కుటుంబ నియంత్రణ లోకవ్యాప్త సమస్య
“మానవజాతికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏ ఒక్క ‘సాంకేతిక విజ్ఞానం’ కన్నా, కుటుంబ నియంత్రణ ఎక్కువమందికి తక్కువ ఖర్చులో ఎక్కువ మేలులను తేగలదు. . . . జనాభా సమస్యలాంటిదేది లేకపోయినా ఇదింకా వాస్తవమే అయివుండును.”—ధి స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ 1992.
పూర్వం ఎక్కువమంది పిల్లలను కలిగివుండడం వాంఛనీయమని పరిగణించబడేది. దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం, రిబ్కా ఇస్సాకును వివాహమాడటానికి మెసపొటోమియా నుండి బయల్దేరుతుండగా, ఆమె తల్లి, ఆమె సహోదరుడు ఆమెనిలా ఆశీర్వదించారు: “మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక.” (ఆదికాండము 24:60) కాలం మారింది. ఈనాడు, చాలమంది స్త్రీలు తక్కువమంది పిల్లలు చాలంటున్నారు.
ఒక్క కూతురు గల తల్లి అయిన 22 సంవత్సరాల బూ అనే ఇండోనేషియా స్త్రీ తాను “ఏడుగురు పిల్లలలో మూడవదానిని” అని అంటుంది. “మధ్య జావా నందలి క్లాటెన్లో నా తండ్రి కల్లు వ్యాపారి, ఎక్కువ మందిగల పిల్లల గుంపును పెంచటంలో మా తలిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. . . . కొంత మంది పిల్లలు మాత్రమే ఉంటే ఆ కుటుంబాన్ని పెంచటం చాల తేలిక.”
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తలిదండ్రులందరు బూ వంటి అభిప్రాయాన్నే కలిగివున్నారు. చాలమంది దంపతులు పిల్లల్ని ఎప్పటి నుండి ఎంత మందిని కలిగి ఉండాలి, పిల్లల మధ్య ఎంత ఎడముండాలి, ఎప్పుడు ఆపాలి అనే విషయాలను గూర్చి పథకం వేసుకోవాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో గర్భనిరోధకాలను స్వచ్ఛందంగా ఉపయోగించే దంపతులు 1960లలో 10 శాతం నుండి ఈనాడు 51 శాతానికి గణనీయంగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి లెక్కల ద్వారా వెల్లడైంది.
ప్రభుత్వాలు కూడ కుటుంబ నియంత్రణను అధికం చేసే విషయంలో అధిక శ్రద్ధను చూపిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికిపైగా జనాభా పెరుగుదలను తగ్గించటానికి పథకాలను చేపడుతున్నాయి. జనాభా నియంత్రణ కార్యక్రమాల కొరకు ఇప్పుడు సంవత్సరానికి దాదాపు 450,00,00,000 డాలర్లు ఖర్చవుతున్నట్లు ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అంచనా వేస్తున్నది. భవిష్యత్ అవసరతలను తీర్చుటకు, 2,000 సంవత్సరం నాటికి ఈ సంఖ్య రెట్టింపు కాగలదని అధికారులు భావిస్తున్నారు.
జననాల రేటును అదుపు చేయడంలో దేశాలు, వ్యక్తులు ఎందుకు అంత ఆసక్తిని కలిగివున్నారు? ఈ ముఖ్య విషయాన్ని గూర్చి క్రైస్తవ దృక్పథమేమిటి? తరువాతి రెండు శీర్షికలు ఈ ప్రశ్నలను పరిశీలిస్తాయి.