కుటుంబ కలహానికి కారణమేమిటి?
“ఒత్తిళ్లు, ప్రయాసలు మరియు బయటి సమాజం యొక్క తర్కరాహిత్యాల నుండి ఒక ఆశ్రయంగా ఉండే బదులు, కుటుంబం అనేక సార్లు ఈ ప్రయాసలను ప్రసారం చేస్తున్నట్లు, లేక పెంచుతున్నట్లు కనిపిస్తున్నది.”—ది ఇంటిమేట్ ఎన్‌వైరాన్‌మెంట్—ఎక్స్‌ప్లోరింగ్ మ్యారేజ్ అండ్ ది ఫ్యామిలి.
కుటుంబ కలహం విషయంలో పరిశోధన సాపేక్షంగా ఒక క్రొత్త ప్రయత్నమే. ఇటీవలి దశాబ్దాలలోనే విస్తృత పరిశోధనలు జరిగాయి. అలాంటి పరిశోధనల ఫలితాలు ఎప్పుడూ స్థిరంగా ఉండకపోవచ్చు, కాని కుటుంబ కలహానికి దోహదపడుతున్న కొన్ని మూలకారణాలు కనుగొనబడ్డాయి. వాటిలో కొన్నింటిని మనం పరిశీలిద్దాము.
కుటుంబ పూర్వపరాలు ఏ పాత్ర వహిస్తాయి?
చాలామంది పరిశోధకులు వారి ఫలితాలను ఇలా తెలియజేశారు: “మేము ఇంటర్వ్యూ చేసిన దంపతులు, ఎంత ఎక్కువ కలహించే వారై యుండిరో వారి పిల్లలు కూడ ఒకరితో ఒకరు, మరియు తమ తలిదండ్రులతో అంతే కలహించేవారై యుండిరి.”
కుటుంబ కలహాన్ని కేవలం కళ్లారా చూడటమే కుర్రవానిపై గొప్ప ప్రభావాన్ని కలిగిస్తుంది. “పిల్లవాడు తన తల్లి చావగొట్టబడటం చూస్తే తానే చావగొట్ట బడుతున్నట్లవుతుంది” అని వైద్యుడైన జాన్ బ్రాడ్‌షో తెలియజేస్తున్నాడు. ఎడ్ అనే పేరుగల యౌవనస్థుడు తన తండ్రి, తల్లిని కొడుతుండడం చూడటాన్ని అసహ్యించుకున్నాడు. అయినప్పటికీ, పురుషులు స్త్రీలను అదుపులో వుంచాలని, అలాచేయటం కొరకు పురుషులు వారిని భయపెట్టి, హింసించి, హీనపర్చాలని అతను గ్రహించక పోయినప్పటికీ, దాన్ని నమ్మేలా అతడు నేర్చుకున్నాడు. ఎడ్ పెద్దవాడైన తరువాత ఈ కొట్టుట, హింసించుట వంటి ఈ కుతంత్రాలను తన భార్యపై ప్రయోగించాడు.
కొంతమంది తలిదండ్రులు ముందు జాగ్రత్త చర్యగా తమ పిల్లలు టీవీలో దౌర్జన్యాన్ని చూడకుండా ఆటంకపరుస్తారు, అది మంచిపని. కాని, ప్రభావితులయ్యే తమ పిల్లలకు ఒక మాదిరిగా ఉన్న తమ ప్రవర్తనను మలుచుకోవటం విషయంలో కూడ తలిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఒత్తిడి ఏ పాత్ర వహిస్తుంది?
గర్భధారణ, నిరుద్యోగం, తలిదండ్రుల మరణం, వేరే ప్రాంతానికి వెళ్లటం, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, ఇతర విషయాలవలే ఒత్తిడిని తెస్తాయి. చాలమంది కలహానికి దిగకుండానే ఒత్తిడి నెదుర్కొంటారు. అయితే కొందరికి, ముఖ్యంగా ఇతర కారణాలు జతకూడినప్పుడు, ఒత్తిడి కలహానికి పీఠిక కాగలదు. ఉదాహరణకు, వృద్ధులైన—ముఖ్యంగా అనారోగ్యులైన తల్లి లేక తండ్రిని గూర్చి శ్రద్ధ తీసుకోవలసి వచ్చినప్పుడు, శ్రద్ధవహించే వ్యక్తికి ఇతర కుటుంబ బాధ్యతల భారం మోపబడితే సాధారణంగా దూషణకు పాల్పడవచ్చును.
పిల్లల పెంపకం ఒత్తిడిని కలుగజేస్తుంది. దాని ఫలితంగా, కుటుంబం పెరిగే కొలది పిల్లలను హింసకు గురిచేయటం పెరుగుతుంది. భార్యాభర్తలు కొట్టుకోవడం అధికమగుటకు కూడ పిల్లలు కారణమౌతారు, అందుకే బిహైండ్ క్లోస్డ్ డోర్స్ ఇలా నివేదించింది: “ఒక భార్యాభర్త కలహించు కోవటానికి, చాలా మట్టుకు పిల్లలను గూర్చిన వివాదం కారణం కావచ్చు.”
పరలింగ వ్యక్తుల యెడల అనుచిత దృష్టి
కెనడాలో సలహాలిచ్చే ఒక గుంపును నడుపుతున్న డాన్ బెజోరెక్, భార్యను కొట్టే పురుషులకు స్త్రీలను గూర్చి తప్పుడు అభిప్రాయం వుందని చెప్తూ: “వారు ఏ సంస్కృతికి చెందిన వారైనప్పటికీ, పురుషులు అగ్రగాములని నమ్మేలా పెంచబడుతున్నారు” అని అంటున్నాడు. పురుషులు స్త్రీలకంటె ఉన్నతులని, స్త్రీలను “శిక్షించి, క్రమశిక్షణలో పెట్టడం లేక భయపెట్టడం” పురుషుల హక్కు అని నమ్మేలా శిక్షణ పొందుతున్నారని, భార్యలను కొట్టే పురుషులకు చికిత్సచేసే వర్గానికి నాయకత్వం వహిస్తున్న హామిష్ సింక్లేర్ చెబుతున్నాడు.
పురుషుడు తన భార్యను కేవలం ఒక ఆటవస్తువుగా, తన ఆస్తిలో ఒక వస్తువుగా పరిగణించగల హక్కును కలిగివున్నట్లు అనేక దేశాల్లో భావించ బడుతోంది. భార్యపై అతనికున్న అధికారం, ఆజమాయిషీ అతని పురుషత్వానికి, ఘనతకు కొలమానంగా పరిగణించ బడుతోంది. తరచూ భార్యలు చితగ్గొట్టబడినను, లేక మరితర విధాలుగా బాధింపబడినను న్యాయవ్యవస్థలు ఏమీ చేయవు, ఎందుకంటె ఆ దేశాలలో అదే శాసనం. పురుషుడు ఉన్నతుడు, స్త్రీ అధమురాలు; అతడు ఎంత అగౌరవంగా ప్రవర్తించినా, దౌర్జన్యకారుడైనా, పెడత్రోవపట్టినవాడైనా, లేక స్వార్థపరుడైనా ఆమె అతనికి పూర్తి విధేయతను చూపించాల్సిందే.
సి.బి.ఎస్ టెలివిజన్ రిపోర్టర్ మోర్లె సేఫర్ ఒక దక్షిణ అమెరికా దేశాన్ని గూర్చి ఇలా నివేదించాడు: “లాటిన్ అమెరికాలోతప్ప మరెక్కడా పురుషాధిపత్యభావం అంత తీవ్రంగాలేదు. . .అది సమాజమంతటా వ్యాపించింది, న్యాయస్థానాల్లో కూడ బాధితురాలు తన భార్యయైతే పురుషుడు హత్య చేసి కూడ తన గౌరవాన్ని కాపాడుకొన వచ్చని సమర్థించ బడుతుంది.” ఆ దేశంలో వలే “భూమిపై ఏ ప్రాంతంలోను స్త్రీ అంత హీనపర్చబడడం లేదు” అని ఆయన నొక్కితెల్పాడు. కాని పురుషాధిక్యత, స్త్రీ అణచివేత సర్వవ్యాప్తంగా ఉంది. అది ఎంత తీవ్రంగా ఉన్నా, అది ఆ ఒక్క దేశానికే పరిమితం కాదు.
న్యూయార్కులో కుటుంబ కలహాలు, శాసనాన్ని అమలుపర్చేలా చూసే సంస్థకు డైరెక్టరైన మినా షుల్‌మెన్ ఏమన్నదంటే, స్త్రీపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించటానికి, అదుపుచేయటానికి, దౌర్జన్యం పురుషులకు ఒక పరికరం లాంటిది. ఆమె యింకను యిలా అన్నది: “కుటుంబ కలహాన్ని అధికారం, ఆధిపత్యాల దుర్వినియోగంగా మనం పరిగణించవచ్చు.”
భార్యలను కొట్టే కొంతమంది న్యూనతా భావంతో బాధపడ్తూ, తమ బాధితులందు కూడ అట్టి భావాన్నే కలిగిస్తారు. వారు అలా చేయగలిగితే, వారి ఆత్మగౌరవం పెరిగి, ఇతరులపై ఆధిపత్యం, ఆధిక్యత కలిగి ఉన్నట్లు భావిస్తారు. ఆవిధంగా వారు తమ పురుషత్వాన్ని నిరూపించుకున్నామనుకుంటారు. అయినా, వారలా చేయగలరా? శారీరకంగా బలహీనురాలైన స్త్రీపై దౌర్జన్యం చేస్తే, వారు నిజంగా బలంగల పురుషులనిపించుకుంటారా, లేక వారు కారణసహితంగా లేరని అది నిరూపిస్తుందా? బలవంతుడైన పురుషుడు బలహీనమైన, ఎక్కువ రక్షణలేని స్త్రీని కొట్టటం నిజంగా పురుషత్వమౌతుందా? బలమైన నైతిక లక్షణంగల వ్యక్తి, బలహీనమైన ఎక్కువ రక్షణలేని వారి పట్ల కనికరము, విచారణ కలిగి, వారి స్థితినిబట్టి లాభం పొందాలని చూడకుండ వుంటాడు.
భార్యను కొట్టే వ్యక్తి యొక్క మరో కారణరహితమైన ఆలోచన ఏమిటంటే, ఆమెను కొట్టేలా తన భార్యే తరచు తనను రెచ్చగొట్టిందని అతడు నిందిస్తాడన్న వాస్తవం. ‘నీవు ఇది సరిగ్గా చేయలేదు. అందుకే నిన్ను కొడుతున్నాను.’ లేక: ‘రాత్రి భోజనం ఆలస్యమైంది, అందుకే నీకు తగిన శాస్తి జరుగుతున్నది.’ అని ఆయన సూచించడం లేక ఆమెతో అనడం కూడ జరుగుతుంది. అది ఆమె తప్పేనని భార్యను కొట్టేవాని మనస్సులో ఉంటుంది. ఏమైనను, ఆమె పొరపాటు నిమిత్తం కొట్టటం న్యాయంకాదు.
మధ్యం ఏమైనా తేడా తేగలదా?
మధ్యం అదుపును తగ్గించి, మానసిక ప్రేరణానుసారంగా ప్రవర్తించటాన్ని పెంచుతుంది కాబట్టి, కొట్టడాన్ని అది ప్రేరేపిస్తుందని కొందరు భావించడంలో ఆశ్చర్యమేమి లేదు. సాధారణంగా ఒక వ్యక్తి మత్తులో లేనప్పుడు దౌర్జన్యపూరిత భావాలను అదుపు చేసుకోగలడు, కాని మధ్యం సేవించిన తరువాత అతను కొట్టే స్థితికొస్తాడు. మధ్యం అతని మానసిక సామర్థ్యాలను మందగింపజేసి, తన ఉద్రేకాన్ని అదుపు చేసుకునే సామర్థ్యాన్ని మటుమాయం చేస్తుంది.
అయినా ఇతరులు, మధ్యంలో కంటె ఒత్తిడిలోనే సమస్య వేళ్లూని ఉందని ఆరోపిస్తారు. ఒత్తిడిని తాళుకొనడానికి మద్యాన్ని సేవించేవ్యక్తి, అదే పనికొరకు దౌర్జన్యాన్ని ఉపయోగిస్తాడని వారంటారు. అంటే, త్రాగుబోతు మత్తులో ఉన్నప్పుడు, మత్తులో లేనప్పుడు కూడ కొట్టేవానిగా వుంటాడని అర్థం. ఏమైనప్పటికీ, ఈ విషయంలో ఏవిధంగా తర్కించినప్పటికీ, కచ్చితంగా ఒకరి భావాలను అదుపు చేసుకోవటానికి మధ్యం దోహదకారికాదు కాని, తరచు అందుకు ప్రతికూలంగా జరిగిస్తుంది.
చర్యలను ప్రచారసాధనాలు ఎలా ప్రభావితం చేస్తాయి?
దూరదర్శిని మరియు సినిమా, పురుషులకు కోపోద్రేక స్వభావాన్ని ప్రోత్సహించి, వ్యతిరేకత మరియు కోపంతో వ్యవహరించటానికి దౌర్జన్యం అసలైన మార్గమని బోధిస్తాయని కొందరు ఆరోపిస్తారు. “రాంబో సినిమా చూసి నేను పొందిన అనుభూతిని బట్టి నేనే ఆశ్చర్యపోయాను, శాసనానికి కట్టుబడి వుండే నా పెద్దవయస్సు అంతరంగం రాంబో చేసిన సామూహిక హత్యలతో భీతి నొందింది, కాని నాలోని చిన్న పిల్లల మనస్తత్వం అతను అలా చంపుతూనే వుండాలని కోరుకున్నది,” అని ఒక కుటుంబ ఉపదేశకుడు అంగీకరిస్తున్నాడు.
అనేక మంది పిల్లలు దౌర్జన్యం, మానభంగం, ఇతర మానవులను, ముఖ్యంగా స్త్రీలను హీనపర్చడం వంటి లెక్కలేనన్ని కార్యాలు కొన్ని వేల గంటలు టీవీలో చూస్తున్నారు, కావున అనేకులు అలాంటి సంఘ వ్యతిరేక కార్యాలను ఇతరులపై ప్రదర్శిస్తున్నారంటే దానిలో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. పిల్లలే కాదు పెద్దలు కూడ ప్రభావితులవుతున్నారు.
అంతేకాక, ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో, టీవీ మరియు సినిమాలలో ప్రదర్శింప బడుతున్నట్లుగా దౌర్జన్యం, అవినీతి, స్త్రీలను కించపర్చడం వంటివి గణనీయంగా పెరిగినవి. ఇది తప్పకుండ కుటుంబ కలహాన్ని ఇంకా అధికం చేయగలదు. ఒక పరిశోధనాత్మక వర్గం తెలియజేసినట్లు, స్పష్టంగా, “దౌర్జన్యాన్ని చూడడానికి మరియు జగడాలమారి ప్రవర్తనకు మధ్య . . . పరస్పర సంబంధం ఉంది.”
ఏకాంతత యొక్క ప్రభావం
ఈనాడు చాలా మందికి జీవితం ఒక వ్యక్తిత్వం లేనిదానిగా, ఒంటరితనంగా వుంది. స్నేహపూరితంగా ఉండే ఇరుగు పొరుగు అంగళ్ల స్థానాన్ని సూపర్ మార్కెట్లు, డిస్కౌంటిచ్చే దుకాణాలు ఆక్రమించాయి. పట్టణ ఆధునీకరణ, ఆర్థిక సమస్యలు మరియు నిరుద్యోగం కుటుంబ ఏర్పాట్లు అల్పకాలికం అయ్యేలా చేస్తున్నాయి. పటిష్టమైన సాంఘిక సంబంధాలు లేనివారిలో కుటుంబ కలహం యొక్క శాతం అధికంగా ఉంది.
ఇంటిమేట్ రిలేషన్‌షిప్స్, మ్యారేజ్, అండ్ ది ఫ్యామిలి, అనే తన పుస్తకంలో జేమ్స్ సి. కోల్‌మాన్, పరిస్థితి ఇదని తానెందుకు భావిస్తున్నాడో వివరించాడు. ఒంటరిగా ఉండి అర్థవంతమైన సంభాషణను త్రుంచేసే వ్యక్తి, తన పరిస్థితిని యథాతధంగా దృష్టించి, నమ్మకమైన స్నేహితున్నుండి సహాయం పొందడాన్ని కష్టమయ్యేలా చేస్తాడని అతని ఉద్దేశం. తన తప్పుడు ఆలోచన తన సన్నిహితులచే ప్రతిదినం ప్రతిఘటింపబడదు గనుక చాల సుళువుగా స్వార్థపూరితంగా ప్రవర్తించుటకు నడుపగలదు. సామెతలు 18:1 చెప్తున్నట్లుగా ఉంది: “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు; అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.”
కలహాల కుటుంబానికి సహాయం
కుటుంబ కలహానికి ఇవ్వబడిన వివరణల యొక్క కొంతభాగాన్ని మాత్రమే మనం చర్చించాము. ఇంకా వేరేవి వున్నాయి. కొన్ని కారణాలను కనుగొన్నాము కాబట్టి, ఇప్పుడు మనం వాటికి పరిష్కారాలను పరిశీలించాలి. కలిహించుకునే కుటుంబంలో ఒకరు ఉన్నట్లైతే, కొట్టడాన్ని ఎలా ఆపవచ్చు? బైబిలు దృష్టి ఏమిటి? కుటుంబ కలహం ఎన్నటికైనా అంతమగునా? పదవ పేజీలో ఉన్న శీర్షిక ఈ ప్రశ్నలను గూర్చి చర్చించును.
[9వ పేజీలోని బాక్సు/చిత్రం]
భావోద్రేక హింస—సూటిపోటి మాటలతో పొడుచుట
శారీరక హింసలో పిడికెళ్లతో ముట్టడి జరిగితే భావోద్రేక హింసలో మాటలతో ముట్టడి జరుగుతుంది. వీటిలో తేడా మాత్రం ఎంచుకున్న ఆయుధాలే. అది సామెతలు 12:18లో చెప్పినట్లుంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.”
“కత్తిపోటువంటి” మాటలతో సహా ఈ భావోద్రేక హింస ఎంత అపాయకరం? డా. సూసన్ పార్‌వార్డ్ ఇలా రాశారు: భావోద్రేకంతో చెప్పాలంటే, “దీని ఫలితం (శారీరక హింస లాగే) ఉంటుంది. మీరప్పుడు భయపడతారు, నిస్సహాయంగా భావిస్తారు, బాధననుభవిస్తారు.”
భార్య లేక భర్తపై భావోద్రేక హింస: “దాంపత్య దౌర్జన్యం కేవలం శారీరకం కాదు. అధికంలో అధికంగా, బహుశ అత్యంత ఎక్కువ భాగం నోటి దురుసుతనమే, భావోద్రేకం,” అని దీర్ఘకాలంగా దీనికి బలైన ఒకావిడ అన్నారు. పేర్లుపెట్టడం, అరవడం, ఎడతెగని విమర్శ, హీనంగా మాట్లాడడం, కొడతానని బెదిరించడం ఈ హింసలో ఇమిడియున్నాయి.
కించపరిచే, అవమానపరిచే లేక బెదిరించే దుర్భాషాపూరిత వ్యాఖ్యానాలు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. బండమీదపడే నీటిబొట్లలా, అప్రతిష్టపాలుచేసే వ్యంగ్యసూచనలు మొదట్లో హానికరం కానట్టు కనిపించవచ్చు. కానీ వెంటనే ఆత్మాభిమానం పెకలించబడుతుంది. “శారీరక, మౌఖిక హింసలలో ఏదొకటి ఎన్నుకోవలసివస్తే, ఎప్పుడైనాసరే నేను దెబ్బలనే ఎన్నుకుంటాను,” అన్నది ఓ స్త్రీ. “మీకు వాటి గుర్తులు కనిపిస్తాయి,” అని ఆవిడ వివరిస్తూ, “కాబట్టి ప్రజలు మీగురించి కనీసం బాధపడతారు. మాటలతో హింసించుట మిమ్మల్ని పిచ్చివాళ్లను చేస్తుంది. గాయాలు కనబడవు. ఎవ్వరూ పట్టించుకోరు.”
పిల్లలపట్ల భావోద్రేక హింస: ఇందులో పిల్లల రూపాన్ని, వివేకాన్ని, సమర్థతను లేక వ్యక్తిత్వాన్ని ఎల్లప్పుడు కించపరుస్తూ వ్యాఖ్యానించడం ఇమిడివున్నాయి. ప్రత్యేకంగా వ్యంగ్యభాష నాశనకరం. వ్యాఖ్యానం వాస్తవమా లేక “తమాషా” అన్నది తేల్చుకోలేక, పిల్లలు అనేకసార్లు వ్యంగ్య వ్యాఖ్యానాలు నిజమని అనుకుంటారు. కుటుంబ వైద్యుడు షోన్ హోగెన్‌డౌనీ ఇలా గమనించారు: “పిల్లవాడు బాధపడుతుంటాడుగానీ, అందరూ నవ్వుతుంటారు కాబట్టి, తన భావాలను తాను నమ్మకూడదని నేర్చుకుంటాడు.”
అలా అనేక సంఘటనలలో, స్కాటిష్ చరిత్రకారుడు, సాహితీవేత్త థామస్ కార్లేలి అన్న మాటల్లో నిజం లేకపోలేదు: “నాకు వ్యంగ్యం సహజంగా దయ్యాల భాషలా అనిపిస్తుంది; అందుకనే ఎంతోకాలంగా నేను దాన్ని దాదాపు పూర్తిగా త్యజించాను.”
బాల-హింస నిపుణుడైన జాయి బైయెర్స్ ఇలా అన్నాడు: “శారీరక హింస పిల్లలను చంపవచ్చు, అయితే మీరు వాని లక్షణాన్ని స్వభావాన్ని సహితం చంపగలరు; మరి తల్లిదండ్రుల ఎడతెగని ప్రతికూల వ్యాఖ్యానాలకు అలా చేయగల శక్తివుంది.” ఎఫ్. ఎల్. ఎడ్యుకేటర్ అనే పత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “కనిపించి, మానిపోయే దెబ్బల్లాకాక, భావోద్రేక హింస పిల్లల మనసులోను వ్యక్తిత్వాలలోను కానరాని మార్పులను కల్గిస్తుంది. ఈ మార్పు వారి వాస్తవికతను, ఇతరులతో వారి సంబంధాన్ని శాశ్వతంగా మారుస్తుంది.”
[7వ పేజీలోని చిత్రం]
దౌర్జన్యాన్ని చూడటం పిల్లవాడి బావి ప్రవర్తనపై గట్టి ప్రభావాన్ని చూపగలదు.