“నాజీలు మమ్మల్ని ఆపలేకపోయారు!”
అది ఒక అపరిచిత వ్యక్తి ఇల్లు. ఇంటి వద్ద ఎవరు ఉండరని నిరీక్షిస్తూ, తలుపుకొట్టి, భయపడుతూ నిలుచున్నాను. నేను యౌవనుడను. కేవలం 21 సంవత్సరాల ప్రాయమే. యెహోవాసాక్షుల ఇంటింటి ప్రకటనా పనికి నేను మొదటి సారి వచ్చాను. అది 1934 నవంబరు నెలలో, జర్మనీ నందు హిట్లరు అలాంటి ప్రకటనా పనిని ఖండితంగా నిషేధించాడు. మా చిన్న గుంపు కూటములకు నాయకత్వం వహించిన పరిచారకుడు ప్రచార పనికి వెళ్లుటకు ప్రతిపాదించినప్పుడు, “నన్ను ఉద్దేశించి కాదు” అని అనుకున్నాను. అయినా నేను ఇంకా బాప్తిస్మము కూడా తీసుకోలేదు, నాకు కేవలం ఒక్క లేఖనం మాత్రమే తెలుసు. కాని నేను పొరబడ్డాను, అతడు నన్ను ఉద్దేశించే అన్నాడు, అందుకే నేనిక్కడున్నాను.
ఇంటి వద్ద ఎవరు లేరా! హమ్మయ్య అనుకున్నాను. తరువాత తలుపునొద్ద, మళ్లీ ఎవరూ జవాబివ్వలేదు, కాని లోపల శబ్దం అవుతున్నట్లు నాకు వినిపించింది, అందుకే తలుపు తెరిచాను. ఒక స్త్రీ కుండలు కడుగుతుంది, నన్ను చూసి బెదిరినట్లు కనిపించింది. భయపడుతూ నాకు తెలిసిన ఒక్క లేఖనమైన మత్తయి 24:14ను వివరించడం మొదలు పెట్టాను. ఆమె కేవలం నావైపు చూస్తూ నిలుచుంది. (ఆమె చెవిటిదని తరువాత తెలుసుకున్నాను.) నా ప్రక్కన హఠాత్తుగా ఒక వ్యక్తి కనిపించాడు. అతడు ఆమె భర్త అని ఊహించి నా సాక్ష్యాన్ని కొనసాగించాను, నా ప్రక్కటెముకపై తుపాకి గురి పెట్టబడుట గమనించాను. అతడు ఒక నాజీ నాయకుడు! ఆ వీధిలో ప్రకటన పని చేస్తున్న నా సహచరుడు, ఈ వ్యక్తి ఇంటికి వెళ్లి ప్రకటించినందుకు మెట్లపై నుండి నెట్టివేయబడ్డాడు. ఆరోజుకు ఆ సహోదరుని పరిచర్యను ఆపగలిగాననుకొని ఆ నాజీ నన్ను పట్టి నిర్బంధించుటకు వచ్చాడు. కాని, నా సహచరుడు తేలికగా దుమ్ము దులుపుకొని పరిచర్యకు వెళ్లిపోయాడు, నేను నాలుగు నెలలు జైలులో వేయబడ్డాను. అలా నా పరిచర్య మొదలయ్యింది!
నిర్బంద శిబిరానికి!
నా విడుదల తరువాత, రహస్య సాక్ష్యపు పనిలో సహాయపడతానని సహోదరులు నన్ను నమ్మారు. నా ప్రతి కదలికను నాజీలు గమనించ సాగారు, త్వరలోనే నేను మళ్లీ నిర్బంధించబడ్డాను. స్థానిక పోలీసులు నన్ను గెస్టెపొ అనే పోలీసు దళం వద్దకు తీసుకు వెళ్లారు, “నిర్బంధ శిబిరానికి!” అన్న ఉత్తరువు విన్న వెంటనే నేను చాల భయపడ్డాను, నేను ఇస్టర్‌వేగెన్‌కు వెళ్లాలి. దాదాపు 120 మంది సాక్షులు (బెబెల్‌ఫోర్‌శెర్) ఉన్నారు, మా యథార్థతను భంగము చేయాలని ఎస్.ఎస్. గార్డులు నిశ్చయించుకొనిరి.
మేము “ఐరన్ గుస్టాఫ్” (మొండి ఘటం) అని మారుపేరు పెట్టిన ఒక సార్జంట్ మమ్మల్ని రాజీపడునట్లు చేయుటకు నిశ్చయించుకున్నాడు. ఒక రోజు, మధ్యలో విరామం లేకుండా ఆగస్టు మండుటెండలో ప్రయాసతో కూడిన శారీరక వ్యాయామాలు చేయుటకు మమ్మల్నందరిని బలవంతపెట్టాడు. ఆ రోజు గడిచేటప్పటికి, సగం మంది సహోదరులు స్పృహ కోల్పోయారు, లేదా చికిత్సాలయంలో చాల అస్వస్థతో ఉన్నారు. విచారకరంగా, ఒక సంఘాధ్యక్షుడు బలహీనుడై “రాజీపత్రం” పై సంతకం చేశాడు, అతని సంఘమందలి 12 మంది ఇతరులు అతనితో పాటు సంతకం చేశారు.
తాను పెడుతున్న యాతన పనిచేస్తున్నట్లుందని ఉప్పొంగిపోయి, “ఐరన్ గుస్టాఫ్”, “రేపు మీలో ప్రతి ఒక్కరు ఈ పత్రంపై సంతకం చేయడానికి సంతసిస్తారు, ఏ యెహోవా మీకు సహాయం చేయడు” అని ప్రమాణం చేశాడు. ఆ రాత్రి మేము పట్టుదలతో ప్రార్థించామని మీరు ఊహించవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే మేము “ఐరన్ గుస్టాఫ్” వస్తాడని ఎదురుచూసాము. మేము వేచియున్నాము. చివరికి మా సైనిక శిబిరాలకి వెళ్లిపొమ్మని చెప్పారు. ఇంకా గుస్టాఫ్ రాలేదు! చివరకు, ఏం జరిగిందో మేము తెలుసుకున్నాము. ఆ ఉదయం తన శిబిరానికి వెళ్లే దారిలో, “ఐరన్ గుస్టాఫ్” తాను ఉక్కు కంటే తక్కువ దానితో చేయబడ్డాడని చేదు అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. ముప్పై అడుగుల కంటె ఎక్కువ వెడల్పున్న ప్రవేశద్వారం—శిబిర ప్రవేశద్వారానికి రక్షణిచ్చే ఇటుకల స్తంభంలోనికి అతడు తన మోటారు సైకిల్‌ను పోనిచ్చాడు! విరిగిన చేతితో, చిట్లిన తలతో అతను ఆసుపత్రికి తరలించబడ్డాడు. తుదకు రెండు నెలల తరువాత మళ్లీ మేమాయనను కలిసినప్పుడు “మీ యెహోవాయే నాకు ఇలా చేశాడు!” అని మాపై అరిచాడు. ఒక్క క్షణం కూడ మేమెవ్వరం అతని మాటలను సందేహించ లేదు.
హాలెండుకు
నేను 1935 డిశంబరులో, విడుదల చేయబడ్డాను, జర్మను సైన్యంలో చేరమని నాతో చెప్పారు. కాని నేను హాలెండు మార్గాన స్పెయినుకు వెళ్లి, నా సాక్ష్యపు పనిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఒకసారి నేను హాలెండులో ప్రవేశించిన తరువాత సాక్షుల కొరకు వెతికాను, వారు నన్ను హాలెండులో ఉండమని కోరారు. మళ్లీ స్వేచ్ఛగా ప్రకటిస్తూ క్రైస్తవ కూటములలో నా సహోదర సహోదరీలతో కలిసి ఉండడం ఎంత సంతోషకరం! రాత్రులందు డేరాలలో నిద్రిస్తూ, పగలు డచ్ గ్రామసీమలగుండా సైకిలుపై ప్రయాణిస్తూ పరిచర్య చేశాము. సగటున నెలకు 200 నుండి 220 గంటలు పరిచర్య చేసే వాళ్లము.
ఆహారం కొనటానికి, ఇతర ఖర్చుల కొరకు డబ్బు సరిపోయేది కాదు. రాత్రి భోజనానికి మేము కొంచెం ఆహారాన్ని ఎలా సిద్ధం చేసుకున్నది చూసి, ఒక రైతు రాత్రి భోజనానికి మమ్మల్ని ఆహ్వానించటం నాకు స్పష్టంగా గుర్తుంది. ఎంతో రుచికరమైన ఆహారంతో నిండియున్న బల్ల మా కొరకు సిద్ధం చేయబడింది! అప్పటి నుండి, వెన్న, గ్రుడ్లు, జున్ను మరియు రొట్టె వంటి ముఖ్య అవసరతల గురించి ఈ ప్రేమగల కుటుంబమే శ్రద్ధ తీసుకుంది. బట్టలు ఉతుకుపనిలో కూడా వారే మాకు సహాయం చేశారు. మొత్తం ఆ కుటుంబమంతా సాక్షులయ్యారు. మున్ముందు జరుగవలసిన పనికి బహుగా ఉపయోగపడ్డారు.
స్విట్జర్లాండులోని బెర్న్‌లో, 1936లో ఒక సమావేశం జరిగింది. ఆ సమయంలో వాచ్‌టవర్ సంస్థ యొక్క అధ్యక్షుడైన జోసెఫ్ ఎఫ్.రూథర్‌ఫోర్డ్ అక్కడ మాట్లాడారు. అప్పుడు, పూర్తికాల సువార్తికునిగా అంత కాలం గడిపిన తరువాత, చివరకు అప్పుడు నేను బాప్తిస్మం తీసుకున్నాను!
హగ్
హగ్ ప్రాంతానికి నన్ను పంపించారు. అక్కడ చాల కుటుంబాలు దేవుని వాక్య సత్యాన్ని స్వీకరించాయి. ఈనాటికి నేను కొంతమందితో సంబంధం కలిగి యున్నాను. డచ్ పోలీసులు 1939లో—ఏ ఆధారం లేకుండా నన్ను నాజీ గూఢచారియని నిర్బందించారు. నా వద్ద నుండి బయటికి వెళ్లే ఉత్తరాలను జడ్జి చదువుతాడని తెలిసి కూడా, నాకు సాధ్యమైనంత వరకు జైలు నుండే ఉత్తరాల ద్వారా నా సాక్ష్యపు పనిని కొనసాగించాను. ఐదు నెలల తరువాత, వాటిలో చివరి రెండు నెలలు ఏకాంతవాస శిక్షననుభవించిన తరువాత, నేను విడుదల చేయబడ్డాను. హగ్‌లో మా ఇంటికి తిరిగి వచ్చిన కొద్ది దినాలకు, జర్మను లుఫ్ట్‌వాఫె (వైమానిక దళం) ఆ ప్రాంతంపై బాంబులు కురిపించడం మొదలు పెట్టింది! గెస్టెపో అనే పోలీసు దళం, దాడి చేస్తున్న సైనికుల కంటే తక్కువ వారు కారని నాకు తెలుసు. నేను మళ్లీ రహస్యంగా పని చేయ వలసి వచ్చింది.
కాని, కనబడకుండ నేనెలా తిరుగగలను? సైకిలు దుకాణం నడిపించే సహోదరుడు ఒకరు, నా కొరకు ఒక ప్రత్యేకమైన సైకిలును తయారు చేశాడు. అది సరిగ్గా రహస్య పోలీసులు ఉపయోగించే దానిలానే ఉండేది—అదే ప్రత్యేకమైన రంగు, ఎత్తైన హాండిల్స్, కత్తి పెట్టుకొనుటకు వీలుగా క్లిప్పులు. నేను వారిలో ఒకడిననుకొని రహస్య పోలీసులు నాకు అభివాదం కూడా చేసేవారు! రోడ్డు పై కంచెతో వేరుచేయబడిన సైకిళ్లు వెళ్లేదారిలో నేనొక రోజు సైకిలు త్రొక్కుతూ వెళుతుంటే, రోడ్డుకు ఆవలి వైపు వెళుతున్న ఇద్దరు పోలీసులు కంచెకు ఉన్న సందులో నుండి నన్ను గమనించి, పలాయితుడనని గుర్తించారు. నేను జీవితంలో ఎప్పుడు త్రొక్కలేనంత వేగంగా సైకిలు త్రొక్కాను! నన్ను వెంబడించాలంటే వాళ్లు చుట్టు తిరిగి రావాలి, వాళ్లు ఎంతో కష్టపడి వెంట తరిమినప్పటికి, చివరకు నేను వాళ్లనుండి తప్పించుకున్నాను.
తృటిలో తప్పిన అనేక ప్రమాదాలు
హగ్‌లో నా ఉనికి గురించి ఇప్పుడు పోలీసులకు తెలుసు. రక్షణ కొరకు నేను వేరు వేరు ఇళ్లలో నిద్రించడం మొదలు పెట్టాను. ఒక సందర్భంలో ముగ్గురు పిల్లలు గల కుటుంబముతో నిద్రించాను. దాడి జరిగినట్లైతే త్వరగా బట్టలు వేసుకుని వెళ్లగల్గే రీతిలో ఎప్పటిలాగే బట్టలు సిద్ధంగా ఉంచుకున్నాను. నేను వెళ్లిపోయేటప్పుడు నా ఖాళీ పడక మీద ఒకరిని పడుకోబెట్ట వచ్చునని ఇద్దరు పిల్లలను ఒకే దగ్గర పడుకోబెట్టాను. ఆ విధంగా నాజీలు వెచ్చగా, ఖాళీగా ఉండే పడకను కనుగొనజాలక పోయిరి.
ఆ ఉదయం ఐదు గంటలకు ఈ చర్యలన్నీ ఉపయోగపడ్డాయి. తలుపు నొద్ద గట్టిగా, ఏకధాటిగా శబ్దం వినిపించింది. తొమ్మిదేళ్ల పిల్లవాడిని నా పడకపై పడుకో బెట్టటానికి, నా బట్టలన్ని బ్రీఫ్‌కేస్‌లో పెట్టుకోవడానికి, కోటు వేసుకుని టోపి పెట్టుకోవడానికి, వట్టికాళ్లతో వెనక కిటికిలో నుంచి మంచులోకి దూకడానికి నాకు ఎంతో సమయం లేదు. సంతోషకరంగా, వెనుక వైపు ఒక కాపలాదారున్ని ఉంచడాన్ని గూర్చి వాళ్లు తలంచలేదు. నేను బైబిలు పఠనం చేసిన కుటుంబం ఇంటికి పరుగెత్తాను. అప్పుడు ఉదయం ఐదున్నర, అదీ చలి కాలం చీకట్లో, అయినా ఆ వ్యక్తి ఒక్క మాట మాట్లాడకుండ ఇంట్లోకి రానిచ్చి నన్ను దాచాడు. తరువాత ఆ కుటుంబములోని మొత్తం ముగ్గురూ సాక్షులయ్యారు.
నేను అప్పుడే వదలి వచ్చిన కుటుంబాన్ని గెస్టెపో పోలీసు దళం ప్రశ్నించినప్పుడు, పిల్లవానిపై దృష్టి సారించారు. ఇంత క్రితమే ఎవరైనా “అంకుల్” వచ్చి వెళ్లాడేమో చెబితే డబ్బు ఇస్తామని కూడా ఆ పిల్లవాడితో అన్నారు. “అవును, చాల కాలం క్రితం వచ్చాడు” అని అతడు వాళ్లకు జవాబిచ్చాడు. ఎంత కాలం క్రితం? అతనికి తెలియదు. వాళ్లు విసుగు చెంది వెళ్లిపోయారు. తరువాత పిల్లవాని తల్లి పిల్లవాడిని “అంకుల్ టామ్” (నా రహస్య పేరు) రాత్రి ఇక్కడ గడిపాడని నీకు తెలుసు కదా అలా ఎందుకు జవాబిచ్చావని అడిగింది. “ఇరవై నాలుగు గంటలంటే ఎన్నో నిమిషాలతో, ఎంతో కాలం అవుతుంది కదా” అని జవాబిచ్చాడు. కావున అది వాస్తవమే!
తరువాత నన్ను గ్రోనినెన్‌కు పంపించారు. ఆ పట్టణంలోని కొందరు సాక్షులు చాల భయపడ్డారు, పరిచర్య వాస్తవంగా స్థంభించి పోయింది. త్వరలోనే సహోదరులు క్రూరమైన డచ్ గెస్టెపో పోలీసు దళాన్ని ధిక్కరిస్తూ మళ్లీ నిర్భయంగా తయారయ్యారు. ఒక రాత్రి 1942లో, ముందే నిర్ణయింపబడిన పది నిమిషాల కాల వ్యవధిలో వేలాది బైబిలు కరపత్రాలను పట్టణమంతా పంచిపెట్టే ఒక “ముట్టడి”లో కూడా మేము పాల్గొన్నాము. యెహోవాసాక్షుల తరఫున బ్రిటీషు రాజరికపు వైమానిక దళం లక్షలకొలదిగా కరపత్రాలను పంచి పెట్టింది అని వార్తాపత్రికలన్ని తెలియజేసాయి! మేము బ్రతికే వున్నాము, క్షేమంగా వున్నాము అని గెస్టెపొ పోలీసు దళానికి తెలియజేసాము. నాజీలు మమ్మల్ని ఎన్నటికి ఆపలేక పోయారు!
యుద్ధం కొనసాగింది, వీధుల్లో నడవడం మరీ ప్రమాదకరమై పోయింది. ఒక రాత్రి నేను, ఇంకొక సహోదరుడు హిల్‌వెర్‌సెంలో రహస్యంగా జరిగిన కూటం నుండి వెళుతుంటే, ఎవరో నన్ను వెనుక నుండి కొట్టారు, నా కాళ్ల దగ్గర ఏదో వస్తువొచ్చి పడింది. నేను దాన్ని తీసి భయపడుతూ చూశాను, అది ఒక జర్మను సైనికుని హెల్మెట్! అతడు తన వాహనం వద్ద నిల్చొని నాపై లైటు వేశాడు. నేను అతని వద్దకు వెళ్లాను; నా చేతుల్లోంచి హెల్మెట్ లాక్కుని, తన రివాల్వర్ బయటికి తీసి, “నిన్ను అరెస్ట్ చేస్తున్నా” అని అరిచాడు.
నేను వణకుతున్నాను. ఒకవేళ అతడు నన్ను అరెస్ట్ చేశాడంటే అది నా అంతమే. సహాయం కొరకు నేను దేవునికి ప్రార్థించాను. ఈ గడబిడ శబ్దం విని, పెద్ద సమూహం పోగయ్యింది. సైనికుడు కొద్దిగా తూలుతుండడం గమనించినప్పుడు, అతను తాగివున్నాడని నాకు అర్థమైపోయింది. జర్మను మిలిటరీ నిబంధనలను బట్టి, ఆఫీసర్లు మామూలు బట్టలలో తిరుగవచ్చని అప్పుడు నాకు గుర్తు వచ్చింది. కాబట్టి నేను సైనికుని దగ్గరకెళ్లి నాకున్న అధికారాన్నంతటిని కూడగట్టుకొని “నేనెవరో నీకు తెలియదా?” అని అరిచాను. ఆ సైనికుడు నిర్ఘాంత పోయాడు. తన హెల్మెట్‌పై చరిచి నాకు నమస్కారం చేశాడు! ఒక ఆఫీసరును అవమానించానని భావించి, సిగ్గుతో చీకట్లో కలిసిపోయాడు. చుట్టూ నిలబడి వున్న గుంపు చెదిరి పోయింది. మరో సారి తృటిలో తప్పించుకున్నందుకు నేను యెహోవాకు కృతజ్ఞత మాత్రం చెల్లించగలను!
బెల్జియంలో అజ్ఞాత జీవితం
నా తరువాతి అసైన్‌మెంట్ మరొక దేశం: బెల్జియం. ఆంట్వెర్ప్‌లో నేను సంఘాధ్యక్షుడనయ్యాను. నిర్బంధం ఉండడం వల్ల, ప్రతి వారం వేరు వేరు ఇళ్లలో, అనేక చిన్నచిన్న కూటాలు జరిపేవాడిని. ఆ కష్ట సంవత్సరాలలో ఆత్మీయాహారం క్రమంగా రావటానికి కారణమైన అద్భుతమైన ఇంకొక లింకు—వార్తలందించుటే—ఆ పని కూడ నేను చేశాను.
హాలెండు సరిహద్దు నుండి సాహిత్యం దొంగరవాణా చేయుటకు ఒక రెస్టారెంట్ మాకు రహస్య స్థావరంగా ఉండేది. ఆ భవనం బెల్జియంలో ఉండేది, కాని దాని తోట హాలెండులోనికి ఉండేది, కాబట్టి నేను ఒక వ్యక్తిని కలుసుకోవటానికి, బ్రీఫ్‌కేసులు మార్చుకోవటానికి అది తగిన స్థలంగా ఉండేది. మేము బ్రిటిషు రహస్య సమాచార ప్రతినిధులమని భావించి దాని యజమాని మాతో సహకరించాడు. డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసరుకు మమ్మల్ని ఒంటరిగా వదిలి పెట్టమని కూడా అతను చెప్పాడు. కాని, నా గురించి ఏమి తెలియని ఒక నాజీ దృక్పధం గల బెల్జియం దేశస్థుడు, ఒకరోజు క్రొత్త కాపలాదారునిగా వున్నాడు. నేను ఒక పెద్ద లెదరు కేస్ తీసుకుని వెళుతుంటే, దాన్ని తెరిచి చూపించమన్నాడు. నేను నిరాకరించాను; ఎందుకంటే దాంట్లో మూడు లేక నాలుగు వందల వాచ్‌టవర్ పత్రికలున్నాయి. కాబట్టి అతడు నన్ను నిర్భందించి పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లాడు. అక్కడ డ్యూటీలో ఉన్న ఆఫీసరు నా గురించి శ్రద్ధ తీసుకుని, ఆ కాపలాదారున్ని వెళ్లిపొమ్మని చెప్పాడు. తరువాత “అందులో ఉన్నవి నేను చూడదలచుకోలేదు. ఈ సారి నుండి చిన్న పెట్టెలలో తెచ్చుకోండి”, అని నాతో మెల్లిగా చెప్పాడు. మళ్లీ నేను యెహోవాకు కృతజ్ఞత మాత్రం చెల్లించ గలిగాను!
యుద్ధసన్నాహ దినం వచ్చిన రోజున (జూన్ 6, 1944) మిత్ర పక్షాలు బెల్జియంను ఆక్రమించటం మొదలు పెట్టాయి, యుద్ధం ఆంట్వెర్ప్‌లోకి ప్రవేశించింది. ఇరువర్గాల నుండి తుపాకి కాల్పులు, బాంబు దాడులు నగరమంతా ప్రతిధ్వనిస్తుంటే పరిచర్య చేయడం, కూటములకు హాజరు కావడం నిజంగా సవాలుగా తయారయ్యింది. దాదాపు యుద్ధం ముగుస్తుండగా బ్రాంచి పరిచారకుడు, నేను అజ్ఞాతంలో ఉండడం ఇక అనవసరమని పొరపాటుగా తలంచాడు. స్నేహభావం గల ఒక పోలీసు అధికారి, నన్ను నేను బయలు పర్చుకోవడంలో మరీ త్వరపడుతున్నానని భావించి సలహా ఇచ్చిన దానికి వ్యతిరేకంగా నేను అంగీకరించాను. పదకొండు నెలల తరువాత, నా జీవితంలో అత్యంత ఘోరమైన అనుభవం నుండి బయటపడ్డాను. అధికారులు నా కథను నమ్మలేదు. గెస్టెపొ పోలీసు దళం యొక్క ప్రతినిధినని భావించి, నేనింత వరకు అనుభవించనటువంటి అమానుష పరిస్థితులలో నన్ను బంధించారు. నాకంటే చిన్న వయస్కులైన పురుషులు ఆ నెలలో రోగగ్రస్థులై చనిపోయారు. ఆఖరుకు నేను విడుదల చేయబడినప్పుడు, నేను పూర్తిగా శారీరక అస్వస్థతకు గురయ్యాను.
నమ్మకమైన పరిచర్య కొనసాగుట
ఎన్నో బాధాకరమైన నిర్బందాలు, విచారణలు, ఖైదులు, ముగిసిన తరువాత, నేను విడిచి వచ్చిన దినానికి సరిగ్గా పది సంవత్సరాల తరువాత మళ్లీ జర్మనుకు తిరిగి రాగలిగాను! నమ్మకమైన సాక్షియగు మా అమ్మను మళ్లీ కలుసుకున్నాను, మేము పంచుకోవటానికి మాకు ఎన్నో అనుభవాలుండెను. మెల్లిగా నా ఆరోగ్యం పుంజుకోవడంతో, మళ్లీ ష్యూవన్‌ఫర్ట్‌లో పూర్తికాల పరిచర్య చేయడం మొదలుపెట్టాను. హిట్లరు గర్వంగా తన సైన్యాన్ని కవాతు తిప్పిన ప్రాంతమైన న్యూరెంబర్గ్‌లో జరిగిన యుద్ధం తరువాత, మా మొదటి సమావేశానికి సిద్ధపడుటకు సహాయం చేయగలగడం ఎంతటి ఆధిక్యత! మిషనరీగా శిక్షణ పొందుటకు, అమెరికాలోని వాచ్‌టవర్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు నేను అంగీకరింపబడినందుకు తరువాత ఎంతో పరవశించి పోయాను.
నేను గిలియడ్‌కు వెళ్లక ముందు ఒక కూటములో, అమెరికానందు జండావందనం విషయంలో మత స్వాతంత్ర్యం కొరకైన పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన లిలియన్ గాబిటెస్‌ను కలుసుకున్నాను. ఆ కూటంలో నేను పాడిన గీతాలు బాగున్నాయని మెచ్చుకుంది, ఆమె అన్నది నాకు అర్థం కాలేదు, కాబట్టి నేను కేవలం చిరునవ్వు చిందించి ఊరుకున్నాను. నేను నవ్వుతూనే వున్నాను, ఆమె మాట్లాడుతూనే ఉంది. చివరికి అది మా వివాహానికి దారి తీసింది! ఇదంతా ఇద్దరం గిలియడ్ కోర్సును ముగించిన తరువాత, ఆస్ట్రియాలో మిషనరీలుగా పని చేస్తున్నప్పుడు జరిగిందనుకోండి.
కొంత సమయానికి, నా ఆరోగ్య సమస్యల వల్ల మళ్లీ మేము అమెరికాకు తిరిగి రావలసి వచ్చింది. అప్పటికి మాకు ఇద్దరు చక్కని పిల్లలు కలిగారు, ఒక కుమారుడు ఒక కుమార్తె. వాళ్లిద్దరు సత్యాన్ని హత్తుకోవడం చూచి మేమెంతో ఆనందించాము. నా ఆరోగ్యం మెరుగౌతుంటే, అమెరికా మరియు కెనడాలలోని సంఘాలకు సహాయం చేశాను. పని ఎప్పుడు ఆగిపోదు, దానికి తగినట్లు ఉండటానికి మేము ప్రయత్నిస్తాము. అజ్ఞాతంలో గడిపిన ఆ సంవత్సరాలను నేను ఇప్పటికి ఇష్టంతోనే గుర్తు తెచ్చుకుంటాను. నాజీలు మమ్మల్ని ఆపలేకపోయారు, ఎందుకంటే, యెహోవా మాతో ఉన్నాడు. ఇంకా యెహోవా పనిని ఆశీర్వదిస్తాడు, అది ఆయనకు తృప్తికరమైన విధంగా జరిగేంత వరకు ఏది దానిని ఆపదనుట స్పష్టం!—ఎర్విన్ క్లోసె చెప్పిన వృత్తాంతం. (g92 11/22)
[20వ పేజీలోని చిత్రం]
ఎర్విన్ క్లోసె