేని మనస్తాపం భౌతిక అనారోగ్యానికి, లేదా నేరప్రవృత్తికి దారితీస్తుంది. ఇతరులకైతే, ఒత్తిడి అనేది లోలోపలనే దాచుకొని తనకుతాను గాయపరచుకోవడంతో పాటు, సరిగా ఆహారం తీసుకోకపోవడం, మత్తుపానీయాలు సేవించడం, ఆత్మహత్య చేసుకోవడంలాంటి తమనుతాము నాశనం చేసుకునే క్రియలు చేయడానికి కూడా నడుపుతుంది. ది చైల్డ్ ఇన్ క్రైసిస్ యిలా పరిశీలిస్తున్నది: “ఈ సమస్యల్లో చాలామట్టుకు—ప్రాముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడం—ఒకప్పుడు పెద్దవాళ్లకూ ఎదిగిన పిల్లలకు మాత్రమే పరిమితమైయుండేది. ప్రస్తుతం అవి చాలా చిన్న పిల్లలకు కూడా నెమ్మదిగా అంటుకుంటున్నాయి.”
‘ఇదెలా జరుగవచ్చును?’ అని సందిగ్ధంలోనున్న పెద్దలు అడుగుతారు. ‘పసితనమంటే బొమ్మలాటలకు, నవ్వులాటలకు సమయం కాదా?’ కాదు అనే చాలామంది పిల్లల సమాధానం. “పసితనం చెక్కుచెదరని ఆనందాలకు సమయమని పెద్దవాళ్లు కల్పించిన కట్టుకథ,” అంటూ డా. జులియస్ సెగెల్ చెబుతున్నాడు. ఈ విషాధ సత్యం పసిపిల్లల నిపుణుడైన జోసఫ్ లూపో నిజమేనని నిర్ధారించాడు. “నేను 25 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్నాను. ఈనాడు నేను నాలుగు రెట్లు ఒత్తిడికి గురైన పిల్లలను, యౌవన రోగులను చూస్తున్నాను.”
పిల్లల్లో ఎన్నడూ లేని యిలాంటి ఒత్తిడికి కారణమేమైయుంది? హెచ్చరికా సూచనలేమిటి? ఒత్తిడికి గురైన పిల్లలు ఎలా సహాయం పొందగలరు? ఈ ప్రశ్నలు తరువాతి శీర్షికల్లో చర్చించబడతాయి.