మందమైన చర్మంగల శాంతియుత ఏనుగులను సంరక్షించుట
“ఒక్కసారి ఆ ముద్దులొలికే గున్న ఏనుగుల్ని చూడండి! ఎంత ఆకర్షణీయంగా ఉన్నవి! నువ్వనేది మనవైపు నడిచివచ్చె లంక అనే పేరు గల వీడి వయస్సు ఏడునెల్లనేనా? మరి అక్కడున్న ఆడు గున్న ఏనుగు కాంచనాకి ఎనిమిది నెలలా? వంటినిండా నిక్కపొడుచుకున్న రోమములతో అడవిలోనుండి పరుగుపరుగున వస్తున్న ఈ గున్న ఏనుగులు ఏంచేస్తున్నాయి? ఓహో, భోజన సమయమైయిందనటంలో ఆశ్చర్యం లేదు! వాటికి రోజుకు ఐదుసార్లు, ఒక లీటర్ పాలతో నింపిన ఏడు సీసాల పాలు ప్రతిసారి తాగించాలా? అంటే, 35 లీటర్లు! వీటి వయస్సు కొన్ని నెలలే అయినా, ఒకొక్కటీ 90 కిలోల బరువుందంటే ఆశ్చర్యం లేదు!”
శ్రీలంకలోని ప్రముఖ పట్టణం, కొలంబో నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిన్నావెలా అనే ఏనుగుల అనాధశరణాలయంలో మేము ఇపుడున్నాము. విడువబడిన లేక గాయపడిన గున్న ఏనుగులను ఈ అనాధాశ్రమానికి తీసుకొచ్చి, పెంచుతారు. మేము సందర్శించడానికి వెళ్ళినప్పుడు 15 గున్న ఏనుగులున్నాయి. మాములుగా వీటిని పెద్ద ఏనుగులతో కలిపి అడవిలోని ఒక పెద్ద ప్రాంతంలో వదిలేస్తారు, కానీ గున్న ఏనుగులు మాత్రం వాటికి కేటాయించిన పాల కోసం పిలవబడతాయి. పాలునింపిన సీసాలు పట్టుకుని వేచివున్న అటెండెంట్లను కనిపెట్టడంలో, ఈ అనాధలు ఒక్క నిమిషం కూడా వృధాచేయవు.
అటెండెంట్లు సీసాపైకెత్తి వాటి నోళ్లలో పోస్తూవుంటే, ఇవి వాటి తొండాలను చుట్టి తల మీదపెట్టి, నోళ్ళను పెద్దగా తెరిచి, వీలైనంత త్వరగ గుటకలు వేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ సీసాలకిక పీకలు అవసరంలేదు! కొన్నిసార్లు పాలు పొర్లి నోటి ప్రక్కగుండా తొణుకుతాయి. చిన్నవాటికి అవకాశం ఇవ్వటానికి, వీటన్నింటిలో పెద్దవాడినొకడ్ని ఒక స్తంభానికి కట్టేసారు. ఈ “భిన్నత్వానికి” వాడు చాలా బాధపడి అటూఇటూ తిరిగి, తన తొండాన్ని పైకెత్తి, అక్కడి వాతావరణాన్నంతా అసమ్మతితోకూడిన ఆర్తనాదాలతో నింపేశాడు. ఇక ఒకసారి తాగగల్గినన్ని పాలు తాగిన తరువాత, ఈ గున్నలు నీ అవధానం కోసం నీ చుట్టూ చేరి, నిన్నానుకుంటాయి. అంతే కాదు, తమ తొండములతో నీ కాళ్ళను చుట్టేస్తాయి.
ఏనుగుల స్నానపు తొట్టి
సూర్యాస్తమయము వాటి స్నాన సమయము. ఏనుగులన్నీ, చిన్నవి పెద్దవి మైయ ఓయ నదికి ఒక అర్ద కిలోమీటర్ దూరం వరకు గుంపులు గుంపులుగా నడుస్తుంటాయి. అది చాలా లోతుగా, విశాలంగా వున్నది, దానిలో బల్లపరుపురాళ్ళు బైటికి కనపడుతుంటాయి. అక్కడ ముగ్గురు నలుగురు స్త్రీలు తమ బట్టలకు పట్టిన మురికిని వదిలించడానికి వాటిని ఆ రాళ్ళకేసి కొట్టి, ఆరబెట్టడానికి వాటిని ఆ బండల మీద పరుస్తున్నారు. దూరంనుండి చూస్తే, ఆ దృశ్యం రాళ్ళ మీద పరచిన రంగు రంగుల అందమైన పరుపులావుంది. మైయ ఓయ ఒడ్డున దట్టంగా ఏపుగా పెరిగిన అడవి వుంది. ఇది కనులకు ఎంతోరమ్యంగా, ఏనుగులకు ఒక పెద్ద స్నానపు తొట్టిలా వుంటుంది.
ఒక్క నిమిషం వృధా చేయకుండా, గున్న ఏనుగుల ముందు నడుస్తుండగా అన్నీ నీళ్ళలోకి దిగుతాయి. కానీ, మునగడానికి అన్నీ జంకుతాయి. అందుచేత అటెండెంట్లు వాటిపైన నీళ్ళు చిమ్మి, పొడవైన అంకుశంతో పొడుస్తారు. దాంతో ఉత్తేజితమై, చల్లటి మునకకై నీటిలోకి దిగుతాయి. పెద్ద వాటిలో కొన్ని తమ తలలను సగం ముంచి, ఊపిరి పీల్చడానికి ఉపయోగించే గాలిగొట్టాలవలే తమ తొండముల చివర్లను మాత్రం బైటుంచుతాయి. సూర్యుని వేడి తీవ్రంగా వుంటుంది గనుక, చల్లటి నీళ్ళు వాటి మందమైన చర్మానికి ఎంతో హాయినిస్తాయి—పాచిడర్మ అన్న వాటి పేరుకు భావం “మందమైన చర్మం కలవి” అని అర్థం.
ఈ అనాధాశ్రమము, జాతీయ జంతు సంరక్షణాశాల డైరెక్టర్ బ్రాడ్లె పెర్నాన్‌డోగారి పర్యవేక్షణలో ఉంది. జంతు సంరక్షణాశాల ముఖ్య ఉద్దేశాన్ని అవేక్!కు ఆయనిలా తెలిపారు: “మొదట్లో మేము కేవలం గున్న ఏనుగులను బ్రతికించాలనుకున్నాము. తరువాత దీర్ఘకాలానికి, మేము ఒక పెంపక స్థావరాన్ని నిర్మించనుద్దేశించాము.”
అయితే మరి ఈ శాంతియుత ఆసియా మందమైన చర్మంగల ఏనుగుల శత్రువులెవరై ఉండవచ్చు? ఆఫ్రికాకు చెందిన ఏనుగుతో పోలిస్తే ఇది చిన్నదైనా, పెరిగిన శ్రీలంక ఏనుగు నాలుగు టన్నుల బరువు లేక అంతకంటే ఎక్కువే వుండి, భుజము నుండి పది అడుగుల ఎత్తు వుంటుంది. తన శత్రువులను నిరుత్సాహపరచడానికి అంతటి బారీ శరీరం చాలు. నిజానికి, ఇతర దేశాల్లో వున్న సింహాలు, పులుల మాదిరే శ్రీలంక చిరుతపులి, పెద్ద ఏనుగుకు భయపడి దూరంగా వుంటుంది.
అయితే మరి దానికి కాగల శత్రువు ఇంకెవరు? మనిషే. ఏనుగుకు భూమి అవసరం; మనిషికీ భూమి కావాలి; మనిషికి భూమి లభిస్తుంది. ఇక శ్రీలంక ఏనుగు అంతరించిపోతోంది. కనీసం, ఏషియవీక్ అనే పత్రిక దీన్ని ఆ విధంగా దృష్టిస్తుంది.
“శ్రీలంక ప్రాచీన రాజులు వన్యప్రాణులను సంరక్షించడం పవిత్ర ధర్మంగా భావించేవారు. వారు రాజశాసనమును అమలు పరచారు—బహుశ ఇది ప్రపంచములోకెల్లా ప్రప్రథమ వన్యప్రాణి సంరక్షణా చట్టము అయివుండ వచ్చును. తాము నిర్మించిన పెద్దపెద్ద పంటపొలాల జలాశయముల చుట్టూ జంతు సంరక్షణాశాలలు నిర్మించారు. వేటను ఇతర ప్రాంతాలలో అనుమతించే వారు, అయితే ఆహారంకొరకే గానీ సరదా కొరకే గానీ ఏనుగును చంపేవారు కాదు. ఈ జంతువును పట్టుకొని దానిని రాచకార్యములకు మరియు మతపరమైన ఊరేగింపులకు, లేక బరువులు మోసే జంతువులుగా వాటిని పెంచే అధికారం ఒక్క రాజులకు మాత్రమే ఉండేది. వలసపాలనలో ఇదంతా మారిపోయింది. జంతు పందెములలో ఏనుగులను ఉపయోగించేవారు.”
నాగరికత తెచ్చిన కష్టాలు
గతంలో ఏనుగులు ఎన్నడు వేటకై చంపబడలేదు, కానీ పాశ్చాత్య నాగరికత—దానితో దాని వేటగాళ్లు వచ్చినప్పుడు—పరిస్థితులు మారిపోయాయి. మరి ఏనుగు వేటగాళ్ల సంగతేంటి? జే. ఎమర్‌సన్ టెన్నట్ రాసిన స్కెట్చెస్ ఆఫ్ ది నాచురల్ హిస్టరీ ఆఫ్ సిలోన్ పుస్తకం ఇలా తెలిపింది: “ఒక అధికారి, మేజర్ రోజర్స్ 1,400 ఏనుగులను చంపాడు; మరొకరు, గల్‌వా అనే కాప్టన్‌కు, అందులో సగం కంటే ఎక్కువ చంపిన ఘనత దక్కింది; కమీషనర్ మేజర్ స్కిన్నర్, రహదారి శాఖ, ఇంచుమించు ముందు చెప్పినన్ని చంపాడు; అంత ఆశ లేనివారు ఎక్కువ ఏనుగులను చంప లేదు.”
అంతేకాక, ఏనుగును చంపిన ప్రతిసారీ దాన్ని చంపిన వ్యక్తికి బహుమతిగా కొన్ని షిల్లింగుల డబ్బును వలస ప్రభుత్వము ఇచ్చేదని టెన్నట్ పేర్కొన్నాడు. ఈ ఏనుగులను మానవునికి హానికరమైనవిగా దృష్టించేవారు. కొన్ని సంవత్సరాల కాలంలో, ఈ పారితోషికం కొరకు 5,500 ఏనుగులను మట్టు పెట్టారు. టెన్నంట్ ఇలా ముగించాడు: “వీటి శవాలను ఎన్నడు ఉపయుక్త కారణాలకై వాడలేదు గానీ, కుళ్లి కృషించిన వాటిని, అడవి వాతావరణాన్ని కలుషితం చేయడానికి వదిలేసేవారు గనుక, సిలోను [ఇప్పటి శ్రీలంక] వేటగాళ్ళు చేసే యీ ఏనుగుల నిత్య హత్య, వట్టి నాశనకర పిచ్చి మనస్తత్వాన్ని సూచిస్తుంది.” శ్రీలంకలో ఏనుగు దంతంనకు సమస్యే లేదు. కారణం, “సిలోనులో, వందలో కనీసం ఒక్క ఏనుగుకైనా దంతములు వుండేవి కావు, వాటిని కల్గియున్న కొన్ని మగవే.”
వలస పరిపాలన ప్రారంభంలో మరియు దాని కాలంలో ఏనుగుల గొప్ప సంఖ్య తరగటానికి గల కారణాన్ని ఏషియావీక్ ఇలా పునరుద్ఘాటించింది: “రాజ శాసనం వలన ఏ మాత్రం రక్షింపబడని తమ అడవి సంరక్షణను, టీ చెట్లు నాటడానికై నిర్మూలించారు. ఈ ద్వీపంలో 1,800 సంవత్సరం నాటికి దాదాపు 50,000 ఏనుగులుండేవి. 1,900 సంవత్సరంలో 12,000 ఉండేవి. ఈ రోజున అంటే, 50 ఏళ్ళ కఠిన సంరక్షణా చట్టం తరువాత కూడ వాటి జనాబా 3,000 కన్నా తక్కువే.” దంతాలున్న ఏనుగుల నిష్పత్తి 100కి 1 కాకుండా 20కి 1 వేసుకున్నా, ఏనుగు దంతమే వాటి హత్యకు ప్రముఖ కారణం అని ఏషియావీక్ వెల్లడి చేస్తుంది. తరువాత శ్రీలంక ఏనుగుల వినాశనానికి గల అసలు కారణాన్ని ఉదహరించింది: “అసలు హాని మానవుని కనికరము లేని భూవాంఛే. క్రమక్రమంగా తమ ప్రకృతి నివాసము చుట్టూ భూసేద్యం జరిగించే కొలది, శ్రీలంక ఏనుగులు అంతరించిపోనైయున్నవి.”
యాలా జాతీయ పార్కు
శ్రీలంక వైల్డ్‌లైఫ్ అండ్ నేచర్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు డా. రంజెన్ ఫెర్నాండో అవేక్! తో ఇలా అన్నారు: “ముఖ్యంగా మా సంస్థ కృషి వల్ల వేటను అరికట్టడానికై, 1898లో ప్రప్రథమ వన్యప్రాణుల సంరక్షణా ప్రదేశము యాలలో స్థాపించబడింది. పందొమ్మిది వందల ముప్పైఎనిమిదిలో యాల మా మొదటి జాతీయ పార్కు అయ్యింది, తరువాత ఇతర పార్కులు చేర్చబడినవి. ఈ పార్కులను జాతీయ నిధిగా మేము దృష్టిస్తాము, మరియు అవి మా అమూల్య వన్యప్రాణులకు ఎల్లప్పుడు రక్షణనివ్వాలని మేము కోరుకుంటున్నాము.”
మేము యాల జాతీయ పార్కును సందర్శించే కార్యక్రమం వేసుకున్నాం, ఫెర్నాండో సూచనే మా ఆసక్తిని మరింత పెంచింది. పిన్నవెలా ఏనుగుల అనాధాశరణాలయపు అటెండెంట్లు మాకు చేసిన ఉపకారములకు, మర్యాదలకు మేము వారికి కృతజ్ఞతలు తెలిపి, ఇంకా మైయ ఓయాలో స్నానం చేస్తున్న అనాధలు, పెద్దవైన ఏనుగులకు వీడ్కోలు అన్నట్లుగా చేతులూపి (అవి గమనించాయో లేదో నాకు తెలియదు గాని), యాల జాతీయ పార్కుకు ప్రయాణమయ్యాము.
అక్కడ మేము సముద్రపు ఒడ్డునున్న బంగళాలో మూడు రాత్రులు గడిపాము. ఒక గైడు మమ్మల్ని కారులో జంతువులను చూపించటానికి తీసుకు వెళ్లాడు—కారులోనుండి దిగనివ్వరు. మేమక్కడ జింకలను, అడవి పందులను, ఎన్నో పెద్ద ఉడుములను, అందమైన పక్షులను చూశాము. ఒక నెమలి తన అద్భుతమైన పింఛమును విప్పి జతకై నాట్యము చేసింది, చెట్ల పైనుండి వ్రేలాడుతున్న బంగారు పిచ్చుకగూళ్లు, చారల కొంగ అద్భుతమైన సౌందర్యం మాకు గాఢానుభూతిని కలుగజేసింది. చిరుత పులులున్నప్పటికినీ వాటిని చూడలేదని నిరాశ చెందాము. అయితే, మా పాత స్నేహితులైన ఏషియా ఏనుగుల గుంపుల నెన్నింటినో చూసాము. అవి శాంతియుతంగా, సంరక్షించబడిన తమ ఉద్యాన ప్రాంతంలో తృప్తి నొందుతున్నట్లు కనిపించినవి.
ఏనుగుకి నిజంగా చాలా స్థలం కావాలి. మరి ఈ మానవ జనాబా పెరుగుదల, తరిగిపోతున్న సేద్యభూమికై గల అవసరతను నొక్కితెల్పుతున్నది. ఏనుగుల జీవనమునకైన ప్రభుత్వ ప్రతిబద్ధత ఎంతమట్టుకు నిలకడగా వుంటుందోనన్న విషయంపై సంరక్షకులు తమ భయాందోళనను వ్యక్త పరుస్తున్నారు. కేవలం సమయమే వీటి ఫలితాలను వెల్లడించగలదు.—అవేక్! ప్రతినిధి (g92 11/22)
[17వ పేజీలోని చిత్రాలు]
స్నానం చేసే సమయంలో ఏనుగులు నీటిలోనికి దిగడానికి బలవంత పెట్టబడతాయి, ఇక్కడ అవి తమ తొండములను గాలిగొట్టాలుగా ఉపయోగిస్తాయి
[18,19వ పేజీలోని చిత్రాలు]
అడవిలో అనాధలైన గున్న ఏనుగులు ఇక్కడ పిన్నావెలాలో పెంచి పెద్ద చేయబడతాయి