పిల్లలు—లాభమా నష్టమా?
జనాభా పెరుగుదల అని తరచుగా పిలువబడేది కుటుంబ నియంత్రణతో దగ్గరి సంబంధాన్ని కలిగివుంది. దాదాపు మానవ చరిత్రంతటిలో జనాభా పెరుగుదల తక్కువగానే ఉంది; చనిపోయేవారి సంఖ్య జన్మించేవారి సంఖ్యతో సమానంగా ఉండేది. చివరికి, 1830వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా వంద కోట్లకు చేరుకొన్నది.
అప్పుడు వైద్య మరియు వైజ్ఞానిక అభివృద్ధి జరగడంతో, వ్యాధి వల్ల ముఖ్యంగా శిశురోగాలవల్ల సంభవించే మరణాలు తగ్గిపోయాయి. దాదాపు 1930 నాటికి ప్రపంచ జనాభా రెండు వందల కోట్లకు చేరింది. 1960 నాటికి మరో వంద కోట్లు పెరిగాయి. 1975 నాటికి మరో వంద కోట్లు, అలా 1987 నాటికి ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లకు చేరుకుంది.
ఈ పరిస్థితిని మరో విధంగా చూడాలంటే, యీ గ్రహంపై ప్రజల సంఖ్య ప్రతి నిమిషానికి 170 మంది చొప్పున పెరుగుతున్నది. అంటే ప్రతిరోజు దాదాపు 2,50,000 మంది అనగా ఒక మోస్తరుగా నగరానికి సరిపోయేంత మంది పెరుగుతున్నారు, అంటే మరో మెక్సికో లేదా మూడు కెనడాలతో సమానమయ్యేంత మంది అనగా ప్రతి సంవత్సరం తొమ్మిది కోట్ల కంటె ఎక్కువ జనాభా కలుపబడుతూందని దాని అర్థం. అభివృద్ధిచెందుతున్న దేశాలలోనే 90 శాతం కంటె ఎక్కువ పెరుగుదల జరుగుతున్నది, ఈ దేశాలలో ఇప్పటికే ప్రపంచ జనాభా యొక్క 75 శాతం జీవిస్తున్నది.
ఆందోళన చెందుతున్న ప్రభుత్వాలు
అయితే కుటుంబ నియంత్రణ ద్వారా జనాభా పెరుగుదలను అదుపు చేయాలని ప్రభుత్వాలెందుకు ఆతురపడుతున్నాయి? ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యొక్క నైజీరియా నేషనల్ ప్రోగ్రాం అధికారి, డాక్టర్ బాబ్స్ సాగో క్లిష్టమైన, వివాదాస్పదమైన పరిస్థితిని మరీ సులభతరం చేసే సాధారణ ఉదాహరణ ద్వారా యీ ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆయనిలా హెచ్చరిస్తున్నాడు:
‘ఒక రైతుకు పదెకరాల భూమి ఉందనుకోండి. ఒకవేళ ఆయనకు పది మంది పిల్లలుంటే, దాన్ని ప్రతి ఒక్కరికీ సమానంగా పంచి ఇస్తే, ఒకొక్కరికీ ఒక ఎకరం భూమి వస్తుంది. ఆ పిల్లలందరిలో ఒకొక్కరికీ పది మంది పిల్లలుండి, భూమిని అలాగే పంచి పెడితే, ఆ పిల్లలందరిలో ఒకొక్కరికీ ఆ ఎకరంలో పదవవంతు మాత్రమే లభిస్తుంది. స్పష్టంగా, ఈ పిల్లలు పదెకరాల భూమి ఉన్న వారి తాతయ్యలా మాత్రం ఉండలేరు.’
ఈ ఉపమానం, పెరుగుతున్న ప్రజలకు, పరిమిత వనరులుగల పెరగని భూమికి మధ్య ఉన్న సంబంధాన్ని ఉన్నత పరుస్తోంది. జనాభా పెరిగేకొలది, అనేక అభివృద్ధిచెందుతున్న దేశాలు ప్రస్తుత జనాభా పెరుగుదల స్థాయిని ఎదుర్కొనడానికి పోరాడుతున్నాయి. కొన్ని సమస్యలను పరిశీలించండి.
వనరులు. జనాభా పెరిగే కొలది, అడవులు, సారవంతమైన నేల, పంటపొలాలు, తాజానీరు వంటి వాటి అవసరత పెరుగుతుంది. ఫలితం? “అభివృద్ధి చెందుతున్న దేశాలు . . . వారి భవిష్యత్ అభివృద్ధి ఆధారపడి ఉన్న జాతీయ వనరులను అధికంగా వినియోగించు కొనవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది” అని పొపూలి అనే పత్రిక విలపిస్తోంది.
ప్రజాసేవాసంస్థలు: జనాభా పెరుగుతున్న కొలది, తగిన గృహ వసతులు, పాఠశాలలు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రహదారులు మరియు ఆరోగ్య సేవలు అందించటానికి ప్రభుత్వాలకు ఎంతో కష్టమౌతున్నది. అధిక రుణ భారం, వనరుల తరుగుదల మూలంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఇతర పెద్ద సమస్యలటుంచి, ప్రస్తుత జనాభా అవసరతలను తీర్చుటే గగనమౌతోంది.
ఉద్యోగము. పాపులేషన్ అండ్ ది ఎన్‌వైరన్‌మెంట్: ది చాలెంజ్ ఎహెడ్ అనే ప్రచురణ ఏమంటున్నదంటే, అభివృద్ధిచెందుతున్న అనేక దేశాలలో 40 శాతం శ్రామికులు ఇప్పటికే ఉపాధి లేకుండావున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 50 కోట్లకంటె ఎక్కువమంది ప్రజలు, అంటే దాదాపు పారిశ్రామిక దేశాల్లోని మొత్తం శ్రామికులతో సమానమైనంత మంది, నిరుద్యోగులుగానో తగినంత ఉపాధిలేకనో ఉన్నారు.
ఈ రేటు ఇంకా తగ్గిపోకుండా అరికట్టడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రతి సంవత్సరం 3కోట్ల కంటె ఎక్కువ క్రొత్త ఉద్యోగాలను కల్పించాలి. ఈ ఉద్యోగాలు అవసరమయ్యే ప్రజలు ఈనాడు సజీవంగా ఉన్నారు—అంటే వారు ఈనాటి పిల్లలే. అధిక నిరుద్యోగం పౌరపోరాటానికి, అత్యధిక దారిద్ర్యానికి, సహజ వనరుల నాశనానికి దారి తీయవచ్చునని నిపుణులు ఊహిస్తున్నారు.
ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు కుటుంబ నియంత్రణను అధికం చేయటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయనడంలో ఆశ్చర్యమేమి లేదు. భవిష్యత్తులో జరగబోయే దాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తూ, బ్రిటిష్ వైద్య పత్రిక లాన్‌సెట్ దాని సంపాదకీయంలో ఇలా అన్నది: “ముఖ్యంగా ప్రపంచ పేద దేశాలు ఎదుర్కొంటున్న జనాభా పెరుగుదల ఒత్తిడి అపరిమితమైనది. . . . లక్షలాది మంది విద్య, ఉపాధి, సరైన వసతి, ప్రాథమిక ఆరోగ్యం, సంక్షేమం మరియు పారిశుద్ధ్య సేవలు లేకుండానే తమ జీవితాలను గడుపుతారు, వీటన్నిటికీ జనాభా పెరుగుదలే ముఖ్య కారణం.”
ఆందోళన చెందుతున్న కుటుంబాలు
జాతీయ స్థాయిలో లక్ష్యాలు పెట్టుకుని కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించటం ఒక ఎత్తు; ప్రజలను ఒప్పించటం మరో ఎత్తు. అనేక సమాజాల్లో, పెద్ద కుటుంబాలను కల్గియుండుటకు ఇష్టపడే సాంప్రదాయ దృక్పథాలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు, శిశుజననాలను తగ్గించమని తన ప్రభుత్వం చేసిన ప్రోత్సాహానికి ఒక నైజీరియా తల్లి ఇలా ప్రతిస్పందించింది: “నా తండ్రికి ఉన్న 26 మంది పిల్లల్లో నేను చివరిదాన్ని. నా సోదరీ సోదరులలో ప్రతిఒక్కరు 8 నుండి 12 మంది పిల్లలను కలిగి వున్నారు. మరి నేనొక్కదాన్నే తక్కువ మంది పిల్లలను కలిగి వుండాలా?”
అయిననూ, సగటు స్త్రీ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చే నైజీరియాలో ఒకప్పుడు ఉన్నటువంటి దృక్పథం ఇప్పుడు లేదు. ధరల పెరుగుదల వల్ల లక్షలాది మంది ప్రజలు వారి కుటుంబాలకు కావలసిన ఆహారాన్ని, వస్త్రాలను సమకూర్చడానికి కష్టపడుతున్నారు. “ఓ సప్ మో సప్” (అధిక సంతానం, అధిక పేదరికం) అనే యెరుబా సామెతలోని సత్యాన్ని చాలామంది అనుభవం ద్వారా తెలుసుకున్నారు.
కుటుంబ నియంత్రణా ప్రయోజనాలను చాలమంది దంపతులు గ్రహించినప్పటికీ, దాన్ని పాటించరు. ఫలితం? ఐక్యరాజ్య సమితి బాలల నిధి ప్రచురించిన ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్‌డ్రన్ 1992, తెల్పేదేమంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యీ సంవత్సరం జరిగిన దాదాపు ప్రతి మూడు గర్భధారణలలో ఒకటి పథకం ప్రకారం జరిగింది కాదు కానీ తాము కోరనిదే జరిగింది.
కుటుంబ నియంత్రణ జీవితాలను కాపాడుతుంది
ఆర్థిక కష్టాలున్నప్పటికీ, కుటుంబ నియంత్రణ పాటించటానికి ముఖ్య కారణం తల్లీపిల్లల ఆరోగ్యం. “గర్భధారణ ఒక జూదం, జన్మనిచ్చుట ఒక జీవన్మరణ పోరాటం” అని అంటోంది ఒక పశ్చిమాఫ్రికా సామెత. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ప్రతి సంవత్సరం ఐదు లక్షలమంది తల్లులు గర్భధారణ లేక ప్రసవ సమయంలో మరణిస్తున్నారు, పది లక్షలమంది తల్లి లేని పిల్లలౌతున్నారు, మరియు అదనంగా 50 నుండి 70 లక్షలమంది స్త్రీలు ప్రసూతి రోగాల మూలంగా అంగవికలులు లేక దుర్భలులౌతున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలోని స్త్రీలందరు ఇదే పరిస్థితిని ఎదుర్కోవడం లేదు. ఇక్కడున్న బాక్సు చూపిస్తున్నట్లుగా, మరీ త్వరగా, మరీ తరచుగా, లేక మరీ ఆలస్యంగా చాలమంది పిల్లల్ని ప్రసవించే స్త్రీలే అపాయానికి గురౌతున్నారు. కుటుంబ నియంత్రణ, ఈ అనర్థాలలో నాలుగు నుండి మూతుల మరణాలను అరికట్టి, లక్షలాది మంది అంగవైకల్యాలను నిరోధించ గలదని ఐక్యరాజ్య సమితి వర్గాలు అంచనా వేసాయి.
మరి లక్షలాదిమంది ప్రాణాలను కాపాడడం జనాభా పెరుగుదలను అధికం చేయటానికి దోహదపడదా? అలా దోహదపడదని చాలామంది నిపుణులు తెలియజేస్తున్నారు. “ఎక్కువ మంది పిల్లలు బ్రతికినట్లైతే జనాభా సమస్యలు మరీ ఎక్కువవుతాయని భావించ వచ్చు. అది పూర్తిగా విరుద్ధం. తమ పిల్లలు బ్రతుకుతారని తలిదండ్రులు పూర్తి విశ్వాసం కలిగి ఉంటే గర్భధారణ తగ్గిపోవచ్చు” అని హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 1991 తెలియజేసింది.
అయిననూ, నిరుపేద సమాజాలలో ఉన్న లక్షలాది మంది స్త్రీలు తరచుగా పిల్లలను కంటూనే ఉన్నారు. కారణం? వారి సమాజం వారలా చేయాలని కోరడం, ఎక్కువ మంది పిల్లలుంటే కొంత మందైనా బ్రతికే అవకాశం పెరగడం, కుటుంబ నియంత్రణ పద్ధతులు వారికి తెలియక పోవడం లేదా అట్టి సేవలకు మార్గం లేకపోవడం ఓ కారణము.
అయినా, పెద్ద కుటుంబాలుగల చాలమంది స్త్రీలకు మరో మార్గమే కానరాదు. వారు ప్రతి బిడ్డను దేవుని దీవెనగా భావిస్తారు.
[6వ పేజీలోని బాక్సు]
అభివృద్ధిచెందుతున్న ప్రపంచంలో అత్యంత హానికరమైన గర్భధారణ
మరీ చిన్నవయస్సులో: గర్భధారణ, శిశు జనన సమయాలలో మరణించే ప్రమాదం 20 నుండి 24 సంవత్సరాల వయస్సు స్త్రీలలో కంటె 15 నుండి 19 సంవత్సరాల వయస్సున్న స్త్రీలల్లో మూడింతలు అధికంగా ఉంది. యౌవన స్త్రీలకు జన్మించిన శిశువులు చాలమట్టుకు చనిపోవడం, నెలలు నిండకముందే జన్మించడం, పుట్టేటప్పుడు బరువు మరీ తక్కువగా ఉండటం జరుగుతాయి.
మరీ వెంటవెంటనే: జననాల మధ్య వుండే కాలవ్యవధి శిశువు జీవించి ఉండటంపై ఎక్కువ ప్రభావాన్ని చూపగలదు. ఒక శిశువు జన్మించి రెండు సంవత్సరాలు కాక ముందే ఆ తల్లికే మరో శిశువు జన్మించినట్లైతే, ఆ శిశువు బాల్యంలోనే చనిపోయే అవకాశం, 66శాతం వరకు ఉంటుంది. ఈ పిల్లలు బ్రతికినా, వారి పెరుగుదల మందగించి, మానసిక ఎదుగుదల తరగిపోగలదు. జననాల మధ్య తగిన కాలవ్యవధి ఉండడం ద్వారా ఐదింటి శిశుమరణాలలో ఒకదాన్ని నిరోధించవచ్చు. జననాల మధ్య మూడు లేక అంతకంటె ఎక్కువ సంవత్సరాల వ్యవధి వుంటే తక్కువ ప్రమాదం ఉంటుంది.
మరీ ఎక్కువమంది: నలుగురికంటె ఎక్కువ మంది పిల్లల్ని కనడం అనేది ముఖ్యంగా మునుపటి పిల్లల మధ్య రెండేళ్ల కంటె ఎక్కువ అంతరం లేకపోతే అది గర్భధారణ, శిశుజనన ప్రమాదాలను అధికం చేస్తుంది. నాలుగు ప్రసవాల తరువాత, తల్లులు రక్తహీనతతో, రక్తస్రావంతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది, వారి పిల్లలు అంగవైకల్యంతో జన్మించే ప్రమాదం అధికంగా ఉంది.
మరీ ఆలస్యంగా: గర్భధారణ లేక శిశుజనన సమయంలో 20 నుండి 24 ఏళ్ల వయస్సుగల స్త్రీలకంటె 35ఏళ్ల కంటె ఎక్కువ వయస్సుగల స్త్రీలు మరణించే అవకాశమే ఐదు రెట్లు అధికంగా ఉంది. పెద్ద వయస్సు గల స్త్రీలకు జన్మించిన పిల్లలు చనిపోయే అవకాశం కూడ ఎక్కువగా ఉంది.
Sources: World Health Organization, UN Children’s Fund, and the UN Population Fund.