కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 3/8 పేజీలు 4-7
  • పిల్లలెదుర్కొంటున్న సంక్షోభం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పిల్లలెదుర్కొంటున్న సంక్షోభం
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వ్యాధి
  • పోషకాహార లోపం
  • పర్యావరణ సమస్య
  • యుద్ధము
  • పిల్లలను మోసగించుట
  • ప్రాధాన్యతలు
  • మానవుల బాధలు ఒక పెద్ద వివాదాంశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • పిల్లల శ్రమతో
    తేజరిల్లు!—1999
  • ప్రపంచ ఆరోగ్య పరిస్థితి—పెరుగుతున్న అగాధం
    తేజరిల్లు!—1995
  • మీ ఆహారం ఎంత పౌష్టికమైనది?
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 3/8 పేజీలు 4-7

పిల్లలెదుర్కొంటున్న సంక్షోభం

భారతదేశమందు ఒక రాళ్లగనిలో 12 ఏళ్ల బాలుడు రోజుకు 11 గంటలు రాళ్లు పగుల గొడుతూ శ్రమిస్తాడు. అతను రోజుకు 85 (యు.ఎస్‌) సెంట్లు సంపాదిస్తాడు.

పదేళ్ల బాలిక బ్యాంకాక్‌లోని వ్యభిచార గృహములో తన శరీరాన్ని అమ్ముకొంటోంది. తాను కావాలనే అక్కడ ఉండటంలేదు కాని ఆమె తండ్రి 400 డాలర్లకు ఆమెను అమ్మివేశాడు.

ఆఫ్రికా దేశంలో పదేళ్ల బాలుడు రోడ్డుతనికీచౌక్‌ వద్ద పనిచేస్తాడు. అతని భుజానికి మరతుపాకి వ్రేలాడుతూ ఉంటుంది; తీరిక సమయంలో అతను మారివానా త్రాగుతుంటాడు.

ఇటువంటి పరిస్థితులు అభివృద్ధిచెందుతున్న దేశాలలో సర్వసామాన్యం. సంక్షోభాలెదుర్కొంటున్న పిల్లల సంఖ్య లక్షలకెదుగుతోంది. డెబ్భై లక్షలమంది శరణార్థ పునరావాస శిబిరాలలో మగ్గుతున్నారు; మూడుకోట్ల మంది పిల్లలు నిలువనీడ లేక వీధుల్లో ఊరకే తిరుగుతున్నారు; 10 నుండి 14 ఏళ్ల మధ్య ఉన్న ఎనిమిది కోట్లమంది పిల్లలు తమ సామాన్య పెరుగుదలను స్తంభింపజేసే పనులయందు కష్టించుచున్నారు; ఈ దశాబ్దంలో పదికోట్ల కంటే ఎక్కువ పిల్లలు తిండి, శుభ్రమైన నీరు, ఆరోగ్యసంరక్షణ లేకపోవడంవల్ల మరణిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలలో కేవలం కొన్నింటిని పరిశీలించుము.

వ్యాధి

పొంగు మరియు కోరింత దగ్గు వంటి వ్యాధులు సోకకుండా టీకాలు వేయనందు వల్ల ప్రతి రోజు 8,000 మంది పిల్లలు మరణిస్తున్నారు. అతిసార వ్యాధి వల్ల వచ్చే నిర్జలతను ఎలా ఎదుర్కొనాలో వారి తలిదండ్రులకు తెలియకపోవడం వల్ల అదనంగా డెబ్బై వేలమంది పిల్లలు మరణిస్తున్నారు. శ్వాసక్రియ సంబంధ అంటు వ్యాధులు సోకకుండా ఉండుటకు కేవలం ఒక డాలర్‌ మాత్రమే ఖరీదు చేసే వ్యాధినిరోధక మందులు వారికి ఇవ్వనందు వల్ల ప్రతి రోజు ఇంకో 7,000 మంది పిల్లలు మరణిస్తున్నారు.

మానవ జాతిని చాలా కాలంగా పీడిస్తున్న అనారోగ్యాలను నివారించు లేక నయం చేయు మందులు మరియు చికిత్సలు అనేక సంవత్సరాలుగా లభించుచున్నవి. కాని వాటి అవసరమున్న లక్షలాది మంది వద్దకు అవి చేరలేదు. దాని ఫలితంగా, గడచిన రెండు దశాబ్దాలలో, కేవలం అతిసారవ్యాధి మరియు శ్వాసక్రియ సంబంధ వ్యాధులవల్లనే ఇంచుమించు పది కోట్లమంది పిల్లలు మరణించారు. “కేన్సర్‌కు నివారణ కనుగొని కూడా దానిని 20 సంవత్సరాల వరకు సరిగ్గావాడకుండా ఉన్నట్లే ఇది కూడా ఉంది,” అని యూనిసెఫ్‌ యొక్క స్టేట్‌ ఆఫ్‌ ది వర్ల్‌డ్స్‌ చిల్డ్రన్‌ 1990 విచారాన్ని వ్యక్తం చేసింది.

అటువంటి కఠోర పరిస్థితి ఉన్నప్పటికి, అభివృద్ధి సాధించడం జరిగింది. ఉదాహరణకు, ఐ.రా.స. అంతర్జాతీయ బాలల అత్యవసరనిధి మరియు ప్రపంచ ఆరోగ్యసంస్థ వ్యాధినిరోధక టీకాల వాడుక యొక్క ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. టీకాలతో నయం చేయగల తట్టు, ధనుర్వాతం, డిఫ్తీరియా, పోలియో, క్షయ మరియు కోరింత దగ్గు—ఈ ఆరు వ్యాధులు సోకకుండా ప్రపంచంలోని 80 శాతం పిల్లలను నిరోధించామని 1991లో ప్రకటించారు. అతిసార సంబంధ వ్యాధులను నిరోధించడానికి సమాంతర ప్రయత్నాలు జరిగాయి, దీని వల్ల ప్రతి ఏటా కొన్ని లక్షల పసిప్రాణాలు రక్షించబడుతున్నాయి.

కాని, ఇటీవలి సంవత్సరాలలో ఇంకొక వ్యాధి అనగా ఎయిడ్స్‌—ఆఫ్రికానందలి పిల్లలను సంరక్షించుటలో గత దశాబ్ద మందు సాధించిన ప్రగతిని తలక్రిందులుచేసి భయంకరంగా ప్రబలింది. ఈ 90వ దశాబ్దంలో కేవలం ఆఫ్రికాలో మాత్రమే ఎయిడ్స్‌ వల్ల 27 లక్షలమంది యౌవనులు చనిపోవచ్చును. తల్లిదండ్రులు ఎయిడ్స్‌ వల్ల చనిపోయారు గనుక 2,000 సంవత్సరంనాటికి, మధ్య మరియు తూర్పు ఆఫ్రికాలలోని 30 నుండి 50 లక్షలమంది పిల్లలు అనాధలు కావచ్చును.

పోషకాహార లోపం

ఆకలితో మాడిపోతు అస్తిపంజరాలవంటి శరీరాలు, లోతుకు పీక్కుపోయిన కడుపులు, మరియు శూన్యంలోకి దిగాలుగా చూస్తున్న కళ్లుగల పిల్లల విషాద చిత్రాలను ఎంతో బాధతో అందరం చూస్తాము. ఆ దయనీయమైన స్థితిలోనున్న పిల్లలు పోషకాహారలోపం యొక్క సమస్యను అతిస్వల్పంగా మాత్రమే సూచిస్తున్నారు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో ఇంచుమించు 17.7 కోట్లమంది పిల్లలు—ప్రతి ముగ్గురిలో ఒకరు—ఆకలితోనే నిద్రపోతారు. వారి సంఖ్య ఇంకా పెరుగుతోంది.

నిరంతర పోషకాహారలోపం వల్ల పిల్లలు పూర్తి మానసిక మరియు శారీరక సామర్థ్యానికి ఎదగలేక పోతున్నారు. పోషకాహారం ఇవ్వబడని చాలా మంది పిల్లలు దుర్భలంగా, నిర్జీవంగా, కాంతి విహీన కళ్లతో ఉదాసీనంగా ఉంటారు. వాళ్లు మంచి ఆహారం తీసుకున్న పిల్లలకంటే తక్కువ ఆడతారు మరియు నిదానంగా నేర్చుకుంటారు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో ప్రతి ఏటా 1.4 కోట్ల శిశుమరణాలలో మూడవ వంతు మరణాలకు కారణమైన అంటురోగాలు కూడా వాళ్లకి సులభంగా సోకుతాయి.

ఆధునిక విజ్ఞానం వ్యాధులతో పోరాడుటకు మందులను ఎట్లు ఉత్పత్తి చేసిందో, అట్లే అది భూమి పైనున్న వారందరికి సరిపడేంత ఆహారం ఉత్పత్తిచేసి అందించుట సాధ్యమయ్యెలా కూడా చేసింది. కాని పోషకాహారలోపానికి చురుకైన పరిష్కారాలు లేవు. అది విటమిన్‌ బిళ్లలు మరియు ఆహార పదార్థాల ఎగుమతుల వల్ల తీసివేయబడదు. నికృష్టమైన దారిద్ర్యం, విస్తృత అజ్ఞానం, అపరిశుభ్రమైన నీరు, అనారోగ్యకరమైన పరిస్థితులు, మరియు కరువు బాధిత ప్రాంతాలలో వ్యవసాయభూమి యొక్క కరువు వల్ల పోషకాహారలోపం కొనసాగుతుంది.

పర్యావరణ సమస్య

భౌగోళిక పర్యావరణ సంక్షోభం పెరిగిపోతుంటె, అందుకు పిల్లలే ఎక్కువ బలైపోతున్నారు. గాలి కాలుష్యాన్ని గమనించండి. నిద్రిస్తున్న మూడేళ్ల లోపు పిల్లలు, నిద్రిస్తున్న పెద్దవాళ్లకంటె ఇంచుమించు రెండింతలు గాలిని దానితో పాటు రెండింతలు కాలుష్యాన్ని శ్వాసిస్తారు. పిల్లల మూత్ర పిండాలు, కాలేయం, మరియు ఎన్‌జైమ్‌ వ్యవస్థ ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదు కాబట్టి పెద్దవాళ్లు తాళుకొనేంత సమర్థవంతంగా వారు కాలుష్యాన్ని తాళుకొనలేరు.

కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రిక్‌ ఆసిడ్‌, సల్ఫర్‌ డైఆక్సైడ్‌ మరియు పెట్రోలులో కలిసి ఉన్న సీసం వల్ల పెద్దవాళ్లకన్నా పిల్లలకే ఎక్కువ హాని కలుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతి ఏటా 42లక్షల కంటే ఎక్కువ మంది ఐదేళ్లలోపు పిల్లలు శ్వాసక్రియ సంబంధ అంటు వ్యాధులతో మరణించుటకు ఈ ప్రమాదం సూటిగా కారణమగుచున్నది. మరణాన్ని తప్పించుకున్న చాలా మంది పిల్లలు శ్వాసక్రియ సంబంధ వ్యాధులతోనే పెరిగిపెద్దవారై జీవితాంతం దానిచేత పీడింపబడతారు.

వారింకా శారీరకంగా పెరుగుతున్నారు కాబట్టి, పెద్దవాళ్లకన్నా పిల్లలే చాలీచాలని ఆహారం యొక్క ప్రమాదాలకు ఎక్కువ గురి అయ్యే స్థితిలో ఉన్నారు. ప్రతి దేశంలోను, అడవులు తగ్గుతూ, ఎడార్లు పెరుగుతూ, ఎక్కువగా ఉపయోగింపబడిన వ్యవసాయభూమి క్షీణించి, ఉత్పాదక శక్తి తగ్గి, ఆహారోత్పత్తి తగ్గుతూ ఉంటే పిల్లలే ప్రధానంగా నష్టపోతున్నారు.

ఈ సమస్యకు తోడు మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగం మంది పిల్లలకే శుభ్రమైన త్రాగేనీరు లభిస్తుంది, ఇంకా కొద్ది మందికి మాత్రమే శుభ్రమైన మఱుగు దొడ్డి సౌకర్యం కలదు.

యుద్ధము

గతంలో యుద్ధమందు ఎక్కువగా సైనికులే బలయ్యేవారు. ఇప్పుడు అలా కాదు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకొని వేర్వేరు పోరాటాల్లో మరణించిన రెండు కోట్లు మరియు గాయాలుతగిలిన ఆరు కోట్ల మందిలో 80 శాతం సాధారణ పౌరులే—అందులో చాలా మట్టుకు స్త్రీలు మరియు పిల్లలే. ఒక దశలో 1980వ దశాబ్దమందు అటువంటి సంఘర్షణల ఫలితంగా ఆఫ్రికాలో ప్రతి గంటకు 25 మంది పిల్లలు మరణించారు! అసంఖ్యాకమైన పిల్లలు చంపబడ్డారు, గాయపడ్డారు, వదలి పెట్టబడ్డారు, అనాధలయ్యారు లేక నిర్బంధించబడ్డారు.

ఇప్పుడు శరణార్థ శిబిరాలలో పెరుగుతున్న లక్షలాది మంది పిల్లలకు గుర్తింపులేదు, జాతీయతలేదు, వీటితోపాటు వారికి తగినంత ఆహారం, ఆరోగ్య సంరక్షణ మరియు చదువు లేకుండా పోతుంది. చాలా మందికి సంఘంలో తమకొక స్థానాన్ని సంపాదించే నైపుణ్యాలను గడించడం అసాధ్యమైపోయింది.

కాని పిల్లలు కేవలం యుద్ధబాధితులే కాదు; వారు కూడా యుద్ధ యోధులే. ఇటీవలి సంవత్సరాలలో 15 సంవత్సరాల లోపు వయస్సుగల 2,00,000 మంది పిల్లలు సైన్యంలో చేర్చుకొనబడి, ఆయుధాలను ధరింప జేసి, చంపుట నేర్పించబడుచున్నారు. వాళ్లలో మందుపాతరలు ఉన్న ప్రదేశాలలో బాటలు ఏర్పరచాలనే ఉత్తర్వులకు లోబడినందుకు తమ ప్రాణాలనో లేక అవయవాలనో కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు.

పిల్లలను మోసగించుట

అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలిదండ్రులు, ఆకలిని తీర్చుకొనుటకు లేక తమ అప్పులను చెల్లించుటకు, తమ పిల్లలను చాలా తక్కువ మొత్తానికి అమ్మేటందుకు దారిద్ర్యమే కారణం. ఆ పిల్లలకు ఏమి సంభవిస్తుంది? కొందరు వ్యభిచారం చేయుటకో లేక ప్రమాదకరమైన స్థలాలలో చమటోడ్చి పనిచేయుటకు బలవంతము చేయబడుతున్నారు. ఇతరులు, మధ్యవర్తులచేతనో లేక పాశ్చాత్య దేశాలలో ఉన్న దత్తత తీసికొను సంస్థల చేతనో 10,000 డాలర్ల వెలకు తిరిగి అమ్మివేయబడుతున్నారు.

పిల్లలతో వ్యభిచరించుట పెచ్చుపెరిగిపోతు, ఆడ మగ పిల్లలలో పసివారిని సహితం ఇందుకు ఉపయోగిస్తున్నట్లు సూచనలున్నవి. కేవలం బ్రెజిల్‌లోనే 5,00,000 వరకు యువతులు వ్యభిచారిణులుగా ఉన్నారని అంచనా వేయబడింది. పిల్లల అశ్లీల చిత్రాల ప్రదర్శన కూడా వృద్ధిచెందుతుంది మరియు సులభంగా లభ్యమయ్యే వీడియో ఉపకరణాలతో ఇది పెచ్చుపెరిగిపోతూ ఉంది.

ప్రాధాన్యతలు

ఈ గణాంక వివరాల వెనుకదాగియున్న బాద మరియు వేదన గ్రహించడం చాలా కష్టం. లక్షలు లేక వేలాది మంది ఎదుర్కొంటున్న యాతనను మనము గ్రహించలేక పోవుట దయనీయమైన విషయమే. కాని, కేవలం ఒక శిశువు—అందరిలా జీవించి వృద్ధిపొందగల సమాన హక్కు ఉన్న వ్యక్తియు, దేవునికి విలువైన ప్రాణము, తనదైన ప్రత్యేక వ్యక్తిత్వం గల ఒక వ్యక్తి—యాతనపడడం లేక మరణించడం చూడటం కూడా ఎంత ఘోరంగా ఉంటుందో మనలో చాలా మందికి తెలుసు.

ఈనాడు పిల్లల పరిస్థితి ఇలా ఎందుకుందనే అప్రీతికరమైన ప్రశ్నలను గమనించుటకు ఎక్కువ సమయమును వెచ్చించకుండానే, పిల్లల శిఖరాగ్ర సమావేశం యొక్క ప్రతినిధులు వారి భవిష్యత్తు గురించి ధైర్యంగా మాట్లాడి ఈ పరిస్థితిని ఇకపై ఎంతమాత్రం సహించేదిలేదని ప్రమాణం చేశారు. వారి “కార్యక్రమ పధకంలో” ఇతర విషయాలతో పాటు, 2,000 సంవత్సరంకల్లా ఈ క్రింది లక్ష్యాలను సాధించుటకు తీర్మానించారు:

▫ గత 1990వ సంవత్సరంలో మరణించిన ఐదేళ్ల లోపు పిల్లల మరణాల సంఖ్య మూడోవంతు తగ్గించుట.

▫ గత 1990లో ఉండిన ఐదేళ్ల లోపు పిల్లల తీవ్రమైన మరియు పరిమిత పోషకాహారలోపం యొక్క సంఖ్యను సగానికి తగ్గించుట.

▫ ప్రపంచ వ్యాప్తంగా అందరికి పరిశుభ్రమైన త్రాగేనీరు మరియు శుభ్రమైన పారిశుద్ధ్య సౌకర్యం లభించునట్లు చేయుట.

▫ ప్రత్యేకంగా క్లిష్ట పరిస్థితులలో ఉన్నవారిని, ప్రాముఖ్యంగా ఆయుధ పోరాటాలలో ఉన్న పిల్లలను కాపాడుట.

ఈ 1990 దశాబ్దంలో 5 కోట్లమంది శిశు మరణాలను నిరోధించగల లక్ష్యసాధన కార్యక్రమాలకు అదనంగా ప్రతి సంవత్సరం 250 కోట్ల డాలర్లు ఖర్చవుతాయని అంచనావేయబడింది.

ప్రపంచ ప్రమాణాలతో చూస్తే అది పెద్దమొత్తమేమీ కాదు. అమెరికా దేశపు సంస్థలు సిగరెట్‌ వ్యాపార ప్రకటనకై ఒక సంవత్సరానికే 250 కోట్ల డాలర్లు ఖర్చుపెడుతున్నాయి. సైన్యం కొరకు ప్రపంచం రోజుకు 250 కోట్ల డాలర్లు ఖర్చుపెడుతుంది.

ఐక్యరాజ్యసమితి ఎంత తక్కువ అంచనావేసినప్పటికి దానిప్రకారం ఇప్పుడు సైనిక వ్యయం సంవత్సరానికి ఒక లక్ష కోట్ల డాలర్ల కన్నా ఎక్కువగా మానవులలో సగంమంది అత్యంత బీదవారి సమిష్టి వార్షిక ఆదాయాన్ని అధిగమించుచున్నది. శిఖరాగ్ర సమావేశ ధ్యేయాలను వేగంగా నెరవేర్చుటకు ఈ వ్యయంలో కేవలం 5 శాతం ఇటు మరల్చితే సరిపోతుంది. ఉదాహరణకు, ఎఫ్‌/ఏ-18 జెట్‌ యుద్ధ విమానం ఖరీదు అంటే మరణాంతక రోగాలనుండి నలభై కోట్ల మంది పిల్లలను కాపాడగలిగే, వ్యాధి నిరోధక మందుల ఖరీదుకు సమానం.

శిఖరాగ్ర సమావేశంలో ప్రస్తావించబడిన ఆశించదగు లక్ష్యాలను నెరవేర్చే సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు కలిగియున్నవి. వాటికి జ్ఞానం, సాంకేతిక విజ్ఞానం, మరియు డబ్బు ఉన్నది. అయితే వారు చేస్తారా?, అన్నదే శేషప్రశ్న. (g92 12/8)

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

కుపోషణను అధిగమించుటకు

తలిదండ్రులు తెలుసుకొనవలసిన ఆరు అంశములు

1. ఒక శిశువుకు జీవితములోని మొదటి నాలుగు నుండి ఆరునెలల కాలంలో తల్లిపాలు మాత్రమే అత్యంత శ్రేష్ఠమైన ఆహారమైయున్నది. అది సంపూర్ణ పుష్ఠినిస్తుంది మరియు మామూలుగా వచ్చే అంటురోగాల నుండి రక్షణ కలుగజేస్తుంది.

2. నాలుగునుండి ఆరునెలల ప్రాయములో, శిశువుకు ఇతర ఆహారములు అవసరము. దానికంటే ముందు ఘన ఆహారమును ఇచ్చినట్లయితే అంటురోగములు సోకే ప్రమాదముంది; అంతకంటె ఆలస్యం చేసినట్లయితే కుపోషణకు దారి తీయును.

3. మూడు సంవత్సరాల లోపు వయస్సుగల పిల్లలకు పెద్దవారికిచ్చినట్లే రెండింతలు తరచుగా తినిపించవలసి ఉంటుంది, అయితే తక్కువ మోతాదులో ఎక్కువ శక్తినిచ్చు ఆహారమును ఇవ్వాలి.

4. అతిసార వ్యాది లేక అస్వస్థతలు కలిగినప్పుడు పిల్లలకు ఆహారమివ్వకుండా ఉండకూడదు.

5. అస్వస్థత తరువాత, పోగొట్టుకున్న శక్తిని భర్తీ చేయుటకు పిల్లలకు వారము వరకు భోజనము కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి.

6. తల్లి పిల్లల పౌష్ఠిక ఆరోగ్యమును కాపాడుటకు ప్రసూతుల మధ్య కనీసము రెండు సంవత్సరముల వ్యవధి ఉండాలి.

[Credit Lines]

Source: United Nations Children Fund

UNICEF/C/91/ Roger Lemoyne

మూలము: ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి

[5వ పేజీలోని చిత్రం]

అభివృద్ధిచెందుతున్న దేశములలో కేవలము సగం మంది పిల్లలకు మాత్రమే శుభ్రమైన త్రాగేనీరు లభ్యమౌతుంది

[క్రెడిట్‌ లైను]

UNICEF/3893/89/ Maggie Murray-Lee

[7వ పేజీలోని చిత్రం]

ప్రతి శిశువు తన విశేషమైన వ్యక్తిత్వముతో, దేవుని దృష్టికి అమూల్యమైనది మరియు ఇతరులవలె పుష్ఠిగా పెరుగు హక్కును కలిగియున్నది

[క్రెడిట్‌ లైను]

Photo: Cristina Solé/Godo-Foto

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి