బైబిలు ఉద్దేశము
మత సంబంధమైన అన్ని పండుగలు దేవున్ని ప్రీతిపరచునా?
నగర కూడలిలో ప్రత్యేక ఆరాధనను విశ్వాసులైన 20,000 మంది జరుపుకొంటారు. ఆరాధన ముగిసిన తరువాత ఊరేగింపు మొదలౌతుంది. బ్రెజిల్ యొక్క పేట్రన్ “సెయింట్” అయిన నోసా సానినోరా అపారెసిడా యొక్క విగ్రహాన్ని అనుసరిస్తూ వీధులవెంట వెళ్తూవున్న ఆరాధికుల సమూహము ఇప్పుడు 60,000 మందికి పెరుగుతుంది. మధ్యాహ్నము, తీర్థయాత్రికులు మిరుమిట్లుగొల్పే బాణాసంచా కాల్చునప్పుడు పవిత్ర స్థలం దగ్గర పెద్ద శబ్దం వినిపిస్తుంది.
అనేక దేశాలలో ఆ విధమైన పండుగలు, వాటితోపాటు ఊరేగింపులు సామాన్యమై యున్నవి. కాని, ఊరేగింపులలో పాల్గొనటానికి ప్రజలను ఏది ప్రేరేపిస్తుంది? కేథోలిక్కులు, బౌద్ధులు మరియు ఇతర మతాలను అవలంభించే వారికి సాంప్రదాయము మరియు భక్తి, యీ రెండు ప్రధానమైన ఉద్దేశములు. వీటికి తోడు, పూర్వం వలెనే వినోదము ముఖ్యమైన మూలకమై యుండవచ్చు. ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా చెప్పేదేమంటే, ప్రాచీన కాలాలలో “చాలా మత సంబంధమైన పండుగలు వినోదానికి ప్రాధాన్యతనిచ్చాయి. అవి ప్రజల అనుదిన కష్టాలను వారు మరచిపోవుటకు అవకాశమిచ్చాయి.” ఈనాడు కూడ అదే నిజమై యున్నది. ఉదాహరణకు, అమితానందోత్సాహాలతో పాటు ఆథ్యాత్మికత మిళితమై మత సంబంధమైన మరియు జన ప్రియమైన పండుగలను జరుపుకొనుటలో బ్రెజిల్‌లోని సాల్వడార్ పేరుపొందింది. అయినను, కొన్ని మత సంబంధమైన ఊరేగింపులు వేడుకగా ఉండవచ్చు, కొన్ని భక్తిపూర్వకమైనవై యుండవచ్చును.
బ్రెజిల్లో ఒక ప్రత్యేకమైన ఊరేగింపుకు వచ్చిన ఒక సందర్శకుడు ఇలా గమనించాడు, “ఆ విగ్రహాన్ని, పూజారులు వెంబడిస్తూ, కొంతమంది కీర్తన పాడుతువుంటే, ఇతరులు నిశ్శబ్దంగా వారిని అనుసరించారు. అయితే, ఆ దృశ్యంలో కొట్టొచ్చినట్లు కనబడేదేమంటే వారేదో అంత్యక్రియలకు హాజరైన సమూహంలా, విశాద వదనాలతో లేదా గంభీర ముఖాలతో సాగిపోయారు.” బ్రెజిల్ యొక్క ఉత్తర భాగం నుండి లూసియో ఇలా చెబుతున్నాడు: “నేను ఒకప్పుడు చేసిన విధంగా ప్రజలు కుటుంబ లేక ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కారాన్ని లేదా నివారణను పొందుటకు విఫలయత్నం చేస్తున్నారు. అనేకసార్లు పేట్రన్ “సెయింట్” ను ఆరాధించడంలో ఆ విగ్రహాన్ని ముద్దు పెట్టుకొనుట, మోకాళ్లతో మెట్లు ఎక్కుట, తలపై ఒకరాయి వుంచుకొని చాలాదూరం నడుచుట వంటివి చేరియుండును.”
తమకుతాము నియమించుకున్న అటువంటి త్యాగాలు నమ్మనివారికి వింతగా అనిపించవచ్చు. అయినప్పటికిని, పాల్గొనేవారు దేవున్ని ప్రీతిపరుస్తున్నట్లు భావిస్తారు. కానివారు అలా ప్రీతిపరుస్తున్నారా? అలాంటి మత సంబంధమైన పండుగలు మరియు ఊరేగింపులు దేవున్ని ప్రీతిపరచగలవా లేదా అన్నది తెలుసుకోటానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది.
అవి దేవుని అనుగ్రహాన్ని తెస్తాయా?
ప్రాచీన ఇశ్రాయేలీయులు సాంవత్సరికంగాను, నియమిత కాలములలోను పండుగలను సంతోషముతో జరుపుకొనెడి వారని మనకు చరిత్ర చెబుతుంది. అలాంటి ఉత్సవాలు యెహోవా దేవున్ని ఘనపర్చాయి. (ద్వితీయోపదేశకాండము 16:14, 15) బైబిలు సంబంధిత ఉత్సవాలను గూర్చి ది ఇలస్ట్రేటెడ్ బైబిల్ డిక్షనరీ ఇలా చెబుతుంది: “హృదయ పూర్వకమైన ఆనందం వ్యక్తపర్చబడేది. దేవుని వరాలని పరిగణించిన లోకసంబంధమైన వాటివలన కలిగే సంతోషానికి మత సంబంధమైన కట్టుబాటుకి ఎంతో సంబంధం ఉంది.” మత సంబంధమైన వేడుకలు చేస్తున్నప్పటికి, ఇశ్రాయేలీయుల యాజకులు, ప్రజలు వారి ఆత్మీయతను నిర్లక్ష్యం చేశారు. (యెషయా 1:15-17; మత్తయి 23:23) అయినప్పటికి, ఇప్పుడు ప్రశ్నేమిటంటే మత సంబంధమైన ఊరేగింపులు మొదటి శతాబ్దపు క్రైస్తవత్వములో భాగమై యుండెనా?
యేసుక్రీస్తు యూదుల పండుగలను కొన్నింటిని ఆచరించినప్పటికిని, యేసుగాని, అతని అపొస్తలులుగాని మత సంబంధమైన ఊరేగింపులను ప్రారంభించలేదు. ది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్పేదేమంటే: “నాలుగవ శతాబ్దంలో కాన్స్టంటైన్చే క్రైస్తవ మతాన్ని ఆ సామ్రాజ్యపు అధికారిక మతంగా గుర్తించిన వెంటనే ఊరేగింపులు జనాదరణలోకి వచ్చినట్లున్నది.” “చాలా అన్యాచారాలకు (వాటి ఊరేగింపులతో సహా) క్రొత్త అర్థాలిస్తూ, చర్చి పండుగలు వాటిని కలుపుకున్నాయి” అని ది వరల్ బుక్ ఎన్సైక్లోపీడియా తెలియజేస్తుంది.
క్రైస్తవులు అలాంటి మత సంబంధమైన పండుగలు ఊరేగింపులో పాల్గొనవలెననే నిర్భంధం క్రింద లేరు. ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం వారు ఆచరించవలసిన పండుగలను గూర్చి తెలియజేస్తూ, అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పుతీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇది రాబోవు వాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో వున్నది.” (కొలొస్సయులు 2:16, 17) కొలొస్సయలోని క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రపు పండుగలను ఆచరించడాన్ని బట్టి దేవుని యెదుట వారి స్థానాన్ని గూర్చి ఎవరను వారికి తీర్పుతీర్చే అవకాశం ఇవ్వలేదు.
ఊరేగింపుల కంటే శ్రేష్ఠమైనది
కొలొస్సయులు వారి క్రైస్తవ విశ్వాసాన్ని మతాచారముతో గుర్తించినట్లైతే, వారి విశ్వాసములో వారు దిగజారినట్లే. పౌలు యొక్క తర్కం ఏమిటంటే, సత్యముయొక్క ఛాయను మాత్రమే ఎందుకు అనుసరించడం? నిజమైన సత్యము క్రీస్తులో ఉన్నది. కాబట్టి ప్రవచనార్థక ఛాయను అంటిపెట్టుకొని వుండుట అంటే, ఆ విషయాలు సూచిస్తున్న ఆత్మీయ వాస్తవాన్ని మరుగుచేయుటై యున్నది. ఎందుకు? ఎందుకంటే పౌలుచెప్పిన విధంగా, “నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది.” గనుకనే ఈనాడు అలాంటి మత సంబంధమైన ఆచరణలు నిజమైన క్రైస్తవ ఆరాధనలో భాగం కావు.
కాబట్టి, దైవిక మూలమున్న యీ ఆచారములను క్రైస్తవులు ఇక ఆచరించవలసిన అవసరం లేదు. అంతేగాక విగ్రహాలు, వేడుకలు ఇమిడియున్న అన్యమూలంగల పండుగలను వారు కచ్చితంగా ఆచరించకూడదు. (కీర్తన 115:4-8) “మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?” అని పౌలు హెచ్చరించాడు. (2 కొరింథీయులు 6:14, 15) మరోవిధంగా చెప్పాలంటే, దేవున్ని ప్రీతిపరచాలనుకుంటే, సత్యారాధనతో అబద్ధ ఆరాధనను మనం కలుపకూడదు. మనం దేవుని చిత్తాన్ని అలక్ష్యం చేస్తూనే ఆయనను ఎలా ప్రీతిపరచగలము?—మత్తయి 7:21.
లేదు, దేవుడు అన్యమత పండుగలను వాటి ఊరేగింపులతో సహా సమ్మతించడు. వాస్తవానికి, దేవుని వాక్యంలో ముందే చెప్పబడిన విధంగా, యెహోవాను అగౌరపరచే ఆచారాలతోపాటు అవికూడ నిర్మూలించబడును. ప్రకటన 18:21, 22 నందు చెప్పబడిన అబద్ధమతము మరియు వాటి ఆచారాలు అన్యుల పట్టణమైన బబులోనుతో సంబంధము కలిగివున్నవి. అచ్చట యిలా వ్రాయబడింది. : “తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడక పోవును. కావున వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు.” బబులోను మత సంబంధ పండుగలు దేవుని ప్రీతిపరచవని గుర్తెరిగిన వారిగా మీరేమి చేస్తారు?
మీరు ఒక ముఖ్యమైన గమ్యస్థానానికి చేరే ప్రయాణంలో ఉండి, దారి తప్పిపోయారనుకోండి. ఒకవేళ ఎవరైనా మీకు క్షేమంగా మీ గమ్యస్థానానికి వెళ్లగలిగే మార్గాన్ని చూపించారనుకోండి, సరైన మార్గం కనుగొన గలిగినందుకు మీరు కృతజ్ఞత గలవారై యుండరా? ఆలాగే, మత సంబంధమైన ఊరేగింపులను దేవుడెలా దృష్టిస్తున్నాడో తెలుసుకున్న తరువాత, దేవున్ని ఏది ప్రీతిపరచగలదో తెలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని ఎందుకు ఇంకా పరిశీలించకూడదు? బైబిలు నందు మీరు నేర్చుకున్న దాని ప్రకారం ప్రవర్తించుట వలన, దేవునితో మంచి సంబంధాన్ని కల్గియుండుటకు అది దోహదపడుతుంది. అది మత సంబంధమైన పండుగలు మరియు ఊరేగింపులు ఆచరించుటకంటే ఎంతో శ్రేష్ఠమైనది.—యోహాను 17:3. (g92 11/8)
[Picture Credit Line on page 26]
Dutch Easter procession, Harper’s, 19th century