కుటుంబంలో కలహం చెలరేగితే
“మానవుని కలహం—చెంపపై కొట్టడం లేదా గెంటడం, కత్తితో పొడవడం లేదా తుపాకితో కాల్చడం—ఇదంతా మన సమాజంలోని కుటుంబపరిధిలో తరచూ జరుగుతూంది.”—బిహైండ్ క్లోస్డ్ డోర్స్.
అమెరికాలోని ఏ వీధికైనా వెళ్లిచూడండి. ఈ సంవత్సరంలో కనీసం ఒకసారైనా ప్రతీ రెండు ఇండ్లకు ఒక ఇంట్లో ఏదోవిధమైన దెబ్బలాట జరుగుతుంది. అంతేకాదు, ఈ దెబ్బలాట ప్రతీ 4 ఇండ్లకు ఒక ఇంట్లో జరుగుతూనేవుంది. రాత్రిపూట వీధుల్లో నడవడానికి భయపడేవారిలో చాలామంది ఇంటిలోనే ఎక్కువ అపాయస్థితిలో వున్నారనుట హాస్యాస్పదమే.
ఒక్క అమెరికాలో మాత్రమే జరిగేది కాదు ఈ కలహం. ఇది ప్రపంచమంతటా జరుగుతుంది. ఉదాహరణకు, డెన్మార్క్‌లో జరిగే హత్యల్లో మూడింటిలో రెండు కుటుంబపరిధిలో సంభవించేవే. జరిగిన హత్యలన్నింటిలో 22 నుండి 63 శాతం కుటుంబంలో జరిగేవే అని ఆఫ్రికాలోని పరిశోధన వెల్లడిచేస్తుంది, ఈ హత్యల సంఖ్య దేశాన్నిబట్టి మారుతుంది. మరియు లాటిన్ అమెరికాలో చాలామంది, ముఖ్యంగా స్త్రీలను, పురుషాహంకారంగల మగమహారాజులు నిందించి, చావుదెబ్బలు కొడుతున్నారు లేదా చంపుతున్నారు.
కెనడాలో ప్రతిసంవత్సరం దాదాపు ఒక వందమంది స్త్రీలు వాళ్ల భర్తలచే లేదా చట్టబద్ధంగా వివాహంచేసుకోని భర్తలచే చంపబడుచున్నారు. కెనడాలో కంటె పదిరెట్లు ఎక్కువ జనసంఖ్యగల అమెరికాలో ప్రతిసంవత్సరం 4,000 మంది వరకూ స్త్రీలు, కొట్టే భర్తలవల్ల లేదా ప్రేమికులవల్ల చంపబడుచున్నారు. అంతేకాకుండ, ప్రతిసంవత్సరం 2,000 మంది పిల్లలు వాళ్ల తలిదండ్రులచే చంపబడుచున్నారు, అలాగే అంతేమంది తలిదండ్రులు వాళ్ల పిల్లలచేత చంపబడుచున్నారు.
ఆలాగున ప్రపంచవ్యాప్తంగా, భర్తలు భార్యల్ని చావబాదడం, భార్యలు భర్తల్ని కొట్టడం, తలిదండ్రులు పిల్లల్ని కొట్టడం, పిల్లలు తలిదండ్రులపై దౌర్జన్యంచేయడం, మరియు పిల్లలు ఒకరితో ఒకరు కలహించుకుంటున్నారు. “పెద్దవాళ్లు వారి జీవితాల్లో చూపే కోపం, కలహస్వభావం చాలామట్టుకు వారి రక్తసంబంధులయెడలనే లేదా రక్తసంబంధులనుండే అనుభవిస్తారు, అంతేకాదు ఈ కోపం వేరే మరెవ్వరియెడల చూపేదానికంటే చాలా తీవ్రమైందని” వెన్ ఫ్యామిలీస్ ఫైట్ అనే పుస్తకం ధృవపరచింది.
కుటుంబ సమరం
భార్యాభర్తల కొట్లాట: భార్యలను కొట్టడానికి వివాహలైసెన్స్ వారికి అనుమతినిచ్చిందని భర్తలు తరచూ అనుకుంటారు. స్త్రీలు పురుషులను కొడుతున్నప్పటికి, సాధారణంగా పురుషులు భార్యలను కొట్టినప్పుడు జరిగేంత గొప్పనష్టం జరుగదు. పేరెంట్స్ అనే పత్రిక ఈ విధంగా నివేదిస్తుంది: “నమోదు చేసిన భార్యభర్తల కొట్లాటలలో 95 శాతంకంటే ఎక్కువ ఫిర్యాదులు పురుషుడు స్త్రీని కొట్టడానికి సంబంధించినవే.”
న్యూయార్క్ జిల్లా న్యాయాధికారి ఇలా చెప్పింది: “అమెరికా సమాజంలో స్త్రీలకు వ్యతిరేకంగా జరిగే బలాత్కారం అంటువ్యాధిలా తీవ్రంగా వుంది. ఎఫ్‌బిఐ అంచనా ప్రకారం . . . ప్రతిసంవత్సరం 60 లక్షలమంది స్త్రీలు చావుదెబ్బలు తింటున్నారు.” ఇలాంటి సంఘటనల సంఖ్య ఒక దేశానికి మరో దేశానికి భిన్నంగా వున్నప్పటికి, మగవాళ్లు ఆడవాళ్లను కొట్టడం అనేది చాలా దేశాల్లో లేకపోయినా, అత్యధిక దేశాల్లో మాత్రం అది అంటువ్యాధిలా వ్యాపిస్తుందని నివేదికలు చూపిస్తున్నాయి.
“పదిమంది స్త్రీలలో ఒక స్త్రీ తన వివాహ జీవితంలో ఏదొకసారి తన భర్తచేత చావుదెబ్బలు తినడం (గ్రుద్దడం, తన్నడం, కొరకడం లేదా యింకా నీచమైన దౌర్జన్యాలు) జరిగియుంటుందని” అమెరికాలో అంచనా వేయబడింది. అంత ప్రమాదకరంకాని సంఘటనలు చేర్చితే, “అమెరికాలో ఇద్దరు స్త్రీలలో ఒకతె ఈ విధమైన హింసను అనుభవిస్తుందని” ఫ్యామిలీ రిలేషన్స్ అనే పత్రిక చెపుతుంది.
నిజానికి, “బలాత్కారం, దౌర్జన్యం, వాహనాల దుర్ఘటనలవల్ల సంభవించిన అపాయాలకంటే భర్త కొట్టడంవల్లనే స్త్రీలకు బహుగా గాయాలు తగిలి ఆస్పత్రుల్లో చేర్చవలసివస్తుందని” గుర్తించినట్లుగా, న్యూయార్క్ జిల్లా న్యాయాధికారి చెబుతుంది.
డాక్టర్ లూయిస్ జి. లివిజి ఇలా పేర్కొంటున్నారు: “స్త్రీలకు విరుద్ధంగా కలహం రేపడం, కుటుంబ పరిధిలోనే స్త్రీలపై అత్యాచారం చేయడం సాధారణమైందని వివరంగా చూడవచ్చు, ఈ నేరస్థులెవరో కాదు . . . మామూలు ప్రజలే . . . ఇది అన్ని తరగతుల ప్రజల్లోను, అన్నిజాతుల్లోను వున్న గంభీరమైన సమస్యే.”
కొట్లాటకు గురైనవాళ్లు కొన్నిసార్లు తమ్మునుతామే నిందించుకుని, ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు. పేరెంట్స్ అనే పత్రిక ఈ విధంగా వివరిస్తుంది: “ఆత్మధైర్యాన్ని కోల్పోయిన ఆడది, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకోలేక దెబ్బలకు గురౌతుంది. . . . అలా దెబ్బలుతిన్న స్త్రీ తనసొంత ప్రయోజనార్థమై యోచించడానికి, ప్రవర్తించడానికి భయపడుతుంది.”
దంపతులమధ్య కొట్లాట పిల్లలపై చెడుప్రభావం కల్గియుంటుంది. వారు ఇతరులను తమ గుప్పిట్లో పెట్టుకోడానికి అలాంటి దౌర్జన్యాన్ని ఉపయోగించవచ్చని నేర్చుకుంటారు. తమ పిల్లలు వారి ఇష్టాన్ని నెరవేర్చుకొనేందుకుగాను “నేను డాడీచేత నిన్ను కొట్టిస్తాను చూడు” అని బెదిరిస్తున్నట్లు కూడ కొందరు తల్లులు నివేదిస్తున్నారు.
పిల్లలను కొట్టుట: ప్రతిసంవత్సరం లక్షలాదిమంది పిల్లలు తీవ్రమైన భౌతిక శిక్షను అనుభవిస్తున్నారు. అందువల్ల వారు బహుగా గాయపడటం, వికలాంగులు కావడం లేదా చనిపోవడం జరుగుతుంది. ప్రతి 200 కేసులలో ఒక కేసు మాత్రమే రిపోర్టు చేయబడుచున్నట్లు అంచనా వేయబడింది. “పిల్లలకు చాలా సందర్భాల్లో ఇల్లే అపాయకరమైన స్థలంగా వుందని” సోసియాలజి ఆఫ్ మ్యారేజ్ అండ్ ది ఫ్యామిలి అనే పుస్తకం వాదిస్తుంది.
కొట్టుట అనేది మిక్కిలి శక్తివంతమైన ఇంటి ప్రభావమైయుండి పిల్లవాడు తన భవిష్యత్తు జీవితంలో యేవిధంగా ప్రవర్తిస్తాడనే దానిపై ప్రభావాన్ని చూపుతుందని యూనివర్శిటీ ప్రొఫెసర్ జాన్ ఇ. బేట్స్ చెపుతున్నారు. డాక్టర్ సూసన్ ఫోర్‌వర్డ్ ఇలా చెబుతుంది: “జీవితంలో మరేయితర సంఘటన కూడ ప్రజల ఆత్మగౌరవాన్ని భయపెట్టలేదు లేదా ప్రౌఢదశలో ఉద్రేకంతోకూడిన కష్టాల్ని ఎదుర్కొనేటట్లు చేయలేదు.” కష్టమైన సమయాల్లో జగడమాడే స్వభావాన్ని కనబరచడం నాల్గు నుండి ఐదు సంవత్సరాల వయస్సున్న పిల్లలలో కూడా గమనించవచ్చును. వారు పెద్దవారైనపుడు మత్తుమందుల నుపయోగించడం, మితిమీరి త్రాగడం, నేరస్థులుగా తయారవడం, మానసికాందోళనకు గురికావడం మరియు అభివృద్ధి మందగించిపోవడం వంటి లక్షణాలు వాళ్లలో హెచ్చుగా వుంటాయి.
చిన్నచూపు చూడబడ్డ పిల్లలు చాలామంది వాళ్లను కొట్టిన తల్లి లేదా తండ్రియెడల కోపాన్ని దాచుకుంటారు, అంతేకాకుండా ఈ దౌర్జన్యం కొనసాగడానికి అనుమతిస్తున్నందుకు తరచు వాళ్లను కొట్టని తల్లి లేదా తండ్రి యెడలకూడ కోపాన్ని కల్గియుంటారు. ఎందుకంటే పిల్లవాని దృష్టిలో, ఇలా ఊరుకున్న వ్యక్తి కూడా తోడుదొంగే.
పెద్దవాళ్లపై దౌర్జన్యం: కెనడాలోని పెద్దవాళ్లలో 15 శాతం మంది తమ ఎదిగిన పిల్లలచేతుల్లో భౌతికంగాను, మానసికంగాను బాధననుభవిస్తున్నారు. ఒక డాక్టరు ఊహించేదేమంటే “వారు వృద్ధులైనపుడు ఈ పరిస్థితి ఇంకా దారుణం కాగలదు మరియు పిల్లలకు సంబంధించిన ఆర్థిక, మానసిక బాధలు ఎక్కువ కాగలవు.” ప్రపంచవ్యాప్తంగా అదే రకమైన భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తరచుగా, పెద్దవాళ్లు ఈ దౌర్జన్యం గురించి రిపోర్టు చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ వారు దౌర్జన్యం చేసేవాళ్లపైనే ఆధారపడి వుండవచ్చు కాబట్టి ఆ ఘోర పరిస్థితుల క్రింద జీవించడానికే కోరుకుంటారు. అధికారులకు వాళ్లను ఎప్పుడప్పగిస్తావని ఒక వృద్ధ స్త్రీని అడిగితే, “తరువాత” అని తదేకంగా సమాధాన మిచ్చింది. ఆ స్త్రీని తన కొడుకు కోడలు కలసి ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆమె ఒక నెలపాటు ఆసుపత్రిలో వుండవలసివచ్చింది.
తోబుట్టువుల పోరాటం: ఇది ఎక్కువ వ్యాప్తిలోనున్న ఇంట్లోజరిగే దెబ్బలాటల్లో ఒక రకం. కొందరు దీన్ని అనావశ్యమైందిగా చేస్తూ, “ఇది సాధారణంగా మగపిల్లల్లో జరిగేదే” అని చెబుతున్నారు. అయినను, ఒక సర్వే నివేదించినట్లుగా, యీ తోబుట్టువుల కొట్లాట, కుటుంబ సభ్యులతోకాక బయటి వ్యక్తులతో జరిగినట్లయితే అది నేరశిక్ష పడేంత తీవ్రమైనదై యుంటుంది.
తోబుట్టువుల మధ్యజరిగే ఈ పోరాటం వారు ఎదిగిన తర్వాత కూడ అలాగే వుండడానికి నేర్పుతుందని చాలామంది అభిప్రాయం. కొందరి విషయంలో వారి తలిదండ్రుల మధ్య జరిగిన పోరాటాన్ని గమనించడం కంటె ఇది వారి వివాహజీవితంలో కొట్లాడుకోవడానికి కారకమవుతుంది.
భయంకరమైన రణరంగం
ఇతర నేర సంఘటనలన్నింటికంటె ఎక్కువగా కుటుంబ సంఘర్షణల నిమిత్తమే పోలీసులు పిలువబడ్డారని చట్టబద్ధమైన ఒక పరిశోధకుని అంచనా. వేరేవిధమైన సమస్యలకంటె, కుటుంబంలో జరిగే అల్లర్లను అణచడానికి వెళ్లినపుడు ఎక్కువమంది పోలీసులు చంపబడ్డారని కూడ ఆయన వాదిస్తున్నాడు. “కనీసం దొంగతనం జరిగినపుడు ఏంచేయాలో మీకు తెలుసు, కాని ఇతరవ్యక్తి ఇంటికి పోతే . . . ఏం జరగబోతుందో మీకు తెలియదు.” అని ఒక పోలీసు అన్నాడు.
ఇంట్లోజరిగే కొట్లాటలను గూర్చి చాలాకాలం అధ్యయనం చేసిన తదుపరి, అమెరికాలోని ఒక అన్వేషణా బృందం నిశ్చయించిందేమంటే, యుద్ధసమయంలోనున్న మిలటరీ తప్ప, సాంఘికంగా ఉనికిలో వున్న అత్యంత ఉగ్రరూపం కలది కుటుంబమే.
కుటుంబ కలహాలకు కారణమేమైయుంది? ఇది ఎన్నటికైనా అంతమగునా? అది నిత్యమూ ఉండాలని నిర్దారించబడిందా? తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.
[4వ పేజీలోని చిత్రం]
“అమెరికా సమాజంలో స్త్రీలకు వ్యతిరేకంగా జరిగే బలాత్కారం అంటువ్యాధిలా తీవ్రంగా వుంది.”—జిల్లా న్యాయాధికారి
[5వ పేజీలోని చిత్రం]
“పిల్లలకు చాలా సందర్భాల్లో ఇల్లే అపాయకరమైన స్థలంగా వుంది.”—సోషియాలజి ఆఫ్ మ్యారేజ్ అండ్ ది ఫ్యామిలి