భాగం 6
విజ్ఞానశాస్త్రం—మానవుని నిరంతర సత్యాన్వేషణ
21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనుట
తొమ్మిది, ఎనిమిది, ఏడు, అంటూ క్రిందికి లెక్కిస్తున్నారు! అలా లెక్కించేది రాకెట్ ప్రయోగించడానికా? లేదు, బదులుగా మానవజాతి అనిశ్చిత సంఘటనల్లో చొచ్చుకుపోవడానికి ముందు 21వ శతాబ్దానికి యింకా ఎన్ని సంవత్సరాలున్నాయా అని లెక్కించడానికే.a
గడచిన శతాబ్దంలో వైజ్ఞానికంగా సాధించిన వాటినాధారం చేసికొని, 21వ శతాబ్దంలో రాబోయే ఏ సవాలునైనా విజ్ఞానశాస్త్రం ఎదుర్కోగలదని చాలామంది యథార్థంగా నమ్మవచ్చు.b వారు 20వ శతాబ్దారంభంలో ఫ్రెంచి రచయితవలే భావించవచ్చు. “ఈనాడు విజ్ఞానశాస్త్రం ప్రపంచాన్ని ఏలే గమ్యంతో ఉంది, ఇప్పటి నుండి ప్రపంచ ఆధిపత్యం ఏ దేవతకూ చెందదుగాని, విజ్ఞానశాస్త్రానికే, ప్రజల ప్రయోజనాన్ని కోరేదిగా, మానవజాతిని విముక్తిచేసేదిగా అది విజ్ఞానశాస్త్రానికే చెందుతుంది” అని ఆయన వ్రాశాడు.
విజ్ఞానశాస్త్రం ఈ ఆశలన్నింటినీ నెరవేర్చాలంటే, దీని కారణంగా ఏర్పడ్డ సమస్యలన్నింటినీ ఇది నిర్మూలం చేయాలి.
వాతావరణ విధ్వంసానికి విజ్ఞానశాస్త్రం గొప్ప బాధ్యత వహిస్తుంది. “మనం ఇటీవల వాతావరణ సంబంధ వక్రమార్గాన్ని చూచినట్లైతే, తర్వాతి శతాబ్దంలో ఈ ఆధునిక సమాజం కాపాడబడుతుందా అనేది ప్రశ్నకాదు, కాని అణుఆయుధ ఘీంకారంతోనా, లేక వాతావరణ సమస్యలతోనా, ఈ సమాజం నాశనమయ్యేది?” అని 5000 డేస్ టు సేవ్ ది ప్లానెట్ అనే పుస్తకం ఖండితంగా అంటుంది.
ఇది అంగీకారంతో కూడిన ఎంపికలా అనిపించడం లేదు.
విజ్ఞానశాస్త్ర హద్దులు
“ఏదో ఒకనాడు సరియైన సత్యాన్ని, పూర్తి అవగాహనను సాధిస్తామని . . . అనేకమంది 19వ శతాబ్దపు శాస్త్రజ్ఞులు తరచూ భావించారు,” అని ది సైంటిస్ట్ అనే పుస్తకం చెబుతుంది. ఆ పుస్తకం యింకా చెప్పేదేమంటే “వారి వారసులు తదేకంగా సత్యాన్ని చేరుకునే ‘పాక్షిక అవగాహనను’ చేరుకుంటున్నట్లు మాత్రమే చెబుతున్నారు, కాని ఎన్నడూ దాన్ని పూర్తిగా గ్రహించలేకపోతున్నారు.” సరియైన జ్ఞానం లేకపోవడమనేది విజ్ఞానశాస్త్రం చేయగల్గేదానికి హద్దులేర్పరచింది.
వైజ్ఞానిక సత్యాలు సంవత్సరాల తరబడి ఏమార్పూ చెందలేదు, కాని వైజ్ఞానిక సిద్ధాంతాల్లో మాత్రం పదేపదే మార్పులు జరిగాయి. నిజానికి, కొన్నిసార్లు సిద్ధాంతాలు ఒక దిశనుండి మరోదిశకు ఒరిగాయి. ఉదాహరణకు, వైద్యశాస్త్రజ్ఞులు, బాగా అస్వస్థతకు గురైన వ్యక్తి శరీరం నుండి రక్తం తీసివేయడం ఒకప్పుడు వైజ్ఞానిక విషయంగా తలంచారు. తర్వాత రక్తం ఎక్కించడమే దానికి పరిష్కారమని వారు తలంచారు. ప్రస్తుతం కొందరు ఈ రెండూ కాకుండా, స్వల్పప్రమాదకర ప్రత్యామ్నాయ చికిత్సల్లోని జ్ఞానాన్ని గుర్తించి వాటికోసం అన్వేషించడం ఆరంభించారు.
శాస్త్రవేత్తలకు తెలిసినదానికంటే, తెలియనిది చాలా ఎక్కువనేది విశదమే. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా యిలా పేర్కొంటుంది: “కిరణజన్య సంయోగక్రియ కచ్చితంగా ఎలా జరుగుతుందో వృక్షశాస్త్రజ్ఞులకు ఇంకా తెలియదు. జీవం ఎలా ఉద్భవించిందనే ప్రశ్నకు సమాధానాన్ని జీవశాస్త్రజ్ఞులు, జీవరసాయన శాస్త్రజ్ఞులు ఇంకా కనుగొనలేదు. విశ్వం ఉత్పత్తిని గూర్చి తృప్తికరమైన వివరాలు ఖగోళ శాస్త్రజ్ఞులింకనూ రూపించలేదు. క్యాన్సరు ఎందుకొస్తుందో, ఎలా నయం చేయాలో, అనేక వైరస్ రోగాలను ఎలా నయం చేయాలో వైద్యశాస్త్రజ్ఞులకు, శరీరధర్మ శాస్త్రజ్ఞులకు తెలియదు. . . . మనోవ్యాధికి గల కారణాలన్నీ మానసిక శాస్త్రజ్ఞులకు తెలియవు.”
విజ్ఞానశాస్త్రం శాస్త్రజ్ఞులకంటే గొప్పదేమీ కాదనే భావంలో కూడ దానికి హద్దువుంది. వేరే మాటల్లో చెప్పాలంటే, శాస్త్రవేత్తకు సరైన జ్ఞానం లోపించడమనేది అతని అపరిపూర్ణతతో ముడిపడివుంది. “తరచూ . . . ప్రత్యేక ఉద్దేశంగల్గిన సంస్థలు హానికర ఉత్పత్తులను అమ్మడానికి లేదా వాతావరణాన్ని నాశనం చేసే కార్యాలను చేయడంలో కొనసాగటానికి పరిశోధనను యుక్తిగా చేసి, పారిశ్రామిక ప్రయోజనం నిమిత్తం వెల-లాభం అనేదాన్ని తప్పుగా విశ్లేషించి, సమాచారాన్ని అణచివేశాయ”ని, 5000 డేస్ టు సేవ్ ది ప్లేనెట్ అనే పుస్తక రచయితలు కనుగొన్నారు.
ఎక్కువమంది శాస్త్రజ్ఞులు యథార్థపరులైనప్పటికి కూడ, వారి కార్యాలకుగాని, వారికి గాని అనవసర గౌరవమియ్యాల్సిన పనిలేదు. “వారు కేవలం ఇతరులవంటివారే, వారందరికీ తమ భావాలున్నాయి. కొందరు అంకితమైనవారు, కొందరు నిజాయితీలేనివారు, కొందరు చాలా మేధావులు, మరికొందరు దద్దమ్మలు. ప్రపంచానికి ఎనలేని మంచి చేసిన శాస్త్రవేత్తల్లో కొందరు నాకు తెలుసు. మరి జైలు పాలైన శాస్త్రవేత్తలెవరూ నాకు తెలియరుగాని, జైలుశిక్షకు ఎంతో పాత్రులైన కొందరు నాకు తెలుసు” అని బ్రిటిష్ శాస్త్రవేత్త ఎడ్వార్డ్ బోవెన్ వాదిస్తున్నాడు.
స్పష్టంగా, దీనికున్న అనేక హద్దులనుబట్టి, ఆధునిక విజ్ఞానశాస్త్రం 21వ శతాబ్దపు సవాళ్లనెదుర్కొనే స్థితిలో లేదు. ప్రాముఖ్యంగా వాతావరణాన్ని కాపాడేందుకు, భూమిని యుద్ధంనుండి దూరం చేయడానికి బదులు, ఇది సమూల నాశనం చేయగల ఆయుధాలను సృష్టించుటలో సహాయపడింది.
త్వరలోనే చర్య తీసుకోవాల్సిన అవసరముంది
త్వరలోనే ఏదోకటి చేయాల్సి ఉందని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. గత నవంబరు మాసంలో 99మంది నోబెల్ బహుమతి విజేతలతో పాటు మొత్తం 1,575మందిగల శాస్త్రవేత్తలగుంపు సమకూడి, యిలా వ్యాఖ్యానించారు: “మానవజాతికి ప్రపంచ శాస్త్రవేత్తల హెచ్చరిక.” దానిలో వారిలా వ్రాశారు: “మనం ప్రస్తుతం ఎదుర్కొనే భయాలను తొలగించడానికి మిగిలివున్న అవకాశాన్ని ఒకటి లేక కొన్ని దశాబ్దాలలో కోల్పోతాము, మరి మానవజాతి ప్రయోజనాలు అపరిమితంగా క్షీణించిపోతాయి.” వారిలా నొక్కిచెప్పారు: “మానవులు, పకృతి ప్రపంచం పరస్పర ఘర్షణకు దిగుతున్నాయి.”
అదేరకమైన హెచ్చరికలు గతంలో కూడా చేయబడ్డాయి. నిజానికి, 1952లో బ్రిటీష్ తత్వవేత్త మరియు విజ్ఞానశాస్త్ర అడ్వకేట్ అయిన బెర్‌ట్రాండ్ రస్సల్ యిలా చెప్పాడు: “విజ్ఞానశాస్త్రంతో పాటు మానవ జీవితం కొనసాగాలంటే, క్రితం అంతగా అవసరం లేని భావాలను గూర్చిన క్రమశిక్షణను మానవజాతి నేర్చుకోవాలి. చట్టం అన్యాయంగాను ప్రతికూలంగాను ఉందని వారు తలంచినప్పటికి, చట్టానికి లోబడటం మానవుడు నేర్చుకోవాలి. . . . అది జరగకపోతే మానవజాతి నాశనమౌతుంది, మరి అది విజ్ఞానశాస్త్ర ఫలితంగానే నాశనమౌతుంది. ఏభై సంవత్సరాల లోపులోనే స్పష్టమైన ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది, ఇది హేతువు, మృత్యువుకు మధ్య చేసే ఎన్నికయే. ‘హేతువు’ అనడంలో నా భావమేమంటే అంతర్జాతీయ అధికారి జారీ చేసిన చట్టానికి లోబడటానికి యిష్టపడటమే. మానవజాతి మృత్యువునే ఎన్నుకుంటుందని నేను భయపడుతున్నాను. నాది పొరపాటే కావచ్చు.”
వాస్తవమేమంటే, నీతి ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు ఈ రోజుల్లో ప్రజలు యిష్టపడటం చాలా అరుదైపోయింది. మానవ హక్కుల పోరాట నాయకుడు కీ.శే. మార్టిన్ లూథర్ కింగ్ యుక్తంగా యిలా పేర్కొన్నాడు: “మన వైజ్ఞానిక శక్తి మన ఆధ్యాత్మికశక్తిని క్షీణింపజేసింది. మానవున్ని తప్పుదారిలో నడిపించిన క్షిపణులు మనకున్నాయి.” అయినను, మానవజాతి “అంతర్జాతీయ అధికారి జారీ చేసిన చట్టానికి లోబడి ఉండాలని” రస్సల్ చెప్పినప్పుడు ఆయన తనకు తెలియకుండానే ప్రపంచ సమస్యల పరిష్కారాన్ని కనుగొన్నాడు.
సమస్యను పరిష్కరించగల్గేదెవరు?
నిజమే, అంతర్జాతీయ అధికారిచే జారీ చేయబడిన చట్టం గురించి బెర్‌ట్రాండ్ రస్సల్ మాట్లాడినప్పుడు ఆయన దైవిక అధికారాన్ని ప్రస్తావించలేదు. అయినా, కచ్చితంగా అవసరమైనదేమంటే అలాంటి అధికారి యొక్క చట్టానికి విధేయత చూపించడమే. నిశ్చయంగా దానికి పరిష్కారం మానవ చట్టాలు, మానవ అధికారులు కానేకాదు. వారు ఎన్నడూ ప్రపంచాన్ని మార్చలేరు, తద్వారా నాశనాన్ని ఆపలేరు. దుస్సంఘటనల చరిత్ర నిరూపించేదేమంటే మానవులకు దైవిక పరిపాలన అవసరము.c
నిజంగా, యెహోవా అను నామం కల్గిన సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే, 21వ శతాబ్దపు సవాళ్లనెదుర్కొనే శక్తి, సామర్థ్యాలుగల అంతర్జాతీయ అధికారిని దయచేయగలడు. (కీర్తన 83:18) సృష్టికర్తయైన యెహోవా దేవునిచే స్థాపించబడ్డ పరలోక ప్రభుత్వమైన దేవుని రాజ్యంలో జీవాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి ఈ అధికారికి లోబడాలి.
ఈ ప్రభుత్వం గూర్చి చాలాకాలం క్రితమే బైబిలు ముందుగా ప్రవచించింది: “ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. . . . సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగును. (యెషయా 9:6, 7) ముందుగా ప్రవచింపబడిన ఈ శిశువైన యేసుక్రీస్తు అద్భుతరీతిలో కన్య మేరీ గర్భానపడి, యూదాలోని బెత్లెహేములో జన్మించాడు.—లూకా 1:30-33.
యేసు భూమిపైనుండగా తన అనుచరులకు దేవుని రాజ్యాన్నిగూర్చి ప్రార్థించమని నేర్పించాడు. ఆయనిలా అన్నాడు: “కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, . . . నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.” (మత్తయి 6:9, 10) ఆయన రాజ్యంయొక్క నీతి సూత్రాలకు అనుగుణంగా ఆసక్తిగల ప్రజలు తమ జీవితాల్లో అవసరమైన మార్పులు చేసుకోడానికి కేవలం యెహోవా దేవుని శక్తివంతమైన పరిశుద్ధాత్మ లేదా చురుకైన శక్తి మాత్రమే సహాయపడగలదు. విజ్ఞానశాస్త్రం అలా చేయలేదు. వేల సంవత్సరాలుగా ఉన్న అనైక్యత, కలవరమే అది చేయలేదనడానికి నిదర్శనం.
కచ్చితమైన అనంత వైజ్ఞానిక జ్ఞానంగల యెహోవా దేవుడు మొదటి మానవజతను సృష్టించినప్పుడు, ఏదేను తోటలోని పరిస్థితివలే, భూప్రజలు పరదైసు పరిస్థితులను అనుభవించేలా చేస్తాడు. ఆనాడు ఆయన వారినిలా ఆజ్ఞాపించాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:28) వారు ఆ ఆజ్ఞకు లోబడుటలో విఫలులై, దానిని నెరవేర్చలేకపోయినప్పటికి, భూమిని పరదైసుగా మార్చాలనే తన మొట్టమొదటి ఉద్దేశాన్ని యెహోవా దేవుడు నెరవేరేలా చేస్తాడు. “నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను,” అని ఆయన చెబుతున్నాడు. (యెషయా 46:11) కాని భూమిని గూర్చిన దేవుని మొట్టమొదటి ఉద్దేశం ఎప్పుడు నెరవేరుతుంది?
మానవ ప్రభుత్వాలన్నింటినీ దేవుని ప్రభుత్వం తీసివేయడానికి కొంచెం ముందు అనగా “చివరి దినాల్లో” ఉండే పరిస్థితులనుగూర్చి యేసుక్రీస్తు, ఆయన అపొస్తలులు వివరించారు. (2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-14, 37-39; 2 పేతురు 3:3, 4) ఒక వ్యక్తి ఇక్కడ వివరించిన బైబిలు ప్రవచనాలను చదివి, వాటిని ప్రపంచ సంఘటనలతో పోల్చితే, దానియేలు 2:44లో వివరించినట్లుగా దేవునిరాజ్యం చర్య తీసుకోబోయే సమయంలో మనం జీవిస్తున్నామని స్పష్టమౌతుంది: “ఆ రాజుల కాలములలో [ప్రస్తుతం పరిపాలిస్తున్న మానవప్రభుత్వాలు] పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”
సమీప భవిష్యత్తులో జీవితం
సమీప భవిష్యత్తు అంటే ఏమిటో కాస్త ఊహించండి! రాబోయే శతాబ్దంలో, లేకపోతే అంతకుముందే మానవజాతికి ఎంత అద్భుతకరమైన విషయాలు దాచిపెట్టబడ్డాయో! వేల సంవత్సరాలుగా కొనసాగిన అపరిపూర్ణ మానవ పరిపాలన, వేషధారణతో కూడిన మతం, దురాశతో కూడిన వ్యాపారం, ఈలోక విజ్ఞానశాస్త్రం బదులు దేవుని పరిపాలన ఉంటుంది, అది మానవులు నిరీక్షించిన దానికంటే వారిని అధికంగా దీవిస్తుంది.
దేవుని నూతన నీతి ప్రపంచంలో వెల్లడయ్యే సంఘటనలను బైబిలు ఈవిధంగా వర్ణిస్తుంది: “అప్పుడు—ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”—ప్రకటన 21:3, 4.
కాబట్టి, లోక అదృశ్య పరిపాలకుడును, అపవాదియైన సాతాను ప్రభావం క్రిందనున్న ఈ లోకవ్యవస్థ నాశనమైనప్పుడు తొందరలోనే ముగియనున్న ఈ లెక్కింపును గూర్చి జాగ్రత్తపడటమే మీకు అతిప్రాముఖ్యం. (యోహాను 12:31; 2 కొరింథీయులు 4:3, 4) మీరు దేవుని చిత్తం తెలుసుకుని, దానిని చేయడం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే బైబిలిలా వాగ్దానం చేస్తుంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17.
కాబట్టి, సమయం అనుకూలించిన కొలది, మీరు రక్షింపబడేందుకు యెహోవా దేవుని ఏర్పాట్లన్నింటి ప్రయోజనాన్ని వివేకవంతంగా పొందగలరు. తర్వాత మీరు భవిష్యత్తులో జీవించే ఆధిక్యత పొందుతారు, ఔను, రానైయున్న 21వ శతాబ్దంలో, అలాగే ఆ తర్వాత వచ్చే 22, 23, మరెన్నో లెక్కలేనన్ని శతాబ్దాల్లోనూ జీవించగలరు. (g93 6/22)
[అధస్సూచీలు]
a సాంకేతిక పరిభాషలో 21వ శతాబ్దం 2001, జనవరి 1న ఆరంభమౌతుంది. అయినను, 1వ సంవత్సరం నుండి ఆరంభమై 99 వరకు మొదటి శతాబ్దమని (0 సంవత్సరం లేదు); 100 నుండి ఆరంభమై 199 వరకు రెండవ శతాబ్దమని; అదేరీతిలో, 2000 నుండి ఆరంభమై 2099 వరకు 21వ శతాబ్దమని వాడుకగా అంటారు.
b ఇది తేజరిల్లు! పత్రికలో విజ్ఞానశాస్త్రాన్ని గూర్చి వెలువడుతూవస్తున్న ఆరు భాగాల ధారావాహికలో చివరి భాగం.
c పది భాగాలుగా ప్రచురించిన “హ్యూమన్ రూల్ వెయ్‌డ్ ఇన్ ది బేలన్స్” అనే తేజరిల్లు! ఆంగ్ల శీర్షికల్లో (ఆగస్టు 8 నుండి డిశంబరు 22, 1990) మానవ ప్రభుత్వాల ప్రభావం ఉన్నతపర్చబడింది.
[27వ పేజీలోని బాక్సు]
దుర్వార్త మధ్యలో సువార్త
వైజ్ఞానిక పురోభివృద్ధి జరుగుతున్నప్పటికి కోకొల్లలుగా ఆకలిమంటల్లో అలమటిస్తున్న శిశువులు, కృశిస్తున్న వయోజనులు యింకనూ ఉన్నారు. కాని తొందరలోనే దేవుని మెస్సీయ రాజ్యంలో, “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.
వైజ్ఞానిక పురోభివృద్ధి జరుగుతున్నప్పటికి లక్షలకొలది ప్రజల్లో హింసాకాండ కొనసాగుతూనే వుంది. కాని తొందరలోనే దేవుని మెస్సీయ రాజ్యాన్ని ఏలే రాజు “దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. . . . కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును.”—కీర్తన 72:12-14.
వైజ్ఞానిక పురోభివృద్ధి జరుగుతున్నప్పటికి ఇళ్లు, ఆహారం లేని హీనస్థితిలోవున్న ప్రజలసంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనేవుంది. కాని తొందరలోనే మెస్సీయ రాజ్యంలో జనులు “ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. . . . వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు.”—యెషయా 65:21, 22.
వైద్య పురోభివృద్ధి జరుగుతున్నప్పటికి, రోగాలు లక్షలాదిమందిని హతమారుస్తూనే ఉన్నాయి. కాని దేవుని మెస్సీయ రాజ్యంలో “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24.
[28వ పేజీలోని చిత్రం]
భూమిపై ప్రతిచోటా జీవితం సంతోషంగా ఉండును.
[క్రెడిట్ లైను]
Courtesy Hartebeespoortdam Snake and Animal Park