యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేనెప్పుడు ఏదిచేసినా ఎందుకు బాగుండదు?
“నేను నా తండ్రికి సహాయం చేయుట మొదలు పెట్టినపుడు, ఆయనకు నచ్చేటట్లు పని చేయడం చాలా కష్టంగా ఉండేది. నా వయసు కేవలం 15 సంవత్సరాలే, కాని పని మాత్రం చాలా క్లిష్టమైనది; నేనేదైనా పొరపాటు చేస్తే అయన విమర్శించేవాడు.”—రాండి.
“నా తల్లి ఎప్పుడు నా అపజయాలనే వెదుకుతూ—ఒక పోలిస్ డిటెక్టివ్‌లా అనిపించేది. నేను నా పనులు ముగించే ముందే తాను వచ్చి నా తప్పులు పట్టడానికే నా పనిని పరిశీలించేది.”—క్రెయిగ్.
“నా తలిదండ్రులు ఎప్పుడు నాకు ఏదో ఒకదాన్ని గురించి ఉపదేశించే వారు. నేను నా జీవితాన్ని క్రమబద్ధం చేసుకోలేనని వారనేవారు. పాఠశాల, ఇల్లు, క్రైస్తవ సంఘం—వీటి గురించి విరామం లేకుండా ఉపదేశించేవారు”.—జేమ్స్.
నీవు చేసేదేది కూడా నీ తలిదండ్రులను మెప్పించేంత మంచిదిగా ఉండదని కొన్నిసార్లు నీకనిపిస్తుందా? నీ ప్రతి కదలిక మైక్రొస్కోప్ క్రింద తనిఖీ చేయబడుతున్నట్లు, నీవు ఎప్పుడు గమనించబడుతున్నట్లు, ఎడతెగక విమర్శింపబడుతున్నట్లు, ఎన్నడు ముగియని పరిశీలన క్రింద ఉన్నట్లు నీకెప్పుడైనా అనిపించిందా? అట్లయితే, నీవు నీ తల్లిదండ్రుల అనంగీకారపు మేఘం క్రింద జీవిస్తున్నట్లు నీవు భావిస్తుండవచ్చును.
నీ పరిస్థితి వింతైనదేమి కాదు. డా. జాయిసీ ఎల్. వెడ్‌రల్ ఇలా వ్యాఖ్యానించింది: “అనేక మంది యౌవనులు చెప్పినట్లు, ప్రతిదానికి తలిదండ్రులు విసిగిస్తారు. . . . నీ గది శుభ్రంగా ఉంచడం నుండి చెత్తపడవేయడం వరకు, బాత్‌రూమ్ ఉపయోగించడం నుండి నీవు దుస్తులు ధరించు విధానం వరకు, నీ స్నేహితుల ఎంపిక నుండి నీ స్కూల్ మార్కులు మరియు హోమ్‌వర్క్ వరకు అన్ని విషయాలకు సణుగుతూనే ఉంటారు.” ఇది నీకు విసుగు కలిగించవచ్చు, కాని అదంత చెడ్డ విషయమేమికాదు. తలిదండ్రులు తమ పిల్లలను సవరించి, క్రమశిక్షణ ఇవ్వడం చాలా సహజం; వారి ఎడల తమ ప్రేమ చూపించడానికి అదొక మార్గం. బైబిలు చెప్పుచున్న రీతిగా, తండ్రి “తనకు ఇష్టుడైన కుమారుని గద్దించును.”—సామెతలు 3:12.
ఒకవేళ నీ తలిదండ్రులనుండి నీవు ఎప్పుడు ఏ సవరణ పొందకుంటే, అసలు వారు నీ ఎడల శ్రద్ధను కలిగియున్నారా లేదాయని నీవు ఆశ్చర్యపోవా? (కీర్తనలుసామెతలు13:24; హెబ్రీయులు 12:8 పోల్చుము.) కాబట్టి, నిన్ను సవరించేంత శ్రద్ధగల తలిదండ్రులను కలిగియున్నందుకు, నీవు కృతజ్ఞత కలిగి యుండవచ్చు. ఎంతైనా నీవు, యౌవనప్రాయంలో ఉన్నావు, ఇతరుల కన్నా అనుభవం తక్కువే. సవరణ కొన్నిసార్లు ఆవశ్యం కావచ్చు. ఉపదేశం లేకుండా, నీవు “యౌవనేచ్ఛల” వలన సులువుగా జయింపబడగలవు.—2 తిమోతి 2:22.
ఆ కోరికలు యౌవనులకు తీసుకొచ్చే కొన్ని సమస్యలను గమనించుము. రచయిత క్లాటెన్ బార్బ్ ఇలా చెప్తున్నాడు “ఈ లోకం యౌవనులకు ప్రమాదకరమైనది; ప్రతి గంటకు ఒక యౌవనస్థుడు వాహనాల ప్రమాదంలో మరణిస్తున్నాడు; ప్రతి ఏటా సుమారు పన్నెండు వేల యౌవనస్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు; ప్రతి సంవత్సరం పదిలక్షల మంది యువతులు గర్భం ధరిస్తున్నారు; నేడు ముప్పై లక్షల మంది చిన్న పిల్లలు త్రాగుబోతులయ్యారు; లైంగిక సంపర్క వ్యాధులు విస్తృతమయ్యాయి.” (హౌ టు రైజ్ పేరెంట్స్) నీ తలిదండ్రులు బహుశా నిన్ను అస్తమానం సవరించడంలో ఆశ్చర్యమేమి లేదు! బైబిలు చెప్పుచున్నట్లు, “జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును . . . మూర్ఖులు జ్ఞానమును తిరస్కరించుదురు.”—సామెతలు 1:5, 7; సామెతలు 10:17 పోల్చుము.
అదెందుకు బాధకలిగిస్తుంది
మరియు “ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు.” (హెబ్రీయులు 12:11) నీవు యౌవనప్రాయంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నీకలా అనిపించ వచ్చు. ఎంతైనా నీ వ్యక్తిత్వం ఇంకా వికసించలేదు; నీవు ఇంకా పెరుగుతూ నీవెవరో తెలుసుకుంటున్నావు. కాబట్టి విమర్శ అనేది—జాగ్రత్తగా ఆలోచించి, మృదువైనరీతిలో చేయబడినప్పటికి—అవమానపు తలంపును రేపగలదు. హౌ టు సర్‌వైవ్ యువర్ అడోలసెంట్స్ అడోలసెన్స్ అను పుస్తకం “యౌవనస్థులు విమర్శకు అతి సున్నితంగా ప్రతిస్పందిస్తారు” అని చెప్తుంది. ఒక యౌవనుడు “విమర్శ నాకు బాధ కలిగిస్తుంది” అని చెప్తున్నాడు.
కాని నీ తలిదండ్రులే నిన్ను విమర్శిస్తూ వుంటే, నీకు బాధ చాలా ఎక్కువగా ఉండవచ్చు. హెల్పింగ్ యువర్ టీనేజర్ డీల్ విత్ స్ట్రెస్, అను తన పుస్తకంలో డా. బెట్టి యెన్స్ “ఇతరుల అంగీకారం లేదా అనంగీకారం ద్వారానే ఒక యౌవనుడు తన యోగ్యతను మరియు మనిషిగా తన విలువను గూర్చిన అభిప్రాయాన్ని పెంపొందించుకుంటాడని” మనకు జ్ఞాపకం చేస్తుంది. యౌవనులు తమ్మును గూర్చిన అభిప్రాయాన్ని ఏర్పరచుకొను ఈ ప్రక్రియలో తలిదండ్రులే అతి గొప్ప మూలకారకులు. కావున తలిదండ్రులు నిన్ను సవరించినపుడు లేక నీ పని విధానాన్ని గురించి ఫిర్యాదు చేసినప్పుడు అది నిన్ను కృంగదీయవచ్చు, నొప్పించవచ్చును.
అయిననూ, నీవు చేసేది ఎన్నడు కూడా బాగుండదని నీవు అనుకోవాలా? లేక నీ తలిదండ్రులు నీలోని కొన్ని తప్పులను ఎత్తిచూపించినందుకు నీవు పూర్తిగా పనికిరావనే నిర్ణయానికి రావాలా? నిజానికి, మానవులందరు పరిపూర్ణత కొరవడియున్నారనుట విచారకరం. (రోమీయులు 3:23) పొరపాట్లు చేయడం, నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగం. (యోబు 6:24 పోల్చుము.) సమస్యేమంటే, నీవు ఏదైనా సరిగ్గా చేస్తే నీ తలిదండ్రులు నీకు చెప్పడానికి వారికేమి ఉండదు—కాని నీవు తప్పిదం చేసినప్పుడు వారు గద్దిస్తారు. అది బాధ కలిగిస్తుంది, కాని దాని అర్థం నీవు పూర్తిగా పనికిరావని మాత్రం కాదు. సహేతుకమైన విమర్శను అంగీకరించడానికి నేర్చుకొనుము, దాన్ని చిన్నబుచ్చవద్దు, దాన్ని అధిగమించనీయవద్దు.—హెబ్రీయులు 12:5 పోల్చుము.
అన్యాయపు విమర్శ
ఒకవేళ విమర్శ అన్యాయమైనదైతే అప్పుడేమిటి? కొందరు తలిదండ్రులు తమ పిల్లల ఎదుట అర్థవిహీనమైన ఉన్నత ప్రమాణాలను ఉంచుతారు. వారు అల్పమైన విషయాలలో తమ పిల్లలపై అస్తమానం సణుగుతూ వుంటారు. తమ ఫిర్యాదులకు సరైన కారణాలు గల తలిదండ్రులు కఠినంగా నిందిస్తూ విమర్శించవచ్చు. తలిదండ్రులు “పిల్లలకు అవమానకరమైన పేర్లు పెట్టి పిలవడం, ఉపదేశాలివ్వడం, ఎత్తిపొడవడం, అవమానించడం, నిందించడం, మరియు బెదిరించడం” వంటివి “పిల్లల ఆత్మస్థైర్యాన్ని మరియు యోగ్యతను దెబ్బతీయు, . . . నాశనకరమైన సంభాషణా మాదిరులు” అని కూడా డా. బెట్టి యెన్స్ చెప్తుంది.
నీతిమంతుడైన యోబు అన్యాయంగా తీవ్రమైన విమర్శకు గురియైనపుడు: “ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?” అని ఎలుగెత్తి ఏడ్చాడు. (యోబు 19:2) అదే విధంగా, తలిదండ్రులచేత తదేకంగా కించపరచ బడడం లేక వాస్తవం కాని ఉన్నత ప్రమాణాలతో పోల్చబడడం ఒక యౌవనుని ఉద్రేకపరచి, అతని “మనస్సు క్రుంగ” దీయగలదు. (కొలొస్సయులు 3:21) కాత్‌లెన్ మెకాయ్ వ్రాసిన కోపింగ్ విత్ టీనేజ్ డిప్రెశన్స్ అను పుస్తకం “తలిదండ్రుల తలంపులకు ఎదగలేక పోవడం వల్ల యౌవనులలో ఆత్మగౌరవం విశేషంగా తగ్గి నిరుత్సాహంతో కూడిన ప్రతికూల ధోరణి మొదలవుతుంది”, అని చెప్పుచున్నది.
వాస్తవానికి, అటువంటి అయుక్తమైన విమర్శవలన తరచు ఒక విషవలయం ఏర్పడుతుంది. నీ తలిదండ్రులు నీ తప్పులు ఎత్తి చూపిస్తారు. నీవు నీ గురించి వ్యాకులపడతావు, నీవు నీ గురించి వ్యాకులపడుతూ ఉంటావు కాబట్టి, నీ తలిదండ్రులు నిన్ను ఏపనైనా చేయమన్నప్పుడు నీవు సరిగా చేయలేవు. ఫలితం? ఇంకా ఎక్కువ విమర్శకు గురౌతావు!
విమర్శ వెనుక
ఈ నాశనకరమైన వలయాన్ని నీవెలా ఆపగలవు? మొదట, నీ తలిదండ్రులు అలా ఎందుకు భావిస్తున్నారో అర్థం చేసుకొనడానికి ప్రయత్నించండి. వారి సణుగుడు లేక అస్తమానం విమర్శించడం నిజంగా ద్వేషపూరితమైనదా? అలా కాకపోవచ్చును. డా. జాయిసీ ఎస్. వెడ్‌రల్ ఇలా అడుగుతున్నారు: “వాళ్లెందుకు సణుగుతున్నారు? ఎవరూ వినడం లేదు, లేక కనీసం వాళ్లున్నారని కూడా ఎవ్వరూ పట్టించుకొనక పోవడం వల్లనే వారలా సణుగుతున్నారు. వారు ఎంతగా ఉపేక్షించబడితే, అంత ఎక్కువ వారు సణుగుతారు.” వారి ఫిర్యాదులకు ప్రతిస్పందిస్తున్నావని నీవు నిజంగా నీ తలిదండ్రులకు చూపిస్తున్నావా? లేక వారి మాటలను పట్టించుకోవడంలేదా? అట్లయితే, తప్పులు పట్టడం మరీ తరచుగా—మరియు తీవ్రంగా ఉంటే ఆశ్చర్యపోవద్దు! నీవు సామెతలు 19:20 లోని మాటలను అన్వయించుకొంటే అది ఆగునా? ఆ వచనం ఇలా చెబుతుంది: “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.”
కొన్ని సార్లు తలిదండ్రులు నీ తప్పువల్లకాక, కేవలం అతను లేక ఆమె మంచి మానసికావస్థలో లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా విమర్శించవచ్చు. నీ తల్లి ఈ రోజు ఉద్యోగస్థలంలో కష్టపడవలసి వచ్చిందా? అందుచేత ఆమె నీ గది శుభ్రంగా లేకపోవడం చూచి నిన్ను క్రితంకన్నా ఎక్కువగా ఎత్తి పొడవవచ్చు. నీ తండ్రి క్షీణిస్తున్న ఇంటి ఆర్థిక పరిస్థితి గురించి కోపంగా నిస్సహాయంగా ఉన్నాడా? ఆయన గమనించుకోకుండా అనాలోచితంగా “కత్తిపోటు వంటి మాటలు” మాట్లాడవచ్చు. (సామెతలు 12:18) నిజమే, ఇది అన్యాయం. కాని, “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.” (యాకోబు 3:2) కాబట్టి అమ్మ లేక నాన్న ఉద్రిక్తంగా లేక విసుగ్గా ఉంటే, జాగ్రత్తగా ప్రవర్తించడానికి ప్రయత్నించి విమర్శను అధికం చేయకుండ తప్పించుకోవడమే తెలివైన పని.
అసంపూర్ణ మానవులుగా, తల్లిదండ్రులు కూడా సరితూగలేమనే భావనలతో వేధించబడవచ్చు. నీవు ఏదైనా చేయలేకపోతే తామే విఫలమైపోయారన్న భావన వాళ్లకు రావచ్చు! డా. వెడ్‌రల్ ఇలా వివరిస్తున్నారు: “నీవు తక్కువ మార్కుల రిపోర్ట్‌కార్డ్ ఇంటికి తీసుకొని వస్తే, అపుడు మీ నాన్న నీతో ‘ఏంటి, నీకు బుద్ధిలేదా? నాకు మూర్ఖుడైన కొడుకు ఉన్నాడు,’ అని అనవచ్చు. నీ తండ్రి ఉద్దేశం నీవు మూర్ఖుడవని కాదు. నిజానికి ‘నిన్ను చదువుటకు పురికొల్పుటలో నేను నా బాధ్యతను సరిగ్గా నిర్వహించుట లేదనేదే నా బాధ.’ అని ఆయన అంటున్నాడు.”
అటువంటి భయాలే వాస్తవం కాని ఉన్నత ప్రమాణాలు ఉంచడానికి తలిదండ్రులను నడుపుతాయి. జెసన్ అనే యౌవనుడు ఇలా విలపించాడు: “నేను దేనిని ఎన్నడు చక్కగా చేయలేదు. నేను ఇంటి చుట్టున్న ప్రాంతంలోని ఆకులు తీసేసినతరువాత నేనెందుకు చెత్తపడవేయలేదో మా నాన్నకు కారణం కావాలి. నాకు ‘ఎ’ కన్నా కొంచం తక్కువ గ్రేడ్ వస్తే మరి ‘ఎ’ ఎందుకు రాలేదు అని నా తలిదండ్రులు అడిగి, నేను పనికిరానని వాళ్లు అంటారు.” కాని పాఠశాల సలహాదారుడు జెసన్ తలిదండ్రులతో మాట్లాడి, ఈ విషయం గుర్తించాడు: “వారి ఆర్థిక పరిస్థితి, వారి ఉద్యోగముల ఎంపిక విషయంలో వారికున్న అసంతృప్తిని గూర్చిన భావాలు, వారి కుమారుని విషయంలో వారు కల్గియున్న అపరిమిత ఆశయాలలో ప్రతిబింబించాయి.”—కోపింగ్ విత్ టీనెజ్ డిప్రెశన్.
నీ ఇంట్లో పరిస్థితి ఎలా వున్ననూ, నీ తలిదండ్రులు కొన్నిసార్లు ఎందుకు విమర్శనాత్మకంగా ఉంటారు, అనే విషయాన్ని నీవు ఒకవేళ గుణగ్రహించవచ్చు. కాని ఇలా తలిదండ్రులు తప్పుపట్టే విషయాన్ని ఎదుర్కొనగల కొన్ని మార్గాలేమిటి? వారి విమర్శల ద్వారా లాభం పొంద గల మార్గాలేమైనా ఉన్నవా? ఈ ప్రశ్నలు తదుపరి సంచికలో చర్చించబడును. (g92 11⁄22)
[11వ పేజీలోని చిత్రం]
నీ పని విధానాన్ని గురించి తలిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అది కృంగ దీసేదిగా ఉండవచ్చును