యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నా తలిదండ్రులు నాపై ఎక్కువ శ్రద్ధను ఎందుకు చూపించరు?
“నేనెప్పుడైనా మా అమ్మను నాకోసం ఐదు నిమిషాలు గడపమని అడిగితే, ఆమె తీరిక లేదంటూ వుండేది” అని ఒక యౌవనస్తురాలు ప్రలాపించింది.
పదహారేళ్ల క్రిస్టీనా—అవివాహితురాలే గాని గర్భవతి. తన సంకట పరిస్థితిని గూర్చి ఆమె పశ్చాత్తాపపడడమే కాక, దుఃఖిస్తుంది కూడ. “ఈ విషయాలు మా అమ్మ నాకు వివరించేది కాదు, అసలు ఎన్నడూ పట్టించుకోదు. నేను చేసే విషయంలో ఆసక్తి చూపటానికి ఆమెకు సమయం ఉండేదికాదు” అని ఆమె వెక్కివెక్కి ఏడ్చింది.
నీ తలిదండ్రులు నీయెడల అసలు శ్రద్ధ చూపడంలేదని నీవు కొన్నిసార్లు అలాగే భావిస్తున్నావా? క్రిస్టీనా మాదిరే, నీవు నీ బాధల్ని వ్యక్తపరచడానికి నీకు ఇష్టంలేకపోవచ్చు. నిర్లక్ష్యవైఖరిగల తలిదండ్రులు వుండడం చెడు ప్రవర్తన కలిగివుండటానికి ఒక సాకుకాదని నీకు తెలుసు. అయినప్పటికి, వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తే, నీవు తీవ్రంగా గాయపడినట్లు భావించవచ్చు. నీకు యుక్తవయస్సు వస్తున్నప్పటికి, తలిదండ్రుల ప్రేమ మరియు మద్దతు యొక్క అవసరత నీకు ఉన్నట్లు నీవు భావించవచ్చు. తలిదండ్రుల చేత అలక్ష్యం చేయబడడం విడిచిపెట్టబడినావనే విధంగా నీవు భావించునట్లు చేస్తుంది. “నేనెప్పుడైనా మా అమ్మను నాకోసం ఐదు నిమిషాలు గడపమని అడిగితే, ఆమె తీరిక లేదంటూ వుండేది” అని ఒక యౌవనస్తురాలు ప్రలాపించింది.
ఒక పరిశోధన ప్రకారం, 25 శాతం యౌవనస్థులు, “వారి తలిదండ్రులతో గడపటానికి వారికి తగినంత సమయం లేనట్లు వారు భావిస్తారు.” కాబట్టి, అది ఆశ్చర్యకరమేమీ కాదు. ఒక యౌవనవ్యక్తి యిలా చెప్పాడు: “నా తలిదండ్రులతో నేను సన్నిహితంగా వుండగలిగి, నా భావాలను గూర్చి వారితో నిజాయితీగా మాట్లాడాలని నేను కోరుకుంటాను.” యౌవనస్థులు మరియు తలిదండ్రులు భౌతికంగా దగ్గరే ఉన్నప్పటికి, మాసికంగా వారు దూరంగానే వుండవచ్చు. వారిమధ్య ప్రాముఖ్యమైన సంబంధం వుండకపోవచ్చు.
వారెందుకు నిన్ను అలక్ష్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది
ఊహించండి, అమ్మతో ఏదో ఒక సమస్య గురించి మాట్లాడాలని నీవు దినమంతా ఎదురుచూశావు. కాని పనినుండి ఇంటికి వచ్చినవెంటనే ఆమె సాయంకాలమువచ్చే టివిలో వార్తలను వినాలని కుర్చీలో వాలిపోతుంది. నీవు ఆమెను సంభాషణలో దింపాలని ప్రయత్నిస్తే, చికాకుగా “నేను విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది నీవు చూడలేవా” అని ఆమె త్రోసిపుచ్చవచ్చును.
ప్రేమలేని కఠినాత్మురాలా? కాదు తలిదండ్రులు అరుదుగా నిర్లక్ష్యం చేస్తారు. కాని మనం “అపాయకరమైన కాలములలో” జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1-3) మునుపెన్నటికంటే ఇప్పుడు ఎక్కువ వత్తిడిక్రింద ఉన్నట్లు నీ తలిదండ్రులు భావించవచ్చు. నీతో ఫలవంతమైన సమయాన్ని గడపటానికి వారికి తగిన శక్తి లేనట్లు వారు కలతచెంది, ఆశాభంగముతో అలసిపోయి వుండవచ్చు. ఒకవేళ నీవు తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబములో నివసిస్తున్నట్లయితే, ముఖ్యంగా ఇది నిజమైయుండవచ్చు. కాబట్టి నీ తలిదండ్రులు నీనుండి ఫిర్యాదు వినేంతవరకు అంతా సవ్యంగానే వుందని వారూహించవచ్చును.
తలిదండ్రులు ఇతర వ్యవహారాలలో కూడ నిమగ్నమై యుండవచ్చు. ఒకవేళ నీ తండ్రి చురుకైన క్రైస్తవుడైతే ఆ సంఘ బాధ్యతయొక్క భారాన్ని మోయవలసి యుంటుంది. (2 కొరింథీయులు 11:28, 29 పోల్చుము.) ఎక్కువసార్లు ప్రస్తావించకపోయినను, నీ తల్లి అధికమౌతున్న ఆరోగ్య సమస్యలవల్ల కలవరపడుతుండవచ్చు. నీకు అన్నా తమ్ముళ్లు, అక్కాచెల్లెండ్రు ఉన్నారా? నీ తలిదండ్రులు వారిని పరామర్శించుటలో కూడ నిమగ్నులై యుండవచ్చునేమో.
కొంతమంది తలిదండ్రులు మద్యపానమునకు దాసులై తీవ్రమైన సమస్యలతో పోరాడుతూ, వారి పిల్లల అవసరతలకు అనుగుణంగా ప్రతిస్పందించలేక పోతున్నారనుట అంగీకరించవలసిందే. మరికొందరికైతే వారి పిల్లల యెడల ఎలా శ్రద్ధ చూపించాలో తెలియకపోవచ్చు. ఏదిఏమైనా, పిల్లలు వారి తలిదండ్రుల నుండే ప్రేమ నేర్చుకుంటారు. (1 యోహాను 4:19 పోల్చుము.) బహుశ నీ తలిదండ్రులు వారి యెడల శ్రద్ధ తీసుకొనని తలిదండ్రుల చేత పెంచబడ్డారేమో.
యౌనస్థుల అవసరతలను వాస్తవంగా అలక్ష్యం చేసే కొన్ని సంస్కృతులున్నాయన్న వాస్తవం కూడ వుంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, తండ్రులు, తల్లులు, పిల్లలు వేర్వేరుగా భోజనాలు చేయాలని సాంప్రదాయం శాసిస్తుంది. దాని ఫలితమేమిటి? కొలెన్ అనే 14 ఏళ్ల ఆఫ్రికా యౌవనస్థుడు యిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నా తలిదండ్రులతో సన్నితత్వాన్ని అనుభవించడం కష్టంగా ఉండేది. నా జీవితాన్ని నేనే స్వంతగా తడవులాడుకుంటూన్నట్లు భావించేవాన్ని.”
తప్పించుకొనవలసిన ఉరులు
నీ తలిదండ్రుల నిర్లక్ష్యానికి కారణం ఏదైనా కానివ్వండి, అది నీవు బాధపడునట్లు, కోపగించుకొనునట్లు చేస్తుంది. అందుచేత, కొంతమంది యౌవనులు సహకరించకుండ, అవిధేయులవుతున్నారు. వారి దురవస్థను తలిదండ్రులు పట్టించుకోవాలంటే, తిరుగుబాటు మాత్రమే ఏకైక మార్గమని కొందరు నిర్ణయించుకుంటారు. ప్రారంభంలో తెలియజేయబడిన క్రిస్టీనావలే, వారు తమనుతాము బాధపరచుకోవడం కంటే ఇంకా ఎక్కువే చేస్తారు. “బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు” అని సామెతలు 1:32 హెచ్చరిస్తున్నది.
ఇంకోవైపు, అది నీకు తీవ్రమైన బాధను కలిగిస్తున్నట్లైతే—పరిస్థితిని దాటవేస్తే ప్రయోజనం స్వల్పమే. “శ్రమదినమున నీవు కృంగితివా,” అని సామెతలు 24:10 NW ప్రశ్నిస్తుంది. అయితే, “నీవు చేతకాని వాడవగుదువు”. మానసిక గాయాలు కూడ శారీరక గాయాలంత సహజము మరియు వాటికంటే బాధాకరంగా వుంటాయి. (సామెతలు 18:14) వాటిలా పెరగనిస్తే అవి యుక్తవయస్కులైన తరువాత కూడ బాధిస్తూనే వుంటాయి. యోహాన్ అనే యౌవనస్థుడు యిలా తెలియజేస్తున్నాడు: “నేను పెరిగే కొలది, నా త్రాగుబోతు తండ్రి నా కవసరమైనపుడెల్లా ఆయన అందుబాటులో ఉండేవాడు కాదు. నా ఎడల ఎక్కువ శ్రద్ధ చూపించలేనంతగా తాను తన సమస్యలలో నిమగ్నమై యుండేవాడు.” పెద్దవానిగా యోహాను దీర్ఘకాలం నిరుత్సాహముతోను, తాను తప్పిదస్థుడన్నట్లే బాధననుభవించాడు.
కొంతమంది మంచి స్నేహితుల సహాయముతో, యోహాను మళ్లీ తన ఆత్మ విశ్వాసాన్ని పునర్నిర్మించుకోవడం మొదలుపెట్ట గలిగాడు. అయినప్పటికి, నీవు ఇంటిదగ్గర ఎదుర్కొంటున్న పరిస్థితి చక్కబరచుకొను అనుకూల మార్గాలను కనుగొనుటకు చేసే ప్రయత్నాలయొక్క విలువ ఏమిటో అతని అనుభవం నొక్కిచెబుతోంది.
నీలో వారి శ్రద్ధను వృద్ధిచేసుకొనుడి
ఒకవేళ అమ్మ లేక నాన్న ఎప్పుడో గాని నీతో సంభాషణ మొదలు పెట్టరనుకో, నీవే వారి ఎడల కొంత శ్రద్ధ చూపిస్తూ, అటువంటి మౌనవ్రతాన్ని పారద్రోలవచ్చు. (మత్తయి 7:12; ఫిలిప్పీయులు 2:4) ఏదైనా తేవడానికి బయటికి వెళుతుంటే వారితో పాటు వెళ్లవచ్చు. శుభ్రంచేయడం ద్వారా లేక వంటచేయడం ద్వారా గాని వారికి నీవు ఏ విధంగానైనా సహాయం చేయగలవేమో అడుగుము.
కొన్నిసార్లు నీకు చర్చించడానికి కొన్ని గంభీరమైన సమస్యలు వుండవచ్చు. ఉద్యోగంలో దినమంతా కష్టపడిన తరువాత, విశ్రాంతి కొరకు సోఫాపై వాలి ఉన్నప్పుడు నీ నాన్నను సమీపించినట్లైతే, అది నీకు నిష్ప్రయోజనము. విషయాలను చర్చిండానికి ఆయన నిజంగా విశ్రమించి సంతోషంగా ఉన్నప్పుడు “తగిన సమయం” కొరకు చూడుము. (సామెతలు 15:23) ఆయన నీ సమస్యలపట్ల శ్రద్ధ చూపించడానికి ఇష్టపడవచ్చు.
అయినప్పటికి, నీ మంచి ప్రయత్నాలకు నీ తలిదండ్రులు సరైన విధంగా ప్రతిస్పదించకపోతే?a సామెతలు 15:22 మనకు గుర్తుచేసేదేమిటంటే, “ఆలోచన చెప్పువారు లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును.” అవును, (దయతోను సమర్థవంతముగా) వారు నీపట్ల తగిన శ్రద్ధ కనబరచడంలేదని, అది నిన్ను గాయపరుస్తున్నదని, ప్రేమింపబడని విధంగా అనిపిస్తున్నదని, నీ తలిదండ్రులకు చెప్పవలసి వుంటుంది. అప్పు డప్పుడు నిన్ను మెచ్చుకోవాలని, మీ ఇంటి పనిలో నీకు సహాయం కావాలని బహుశ నీవాశించవచ్చును.
నీవు ఈ విధంగా భావిస్తున్నారని తెలుసుకొనుటకు బహుశ నీ తలిదండ్రులు ఆశ్చర్యపడవచ్చు. నీవు వారిని అపార్థం చేసుకునేట్లు వారు ప్రవర్తించినందుకు క్షమాపణ కోరుకోవచ్చుకూడ. లేదా నీ ఎడల వారి ప్రేమ నిశ్చయంగా ఉంటుందని అభయమీయవచ్చు. వారి దృష్టికి సమస్య తేబడినప్పుడు తలిదండ్రులు సాధారణంగా మారడానికి నిజంగా కష్టపడతారు.
ఇంకోవైపు చూస్తే, నీవే వారిని అపార్థం చేసుకోవడం జరిగిందని బహుశ నీ చర్చ మూలంగా బయటపడిందనుకుందాం. నీ ఎడల వారు అనేక విధాలుగా చూపిన ప్రేమను నీవు గమనించి వుండకపోవచ్చును. ఏమైనప్పటికి, పరిస్థితులను మెరుగుపర్చుకోవడానికి ఇంటికివచ్చి మాట్లాడుకోవడం అన్నది ముఖ్యమైన మెట్టు.
శూన్యతను పూరించుట
అప్పటికీ నీ తలిదండ్రుల నుండి అనుకూలమైన ప్రతిస్పందన రాకపోతే? అర్థవంతంగా, ఇది చాలా బాధాకరంగా వుంటుంది. అయినా, ఇంకా ఇతర ఎంపికలు కూడ ఉన్నాయి.
ఉదాహరణకు, నిర్లక్ష్య వైఖరిగల నీ తలిదండ్రులు ఏర్పరచిన శూన్యాన్ని పూరించగల మరోవ్యక్తిని, అంటే నీకంటే వయస్సులో ఓ పెద్ద వ్యక్తి కొరకు ప్రయత్నించండి. “దుర్దశలో సహోదరుడుగా నుండు స్నేహితుడు కలడు” అని సామెతలు చెబుతుంది. (సామెతలు 17:17) అలాంటి స్నేహితుని కొరకు చూడండి. నీ మంచిని కోరే, దేవుని వాక్యంతో పొందిక కలిగివున్న ఉపదేశాన్ని తీసుకొనుటకు ప్రయత్నించుము.
సహాయానికి, మద్దతుకు ఇంకొక మూలం ఏమిటంటే, యెహోవాసాక్షుల స్థానిక సంఘం. నీవు ఆత్మీయంగా, మానసికంగా వృద్ధిపొందడానికి సహాయపడగలవారు, నీ పట్ల నిజమైన శ్రద్ధచూపగల తండ్రులను తల్లులను, ఆత్మీయ సహోదర సహోదరీలను నీవక్కడ కనుగొనగలవు. (మార్కు 10:30) ముందు ప్రస్తావించిన ఆఫ్రికా యౌవనస్థుడు కాలెన్, అలాంటి స్నేహితులనే కనుగొన్నాడు. నడిపింపు కొరకైన అవసరతను గ్రహించి అతడు యెహోవాసాక్షుల సమావేశాలకు హాజరుకావడం మొదలుపెట్టాడు. ప్రేమింపబడిన విధంగా, కోరుకొనబడిన విధంగా, అతను భావించేలా చేసిన సంఘ సభ్యులతనితో త్వరగా స్నేహం చేశారు. కొంతకాలానికి, అతని తలిదండ్రులు మరియు తోబుట్టువులు కూడ క్రైస్తవ కూటాలకు హాజరు కావడం మొదలు పెట్టారు.
నిజంగా నీ తలిదండ్రులు నీ కొరకు శ్రద్ధ కలిగివుంటారు, కాని వారు నీ అవసరతలను గూర్చి ఎక్కువ తెలుసుకొని వుండాలి. ఆ అవసరతలేమిటో చొరవ తీసుకొని వారికి తెలియజేయండి! ఎవరికి తెలుసు? నీవెన్నడు ఊహించనంతకంటే ఎంతో ఎక్కువగా వారు నీ పట్ల శ్రద్ధ కలిగివున్నట్లు నీవు కనుగొనవచ్చునేమో. (g92 11/8)
[అధస్సూచీలు]
a మాదక ద్రవ్యాలు లేక మద్యపాన దురలవాటు వంటి తీవ్ర సమస్యలతో పోరాడుతున్న తలిదండ్రులు, తమ పిల్లల అవసరతలకు అనుగుణంగా ప్రతిస్పందించటానికి ముందు, సమర్థులైన వృత్తిపరంగా అనుభవమున్న వారి సహాయం తీసుకోవాలి.
[24వ పేజీలోని చిత్రం]
ఈనాడు తలిదండ్రులు సాధారణంగా చాల వత్తిడిని కలిగివున్నట్లు మరియు వారి పిల్లల సమస్యలతో వ్యవహరించడానికి అలసిపోయినట్లు భావిస్తారు