కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 5/8 పేజీలు 10-14
  • కుటుంబకలహానికి ఒక అంతము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబకలహానికి ఒక అంతము
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నవీన స్వభావము”
  • నమ్మకమును నేర్చుకోండి
  • దయార్థ హృదయంగల అధ్యక్షులు
  • వివాహం యెడల దేవుని దృక్పథం
  • దేవుని శాసనం దేనిననుమతిస్తోంది
  • కుటుంబ దౌర్జన్యానికొక అంతము
  • కుటుంబానికి హాని కలిగించే సమస్యలను మీరు అధిగమించగలరు
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • కుటుంబ కలహానికి కారణమేమిటి?
    తేజరిల్లు!—1993
  • కుటుంబంలో కలహం చెలరేగితే
    తేజరిల్లు!—1993
  • మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 5/8 పేజీలు 10-14

కుటుంబకలహానికి ఒక అంతము

“గృహములోని దౌర్జన్యాన్ని నిరోధించడం, కుటుంబకలహాలను తగ్గించడం, అటు సమాజంలోను ఇటు కుటుంబ విధానంలోను గణనీయమైన మార్పులు చేయుటవల్లనే సాధ్యం.”—బిహైండ్‌ క్లోస్డ్‌ డోర్స్‌.

మానవ చరిత్రలోని ప్రప్రధమ హత్య అన్నదమ్ముల మధ్యనే జరిగింది. (ఆదికాండము 4:8) ఆనాటినుండి వేల సంవత్సరాలుగా మానవున్ని అన్ని రకాలైన గృహసంబంధిత దౌర్జన్యాలు ఒక తెగులులా పట్టిపీడిస్తున్నాయి. అనేక పరిష్కారమార్గాలు అందించబడ్డాయి కానీ, చాలామట్టుకు అన్నింటిలో చిక్కులున్నాయి.

ఉదాహరణకు, తమ సమస్యను అర్థంచేసుకున్న హింసకులకు మాత్రమే పునరావాసం లభిస్తుంది. పశ్చాత్తాపపడుతున్న భార్యాహింసకుడు నిట్టూరుస్తూ ఇలా అన్నాడు: “(పునరావాసం పొందుతున్న) మాలో ప్రతిఒక్కరికి ‘ఆ ముసలిదాన్ని దారిలో పెట్టుకోవాలి’ అని చెప్పే ముగ్గురుంటారు.” కాబట్టి అతడు తన స్వంత పరిస్థితితో వ్యవహరించడం నేర్చుకోవాలి. అతడు హింసించేవానిగా ఎందుకు మారవలసివచ్చింది? తన స్వంత తప్పిదాలను సరిదిద్దుకునే సహాయం పొందినప్పుడు, చివరికతడు తన సమస్యను అధిగమించగలడు.

అయితే సాంఘిక కార్యక్రమాలకు తగు సిబ్బంది కరువైంది. అమెరికాలో 90 శాతం బాల-హంతకులు హత్యచేయకముందు వారి కుటుంబంలోని పరిస్థితి అపాయకరంగావుందని నమోదైనట్లు అంచనా వేయబడింది. కాబట్టి, సాంఘిక కార్యక్రమాలు, పోలీసు సంస్థలు అంతకంటే ఎక్కువ చేయలేవు. ప్రాముఖ్యమైంది మరొకటేదో చేయవలసిన అవసరమున్నది.

“నవీన స్వభావము”

“ఇక్కడ అవసరమైంది, కుటుంబ సభ్యులనడుమనున్న సంబంధాలను పునర్‌వ్యవస్థీకరించడం మాత్రమే కాదు,” అని ఒక పరిశోధనా బృందం తెలిపింది. కుటుంబ దౌర్జన్యం వట్టి శారీరక సమస్యకాదు; ప్రప్రధమంగా అది మానసిక సమస్య. అది కుటుంబ సభ్యులు—దంపతులు, పిల్లలు, తలిదండ్రులు, తోబుట్టువులు—ఒకరినొకరు ఎలా దృష్టిస్తారన్న దానితో మొదలవుతుంది. ఈ సంబంధాల పునర్‌వ్యవస్థీకరణ అంటే, బైబిలు పిలిచే “నవీనస్వభావమును” ధరించుకోవడం అని దాని భావం.—ఎఫెసీయులు 4:22-24; కొలొస్సయులు 3:8-10.

కుటుంబ సభ్యులమధ్య మరింత మెరుగైన మంచి సంబంధాన్ని కలిగియుండే, క్రీస్తువంటి నవీన స్వభావమును ధరించుకోవడానికి మనకు దోహదపడే కొన్ని కుటుంబ సంబంధిత బైబిలు సూత్రాలను మనమిప్పుడు పరిశీలిద్దాము.—మత్తయి 11:28-30 చూడండి.

పిల్లలయెడల దృక్పథం: తల్లిదండ్రులు పిల్లల్ని కనడంకంటె మరెంతో చేయవలసివుంది. అయినా, విచారకరంగా, ఈనాడు అధికులు తమ పిల్లలను ఒక భారంగా దృష్టించి తలిదండ్రులుగా తమ పాత్ర పట్ల చిత్తశుద్ధి కలిగియుండటంలేదు. ఇట్టివారే హింసకులయ్యే అవకాశాలు ఎక్కువ.

పిల్లలు “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.” “బహుమానమే” అని బైబిలు అంటోంది. (కీర్తన 127:3) ఆ స్వాస్థ్యమును జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను సృష్టికర్త యెడల తలిదండ్రులు కలిగియున్నారు. తమ పిల్లలను భారంగా భావించే ఈ విషయంలో నవీన స్వభావమును ధరించుకోవాలి.a

పిల్లలనుండి వాస్తవంగా నిరీక్షించేవి: చాలమంది హింసించే తల్లులు, తమ పసివారు ఒక సంవత్సరం వయసునుండే మంచిచెడులను తెలుసుకొని ఉండాలని ఆశిస్తున్నట్లు ఒక పరిశీలన వెల్లడిచేసింది. వీరిలో మూడవవంతు తల్లులు అందుకు ఆరవనెలనే సూచించినట్లు సర్వేవలన తెలిసింది.

ప్రతిఒక్కరు అపరిపూర్ణులుగానే జన్మించారని బైబిలు చూపుతోంది. (కీర్తన 51:5 రోమీయులు 5:12) వివేకం పుట్టుకతోనే వస్తుందని అది చెప్పడంలేదు. బదులుగా, “అభ్యాసముచేత” ఒకని జ్ఞానేంద్రియములు “మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయ బడతాయని” అది తెలుపుతోంది. (హెబ్రీయులు 5:14) ఇంకా, బాలుడిగావున్నప్పటి “మూఢత్వము,” నడిప్రాయము “గతించిపోవునని” “పిల్లవాని చేష్టలు,” వంటి వాటి గురించి బైబిలు మాట్లాడుతోంది. (1 కొరింథీయులు 13:11; సామెతలు 22:15; ప్రసంగి 11:10) తలిదండ్రులు ఈ పరిమితులను అర్థంచేసుకొని, పిల్లల వయస్సు, సామర్థ్యతకు తగినదానికంటే వారినుండి ఎక్కువ కోరకూడదు.

పిల్లలకు క్రమశిక్షణను ఇచ్చుట: బైబిల్లో అనువదించబడిన “క్రమశిక్షణ” అనే గ్రీక్‌ పదం భావమేమనగా “విద్యాబోధన.” కాబట్టి, క్రమశిక్షణా లక్ష్యం శిక్ష కాదు శిక్షణ. అప్పుడప్పుడు చేతిదెబ్బ అవసరమైనా, చాలామట్టుకు ఈ శిక్షణను అలా కొట్టకుండానే సాధించవచ్చు. (సామెతలు 13:24) “ఉపదేశమును నిరాకరింపక దాని నవలంభించి జ్ఞానులైయుండుడి” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 8:33) అంతేకాకుండా ఒకడు తన్నుతాను “కీడును సహించువానిగా” వుంటూ, “దీర్ఘశాంతముతో” బుద్ధిచెప్పవలెనని పౌలు రాశాడు. (2 తిమోతి 2:24: 4:2) అంటే కొట్టవలసి వచ్చినపుడు అధిక శక్తిని ఉపయోగించడం కోపంతో విరుచుకుపడడం,వంటి వాటికది తావివ్వడంలేదు.

ఈ బైబిలు సూత్రాల దృష్ట్యా మిమ్మల్నిమీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేనిచ్చే క్రమశిక్షణ నేర్పిస్తోందా లేక వూరికే నొప్పించి అదుపులోపెడుతోందా? నేనిచ్చే క్రమశిక్షణ వట్టి భయాన్ని నాటుతోందా లేక సరైన సూత్రాలను నాటుతోందా?

పెద్దవారి ప్రవర్తనా హద్దులు: తాను “అదుపు తప్పి” తన భార్యను కొట్టానని ఒక హింసకుడు అన్నాడు. ఒక సలహాదారుడు అతన్ని ఎన్నడైనా నీవు నీ భార్యను కత్తితో పొడిచావా అని అడిగాడు. “నేను ఎన్నడు ఆ పనిచేయను!” అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. అతను కొన్ని హద్దుల్లో ఉన్నాడని చూపించబడ్డాడు. అయితే అవి సరైన హద్దులు కావన్నదే అక్కడ వచ్చిన చిక్కు.

మీ హద్దులు ఎక్కడ నియమించబడ్డాయి? ఎదో ఒక హింసకు ఎదగకమునుపే మీరు మీ వివాదాన్ని ఆపుతారా? లేక చివరికి మీరు మండిపడి కేకలు వేసుకొని, నిందించుకొని, నెట్టుకొని, వస్తువులు విసురుకొని, లేక కుమ్ముకోవడంతో వివాదాన్ని ప్రారంభిస్తారా?

మానసిక హింస లేక శారీరక దౌర్జన్యాలను ఏమాత్రం అనుమతించకుండా, నవీన స్వభావానికి నిర్దిష్ట హద్దులున్నాయి. “దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి,” అని ఎఫెసీయులు 4:29 అంటోంది. ఇంకా 31 వ వచనం ఇలా అంటోంది: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” “కోపము” యొక్క గ్రీకు పదము “ఉద్వేగ స్వభావాన్ని” సూచిస్తుంది. ఆసక్తికరంగా, ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేని “ఘోర లోపమే” పిల్లల హింసకు సహజ కారణమని టాక్సిక్‌ పేరెంట్స్‌ అనే పుస్తకం తెలియజేస్తోంది. నవీన స్వభావము శారీరక, మౌఖిక ఉద్వేగాలపై దృఢమైన హద్దుల నుంచుతోంది.

ఈ నవీన స్వభావము భార్యకు భర్తకు కూడా వర్తిస్తుంది. ఆమె తన భర్తను రెచ్చగొట్టే విధంగాకాక, కుటుంబ క్షేమానికి ఆయన చేసే కృషిని అభినందిస్తూ ఆయనతో సహకరించాలి. ఇద్దరూ కనపర్చలేని పరిపూర్ణతను ఒకరినొకరు కోరకూడదు. బదులుగా ఇరువురు 1 పేతురు 4:8 ని అన్వయించాలి: “ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కుటమైన ప్రేమగలవారై యుండుడి.”

వృద్ధులయెడల గౌరవము: “వృద్ధులయెడల గౌరవమును కనపర్చుడి మరియు వారిని సన్మానించుడి,” అని లేవీయకాండము 19:32 (టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్ష్‌న్‌) అంటోంది. వృద్ధులైన మన తల్లికానీ తండ్రికానీ అనారోగ్య పరిస్థితిలోవుండి బహుశ మననుండి మరీ ఎక్కువ కోరేవారైనప్పుడు ఇదొక సవాలుగా తయారయ్యే అవకాశముంది. మొదటి తిమోతి 5:3, 4 తలిదండ్రులను “సన్మానింపుమని,” వారికి “ప్రత్యుపకారము” అందించుమని చెబుతోంది. దీనిలో సన్మానించడం, ఆర్థిక సహాయాన్నందించడం ఇమిడున్నాయి. మనం నిస్సహాయ పసివారిగావున్నప్పుడు వారు మనకు చేసినవాటన్నింటి దృష్ట్యా అవసరమైనపుడు మనం వారికి అలాంటి శ్రద్ధనే కనపర్చాలి.

తోబుట్టువుల విరోధాన్ని జయించుట: కయీను తన తమ్ముడైన హేబెలును వైరంతో చంపడానికి నడిపింపకముందే, ఈ సలహా అతనికి ఇవ్వబడింది: “నీ ద్వారమునొద్ద పాపము పొంచివుంది. అది నిన్ను ఏలడానికి ప్రయత్నిస్తోంది, అయితే నీవే దానిని ఏలవలెను.” (ఆదికాండము 4:7, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌) భావాలను అదుపులో పెట్టుకోవచ్చు. ఒకరితోనొకరు ఓపికతో వ్యవహరించడం నేర్చుకొనండి, “మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు గనుక విరివిగా ఒకరినొకరు సహించండి”—ఎఫెసీయులు 4:2, ఫిలిప్స్‌.

నమ్మకమును నేర్చుకోండి

కుటుంబ కలహాలకు గురయ్యే అనేకులు మౌన బాధితులు. కానీ డా. జాన్‌ రైట్‌ ఇలా ఉద్బోధిస్తున్నాడు: “చావుదెబ్బలుతిన్న స్త్రీ మానసిక, శారీరక సంరక్షణను యోగ్యమైన మూడొవ వ్యక్తినుండి పొందాలి. బాధననుభవిస్తున్న ఏ కుటుంబ సభ్యుని విషయంలోనైనా ఇది వాస్తవమే.

మరో వ్యక్తియందు నమ్మకం పెంచుకోవాలంటే కొందరు బాధితులకు కష్టంగావుంటుంది. ఎందుకంటే తనకు అతి దగ్గిరలోవున్న సాంఘిక విభాగమైన కుటుంబంలో నమ్మకమే వేదనకుగురైంది. అయినప్పటికీ, “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు,” అంటోంది సామెతలు 18:24. కావలసిన సహాయం పొందాలనుకుంటే అలాంటి స్నేహితులను కనుగొని వారియందు వివేకయుక్తంగా నమ్మికవుంచడానికి నేర్చుకోవాలి. అయితే, హింసించేవానికికూడా సహాయం అవసరమే.

ప్రతి సంవత్సరం లక్షలాదిమంది వ్యక్తులు యెహోవాసాక్షులౌతున్నారు. నవీన స్వభావాన్ని ధరించుకునే సవాలును వీరంగీకరిస్తారు. వీరిలో కుటుంబ కలహాలలో ఒకప్పుడు నేరస్థులుగావున్నవారు ఉన్నారు. తిరిగి పాతపద్ధతికి మరలే ఏ అభిప్రాయాన్నైనా ఎదుర్కోవటానికి బైబిలు తమకు “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైనదిగా” చేసుకోవాలి.—2 తిమోతి 3:16.

ఈ కొత్త సాక్షులకు నవీన స్వభావం ధరించుకోవడం ఎల్లప్పుడూ కొనసాగేదే, ఎందుకంటే కొలొస్సయులు 3:10లో “నూతన పరచబడుచున్న” దాన్ని గూర్చి అది చెబుతోంది. కాబట్టి ఎడతెగని కృషి అవసరం. యెహోవాసాక్షులకు వేవేల ఆత్మీయ ‘అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ర, తల్లుల, పిల్లల’ మద్దతు వారికుంది.—మార్కు 10:29, 30; మరియు హెబ్రీయులు 10:24, 25 కూడా చూడండి.

తర్వాత ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల 70,000 సంఘాలలో “గాలినుండి అండగా గాలివానలనుండి రక్షణగా” వుండే ప్రేమపూర్వక అధ్యక్షులున్నారు. “ప్రజల అవసరతలకు వారి కనులు చెవులు తెరువబడి ఉంటాయి.” (యెషయా 32:2, 3, టిఇవి) కాబట్టి యెహోవాసాక్షులలో కొత్తవారు, అనుభవంగలవారు నవీన స్వభావమును ధరించుకోవడానికి కృషిసల్పునప్పుడెల్ల వారికి అద్భుతమైన సహాయనిధి ఉంది.

దయార్థ హృదయంగల అధ్యక్షులు

యెహోవాసాక్షుల సంఘాలలో ప్రజలు సలహా కొరకు క్రైస్తవ అధ్యక్షులను సమీపించినప్పుడు నిష్పక్షపాతంగా వినేలాగున వారికి తర్ఫీదు ఇవ్వబడుతుంది. వారు ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా తీవ్ర హింసకుగురైన వారికి అధిక దయాళుత్వము, అర్థం చేసుకునే స్వభావమును కనపర్చుమని ప్రోత్సహింపబడుతున్నారు.—కొలొస్సయులు 3:12; 1 థెస్సలొనీకయులు 5:14.

ఉదాహరణకు, చావుదెబ్బలు తిన్న ఒక భార్యకు విపరీతమైన గాయాలు తగిలియుండవచ్చు. ఈనాడు అనేక ఇతర దేశాలలో, అవే దెబ్బలు కుటుంబం బయటివారిపై ప్రయోగించివుంటే, చివరికతడు జైల్లో పడివుండేవాడు. కాబట్టి లైంగిక హింసవంటి ఇతర దురాచారంలాగే, దీనికి గురైనవ్యక్తిని ప్రత్యేక దయతో పరామర్శించాలి.

అంతేగాక, దేవుని న్యాయ విధులకు విరుద్ధంగా నేరంచేసిన ఈ నేరస్థులు తమ లెక్క ఒప్పజెప్పుకోవాలి. ఈ విధంగా సంఘం శుభ్రంగావుండి, ఇతర అమాయకులు సంరక్షింపబడతారు. మరి ప్రాముఖ్యంగా, దేవుని పరిశుద్ధాత్మ పనిచేయడానికి అవరోధం కలుగకుండావుంటుంది.—1 కొరింథీయులు 5:1-7; గలతీయులు 5:9.

వివాహం యెడల దేవుని దృక్పథం

ప్రజలు యెహోవాసాక్షులైనప్పుడు క్రైస్తవ జీవనానికై దేవుని వాక్యములోవున్న సూత్రాలను వారు పాటించడానికి ఒప్పుకుంటారు. సత్యారాధనలో నడిపించడానికై పురుషుడు కుటుంబానికి శిరస్సుగా నియమించబడ్డాడని వారు నేర్చుకుంటారు. (ఎఫెసీయులు 5:22) కానీ శిరసత్వం భార్యను దారుణంగా కొట్టడాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని నలుగగొట్టడాన్ని, లేక ఆమె ఆశలను త్రోసిపుచ్చే అధికారాన్ని మాత్రం అదెన్నడూ ఇవ్వడంలేదు.

దీనికి విరుద్ధంగా, భర్తలకు “భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులుకూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును” అని బైబిలు స్పష్టం చేస్తోంది. (ఎఫెసీయులు 5:25, 28, 29) వాస్తవానికి దేవుని వాక్యము, భార్యలను “సన్మానింపుము” అని స్పష్టంగా తెలుపుతోంది.—1 పేతురు 3:7; మరియు రోమీయులు 12:3, 10 కూడా చూడండి; ఫిలిప్పీయులు 2:3, 4.

తన భార్యను నోటితోను శారీరకంగాను హింసించే ఏ క్రైస్తవ భర్తకూడా తన భార్యను ప్రేమిస్తున్నాడని లేక సన్మానిస్తున్నాడని, వాస్తవంగా వాదించలేడు. అప్పుడది వేషధారణే అవుతుంది, అందుకే బైబిల్‌ ఇలా అంటోంది: “భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.” (కొలొస్సయులు 3:19) త్వరలో అర్మగిద్దోనులో ఈ దుష్టవిధానంపై దేవుని తీర్పులు వచ్చినప్పుడు, దేవుని రాజ్యవిరోధులకు పట్టిన గతే ఈ వేషధారులకూ పడుతుంది.—మత్తయి 24:51.

దైవ భయమున్న భర్త తన భార్యను తన స్వంత శరీరంలా ప్రేమిస్తాడు. అతను తన స్వంత శరీరాన్ని కొట్టుకొని, తన ముఖాన్ని తానే గుద్దుకొని, తన జుట్టును తానే పీక్కుంటాడా? తన్ను తాను తిరస్కరించి కించపరచుకొని, ఇతరులముందు తానే హేళన చేసుకుంటాడా? చివరకు చెప్పాలంటే, అలా చేసేవారిని మతిస్థిమితంలేని వారికింద జమకట్టాలి.

ఒక క్రైస్తవ పురుషుడు తన భార్యను చావుదెబ్బలుకొడితే, దేవుని దృష్టిలో అతని ఇతర క్రైస్తవ క్రియలన్నీ వెలలేనివౌతాయి. జ్ఞాపకముంచుకోండి, ‘కొట్టేవాడు’ క్రైస్తవ సంఘంలోని ఆధిక్యతలకు అర్హుడుకాడు. (1 తిమోతి 3:3; 1 కొరింథీయులు 13:1-3) తన భర్తతో ఇదేరీతిగా వ్యవహరించే ఏ భార్య అయినా దేవుని శాసనాన్ని మీరినట్లే.

గలతీయులు 5:19-21 “ద్వేషములు, కలహము, . . . క్రోధములు,” అని దేవుడు ఖండించిన క్రియలగురించి చెబుతూ “వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని” పేర్కొన్నది. కాబట్టి తన భార్యను గాని పిల్లలనుగాని చావకొట్టడం ఎన్నటికీ న్యాయంకాదు. అది సహజంగా చట్టవిరుద్ధం, మరియు అది తప్పకుండా దేవుని శాసనానికి కూడా, విరుద్ధమే.

యెహోవాసాక్షులు ప్రచురించే ది వాచ్‌టవర్‌ అనే పత్రిక ఈ విషయంపై లేఖనాధార అభిప్రాయాన్నిస్తూ. క్రైస్తవులని చెప్పుకుంటూ ఇప్పటికీ కొట్టేవారిగానే వుంటున్న వారిని గురించి ఇలా చెపుతోంది: “క్రైస్తవుడని పిలువబడే ఎవడైనా పశ్చాత్తాపపడకుండా మరల క్రోధమును కనపరిస్తే అతనిని బహిష్కరించవచ్చు,” వెలివేయవచ్చును.—మే 1, 1975, పేజీ 287; 2 యోహాను 9, 10 పోల్చండి.

దేవుని శాసనం దేనిననుమతిస్తోంది

దేవుడు తన శాసనాలను మీరిన వారిపై చివరికి తీర్పుతీరుస్తాడు. కానీ అంతలోపల, నేరస్థుడై మారకుండా భర్తలవల్ల ఇంకా చావుదెబ్బలు తింటున్న క్రైస్తవ భార్యలకు ఆయన వాక్యం ఏ సహాయాన్ని అందజేస్తోంది? శారీరక, మానసిక, ఆత్మీయ ఆరోగ్యాలు, కొన్నిసార్లు తమ జీవితాలనే అపాయంలో గడపాల్సిన గతి ఈ అమాయకులకు పట్టిందా?

గృహాల్లోని దౌర్జన్యంపై ది వాచ్‌టవర్‌ వ్యాఖ్యానిస్తూ, ఇందు దేవుని వాక్యమనుమతించే వాటిని గూర్చి చెబుతోంది. “‘భార్య భర్తను ఎడబాయకూడదు; ఎడబాసినయెడల పెండ్లి చేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను; మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.’ అని పౌలు సలహానిచ్చాడు” అని అది తెలిపింది. అదే శీర్షిక ఇంకా ఇలా చెబుతూ: “హింస సహించలేనిదై, ప్రాణాపాయంలోవున్నప్పుడు విశ్వాసంలోవున్న జత ‘ఎడబాయుటకు’ ఎన్నుకోవచ్చు. అయితే సకాలంలో ‘సమాధానపడే’ ప్రయత్నంచేయాలి. (1 కొరింథీయులు 7:10-16) అయినప్పటికీ, ‘ఎడబాయడం’ అన్నది దానంతటదే విడాకులకుగానీ తిరిగి వివాహమాడటానికి గాని లేఖనాధార అనుమతినివ్వదు; అయినా చట్టబద్ధ విడాకులు లేక చట్టబద్ధంగా విడిపోవడం వల్ల, ఇకముందు కలిగే హింసనుండి కొంతమేరకు సంరక్షణనివ్వవచ్చును.”—మార్చి 15, 1983, 28-9 పేజీలు; నవంబరు 1, 1988వ సంచిక, 22-3 పేజీలు కూడా చూడండి.

ఒక బాధితురాలు ఈ పరిస్థితులలో ఏం చేయాలనే నిర్ణయం ఆమే స్వయంగా చేసుకోవాలి. “ప్రతివాడును (ప్రతి స్త్రీ) తన బరువు తానే భరించుకొనవలెను.” (గలతీయులు 6:5) ఆమెగురించి అటువంటి నిర్ణయాలు మరెవ్వరూ చేయలేరు. తన ఆరోగ్యం, జీవం, ఆత్మీయత అపాయంలోవున్న హింసించే ఆమె భర్త దగ్గిరకి పొమ్మని ఆమెను బలవంతపెట్టే ప్రయత్నం ఎవ్వరూ చేయకూడదు. ఇతరుల ఇష్టాన్ని ఆమెమీద రుద్దినందుకు కాక, అది ఆమె స్వంతగా స్వేచ్ఛాపూర్వకంగా తీసుకున్న నిర్ణయమై ఉండాలి.—ఫిలేమోను 14 చూడండి.

కుటుంబ దౌర్జన్యానికొక అంతము

“హింసాత్మకధోరణి,” కలిగి అనేకులు “అనురాగరహితులు,” “క్రూరులుగా” వుంటారని అంత్యదినముల గురించి బైబిలులో ముందే చెప్పిన వాటికి ఈ కుటుంబ కలహం సారూప్యంగావుందని యెహోవాసాక్షులు నేర్చుకున్నారు. (2 తిమోతి 3:2, 3, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) ఈ అంత్యదినములు ముగిసిన వెంటనే, ప్రజలు “ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షితముగా నివసించే” ఒక నూతన లోకాన్ని తెస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.—యెహెజ్కేలు 34:28.

ఆ అద్భుతమైన నూతన లోకంలో కుటుంబకలహం అన్నది గతించిన విషయమౌతుంది. “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.

భవిష్యత్తు గురించి మరియెక్కువ బైబిలు వాగ్దానాలను గూర్చి నేర్చుకోవలెనని మేము మిమ్ములను మరీమరీ కోరుతున్నాము. వాస్తవానికి బైబిలు సూత్రాలను మీ కుటుంబంలో అన్వయించడంవలన కలిగే ప్రయోజనాలను మీరిప్పుడుకూడా అనుభవించవచ్చును.

[అధస్సూచీలు]

a ప్రతిభావంతమైన తలిదండ్రులుగా మెలిగేందుకు సంబంధించిన మరింత మంచి సలహా వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌, వారు ప్రచురించిన నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకంలోని, “సంతానము కలిగియుండుట—ఒక బాధ్యత, ఒక బహుమానము.” “తలిదండ్రులుగా మీ బాధ్యత,” “పిల్లలకు బాల్యమునుండియే శిక్షణనిచ్చుట” అను 7-9 అధ్యాయాలలో లభిస్తుంది.

[10వ పేజీలోని చిత్రాలు]

కుటుంబ కలహాలను పరిష్కరించుకోవడానికి బైబిలు సూత్రాలు సహాయపడతాయి

[13వ పేజీలోని చిత్రం]

బాధితులు ఒక యోగ్యులైన మిత్రునియందు నమ్మికవుంచాల్సిన అవసరముంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి