కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 3/8 పేజీలు 13-15
  • వంటచెరకు భవిష్యత్తు భస్మమౌతోందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వంటచెరకు భవిష్యత్తు భస్మమౌతోందా?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఎందుకీ కొరత?
  • ప్రజలపై దాని ప్రభావం
  • ఏం జరుగుతుంది?
  • భవిష్యత్‌ ఉత్తరాపేక్ష
తేజరిల్లు!—1993
g93 3/8 పేజీలు 13-15

వంటచెరకు భవిష్యత్తు భస్మమౌతోందా?

నైజీరియాలోని అవేక్‌! ప్రతినిధి

సూర్యుడు అస్తమిస్తూ ఆఫ్రికా నింగిని ఎర్రబరిచాడు. సాంపా తన భర్తకి పిల్లలకి అన్నం వండి పెడుతోంది. ఆమె ముంతతో నీళ్లు ముంచి, పొగబట్టిన నల్లని అల్యూమినియమ్‌ పాత్రలో ఆ నీళ్లను పోస్తోంది. పాత్ర క్రింద మూడు కట్టెలతో వెలిగించబడ్డ చిన్న మంట చిటచిట మండుతోంది.

పక్కనే ఒక పెద్ద వంటచెరకు కుప్ప ఉంది. పర్వత ప్రాంతంనుంచి వాటిని తెచ్చే వ్యక్తులనుండి సాంప వంటచెరకును కొంటుంది. వంటచెరకు అత్యావశ్యకము. వంటచెరకు లేనిదే మంట లేదు. మంట లేనిదే వంట లేదు.

సాంప పెద్ద కొడుకు ఇలా అన్నాడు: “వంటచెరకు లేనప్పుడు, మేము భోంచేయము.” కొండ మీదున్న ధనికుల ఇళ్లను చూపించి, “ఆ ఇళ్లల్లోనైతే విద్యుచ్ఛక్తి ఉంది. విద్యుచ్ఛక్తితో పని చేసే పొయ్యిలున్నాయి, గాస్‌తో పనిచేసే పొయ్యిలున్నాయి” అని, మంట వైపు తిరిగి, నిస్సహాయ సూచకంగా భుజాలూపి, “మేము కట్టెలే ఉపయోగిస్తాము” అన్నాడు.

ఈ విషయంలో మాత్రం సాంప కుటుంబంవంటి కుటుంబాలెన్నోవున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతి నలుగురిలో ముగ్గురు, తమ వంటకు, కాచుకోవడానికి అవసరమైన వంట ఇంధనంకొరకు వంటచెరకు మీదనే ఆధారపడతారు. కానీ, వంటచెరకు కొరత విపరీతంగా ఉంది.

ఎఫ్‌.ఎ.ఒ. (ప్రపంచ ఆహారవ్యవసాయ సంస్థ) ప్రకారం, వంటచెరకు సంక్షోభం నిజానికి అతి తీవ్రంగావుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 100 కోట్ల ప్రజలు వంటచెరకు కొరతను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి స్థితి ఇలాగే కొనసాగితే, ఈ సంఖ్య ఈ శతాబ్దం చివరి కల్లా సులభంగా రెండింతలయ్యే అవకాశముంది. ఎఫ్‌.ఎ.ఒ. ప్రతినిధి ఒకరు ఇలా పేర్కొన్నారు: “వండేమార్గం లేనప్పుడు ఆకలిగొన్నవారికి ఆహారవస్తువుల్ని సరఫరాచేయడం వృధానే.”

ఎందుకీ కొరత?

అనాది నుండే మానవజాతి వంటచెరకును వంట ఇంధనంగా వాడుతోంది. దానికి కారణం? వంటచెరకు చాలా సులభంగా లభ్యమౌతుంది. మీరు దాన్ని సమకూర్చడానికి ఖరీదైన ఉపకరణాలను లేక అధునాతన సాంకేతిక నైపుణ్యతను ఉపయోగించనవసరం లేదు. దుర్వినియోగపరచనంత వరకు, కొత్త చెట్లను పెంచడం వలన దాని సరఫరాను కొనసాగించవచ్చును. వంటచెరకుతో వండుకోవడానికి గాని, కాచుకోవడానికిగానీ స్టవ్‌ లేక హీటర్‌ అవసరం లేదు. వాస్తవానికి, వంటచెరకు ఉచితం, మరియు అతి సమీపంలో వున్న చెట్టంత దగ్గర్లో లభిస్తుంది. ఇటీవలి కాలంనుండి, అంటే గత రెండు వందల సంవత్సరాలుగా ప్రపంచంలోని ధనిక దేశాలు, గ్యాస్‌, బొగ్గు, చమురు వంటి ఇతర వంట ఇంధనములను ఉపయోగిస్తున్నవి. మిగతా దేశాలు మాత్రం వంటచెరకుపైనే ఆధారపడుతున్నవి.

ఈనాటి సమస్యకు మూల కారణం అధిక జనాబా పెరుగుదలేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. జనాబా పెరిగే కొలది, గృహ నిర్మాణాభివృధికి, వ్యవసాయవిస్తరణకు, పరిశ్రమలకే గాక, వంట ఇంధనం కొరకు కలపను సరఫరా చేయడానికి అడవులు నాశనం చేయబడుతున్నవి. ఇంచుమించు అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లోను వాటిని అధికం చేయుటకు అడవులను నరికి వేయడం అతివేగంగా జరుగుతుంది. ఉత్తరమెరికా మరియు యూరప్‌ దేశాలు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయి.

అయితే, ఈనాటి జనాబా పెరుగుదల భయాందోళనను రేపుతోంది. ఇప్పటికే ఈ గ్రహం మీద 550 కోట్ల మంది ప్రజలున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ప్రతి 20 నుండి 30 సంవత్సరాలలో జనాబా రెండింతలవుతున్నది. జననాల సంఖ్య పెరిగేకొలది వంటచెరకు అవసరత పెరుగుతుంది. జనాబా అనేది తీరని ఆకలితో అడవిని భక్షించే రాక్షసిలా తయారై, రోజురోజుకు దాని ఆకలి, ఆకృతిని పెంచుకొంటుంది. అందుకే వంటచెరకు సరఫరా తిరిగి రాకముందే అది మ్రింగి వేయబడుతున్నది. ఎఫ్‌.ఎ.ఒ. ప్రకారం, ఇప్పటికే 26 దేశాలలోని పది కోట్లమంది ప్రజల కనీసావసరతలకు కావలసినంత వంట చెరకు లభించడంలేదు.

అయిననూ, తీవ్ర కొరత ఉన్న అన్ని ప్రాంతాలలోని ప్రజలు ఒకే విధమైన సమస్యలో చిక్కుకొన లేదు. ఇతర వంటఇంధనం, కిరోసిన్‌ లేక గ్యాస్‌ వంటి వాటిని కొనగల్గినవారు కొని వాడుతున్నారు. వంటచెరకు కొరత, పేరిగే పేదవారి కొరతే.

ప్రజలపై దాని ప్రభావం

గత కొన్ని సంవత్సరాలలో వంటచెరకు ధర రెండింతలు, మూడింతలు, మరి కొన్ని ప్రాంతాలలో నాలుగింతలైంది. ఈనాడు, పట్టణాల చుట్టుప్రక్కల ప్రాంతాలు విస్తరిస్తున్న కొలది ధరలు ఆకాశాన్నంటుతున్నవి. ప్రస్తుతము ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలోని అనేక పట్టణాలు చాలామటుకు అటవీనిర్మూలనా ప్రాంతాలుగా ఆక్రమించబడి ఉన్నాయి. కొన్ని పట్టణాలు 160 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుండి వంటచెరకును రప్పించుకోవలసి వస్తోంది.

అసలే పేదరికంలో మగ్గుతున్న ప్రజలపై ఈ పెరిగే ధరలు మరింత భారాన్ని మోపుతున్నాయి. పరిశోధనల ప్రకారం మధ్య అమెరికా మరియు పశ్చిమాఫ్రికా లోని కొన్ని ప్రాంతాలలో కాయకష్ఠంచేసే వారి కుటుంబాలు తమ ఆదాయం మొత్తంలో 30 శాతం వంటచెరకుపై ఖర్చు చేస్తున్నారు. ఇకపోతే—ఆహారం, బట్టలు, గృహనిర్వాహకము, రవాణా, చదువు—మొదలైన వాటి ఖర్చులు మిగిలిన దానిలోనుండి భరించాలి. వారి పట్ల ఈ సామెత నిజమౌతుంది: కుండలో పోసేదానికన్నా కుండ క్రింద పెట్టేదానికి ఖర్చెక్కువ.

మరి వారెలా సర్దుకుంటున్నారు? వంటచెరకు తక్కువున్న లేక ధరెక్కువున్న ప్రాంతాలలోని ప్రజలు, తమ వేడిభోజనాల సంఖ్యను తగ్గిస్తారు. చవక ఆహారాన్నో లేక తక్కువ ఆహారాన్నో కొంటారు. ఫలితంగా సమపాళ్లు లేని ఆహారాన్ని భుజిస్తారు. అంతేగాక, వారు సరిగ్గా వండుకోరు. అణువులు, పరాన్నజీవులు నశించవు, మరియు శరీరం తక్కువ పోషకపదార్థాలను జీర్ణించుకుంటుంది. నీళ్లు కాయరు. కాలే ప్రతిదాని కొరకు వారు వెదుకుతారు.

ఎండుగడ్డి, పుల్లలు, లేక పీడకల వంటి నాచిరకం వంటచెరకును లక్షలాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. వంటచెరకు ధరెక్కువుండి, పేడ ధర తక్కువున్న ప్రాంతాలలో, పేడను పొలాల్లో వేసేకన్నా మంటలో వేయడం ఆర్ధిక పరంగా సముచితమని భావిస్తారు. వేరే మార్గం కనబడదు. కానీ దీని వల్ల కలిగే నష్టమంతా, నేలకు అవసరమైన అమూల్య సేంద్రియ పదార్థములను నేల కోల్పోతుంది. కొద్ది కాలానికి నేలనిస్సారమై బీటలు వారుతుంది.

గ్రామాలలో నివసించే ప్రజలు వంటచెరకుకై డబ్బు పెట్టనవసరంలేదు గానీ, వాటిపై వ్యయపరిచే సమయం వాటి కొరతను అధికం చేస్తోంది. దక్షిణమెరికా ప్రాంతాలలోని స్త్రీలు దినంలో 10 శాతం సమయాన్ని వంటచెరకు సమకూర్చే పనిలో గడుపుతారు. కొన్ని ఆఫ్రికా ప్రాంతాలలో ఒక రోజంతా కష్టపడి సమకూర్చిన వంటచెరకు, మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది. కొన్నిసార్లు కుటుంబాలు ఒక బిడ్డను తమ కుటుంబానికి వంటచెరకు ఎల్లకాలం సమకూర్చుటకు నియమించుకుంటాయి.

ఎల్లప్పుడు, పల్లె జీవనం పట్నపు కోరికల్ని తీర్చడానికే అర్పించబడుతోంది. వంటచెరకు, పెరిగే సమయంకంటే దాన్ని నరికి అమ్మడమే వేగంగా జరుగుతుంది. కాబట్టి సరఫరా తగ్గుతుంది, మరియు కుటుంబాలు అటు పట్నంకైనా వలస పోతారు లేదా తమకొరకై వంటచెరకును సమకూర్చడంలో ఎక్కువ సమయాన్నైనా వ్యయపరుస్తారు.

చివరికి లక్షలాది ప్రజలు తమ కనీస వంట ఇంధనం కోసం ఎంతో డబ్బును, సమయాన్ని వ్యయపరుస్తుంటారు. వీటికి వేరే మార్గాలున్నాయా? పేదవారికి వేరే మార్గం అంటే కొంచెం అన్నం, చలిలో శయనం, చీకటి జీవనం అంతేగదా.

ఏం జరుగుతుంది?

కొన్ని సంవత్సరాల క్రితం వంటచెరకు కొరతయొక్క గంభీరత అంతర్జాతీయ అవధానాన్ని పొందింది. వరల్డ్‌ బ్యాంక్‌ మరి ఇతర ఏజెన్సీలు అటవీశాస్త్ర పథకాలపై తమ డబ్బును కుమ్మరించారు. ఈ పథకాలన్నీ ఫలించక పోయినా వారు దానినుండి చాలా నేర్చుకోగలిగారు. వంటచెరకు కొరతకు పరిష్కారం కేవలం చెట్లు నాటడం కాదని అనుభవాలు కనపరుస్తున్నవి. ఒక సమస్యేమిటంటే పథకాలను యోచించేవారు, స్థానిక ప్రజల భావనలను దృష్టిలోకి తీసుకోరు. అందుకే పశ్చిమాఫ్రికాలోని ఒక దేశ ప్రజలు, పారంపర్య పచ్చిక బయళ్లపై మొక్కలను నాటినందుకు వాటిని నాశనం చేశారు.

మరొక సమస్య ఏమంటే, అడవుల పెంపకం దీర్ఘకాలపనితో కూడింది. చెట్లు స్వయం కృతాధారంగా వంటచెరకును ఉత్పత్తి చేసేటప్పటికి 25 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే, పెట్టుబడి లాభాల నడుమ ఆలస్యం జరుగుతోంది. మరో భావమేమంటే, చెట్లునాటడం ప్రస్తుతావసరతలను ఏమాత్రం తీర్చదు.

అనేక దేశాలు అటవీనిర్మాణ పనిని అమలు పెడుతున్నవి. అయితే, అవి భవిష్యత్‌ అవసరతల్ని తీర్చగలవా? తీర్చలేవని అటవీశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. తిరిగి నాటేకంటే వేగంగా చెట్లు నరక బడుతున్నవి. వర్ల్‌డ్‌వాచ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకురాలు ఇలా వ్రాసింది: “అనుకోనిరీతిలో, రాజకీయ చిత్తం మరియు వనరుల యెడల వారి ప్రతిబద్ధత అటవీనిర్మూలనం ద్వారా ప్రారంభమైన ఈ చక్రాన్ని విరచవలసిన అవసరత అభివృద్ధి చెందే ఉష్ణమండల దేశాలలో లోపించింది. నరికివేసిన ప్రతి 10 హెక్టార్ల చెట్లకు కేవలం 1 హెక్టార్‌ నాటబడుతున్నవి. ఈ విషయంలో ఆఫ్రికాలో చాలా తేడావుంది. ఇక్కడ చెట్లునాటే నిష్పత్తి ఇరవైతొమ్మిదికి ఒకటి చొప్పున ఉన్నది. రెండువేల సంవత్సరానికి అభివృద్ధి చెందే దేశాల పథకాలు నెరవేరాలంటే, పారిశ్రామికేతర ఉపయోగాలకు ఇప్పుడు నాటే చెట్లకన్నా పదమూడు శాతం అధికంగా నాటవలసివుంది.”

భవిష్యత్‌ ఉత్తరాపేక్ష

ఈనాడు అనేక యథార్థ హృదయులు వంటచెరకు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి భవిష్యత్‌ అంచనాలు అనేకసార్లు విషాదకరంగానే ఉంటున్నాయి. ఎర్త్‌స్కాన్‌ పరిశోధకులు వారి పుస్తకం ప్యూయల్‌వుడ్‌—ది ఎనర్జీ క్రైసిస్‌ దట్‌ వోంట్‌ గో అవే అనేదానిలో: “ఈ చర్యలన్నీ కూడి [వంటచెరకు కొరతను ఎదుర్కొనేందుకు] పేదలపై మోపబడిన వంట ఇంధనం కొరతను, పెరిగే వంటచెరకు ధరల భారములను తగ్గించలేవని” రాశారు. ఎఫ్‌.ఎ.ఒ బోధనా నమూనా పుస్తకం ది ఫ్యూయల్‌ వుడ్‌ క్రైసిస్‌ అండ్‌ పాప్యులేషన్‌—ఆఫ్రికా: “జనాబా పెరుగుదలను అరికట్టేంత వరకు ఈ సమస్యను పరిష్కరించే ఏ ప్రయత్నమైనా పూర్తిగా ఫలించదు,” అని పేర్కొన్నది. అయితే, అదే ప్రచురణ తెలిపేదేమంటే, “ఈ నాటి తలిదండ్రుల కన్నా రేపటి తలిదండ్రులు అధికంగా వున్నారు. రేపటి తలిదండ్రులు ఇప్పటికే పుట్టివున్నారు గనుక,” జనాబా పెరుగుతూనే వుంటుంది.

ఇలాంటి ఉదాసీన సూచనలకు భిన్నంగా, సర్వశక్తిగల దేవుని ఉద్దేశము ఈ భూమిపైన పరదైసును పునరుద్ధరించడమేనని బైబిలు ప్రవచనం కనపరస్తున్నది. (లూకా 23:43) వంటచెరకు, జనాబా, పేదరికం వంటి క్లిష్టమైన సమస్యలకు ఆయనే పరిష్కారాన్ని చూపగల సమర్థుడు.—యెషయా 65:17-25.

వంటచెరకు భవిష్యత్తు భస్మమౌతోందా? ఎన్నటికీ కాదు! త్వరలోనే మన ప్రేమగల దేవుని ప్రవచనం నెరవేరబోతోంది: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.”—కీర్తనలు 145:16. (g92 12/8)

[14వ పేజీలోని చిత్రం]

‘వండేమార్గం లేనప్పుడు ఆకలిగొన్నవారికి ఆహారవస్తువుల్ని సరఫరాచేయడం వృధానే’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి